"అదీ- మగాడంటే అలా వుండాలి. మా మామవున్నాడు ఎందుకు- మల్లెపూలు పెట్టుకుంటే మరి రాత్రికి ఇంటికి రాడు" ఆదెమ్మ మాటలకి నారుమడిలో వరినాట్లకు బదులు నవ్వుల్ని నాటుతున్నట్లయింది. పని ప్రారంభమైంది. ఆదెమ్మ పాటందుకుంది.
మధ్యాహ్నమయ్యేసరికి రెండెకరాల నాటయిపోయింది. ఇక ఆ రోజుకంతే. ఇక పొలంలోంచి లేస్తారనగా అప్పుడు వచ్చాడు సుధాకర్.
"ఏమయ్యా- బావున్నావా? మగాడైపోయావే?" ఆదెమ్మ పలకరించింది. ఉమకి అతనెవరో తెలియదు. ఎగాదిగా చూసింది. ఎందుకనో తెలియదుగానీ తనకు కరెక్టుగా సరిపోయే జోడీ అనిపించింది ఆమెకి.
తను ఇంతకాలం అతనికోసమే ఎదురుచూస్తున్నట్లు, ఇప్పుడు కనపడ్డట్టు ఏదో తెలియని ఆనందం హృదయంలో ఒక్కక్షణం ఎగిసిపడింది.
బావున్నానన్నట్టు తల వూపాడు అతను.
"ఎప్పుడొచ్చాడు మీ అబ్బాయి?" ఆదెమ్మకీ ఇంట్రెస్టు కలిగినట్టుంది అతన్ని చూస్తూనే. అతను షెడ్ లోనికెళ్ళినప్పుడు సుబ్బారెడ్డిని అడిగింది. నిజమెంతో తెలియదుగానీ, కుర్రాజ్ని చూస్తే ఆదెమ్మ వదిలిపెట్టదంటారు.
"మావాడా! మొన్న చదువైపోయింది. ఎం.ఏ. పాసయ్యాడు. ఇక ఎక్కడయినా కొలువు చూసుకోవాలి" సుబ్బారెడ్డి చాలా గర్వంగా చెప్పాడు.
ఎక్కడికో బయలుదేరి వచ్చినట్టుంది సుధాకర్ నీట్ గా తయారైపోయి వున్నాడు. బ్లూ జీన్స్ మీద తెల్లటి కాటన్ షర్ట్ టక్ చేశాడు. ఎంతో అందంగా, లలితంగా ఆడపిల్లకు మగవేషం వేసినట్టుంది.
అక్కడున్న పన్నెండుమంది అమ్మాయిలకు అలాంటి మగవాళ్ళని చూడడం కొత్త బిసీ కాలనీలో వుండే మగవాళ్ళంతా కండలుదేలి చూడడానికి రఫ్ గా వుంటారు. అందుకు భిన్నంగా నాజూకుగా వుండడంతో చాలా ప్రత్యేకంగా కనిపించాడు.
సుబ్బారెడ్డి మోటార్ ఆఫ్ చేయడానికి వెళ్ళిపోయాడు.
షెడ్ లోంచి సుధాకర్ బయటికొచ్చాడు.
"ఏదీ- మీరు నాట్లు వేస్తున్నప్పుడు పాట పాడుతారు కదా! అది పాడండి- రికార్డు చేసుకోవాలి" అనడిగాడు.
ఆదిలక్ష్మి ఒకటే నవ్వు. "మోటు సామెత ఒకటుంది గానీ టౌన్ నుంచి ఇప్పుడే వచ్చావు కాబట్టి తట్టుకోలేవు. మరి నాటయిపోయి ఇంటికి వెళ్లేప్పుడొచ్చి పాట పాడండని అడుగుతావా?" అందతనితో.
"అయితే రేపొస్తాను" అని అందరివంకా పరిశీలనగా చూశాడు. ఓ క్షణమే అయినా అతని దృష్టి తనమీదే లగ్నమైందని కనిపెట్టింది ఉమ.
ముందయితే ఎవరైనా అలా చూస్తే కోపమొచ్చేది. ఇప్పుడు రావడం లేదు. పైపెచ్చు అబ్బాయిలు ప్రత్యేకించి చూస్తుంటే ఒళ్ళంతా ఝల్లుమంటోంది.
అందరూ తిరిగి బీసీ కాలనీకి వచ్చేశారు.
అందరికీ రింగ్ లీడర్ ఆదిలక్ష్మి. తిరిగి రేపు పనిలోకి వెళ్ళాలంటే ఆమెకే ముందుగా చెప్పాలి.
"రేపు నాటుంది కదా" ఎందుకైనా మంచిదని ముందే మాట్లాడుకోవడం మంచిదనిపించి అడిగింది ఉమ.
"ఆ అదే. పన్నెండుమందే. రేపూ ఎల్లుండీ- ఆ తరువాత మీ ఇష్టం చెప్పింది ఆదెమ్మ.
అయితే రేపు సుధాకర్ వస్తాడు కాబట్టి తను మిస్ అయ్యే అవకాశం లేదని సంతోషపడిందామె.
ఆ రోజు సాయంకాలం స్నానంచేసి ఫ్రెష్ గా తయారైంది ఉమ. ఇక ఆ రోజు ఎవరితోనూ మాట్లాడాలనిపించలేదు. ఇంటిముందు నులక మంచం వాల్చుకుని దానిపై పడుకుంది. కళ్ళనిండా సుధాకర్ అందమైన రూపం తన దృశ్యం మారలేదు.
మరుసటిరోజు మరింత శ్రద్ధగా, చాలా అందంగా, ఆకర్షణీయంగా తయారైంది ఉమ.
కూలీలు వెళ్ళేటప్పటికే సుధాకర్ రెడీగా వున్నాడు.
నాట్లు వేసేటప్పుడు రికార్డింగ్ కుదరదు గనుక "మధ్యాహ్నం పని పూర్తయ్యాక పెట్టుకుందాం. మీకు కూడా ఇంటినుంచి భోజనం తెప్పిస్తున్నాను" అని చెప్పాడు ఆదిలక్ష్మితో. మధ్యాహ్నం భోజనం అనేటప్పటికి తెగ సంతోషపడిపోయింది ఆదెమ్మ.
అనుకున్నట్లు మధ్యాహ్నానికి మరో రెండెకరాలు నాటారు. అందరూ గట్టుమీద నుంచి చేతులు కడుక్కుంటూ వుండగా "ఆదెమ్మా! నువ్వూ, నీకు తోడుగా మరో అమ్మాయీ వుండిపొండి" అని అతనే వెంటనే "ఉమ వుంటుందిలే" అన్నాడు.
అలా ఆమె కూడా ఆదిలక్ష్మితోపాటుగా అక్కడే వుండిపోవలసివచ్చింది.
మరో పదినిముషాల్లో వాళ్ళ సేద్యగాడు రామయ్య పెద్ద క్యారియర్ అక్కడికి తెచ్చాడు.
సుబ్బారెడ్డి పనికావడమే వెళ్ళిపోయాడు. భోజనాలయ్యాక రంగడు కూడా వెళ్ళిపోయాడు.
ఇక మిగిలింది సుధాకర్, ఆదిలక్ష్మి, ఉమలే. "పాటలు పాడిందానికి మాకేమిటి లాభం?" అడిగింది ఆదెమ్మ. అతను ఆమెముందు టేప్ రికార్డర్ పెట్టగానే.
"ఆదివారం మిమ్మల్నిద్దర్నీ టౌన్ కి పిలుచుకెళ్ళి సినిమా చూపిస్తాను సరేనా?" అని ఒప్పుకున్నాడు. దాంతో సంతృప్తిపడిపోయింది ఆదిలక్ష్మి.
మరో గంటసేపు పాడింది ఆమె. అన్నింటిని రికార్డ్ చేశాడు. మధ్య మధ్యలో అతను తనను చూడడం, చిన్నగా నవ్వడం కనిపెట్టింది ఉమ. అందర్నీ కాదని తనను కూడా అక్కడ వుండమనడంతోనే అతనికి తన మీద ప్రత్యేకమైన ఇష్టం వున్నట్టు కనిపెట్టింది ఆమె.
రికార్డింగ్ అయిపోయి ఇంటికి బయల్దేరారు ముగ్గురూ. మెయిన్ రోడ్డుమీద వెళితే చాలా సేపవుతుందని అడ్డదారిగుండా నడుస్తున్నారు.
ఏరుదాటి పైకెక్కాలి. ఏరు దాటారు. గడ్డపైకి ఎక్కాలంటే అతనికి ఏమాత్రం చేతకావడంలేదు. ఆడపిల్లలయినా వాళ్ళకి చాన్నాళ్ళనుంచె అలవాటు కాబట్టి తేలిగ్గా ఎక్కేశారు. అథని అవస్థంతా కనిపెట్టి ఎక్కించడానికి ఆదిలక్ష్మి, ఉమ ఒక్కసారే చేయిచాచారు.
అతను వెంటనే ఉమ చేయి పట్టుకున్నాడు.
ఆదిలక్ష్మి ఉడుక్కోవడం గమనించినా తనకేమీ తెలియనట్టు వుండిపోయింది ఉమ.
అతను చేయి పట్టుకోగానే పాము కదిలినట్టు ఒళ్ళంతా ఏదో అలజడి పాకింది. అంతకుముందెప్పుడూ లేని ఆ కొత్త పులకరింతని ఆమె అనుభవిస్తోంది.
అతను నెమ్మదిగా పైకెక్కాడు.
"థాంక్స్" అన్నాడు చేయి విడిపించుకుంటూ.
"నో మెన్షన్" సిగ్గుపడిందామె,
ఉమ ఆ మాట అంటుందని అతనూహించలేదు. ఆశ్చర్యంతోపాటు అభినందనగా చూడడం ఆమె కనిపెట్టింది. ఆ తర్వాత ఆమె ఏం చదువుకుందో, ఎందుకు చదువు ఆపేసిందో కనుక్కున్నాడు.
