"నా టాలెంట్ నా చదువూ సంఘానికి ఉపయోగపడకుండా పోతోంది కదా" అంది.
"ఏం ఫరవాలేదు. హ్యాపీగా ఇంట్లో వుండు" అని ఇక ఆ తరువాతెప్పుడూ ఆ టాపిక్ కి ఆస్కారం ఇవ్వలేదు.
అలా ఆమె దేనికైతే ఆరాటపడిందో అది నెరవేరలేదు. ఇంటికి పరిమితమైపోయింది.
ఇలా హమేషా ఒక్కడికోసమే ఇల్లు కనిపెట్టుకుని వుండడమంటే అసహ్యమేసేది. తను ఎమోషన్స్ ను బయటపెట్టుకునే సమయంగానీ, మనిషిగానీ ఆమెకీ చిక్కేది కాదు.
భర్త అంటే గుడ్ కంపానియన్ లా వుండాలని ఆమె కోరుకుంది. మంచి పొయిట్రీ చదివితే ఆ అనుభూతినంతా మరొకరితో పంచుకోవాలనుండేది. మంచి నవల చదివినప్పుడు అందులోని వస్తువు, శిల్పం మీద మాట్లాడాలని చూసేది. వెన్నెల్లో తడుస్తూ తనతోపాటు ప్రకృతిలో లీనమై పోయే తోడు కోసం వెదికేది.
తత్త్వ చింతన చేస్తూ ఈ ప్రపంచపు పునాదుల మీద చర్చ జరగాలని ఆశించేది. కానీ అతను తప్ప మరొకరు కనిపించని ఆ పెద్ద ఇంట్లో అన్నీ ఆమే దిగమింగుకునేది. ఓ విధంగా ఇంట్రావర్టుగా తయారైంది. తన ఫీలింగ్స్ నన్నీ తనలోనే నొక్కిపట్టి వుంచింది.
ఇదిగో ఇన్నేళ్ళకి ఆమెను వసంత్ కదిలిస్తున్నాడు. అతనికోసం అన్నిటినీ త్యజించుకునే సమయం మించిపోయింది. ఒక్కతే కాలంతో పాటు ఎంతో దూరంగా ప్రయాణం చేసింది. కానీ ఆమె సహజ ప్రవృత్తి ఈ బంధాలన్నీ తెంచుకోవాలని తీవ్ర ప్రయత్నం చేస్తూ వుంది. అందుకే ఆమె మొదటిసారి అంత వేదనకూ, టెన్షన్ కూ గురవుతూ వుంది.
"ఎక్కడికి సార్! అప్పుడే బయల్దేరుతున్నారు?" అని జగదీష్ వెనక నిలబడి అద్దంలో తన ప్రతిబింబం చూసుకుంటోంది సూర్యాదేవి.
"ఈరోజు కాంట్రాక్టర్ల యూనియన్ మీటింగు వుంది. అక్కడికి వెళ్ళి ఆ తర్వాత వర్క్ స్పాట్ కు వెళతాను. రేపు ఏం పనులు చేయాలో ఇంజనీర్లకు చెప్పాలి" అన్నాడు జగదీష్.
"తిరిగి ఎప్పుడు వస్తారు?"
"ఎప్పుడొచ్చేది ఖచ్చితంగా చెప్పలేను సూర్యా! బహుశా సాయంకాలం కావచ్చు"
"ఆరుగంటలకల్లా వచ్చేయండి" అంది జగదీష్ వుంటే వసంత్ ని బలవంతంగానయినా మరిచిపోవచ్చనుకొని అలా ఆరుగంటలకల్లా వచ్చేయమంది.
"ఓకే సూర్యా ట్రై చేస్తాను" అని అతను బయల్దేరాడు. అతన్ని గేటు వరకు సాగనంపి తిరిగి లోనకొచ్చింది ఒంటరితనం తనను తినెయ్యడానికి నోరు తెరిచినట్లుంది ఇల్లు ఏకాంతం తనను సుడిగాలిలా చుట్టేసుకుంటున్నట్లు ఉక్కిరిబిక్కిరయి పోతోంది.
తనను టాను కంట్రోల్ చేసుకోవడానికి కన్నట్లు సోఫాలో కూర్చుని గట్టిగా కళ్ళు మూసుకుంది. ఏవేవో చిత్రాలు కళ్ళను రాసుకుంటూ వెళుతున్నాయి.
టెలిఫోన్ మోగుతున్న శబ్దం లీలగా విన్పిస్తోంది.
కళ్ళు తెరిచింది.
ఇప్పుడు మరింత గట్టిగా వినిపిస్తోంది టెలిఫోన్ శబ్దం. లేచి వెళ్ళి రిసీవర్ అందుకుంది. వసంతేమోనన్న అనుమానం వచ్చింది. ఆ ఊహే శరీరంలో చాలా మార్పులను కలగజేస్తోంది. గుండెలు అదురుతున్నాయి. శరీరం సన్నగా వణుకుతోంది. కళ్ళు అలజడిగా అటూ ఇటూ కదులుతున్నాయి.
అవతల్నించి ఎవరు మాట్లాడుతున్నారో తెలుసుకోవాలనే ఆరాటం ఎక్కువయింది "హలో" అంది.
"ప్రపంచశాంతి" అవతల్నించి వినపడింది.
