Previous Page Next Page 
అష్టపది పేజి 33

 

                                     20
    
    అది మామూలు ఇల్లు కాదు.
    
    రాజ భవంతి.
    
    రాజభవంతి కాదు. రాజభవంతి లాగా కానవచ్చే ఇల్లు.
    
    ఆ ఇంటినిండా నౌకర్లు చాకర్లు వున్నారు. గది గదికి ఖరీదైన ఫర్నిచరు వుంది. రాజుల కాలం అలంకరణ గుర్తుకు తెస్తూ గోడలకు అలంకరణ పెయింటింగ్స్ వున్నాయి.
    
    ఆ భవంతిలో...
    
    గతంలోకి క్లియోపాత్ర పినతల్లే వుందో రాణి రుద్రమదేవి చెల్లెలి బావగారి భార్య వుందో ఎవరికీ తెలియదు గాని అలంకరణ అలా అనిపిస్తూ వుంది.
    
    షాండిలియర్స్ గుత్తులు గమ్మత్తయిన డిజైన్స్ ని పైనుంచి వేలాడుతున్నాయి. గుమ్మాలకి సిల్కు తెరలుగాక విచిత్రమైన సైజువారి పూసలతో కూడా తెరలువున్నాయి! పూసల తెరలకు మాత్రం చిన్ని చిన్ని గంటలు వున్నాయి పూసల తెరలు తొలగిస్తే ఆ గంటలు కదిలి చిరుగజ్జెల శబ్దం వినవస్తున్నది.
    
    శీతల్ కి మెలుకువ వచ్చింది.
    
    శీతల్ కి తాను ఎక్కడ వుందో ముందు అర్ధంకాలేదు తాను పడుకున్న మంచం హంసతూలికా తల్పంలా వున్నట్టు ఆ గది, గదిలో అలంకరణ చూసి ఇది రాజుల కాలమేమో తను కల గంటున్నానేమో! అని అలానే మంచం మీద పడుకుని కాసేపు ఆలోచించింది.
    
    ఇది రాజుల కాలం అయితే, ఇది రాజమందిరం అయితే మరి తను ఎవరు? రాజకుమార్తె అయివుండాలి ఇంతకీ తను చోళ దేశపు రాజకుమార్తె, లేక కళింగ, శివగంగ దేశపు రాజకుమార్తె...
    
    ఊహు అవేమి కావు. తను భారతదేశం పాలించే రాజ సింహాసనం ఎక్కిన రాజకుమార్తె. ఈ మాట తాను గాంధీతో చెబితే ఏమంటాడో! 'ఉన్న ప్రతిపక్షంవారు చాలక నా ప్రాణానికి నువ్వెవరు తల్లీ'! అంటాడేమో!
    
    తన ఆలోచనలకు థానే నవ్వుకుంది శీతల్. ఈ మంచంమీద పడుకుంటే భలే భలే ఆలోచనలు వస్తున్నాయి విక్రమార్కుడి సింహాసనం మీద కూర్చుంటే న్యాయదేవత ఆవరించినట్టు ఈ తల్పం మీద పడుకుంటే ఏనాడో చచ్చిపోయిన రాజకుమార్తెలందరూ అవరిస్తున్నారేమో!
    
    మరోసారి ఆలోచిస్తూ నవ్వుకుని చివరికి సీరియస్ గా ఆలోచించడం మొదలు పెట్టింది శీతల్.  

 

    తనని లోకేశ్వరరావు రాత్రికి రాత్రి నిద్రలేపి ఏసీ కారులో ఎక్కించుకుని బయలుదేరాడు. తను దొంగ నిద్ర నటిద్దామనుకుంది. అంతలోనే ఏమైందో నిద్ర పెద్దమ్మ నిలువునా ఆవరించింది. నిద్రలేచేసరికి ఈ తల్పం మీద యిలా...
    
    తను ఇప్పుడు ఎక్కడ వుంది?
    
