మరో అయిదు నిముషాలు భారంగా గడిచాయి. ధన్వి కూడా కదిలాడు.
"అమ్మా...."
జవాబు లేదు.....
బ్రతుకుపై ఆశ లేనివాడిలా ముడుచుకుని, చీర చెంగుతో కల్లోత్తుకుంటుంది సావిత్రి.
తల్లి సమీపంలో కూర్చున్నాడు. ఎప్పుడో పద్దెనిమిదేళ్ళప్పుడు ఒక మగాడికి భార్యగా ఆ ఇంట అడుగుపెట్టిన అమ్మ, రెండున్నర దశాబ్దాల పాటు ఒక మనిషితో జీవితం పంచుకుని ఇది శాశ్వతమే అని నిన్నటి మొన్నటిదాకా అనుకున్న ఓ స్త్రీ మూడు గదుల ఇంటిలో కంటినిండా కలల్ని పేర్చుకుని, నిద్రలో నిశ్శబ్దంగా కట్టుకున్నవాడికి సేవచేయడం గురించి మాత్రమే ఆలోచించిన ఓ ఆడది......నిట్టూర్పులు , నవ్వుల అనందాలా అభినందనలు, కోపతాపాలూ అన్నీ దేవుడందించిన వరాలే అని సంతృప్తి పడుతూ బ్రతికి. ఇదిగో యిపుడు పగిలిన గుండె అంతర్మధనాన్ని బ్రతుకు కధనంగా మార్చుకుని ఎలా బ్రతకాలా అనుకుంటూ కుమిలిపోతుంది.
ఒక్కరోజులోనే అమ్మకి వృద్దాప్యం వచ్చినట్టు అంతగా సడలిపోయిందేం!
"నువ్విలా కుమిలిపోయి కూర్చుంటే నన్ను ఓదార్చేదేవరు?"
ఆ కొద్దిపాటి అనునయానికే ఆమె దుఃఖం కట్టలు త్రెంచుకుంది. కొడుకుని అల్లుకుపోయింది. వెక్కిపడుతూ, "ఎలారా.....మీ నాన్న ఇక లేరన్న నిజాన్ని తట్టుకుని నేనెలా బ్రతకాలి? తాగినా గానీ తిట్టినా గానీ చిన్న పిల్లడు చేస్తున్న అల్లరిలాగే అనిపించిందేతప్ప నన్ను బాధపెట్టి ఎరుగరే! పోయేదాకా నా కొడుకు ఏమైపోతాడో అన్న భయంతోనే వాడ్ని మందలిస్తున్నాను తప్ప వాడంటే ఎంత ప్రేమో నీకు మాత్రం తెలీదు అంటూ నన్ను వూరడించేవారే......ఆ దేవుడు నాకు దురమయ్యాక నేనెందుకు బ్రతకాలి....."
"నాకోసం అమ్మా!"
ధన్వి గొంతు పూడుకుపోయింది.
నువ్వు నా కోసం బ్రతకాలి. మీ బిడ్డ మీరనుకున్నట్టు ఓడిపోలేదండి! మీ పేరు నిలబెట్టగల సమర్దుడయ్యాడు అని కనిపించని నాన్నకి నీ నోటితో వినిపించటానికైనా నువ్వు బ్రతికే వుండాలి" ధన్వి కళ్ళు తడి అయ్యాయి.
"నేను ఆ నాన్నకి పుట్టిన బిడ్డనమ్మా....
నాన్నగారంటే నాకూ ప్రేమే....."
ఇక మిగిలింది మనం. మనం ఒకరికొకరం అన్నట్టుగా తల్లికి అన్నం తినిపించాడు బలవంతం చేసి. ఆ తర్వాత మరో రెండు రోజులు ఎలా గడిచాయో ఆ ఇద్దరికీ గుర్తులేదు.
అయితే మూడోరాత్రి ఏదో గుర్తుకొచ్చినట్టు ధన్వి గదికి వచ్చిన సావిత్రి "నీకో విషయం చెప్పడం మరచిపోయాను" అంది.
మూర్తిభవించిన ధైన్యంలా అనిపిస్తున్న తల్లి వైపు విప్పారితంగా చూశాడు.