ఆమె కూడా అనాలోచితంగా "ప్రపంచశాంతి" అంది. తనకు తెలియకుండానే తను అతని ఇంద్రజాలంలో చిక్కుకుపోతోందా? లేకపోతే తను కూడా ప్రపంచశాంతి అనడమేమిటి?
'ఈరోజు ఆదివారం అని గుర్తు చేయడానికి మాత్రమే ఫోన్ చేశాను నిద్ర లేవగానే మీరెలా వుంటారో చూడాలన్న కోర్కె కలిగింది నాకు. వచ్చేద్దామనుకున్నాను కానీ నిగ్రహించుకున్నాను. చూడకపోయినా మీరెలా వుంటారో ఊహించుకోగలను.
రాత్రి కన్నకలల తాలూకు రంగులన్నీ మీ కనుపాపల్లో ప్రతి ఫలిస్తుంటాయి. అందుకే నీరెండ పడగానే కళ్ళల్లో సప్తరంగులు కనిపిస్తాయనుకుంటా. మీకయితే మరో రంగు అదనంగా వుంటుంది. మీ ఒంటి ఛాయ వాటిలో కలవక విడిగా కనిపిస్తుంది కదా! మీ తల వెంట్రుకలు ఒకటి కూడా చెదిరి వుండవు అన్నీ బుద్దిగా నిన్న సాయంకాలం మీరెలా దువ్వుకొని వుంటారో అలాగే వుంటాయి. అంత ఒద్దికగా పడుకుంటారన్న మాట. మరి కాసేపట్లో మీనుంచి దూరమౌతానన్న బాధతో కళ్ళు నులుముకోవడంలో ముడతలు ఏర్పడ్డట్లు మీ నైటీ అక్కడక్కడ నలిగి వుంటుంది.
ట్రాన్స్ పరెంట్ గా వుండే మీ నైటీలోంచి పొగరుబోతూ గిత్తల్ని అదుపు చేయడానికి వేసిన వెండి ముక్కుతాడుల్లా మీ బ్రా బట్టీలు కనిపిస్తుంటాయి ఇక మీ బొడ్డు మేఘాల మాటున మసగ్గా కనిపించే చందమామలా వుంటుంది."
"స్టాపిట్" ఆమె పిచ్చిపట్టినట్లు అరిచింది.
"ప్రపంచశాంతి మీకు కోపము వచ్చేసినట్లుంది. రిసీవరు పెట్టేయకండి. సాయంకాలం ఆరుగంటలకి బీచ్ కి వచ్చేయండి. నా వ్యాపారంలో వచ్చిన లాభాన్ని మొదట మీకే ఖర్చు పెట్టాలి. ఇలా నిర్ణయించుకోవడం వల్లే అమ్ద్గ్యలోంచి ఒక్క రూపాయి కూడా తీసి ఖర్చుచేసుకోలేదు. దీంతో మొత్తం నాలుగు పూతలుగా తిండి తినలేదు. లాభంలో మీకు ముంత కింద బొరుగులు తీసిచ్చిన తరువాతే నా భోజనం, సో... వచ్చేయండి, ఆరు గంటలకి మీరు బీచ్ లో కనిపించకాపోతే ముందు చెప్పినట్లు మీకోసం తలకిందులా తపస్సు చేస్తాను. 'నేను మరణింపనామె చింతింపదొడగె ఎంత తొందరగా కరుణించె నన్ను' అని గాలిబ్ అన్నట్లు లేట్ గా రాకండి..."
ఆమె రిసీవర్ పెట్టేసింది. ముఖమంతా చెమటలు పట్టేశాయి.
అతని పిచ్చికి ఓ పక్క కోపమూ, అతని ప్రేమకు మరో పక్క ఆనందమూ కలుగుతున్నాయి.
లాభంలో మొదట తనకే ఖర్చు పెట్టాలని రెండురోజుల నుంచి అన్నం తినకుండా వున్నాడన్న విషయం వినగానే ఎందుకనో మొత్తం శరీరమంతా కదిలి కళ్ళల్లో కన్నీళ్ళు వూరాయి. అలా ఫోన్ లోనే ఏడ్చేస్తాడేమోననే భయం కూడా కలిగింది. అందుకే మౌత్ పీస్ ను దూరంగా వుంచుకుంది.
ఆరుగంటలకి రాకపోతే నిజంగానే తపస్సు చేస్తాడా? మెడవరకు గుంత తవ్వుకుని, అందులో తల వుంచి, పైకిలేపి తపస్సు చేస్తాడట. నిజంగానే చేస్తాడు కోటిసార్లు తన పేరు రాసినవాడు, చిన్న సెంటిమెంట్ కోసం రెండు రోజులు పస్తులున్న వాడు ఇది మాత్రం చేయలేడా? తప్పకుండా చేస్తాడు.
అలా తల లోపల పెట్టేస్తే ఎంతసేపు బతకగలడు? పదీ, పదిహేను నిముషాలకంటే బతకడు. మ్యాజిక్ చేసేవాళ్ళయితే ఏదోలా గాలి ఆడడానికి అరేంజ్ చేసుకుంటారు. ఇతనూ అలా చేస్తాడా? అలా చేయకపోవచ్చు. అలాంటి టెక్నిక్కులూ ఏమీ తెలిసినట్లు లేవు. అందుకే చచ్చిపోతాడు. తన వలన ఒకరు చనిపోతే ఆ నిజాన్ని, ఆ విషాదాన్ని ఎలా భరించగలగడం?
