ఒక్కక్షణం అలోచించి "సరే! బేరం ఫైసలా!" అంది అహల్య.
కొద్ది నిమిషాల తర్వాత బొమికలగూడులాగా ఉన్న కామాక్షి అస్థిపంజరంలా వున్న ఆ వృద్దుడి చేతుల్లోపడింది.
అందం అక్కర్లేదు అతనికి. ఆనందం అంతకంటే అక్కర్లేదు. ఒకప్పుడు భోగాల కోసం వెంపర్లాడిన ఆ మనిషికి ఇప్పుడు ఒకటే కోరిక -- రోగాలు తగ్గాలని!
అందుకు బలిగా పెద్దమనిషికాని ఒక పసిపిల్ల.
కేకలెయ్యడానికి కూడా ఓపికలేని ప్రతిఘటించడానికి కూడా శక్తిలేని కామాక్షి నిస్త్రాణగా చిరిగిపోయిన దూదిబొమ్మలా పడివుంది. వయసురాని ఆ పసిదానికి వయసు ఉడిగిన ఆ వృద్దుడు.....
మధ్యతరగతి కుటుంబాలలో పుట్టి మర్యాదగా పెరిగిన కామాక్షి అరగంట తర్వాత వ్యభిచారులలో 20 శాతం వరకూ ఉన్న పసిపడుపుగత్తెల్లో ఒకటిగా మారింది.
చైల్డ్ ప్రాస్టిట్యూట్!
పళ్ళబిగువున బాధ సహిస్తోంది. ఇంకాసేపు భరిస్తే.....ఆ తర్వాత బ్రౌన్ షుగర్.....బాధ తెలియని మత్తు!
కానీ ఆ అమ్మాయికి తెలియదు!
ఇది అంతంకాదు ఆరంభం అని.
పగలంతా బ్రౌన్ షుగర్ ని ఛేజ్ చేస్తూ దానికి కావలసిన డబ్బుకోసం రాత్రంగా పదిమంది పక్కల్లో దొర్లడమే ఇంక తన బతుకని.
కాసేపటి తర్వాత ముసలాడికి దమ్ము వచ్చింది. రొప్పుతూ లేచాడు. చచ్చిందో బతికిందో తెలియనట్లుగా పడివున్న కామాక్షివైపు చూశాడు.
ఇప్పుడతనికి ఒక్కసారిగా వెర్రి ఆవేశం ముందుకొచ్చింది.
"నాబతుకు బండలవడానికి కారణం నీలాంటిలం.....లేనే...." అని తిడుతూ వచ్చికాలెత్తి విసురుగా ఆమెడొక్కలో తన్నాడు.
అంతవరకూ కేకలు పెట్టకుండా బాధని భరిస్తున్న కామాక్షి అప్పుడు పెట్టింది వెర్రికేక!
"అమ్ మ్ మ్ మ్ మ్మా!"
ఆకేక సృజనకు వినబడింది. తనకే ఆ దెబ్బ తగిలినంత బాధకలిగిందామెకు. కళ్ళెంబడిగిర్రున నీళ్ళుతిరిగాయి.
అప్పుడనిపించింది సృజనకి.
కామాక్షి పెట్టిన కేక ఆమెను కన్నతల్లికి ఎలానూ వినపడదు.
కానీ దేవుడికి? దేవుడికి కూడా వినబడి ఉండదా ఆ కేక?
దేవుడనేవాడున్నాడా అసలు?
ఉంటే ఊపిరాడని ఈ ఊబిలోకి, అడుగులేని ఈ అగాధంలోకి కామాక్షి లాంటి అభాగినులెంద్రో అసంఖ్యాకంగా జారిపోతూ చేస్తున్న ఆర్తనాదాలు, ఆక్రందనలూ అయనకు వినబడవా? చెవిటివాడా ఆయన?
దేవలోకంలోని స్వర్గానికి దీటు వచ్చేలా విశ్వామిత్రుడు. త్రిశంకుస్వర్గాన్ని సృష్టించినట్లు యమకూపంలోని నరకాన్ని మరిపించేలా విశ్వాసఘాతుకులు కొందరు వ్యభిచారపు కొంపలు తయారు చెయ్యడం ఆ దేవుడి దృష్టికిరాదా? దృష్టిలోపమా దేవుడికి? చూపు ఆనదా!
లేదా ఆక్రందనలు వినబడినా అన్యాయాలు కనబడినా ఏమీ చెయ్యడా? ఏమీ చెయ్యలేడా?
అలాంటప్పుడు దీనులని కాపాడలేనిదేముడెందుకు ఉండి?
దేముడే పట్టించుకోకపోతే ఈ దీనులకు దిక్కెవ్వరు.
ఈమనుషులు మాత్రం?
ఈ అహల్య, ఈ ఉస్మాన్, ఈ రంగేలీ.... ఈ చిన్నారావు....
ఎంతకుత్సితం, ఎంత కపటం, ఎంత కార్పణ్యం.
ఎంతనిర్దయ! ఎంత నిర్దాక్షిణ్యం?
ఎత్తులు! ఎత్తుకి పైఎత్తులు!!
తన చేత్తోనే తననేస్తం కళ్ళు పొడిపించారు వీళ్ళు!
తను చాక్లెట్లు తీసుకెళ్ళి ఇవ్వకపోతే కామాక్షి ఇంత భయంకరమైన స్థితికి వచ్చి ఉండేదికాదేమో!
సృజనకి నెమ్మదిగా అర్ధం అవడంమొదలెట్టింది.
తనకు పాఠం నేర్పించాలనే కామాక్షికి ఈ శిక్ష విధించారు వీళ్ళు!
కొన్ని రాచకుటుంబాల్లో ఒక సంప్రదాయం ఉంది. యువరాణి చదువుకోకపోతే ఆమెను దండించరు గురువు. దెబ్బల అమ్మాయి అని ఒకామె ఉంటుంది.
ఆమెని శిక్షిస్తాడు, దానితో యువరాణి తన తప్పు గ్రహించిదిద్దుకోవాలి.
అలా తను తప్పుచేస్తే శిక్ష కామక్షికి పడింది.
విలవిల్లాడిపోయింది సృజన హృదయం! జన్మలో మర్చిపోలేదు తను ఈ అనుభవాన్ని!
నిస్పృహగా తల అడ్డంగా ఆడించింది ఆమె. ఇది ఒక మహామాయ! ఇందులో నుంచి తప్పించువెళ్ళడం అసాధ్యం! తను ఏ ఎత్తువేసినా దానికి పై ఎత్తుతో ముందేసిద్దంగా ఉంటారు వీళ్ళు. యుకెనాట్ విన్ దెమ్ ఆల్! నో! నెవర్!
అహల్య చెప్పింది నిజమే. ఈ కొంపల్లోకి వచ్చేదారే ఉంటుందిగానీ తిరిగి వెళ్ళేదారి ఉండదు!
బాధ భరించలేక కామాక్షి జంతువులా మూలగడం వినబడుతోంది.
"తల్లీ! సృజన!"
ఒక నిశ్చయానికి వచ్చి ఓణీతో కళ్ళుతుడుచుకుని బయటగదిలోకి వచ్చింది సృజన.
సుబ్రహ్మణ్యంగారి ముందు ఒదిగి కూర్చుని కొద్ది క్షణాలు మౌనంగా ఉండి తరువాత మెల్లిగా అంది.
"మేస్టారూ!"
"చెప్పమ్మా!"
"మేస్టారూపోయిన వారం చెప్పాను మీకు. నేను ఇక్కడ వున్న సంగతి మా నాన్నగారికిగానీ, పోలీసులకి గానీ తెలియజేయమని గుర్తుందా?"
ఆయన ఇబ్బందిగా అన్నాడు "గుర్తుంది కానీ....."
"మీకాశ్రమ వద్దు మేస్టారూ! నేను చెప్పినదంతా మర్చిపోండి! నాకు ఇంకా ఎక్కడికీ వెళ్ళాలని లేదు. ఇక్కడే ఉంటాను" అని ఆగి "జీవితాంతం!" అంది.
ఆయన అపరాధిలా తలవంచుకున్నాడు. సంగీతపాఠం నట్టుతూ నడిచింది ఆ రోజు. పాఠం పూర్తయ్యాకలేచి వస్తూంటే పంజరంలోని చిలకవడివడిగా అనడంమొదలెట్టింది.....
"నాన్ననాన్ననాన్న..... అమ్మ అమ్మ అమ్మ....."
సృజన నేర్పిస్తున్న పదాలుపట్టుబడ్డాయి దానికి ఈ వారం రోజులలో.