    కారులోంచి దిగి తను నడిచిరాలేదు.  

 

    మరి ఇక్కడి దాకా ఎలా రాగలిగింది.
    
    ఈ అపర లంకేశ్వరుడికి మాయలు మంత్రాలు వచ్చేమో! హుష్ కాకి అనంగానే తను కారులోంచి ఎగిరి వచ్చి ఈ తల్పంమీద వాలిందేమో!
    
    ఇప్పుడు తనేం చేయాలి!
    
    ఇదంతా ఏమిటి?
    
    ఈ మాయ ఏమిటో అర్ధం గాక దీర్ఘాలోచన చేస్తూ పడుకున్నది శీతల్. అంతలోనే గుమ్మం తెర తొలగించిన చిరుగంటల శబ్దం లీలగా వినిపించేసరికి తల తిప్పి చూసింది.    

 

    బలంగా, ఎత్తుగా, లావుగా వున్న ఇరువురు నీగ్రోలాంటివాళ్ళు లోపలికి వచ్చారు.
    
    శీతల్ టకీమని లేచి కూర్చుంది. మంచంమీద నుంచి.
    
    వచ్చినవాళ్ళిద్దరూ నౌకర్లులాగా తెలిసిపోతూనే వున్నారు.
    
    వాళ్ళిద్దరూ శిరస్సువంచి రెండు చేతులని విసురుగా ముఖం మీదికి తీసుకువెళ్ళి అదేదో కంగాళి భాషలో మాటలది సలాం చేసిన విధంగా గౌరవం చూపారు.
    
    శీతల్ బుర్ర గిర్రున తిరిగింది. గిల్లుకుని చూసుకుంది. చేతిమీద గిల్లుకోవడం వల్ల చేయినొప్పి పుట్టింది. ఎబ్బే ఎంతమాత్రం కల కాదు' అనుకుంది.
    
    వాళ్ళు ఈ లోపల మళ్ళీ కంగాళి భాషలో వినయముగా ఏదో అడిగారు.
    
   వాళ్ళేం మాట్లాడినా, వాళ్ళేం చేసినా జంట వాయిద్యంగాళ్ళలాగా కలసి మాట్లాడుతున్నారు. ఒకే రకంగా ఏక కాలంలో ప్రవర్తిస్తున్నారు.
    
    "ఎవరు మీరు?" శీతల్ కి ఓ విధంగా భయంగా వున్నా పైకి బింకం ప్రదర్శిస్తూ ధైర్యంగా అడిగింది.
    
    మళ్ళీ వాళ్ళు కంగాళి భాష (కంగాళి భాష అని శీతల్ పేరు పెట్టుకుంది)లో వినయంగా మాట్లాడారు.
    
    "ఎవరు మీరు?" అరిచింది.
    
    మళ్ళీ దిక్కుమాలిన భాష అదే.
    
    "ఏమిటీ నాటకాలు!" అంది.
    
    మళ్ళీ వాళ్ళు అదే భాష, అదే ప్రవర్తన.
    
    'ఇంకా వీళ్ళతో మాట్లాడకూడదు. ఇదేదో చూడాలి అనుకున్న శీతల్ మౌనం వహించి తిరిగి మంచం మీద పడుకుంది. 

   

    "ఊంగారే ఊంగారే" అంటూ ఇందాక చేసినట్లే సలాంలాంటిది చేసి వాళ్ళిద్దరూ వెనక్కి వెనక్కి నడుచుకుంటూ గుమ్మందాటి బైటికి వెళ్ళిపోయారు.
    
    'మీ శార్ధం పొండి వెధవల్లారా!' అనుకున్న శీతల్ మరోసారి ఆలోచించే లోపలే ఓ దాసీది వెండి పళ్ళెం దానిమీద పాము కుబుసంలాంటి లేసు గుడ్డ కప్పుకుని వచ్చింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS