"అదేంటి జయంతి అలాగానంతున్నావు? రేపు నీకు పెళ్ళి చేసిన నువ్వు మాతోపాటేగా వుండేది?" అంది పార్వతి ఆశ్చర్యంగా.
"ఏమో! నేను ఇప్పుడప్పుడే పెళ్ళి చేసుకోదలచుకోలేదు, నేను చదువుకోవాలి. డిగ్రీ పూర్తిచేయాలి. అదే నా పట్టుదల" అంది జయంతి.
"చదివి ఏం సాధిద్దామనుకుంటున్నావ్?" అంది దాక్షాయణి.
"ఏముంటుంది మంచి ఉద్యోగం చూసుకుంటాను" అంది జయంతి.
"అమ్మో, ఉద్యోగమే! మన ఇంటావంటా లేదు. బావగారు తన్ని తగలేస్తారు" అంది పార్వతి.
"ఎందుకు? ఎంతమంది ఆడవాళ్లు చేయటంలేదు" మనకేమన్నా కొమ్ములున్నయా?" అంది జయంతి సీరియస్ గా.
"అందరి పరిస్థితి వేరు, మన పరిస్థితి వేరు" అంది దాక్షాయణి.
"ఏమో పిన్ని!~ మనకెంత ఆస్థిపాస్తులున్నా నాకు మాత్రం ఉద్యోగం చేయాలనిపిస్తోంది" అంది జయంతి.
"ఏమో తల్లీ! నీ ఆలోచనలు వింటుంటే నాకు భయమేస్తోంది అంది పార్వతి.
"భయమెందుకు పిన్ని! ఆడవాళ్ళు ఎప్పుడూ వంటింటికే పరిమితం కావాలని రూలులేదు" అంది జయంతి.
"అమ్మో జయంతి! ఏంటి ఈరోజు ఇన్ని పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నావ్?" అంది శివపార్వతి ఆశ్చర్యంగా.
"ఇవి నీకు పెద్ద మాటలేమో, నాకు చిన్న మాటలే" అంది జయంతి.
"ముందు పదవతరగతి పూర్తిచేయి తల్లీ . ఆతరువాత నీ మాటలు వింటాం" అంది దాక్షాయణి నవ్వుతూ.
"అంటే ఏంటి పిన్నీ! నేను పాసవననా నీ అనుమానం?" అంది సీరియస్ గా.
"ఛ! నా ఉద్దేశం అదికాదు. మన ఇళ్ళలో పదవతరగతి కూడా పాసవ్వని ఆడవాళ్లు వున్నారు కదా. నువే మొట్టమొదటిదానివి, మేము గర్వంగా చెప్పుకుంటాము అప్పుడు" అంది దాక్షాయణి.
"పదవతరగతికే పొంగిపోతే ఎలా? ఇంకా చదవాలసింది చాలా వుంది" అంది జయంతి.
"మాకు అదే గోప్పతల్లి! మేము అయిదో తరగతేగా" అంది శివపార్వతి దిగులుగా.
"అది మీ తప్పు. ఏం అంతటితో చదువెందుకు ఆపేశారు? ఇంకా చదవకపోయారా?" అంది జయంతి.
"ఆ రోజుల్లో అదే గొప్ప. మా ఉళ్ళో అమ్మో కస్తాల వల్ల అమ్మాయి అయిదో తరగతి పాసయిందట. అని గొప్పగా చెప్పుకున్నారు" అంది శివపార్వతి.
ఆ మాటలకు జయంతి, దాక్షాయణి పెద్దగా నవ్వారు.
"మా బాబాయ్ ని నువ్వు అసలు చూశావా పిన్ని పెళ్ళికి ముందు?" అడిగింది జయంతి.
"చూడటం కూడానా? ఫలానా అబ్బాయిని నీకు ఖాయం చేశామే ఫలానా రోజు నీ పెళ్ళి అన్నారంతే"అంది దిగిలుగా.
జయంతి పెద్దగా నవ్వింది.
"మరి చూడకుండానే ఎలా చేసుకున్నావు పిన్ని....మా బాబాయ్ బాగుంటాడు కనుక సరిపోయింది. అదే ఏ మెల్లకన్నువాడో అయితే ఏం చేసేదానివి?" అంది జయంతి.
"ఏం చేస్తాం నా ఖర్మ అనుకునేదానిని" అంది విచారంగా.
"మరి నిన్ను బాబాయ్ చూశాడటనా పెళ్ళికి ముందు?" అడిగింది కుతూహలంగా.
"చూశారట....మా ఉళ్ళో ఎవరి పెళ్ళికో వచ్చారట....పెళ్ళిలో నన్ను చూశారట....వెళ్ళి వాళ్ళ పెద్దవాళ్ళకు చెప్పారట. ఫలానా అమ్మాయిని చేసుకుంటానని" అంది నవ్వుతూ.
"ఓ...ఐసి? అయితే లవ్ మ్యారేజి అన్నమాట" అంది జయంతి సీరియస్ గా.
ఆ మాటలకు దాక్షాయణితో పాటు శివపార్వతి కూడా పెద్దగా నవ్వింది.
"నిన్ను చుసిన ఏ మగాడైనా అదే అనుకుంటాడులే! ఈ అమ్మాయి భలేగా వుందే పెళ్ళి చేసుకుందామని" అంది జయంతి కవ్విస్తూ.
"ఏయ్ రౌడిపిల్లా....నికంటేనా ?" అంది పార్వతి జయంతి చెవి మెలిపెడుతూ.
"అమ్మో పిన్నీ వదులు....వదులు ఉన్న మాటన్నాను. కావాలంటే పెద్ద పిన్నిని అడుగు" అంది జయంతి నవ్వుతూ.
"ఎందుకే పార్వతీ! జయంతి అన్నదాన్లో తప్పేముంది?' అంది దాక్షాయణినవ్వుతూ.
18
"ఎంటండి అదోలా వున్నారు?భోంచేయమంటే ఆకలి లేదన్నారు. అసలేమయింది?" కంగారుగా అడిగింది దాక్షాయణి భర్తని.
"ఏంలేదులే దాక్షాయణి! నన్ను కాసేపు ఒంటరిగా వుండని అన్నాడు మాధవరావు సీరియస్ గా.
"తలనొప్పిగా వుందా, కాస్త టి పెట్టి ఇచ్చేదా?"అంది దాక్షాయణి.
ఆమె మనసెందుకో కీడు శంకిస్తుంది. భర్త ఎప్పుడూ ఇంతా ముభావంగా లేడు. పెళ్ళయిన ఈ పదేళ్ళ కాపురంలో భోజనంవద్దు,ఏమి లేదని చిరాకుపడటం ఇదే మొదటిసారి, అందుకే ఆమెకు క్షణ క్షణానికి కంగారేక్కువైంది.
"ఉండండి టి పెట్టుకోస్తాను"అంటూ వంటగదిలోకి వెళ్ళింది దాక్షాయణి కంగారుగా.
"ఏంటి దాక్షాయణి ఏం కావాలి? మాధవ భోంచేశాడా?" అడిగింది కస్తూరి ఉల్లిపాయలు తరుగుతూ.
"లేదక్కా! ఆయనకు తలనొప్పిగా వుందట, ఆకలిగా లేదట, టి పెట్టి ఇద్దామని వచ్చాను" చెప్పింది దాక్షాయణి కంగారుగా.
"ఓస్ ఇంతేగా! తలనోప్పికే అంత కంగారుపడిపోతేవే.....శొంటి కలిపి టి తయారు చేసి ఇస్తాను" అంది కస్తూరి.
