ఆమెకి చాలా నిరుత్సాహం అనిపించింది.
"రేపు కలుద్దాం" అంటూ వీడ్కోలు తీసుకొని వెళ్ళిపోయాడు.
భోజనాలు చేస్తుండగా సుభద్ర అడిగింది "ఆ నవీన్ ఏమంటున్నాడూ? మళ్ళీ డబ్బు కావాలంటున్నాడా?"
అన్నం తింటున్నదల్లా ఆగిపోయి, ఆమె ఏం మాట్లాడిందో అర్ధంకానట్లు చూసింది.
"మొన్ననే వాచీ అమ్మి అంత డబ్బు ఇచ్చావు. ఇలా అస్తమానం అలవాటు చెయ్యకు" అంది.
మూర్ఖత్వం ఎదురైనప్పుడే నిజమైన వివేకానికి పరీక్ష!
"అమ్మా! నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తోందా?" అడిగింది ధృతి సౌమ్యంగానే.
"ఆ.....నిక్షేపంలా తెలుస్తోంది. ఎప్పుడో పాతికా పరకా సహాయం చేశాడు కాదని నువ్వు వేలకి వేలు ధారపోయడం కళ్ళారా చూసే అంటున్నాను. ఆ అబ్బాయి ప్రేమతో తెచ్చిన వాచీ అమ్మేసి, వాళ్ళ ఎదాన పెట్టావు. చీర తెస్తే అందర్లో తిరగ్గొడ్తావా? ఎంత బాధపడతాడోనన్న ఇంగితం లేదు. మన మఠం కాదు, మన కులం కాదు. ఆ నవీన్ ని పట్టుకుని తిరుగుతున్నావు. ఆ నవీన్ కంటే ఈ అబ్బాయి ఎక్కువ సహాయాలే చేస్తున్నాడు పాపం" రెచ్చిపోయి మాట్లాడుతోంది.
తల్లి మాటలకి అడ్డొస్తూ "ఎవరు ఎక్కువ సహాయం చేస్తే వాళ్ళతో 'ప్రేమలో' పడాలా అమ్మా?" అంది.
సుభద్ర ఈ అనుకోని ప్రశ్నకి నిమిషం తత్తరపడి, అంతలోనే సర్దుకుని "అటువంటి పిల్లాడు నువ్వంటే యిష్టపడి మనింటి చుట్టూ తిరుగుతున్నాడు కానీ, మీ నాన్నకోసం, నాకోసం కాదు. అదృష్టం, అవకాశం ఒక్కసారే తలుపు తడతాయి. జాగ్రత్తగా అందిపుచ్చుకోవాలి.... అంతేగానీ ఆ నవీన్ తో ప్రేమా, దోమా అని తిరిగితే ఏం వస్తుందీ? జోగీ జోగీ రాసుకుంటే మిగిలేది బూడిదే!"
నవీన్ పట్ల తల్లి అసహనం గమనించినా, ఇంత త్వరగా బయటపడి పోతుందనుకోలేదు ఆమె.
"అమ్మ నీ మంచికోరే చెబుతోంది ఆలోచించమ్మా! కోపం తెచ్చుకోకు. నువ్వు ఈ ఇంటి మూలస్థంభంలాంటిదానివి! నీ భవిష్యత్ మీదే మిగతావారందరి భవిష్యత్తులూ ఆధారపడి వున్నాయి" అంటున్నాడు సీతారామయ్య.
"క్షమించండి.....! అన్నింటికన్నా హీనమైన విషయం సానుభూతి కోరడం. అటువంటి సానుభూతిపరమైన ప్రేమని నేను అందుకోలేను. మీకూ అందించలేను..." అంటూ చెయ్యి కడిగేసుకుని లేచి వెళ్ళిపోయిందామె.
"చూశారా! ఇన్నాళ్ళూ మీరు నెమ్మదిగా దానికి అన్నీ తెలుసునూ చాలా, చాలా తెలివిగలదీ అంటూ నెత్తికెక్కించుకోబట్టే యిలా తయారయింది. తల్లీ, తండ్రిగా మనకి గడ్డిపోచపాటి గౌరవం ఇవ్వడంలేదు...." అనరుస్తోంది తల్లి.
తల్లికి అంత నోరు ఎలా వచ్చిందో? ధృతికి చాల ఆశ్చర్యంగా వుంది. నవీన్ "పాతికా" "పరకా" సాయం చేశాడంతేగా అని ఎంత తేలిగ్గా అనగలిగిందీ? ఆ పాతికా పరకలే ఎన్నోసార్లు ఆవిడని నరకంలాంటి బాధ నుండి కాపాడాయి. ఇంటి "పరువుని" కాపాడుతూ వచ్చాయి.
"నీ భవిష్యత్తు మీదే మిగతా అందరి భవిష్యత్తులూ ఆధారపడి వున్నాయి" అన్నాడు తండ్రి. అంటే నీ ఇష్టాలూ, అయిష్టాలూ మాకనవసరం మా అవసరాలు, ఆనందాలూ మాకు ముఖ్యం అని చెప్పడమా? 'మనుష్యుల మధ్య రక్తసంబంధాలూ, ప్రేమాభిమానలూ అంతా ట్రాష్'. ఎక్కడ చూసినా బార్డర్ సిస్టమే అంతే!' అని ఆ రోజు చెబితే తనకి ఎంతో తప్పుగా అనిపించింది. కానీ అది నిజమేనేమో! ఆ విధంగా ఆలోచించగానే ఉలిక్కిపడింది. ఏమిటిది? నేను ఇన్నాళ్ళనుండి నమ్ముకున్న సిద్దాంతాలు తప్పా? కేవలం డబ్బేనా మనుష్యుల మధ్య సంబంధాలను పటిష్టం చేసేది? నేను ఓటమికి ఇంత త్వరగా, ఇంత దగ్గరగా వచ్చేశానా? ఇదివరకు ఎన్నో కష్టాలు పాడినప్పుడు అందరూ కలిసి పచ్చడి మెతుకులు తింటూ కూడా ఎంతో తృప్తిగా వుండేవారు. ఈనాడు కంచంలోకి నాలుగు అధరువులూ వచ్చిచేరాయి. కానీ కడుపుతోబాటే మనసులు కూడా స్వార్ధంతో నిండాయి. మనుష్యుల్ని జయించాడానికి ఈ "డబ్బు" అనే ఆయుధాన్ని మొదటగా ఎవరు కనిపెట్టారో వారికి జోహార్లు....!" అనుకుని నిర్లిప్తంగా నవ్వుకుంది ధృతి.
వంటింట్లో అదిరిపోయేట్లు తల్లి కంచాలు, గరిటెలూ శబ్దం చేయడం వినిపిస్తూనే వుంది.
* * *
ఆఫీస్ కి వెళ్ళేసరికి ప్రేమ్ ఎదురుచూస్తూ కనిపించాడు. ఏవో అర్జంట్ కాయితాలు కావాలని ధర్మానందరావుగారు పంపించారుట. కానీ అతనొచ్చింది తనని కలవడానికేనని తెలిసిపోతోంది.
"ఎక్కడికి వెళ్ళావు?" అడిగాడు.
ఆమె చెప్పింది.
"నాతో కలిసి లంచ్ చెయ్యడానికి వస్తావనుకున్నాను" అన్నాడు.
ఆమె జవాబుగా నవ్వి వూరుకుంది.
కాసేపు కూర్చుని వెళ్ళిపోయాడు.
లీల దగ్గరికొచ్చి అడిగింది "ఏమంటాడు యువరాజు?"
"యువరాజా.....!"
"ఆ... ఆయన యమధర్మరాజయితే, ఇతను యువరాజే...." అంది.
ధృతి దాచకుండా చెప్పేసింది.
"ఓహో..." కళ్ళు చక్రాల్లా తిప్పి "అదృష్టవంతురాలివే! మంచి సెలక్షన్" అంది.
ధృతి ఖంగారుగా "అబ్బే! అదేంలేదు వుట్టి ఫ్రెండ్షిప్ అంతే" అంది.
"ఐతే సారీ! గట్టి ఫ్రెండ్షిప్ ఇంకొకచోట వుందన్నమాట...." అంది అల్లరిగా.
ధృతి తేలిగ్గా తీసుకుంటూ నవ్వేసింది.
ప్రతిరోజూ చ్యవలసిన పనులమీద ఆసక్తి ఏర్పరచుకోవాలన్నా ఒకేచోటుకి ప్రతిరోజూ వెళ్ళాలన్నా అక్కడ మన మనసులకి నచ్చే విషయాలు గాని, వ్యక్తులుగానీ వుండాలి. లీల స్నేహం వల్ల ఆమెకి ఆ వెలితి తీరిపోయింది. సాధారణంగా మనం ఎలా వుండాలని కోరుకుంటామో, అటువంటి స్నేహితులతోనే ఎక్కువగా దగ్గరవుతాము. లీలని చూస్తుంటే యీ అమ్మాయి ఇంత సంతోషంగా, ఉత్సాహంగా నిత్యం ఎలా వుండగలుగుతుందీ అనిపిస్తుంది ధృతికి.
* * *
