Previous Page Next Page 
నేస్తం నీ పేరే నిశ్శబ్దం పేజి 34

   

    నవ్వింది సామ్రాజ్యం, మనసారా నవ్వడం అంటే తెలియ చెబుతున్నట్టు నవ్వుతూనే అంది. "అభిప్రాయాలు ఎల్లకాలం ఒకేలా వుండవు మదూళీగారూ.....మారే అవకాశముంది. అంతెందుకు.....మీకు తొలిసారి పరిచయమైనా ధన్వి మలిసారి కలుసుకున్నప్పుడు చాలా ఆకట్టుకున్నాడుగా?"

 

    దానికి కారణం తన తండ్రిని అంతగా ఆకర్షించడమే అని యీ క్షణంలోనూ చెప్పలేదు మదూళీ.

 

    "బహుశా మీరిచ్చిన పజిల్ కి ధన్వి యిచ్చిన జవాబు మిమ్మల్ని అంత కదిలించిందేమో కదూ...."

 

    "ఖచ్చితంగా చెప్పాలి అంటే అది మాత్రమే కాదు సామ్రాజ్యం గారూ....." సాలోచనగా అంది మదూళీ. "మిగతా మూడు అభిప్రాయాల గురించి ధన్వి యిచ్చిన వివరణ కూడా నాకు బాగా నచ్చింది."

 

    "ఆ ప్లేస్ లో ఎవరున్నా అంగికరిస్తారుగా?"

 

    "లేదు సామ్రాజ్యంగారూ....ఒకవేళ నేను ఆదిలో అనుకున్నట్టు ధన్వి అహంకారి మాత్రమే అయితే అర్గ్యు చేసి తన అభిప్రాయమే కరెక్టటు దబాయించేవాడు. కానీ ధన్విలో తెలివితో బాటు ఎదుటి వ్యక్తుల ఔన్యత్యం అంగికరించే సుగుణము వుంది. అదే ఆయనలో నాకు నచ్చిన మరో అంశం."

 

    "ఒకవేళ ధన్వి అహంకారిలా అర్గ్యూ చేసి వుంటే ఏం చేసేవారు?"

 

    "ఈ ప్రపంచంలో ఆర్గ్యుమెంట్ ని ధ్యేయంగా మార్చుకున్న చాలా మందిలో ఒకడుగా నాకు అనిపించేవాడు. నా నవల్లో ఓ గొప్ప పాత్రగా మారే అవకాశం కోల్పోయేవాడు." మదూళీ కళ్ళలో చిత్రమైన వెలుగు మెరిసింది. "ఇప్పటి యువకుల్లో లేని నిజాయితీ ధన్విలో నాకు కనిపించడం ఆయనలో అర్హత కాకపోవచ్చు. కానీ ఒక భిన్నమైన పాత్రలో కధ కనిపించడం నాకు దొరికిన గొప్ప అవకాశం. సో....." నిట్టుర్పుగా అంది మదూళీ.

 

    "మీకు తెలీదేమో" మరో కొత్త విషయం చెబుతున్నట్టుగా అంది సామ్రాజ్యం "ధన్వికి యీ టైం' విధి కర్మలు అంటే నచ్చవు. అంతెందుకు తన తండ్రి చావుని ఈ ప్రపంచంలో జరిగే సహజమైన సంఘటనల్లో ఒకటిగా అనుకున్నాడే తప్ప అంతగా రియాక్ట్ కాలేదు."

 

    మదూళీ నిశ్శబ్దంగా వుండిపోయింది.

 

    ధన్వి డిల్లి ప్రయాణం మొదలుకుని అతడి తండ్రి చావు గురించి శవం ముందే భిన్నంగా ప్రవర్తించడం గురించి రెండు వారాల క్రితమే చెప్పింది సామ్రాజ్యం.

 

    ప్రత్యేకించి కంటతడి పెట్టుకోకుండా మరెవరి మరణాన్నో చూస్తున్నట్టు కనిపించిన ధన్వి గురించి చెప్పినపుడు మధూళీ కూడా ముందు జిర్ణించుకోలేకపోయింది.

 

    అసలు ధన్విలాంటి యువకులుంటారా అని ఆలోచించిన మాట నిజమే కానీ నవల్లో ఆ సంఘటన రాసేటప్పుడు తెలిసింది.

 

    కేవలం ధన్విలాంటి వ్యక్తులకి మాత్రమే సాధ్యమయ్యే నిబ్బరం వుంది.