"మీ నాన్నగారు హార్ట్ అటాక్ తో కుప్పకులిపోగానే మొదట అడిగింది నీ గురించే....." ఆమె కళ్ళు స్రవిస్తుంటే పదాల్ని కూడాబలుక్కుంటు చెప్పింది. "నీ ముందు నిన్ను తులనాడేవారే గానీ నువ్వు లేనప్పుడు నిన్ను చూసి ఎంత సంబరపడేవారు....అసలు అయన నీ ఆలోచనల్ని ఏరోజు తప్పనలేదురా! అవి ఆచరిస్తూ బ్రతకడం కష్టమానేవారు."
క్షణం విరామం తర్వాత మళ్ళీ చెప్పడం మొదలుపెట్టింది.
"గుండె పట్టుకుని నీ గురించి అడగ్గానే డిల్లీ వెళ్ళినట్టు చెప్పాను. చెప్పకుండా వెళ్ళినందుకు బాధపడ్డారోలేక నీతో ఏదో చెప్పాలని ఆలోచించారో నాకు తెలీదు కానీ హాస్పిటల్లో పరిస్థితి విషమించిందని డాక్టర్లు చెప్పాక నీ గురించి ఇంకో సారి అడిగారు. ఎందుకు పనిగట్టుకుని అడిగారో నాకు తోచలేదు. చివరిసారిగా నిన్ను చూడాలని తపించిపోతున్నారేమో అనుకున్నాను. నిన్ను రాప్పిస్తానని చెప్పినా వినకుండా చాలా కుమిలిపోయారు. ఎందుకంత బాధపడుతున్నారని నేను నిలదీసి విషయం చెప్పమంటే 'దేవుడిలాంటి మనసున్న నా బిడ్డకి మాత్రమే అది చెప్పాలి' అన్నారు. ఇంతకాలము చెప్పకుండా చాలా తప్పు చేశాను అన్నారు. అదే చనిపోయే ముందు మీ నాన్నగారి చివరి మాట."
విస్మయంగా నేలచూపులు చూస్తూ వుండిపోయాడు ధన్వి.
ఏమిటి.....తండ్రి తనకి చెప్పాలనుకున్నది?
"దేవుడిలాంటి మనసున్న నా బిడ్డకే చెప్పాలి.....ఇంత కాలం చెప్పకుండా చాలా తప్పు చేశాను అన్నారంటే.....'
"ఏమై ఉంటుంది.....
అయన జీవితంలో అమ్మకీ, తనకీ తెలీని రహస్య పుటలున్నాయా!
ధన్వి ఆలోచనల్లో మునిగిపోయాడు.
నాన్నగారు చనిపోయి చెప్పింది మూడు వాక్యాలే అయినా అందులో మరో నూరేళ్ళ కొత్త కధ వినిపిస్తున్నట్టుగా వుంది.
* * * *
"కంగ్రాట్స్ మదూళీ....." యింటిలో అడుగు పెడుతున్న మదూళీని అభినందించింది సామ్రాజ్యం. 'మీ సీరియల్ మీరు మార్పు చేసిన మొదటి వారమే పాఠకుల్ని విపరీతంగా ఆకట్టుకుందిగా."
మదూళీ రిలాక్స్ గా సోఫాలో కూచుంది. "నేను నిజానికి మీ దగ్గరికి వచ్చింది అది చెప్పాలనే. 'నీరవం' లో ధన్వి పాత్రని నేను ప్రవేశపెట్టాక సంచలనాత్మకమైన రెస్పాన్స్ వస్తోందని ఎడిటర్ కూడా నాకు ఫోన్ చేశాడు. సో....మొత్తం క్రెడిట్ మీకే దక్కాలి."
"నాకా.....దేనికి?" విస్తుపోతూ అడిగింది సామ్రాజ్యం.
"నిజానికి ధన్విని పరిచయం చేసింది మీరేగా....."
"క్రెడిట్ యివ్వడమంటు జరిగితే మిమ్మల్ని అంతగా ఆకట్టుకున్న ధన్వికి యివ్వాలి. నాకు కాదు."
"దయుంచి అతని వ్యక్తిత్వం బేస్ చేసి నవల రాస్తున్నట్టు ఆయనకు తెలినివ్వకండి" మదూళీ అభ్యర్ధనలా అంది "ఆయనకి తెలిడం నాకు యిష్టం లేదు."
"ఒకవేళ ధన్వి చదివి తెలుసుకుంటే?"
"నా మొదటి సంచికతోనే ఆయనకి నా రచన మీద ఓ దురభిప్రాయం ఏర్పడిపోయింది."