 

    "కొన్ని పాత్రల ప్రవర్తన మనకి అసహజంగా అనిపించవచ్చు. కానీ ఆ పాత్రలో మనం ప్రవేశించి ఆలోచిస్తే తప్ప అర్ధం కానీ స్థితి అది. నాకు తెలుసు కన్విస్సింగ్ గా రాయకపోతే పాఠకులు అంగికరించరని.....మనలో చాలామంది ధన్వి లాంటి వ్యక్తుల్ని పొగరుమోతులుగా, పిచ్చివాళ్ళుగా అనుకుంటారు తప్పకుండా, కానీ అలా ప్రవర్తించటంలో మనకి అర్ధం కానీ ఓ ఫిలాసఫి వుంది. ఈ ప్రపంచంలో ప్రతి చిన్న సంఘటనకి అమితంగా స్పందించే వ్యక్తులకిది అర్ధం కాకపోవచ్చు. అలా అని బాధ, దుఃఖం , అవేశపడటం అనే అనుభూతులకి వాళ్ళు అతీతులు కాదు. కానీ అందరిలా ప్రదర్శించరు. సరిగ్గా అక్కడే ఆ వ్యక్తులు మనకి భిన్నంగా కనిపిస్తారు.

 

    ధన్వి పరిచయమైన యీ స్వల్పకాలంలో మధూళీని  అతడెంతగా ఆకట్టుకున్నాడో బోధపడింది. అది కాదు అతడి గురించి ప్రతి అంశాన్ని విశ్లేషించటానికి ఒక రచయిత్రిగా ఆమె పడే తపన కూడా అర్ధమౌతుంది.

 

    మధూళీ ధన్వి గురించి మాట్లాడుతున్నప్పుడు ఆమె నేత్రాల్లో కనిపించే మెరుపుల మరకలు సామ్రాజ్యాన్ని మరో కొత్త కోణంలోకి వెడుతుంటే అసూయపడలేదు. ఒక సమర్దుడైన యువకుడికి.....ప్రపంచంలో చాలా మంది నిరసించే భిన్న ప్రవృత్తిలో సాగిపోతున్న ధన్వి లాంటి వ్యక్తికీ మధూళీ లాంటి మంచి తోడు దొరకడమే సాధ్యమైతే తనూ ఆనందిస్తుంది. వారి స్నేహాన్ని అభినందిస్తుంది.

 

    ఉన్నట్టుండి మనసులో యిలాంటి ఆలోచన రావడం సామ్రాజ్యానికే చిత్రంగా అనిపించింది. కానీ ధన్వి లాంటి వ్యక్తులు కధలోని పాత్రగానే తప్ప జీవితాన్ని పంచుకునే వ్యక్తులుగా ఆమోదించబడతారా?

 

    "మీ విశ్లేషన్ని అభినందిస్తున్నాను మిస్ మధూళీ. కానీ......"సంకోచంగా క్షణం ఆగి అంది " తనవరకూ ఓ.కె. ఒకవేళ అతడి జీవితంలో ప్రవేశించే ఆడపిల్లకే అలాంటి 'ఇన్ బిల్డ్ ఫిలాసఫి' లేకపోతే అడ్జస్టు కాగలదా? యీ మేటిరియలిస్టిక్ ప్రపంచంలో ధన్వి లాంటి వ్యక్తితో ఏ ఆడపిల్లా రాజీపడలేదు. ఒకవేళ అనుకోకుండా అతడితో జీవితాన్ని పంచుకునే అవకాశం దక్కినా ఎల్లకాలము అతడ్ని భరించలేదు......"

 

    మిట్ట మధ్యాహ్నపు వేళ విరహంలాంటి వేడిగాలి కిటికీ ఆవలినుంచి గదిలోకి వస్తుంటే మౌనంగా వుండిపోయింది మధూళీ చాలసేపటిదాకా.

 

    "మీరు జవాబు చెప్పలేదు" గుర్తు చేసింది సామ్రాజ్యం.

 

    "ఒప్పుకుంటున్నాను సామ్రాజ్యంగారూ.....పెళ్ళిదాకా కలల్లో బ్రతకడం అలవాటైన ఆడపిల్లకి తన ప్రతి కదలికని కట్టుకున్న మగాడు ఓ కవితలా వర్ణించాలనుకునే అమ్మాయిని ఒప్పించటానికి , మెప్పించటానికి మాత్రమే బాష ఉపయోగించే మగాళ్ళలో ధన్వి ఒకడు కాదనుకుంటుంది. అతడి ప్రతి మాటా నొప్పించటానికి చేసే ప్రయత్నంగా ఆలోచిస్తుంది. కానీ.....లేని ఇష్టాన్ని నటించే మగాళ్ళకన్నా, భ్రాంతిని నిజమనిపించెట్టు ధ్వనింపచేసే భర్తలకన్నా, త్రికరణ శుద్దిగా మోసం చేసే వ్యక్తుల కన్నా ధన్వి గొప్పవాడు అని తెలుసుకుంటుంది. తనకంటూ విచక్షణ వుంటే ఆఫ్ కోర్స్. ధన్వి లాగే అలాంటి అమ్మాయిలూ అరుదే."

 

    "ఎక్కడో మీలాంటి వాళ్ళు తప్ప....." అర్దోక్తిగా నోరుజారిన సామ్రాజ్యానికి ఆ  తర్వాత గాని తను చేసిన పొరపాటు అర్ధం కాలేదు.

 

    "క్షమించండి మధూళీ.....నా ఉద్దేశం...."

 

    "నేను తప్పుగా అనుకోడంలేదు. కాబట్టి మీరు ఫిలవ్వాల్సిన అవసరంలేదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS