Previous Page Next Page 
నీ మీద మనసాయరా పేజి 35


    
    తనను బెదిరించడానికే అలా చెప్పాడా? కానీ ఇలా బెదురుకుంటూ పోతే ఇది ఎక్కడ ఆగుతుంది? ఈరోజు బీచ్ కి రమ్మన్నాడు. రేపు మరో దగ్గరికి రమ్మంటాడు. సో వెళ్ళకపోవడమే ఉత్తమం. అలా నిర్ణయించుకోవడంతో కొంత టెన్షన్ తగ్గింది.
    
    స్నానం చేస్తే తప్ప ఈ అసహనం పోదనిపించి లేచి బాత్రూమ్ లోకి వెళ్ళింది.
    
    అప్పుడు టైమ్ పదిగంటలయింది.
    
    ఎప్పుడూ లేనిదీ కాలం అతివేగంగా ప్రవహిస్తున్నట్లుంది. సెకన్లు, నిముషాలు కుండపోతగా కురుస్తుంటే, తను ఒక్కతే చిక్కుకుపోయినట్లనిపిస్తోంది. సాయంకాలం కాకుండా వుంటే ఎంత బావుండో ననుకుంది. కానీ కాలం రేసుగుర్రంలా పరిగెడుతోంది.
    
    స్నానం ముగించింది గానీ ఏమీ తినాలనిపించలేదు. నిజంగానే తనకు ఆకలి కాలేదా? లేక తనకోసం మరోవ్యక్తి రెండురోజుల నుంచీ ఏమీ తినకుండా వుండడం వలన ఆకలి కావడం లేదా అని తర్కించుకుంది.
    
    మొత్తంమీద భరించలేని వేదనవల్లే తను తినలేక పోతూ వుందని మాత్రం గుర్తించింది.
    
    ఇలాంటి వేదన పెళ్ళి అయిన కొత్తలో అనుభవించింది. తన తండ్రి పరపతి వలన ఇంకా పెద్ద కాంట్రాక్టర్ అయిపోవచ్చని తనను పెళ్ళి చేసుకోవడానికి సిద్దపడ్డట్లు జగదీష్ చెప్పినప్పుడు ఇంతగానే షాక్ కు గురయింది.
    
    పెళ్ళి వలన జరిగే లాభనష్టాలను బేరీజు వేసుకొనే ఎవరయినా సంబంధాలను ఫిక్స్ చేసుకోవచ్చేమోగానీ ఆమె ఈ వాస్తవాన్ని జీర్ణించుకోలేక పోయింది.
    
    అచ్చు అలాంటి సంఘటనే అంతకు ముందు ప్రాక్టికల్ గా చూసింది. ఆమె ఎం.ఏ చదివేటప్పుడు కవిత, సబిత అనే ఇద్దరు అక్క చెల్లెళ్ళు చదువుకునే వాళ్ళు కాలేజీ చేరేటప్పటికే అక్క అయిన కవితకు పెళ్ళయి పోయింది. వాళ్ళ నాన్న పెద్ద బిజినెస్ మేగ్నెట్. గ్రానైట్లు బిజినెస్ లో కోట్లు సంపాదించాడు.
    
    వాళ్ళకు దూరపు బంధువయిన ఓ అబ్బాయి కవిత, సబితతో పాటు డిగ్రీ చదివేవాడు. అప్పుడు కవితవెంట పడ్డాడు. ప్రేమిస్తున్నానంటూ తిరిగేవాడు. మొదట్లో కవిత అతనంటే కొంత అయిష్టత చూపించినప్పటికీ కొంతకాలానికి ఆమె కూడా అతన్ని ప్రేమించింది.    
    
    తండ్రి వద్దంటున్నా యెలాగో ఒప్పించి అతన్ని పెళ్ళి చేసుకొంది. భర్తగా అతనికి అదృష్టమే పట్టింది. ఆమె తండ్రి అతనికి తన వ్యాపారంలో భాగస్వామ్యం కల్పించాడు. అతని స్థితి పూర్తిగా మారిపోయింది.
    
    సంవత్సరం గడిచిందో లేదో కవితకు ఓ భయంకరమైన నిజం తెలిసింది. తన భర్త కేవలం డబ్బు కోసం తనను ప్రేమించినట్లు నటించాలని అర్ధమైంది. తన వెంటపడేముందు తన చెల్లెలు సబితతో కూడా అతను ఇలాంటి ప్రేమ పాఠాలు వల్లింఛాడని, ఆమె ససేమిరా వీలు కాదంటే ఆ తరువాత తన వెంట పడ్డాడని తెలిసింది. ఇది తెలిశాక అతన్ని యెలా ప్రేమించగలదు? పోట్లాడి యూనివర్శిటీకి వచ్చి ఎం.ఏలో చేరిపోయింది. ఆ తరువాత వాళ్ళ వివాహ బంధం ఏమైందో తెలియదు సూర్యాదేవికి.
    
    ఇలాంటివి విని వుండడం వల్ల కొంత తట్టుకోగలిగింది గానీ లేకుంటే ఆ క్షణాన మూర్చపోయేది. ఆ తరువాత ఇంత కాలానికి తిరిగి ఆకలి వేయడం లేదు. అప్పుడు ప్రేమ లేదని, ఇప్పుడు ప్రేమ వుందని తేడా అదే.
    
    కాఫీ తాగి, రాక్ లో చేతికందిన పుస్తకాన్ని తీసుకుంది. చిత్రంగా అది టాల్ స్టాయ్ అన్నాకరేనీనా అది చేతిలో వుండడం కొంత ధైర్యం చిక్కినట్లయింది.
    
    పెళ్ళయ్యాక అన్నా కరేనీనా ఓ యంగ్ మిలటరీ ఆఫీసర్ తో ప్రేమలో పడుతుంది. చివరికి ఏమౌతుందో గుర్తు రాలేదు సూర్యాదేవికి.
    
    ఆ కాలంలో లాగా జగదీష్ కి, వసంత్ కి ద్వంద్వ యుద్ధం పెడితే ఎవరు గెలుస్తారు? వసంతే గెలుస్తాడా? ఒకవేళ చచ్చిపోతే? ఇప్పుడూ అదే గదా అవుతోంది. ఇంతకీ వెళ్ళడమా? మానడమా?
    
    ఈ ఆలోచనలతో తలనొప్పిగా వున్నట్లనిపించి బెడ్ రూమ్ లోకెళ్ళి పడుకుంది. ఏవేవో దృశ్యాలు కళ్ళ ముందు కదులుతున్నాయి. ఒకదాని కొకటి సంబంధం లేదు. అలా వుండగానే నిద్రపట్టేసింది.
    
    "అమ్మా! ఫోన్" పనిమనిషి అరిచి చెప్పడంతో ఆమెకి మెలకువ వచ్చింది.
    
    "ఫోనా?" కంగారుగా అడిగింది.

    "అవునమ్మా"
    
    ఖచ్చితంగా వసంతే అయి వుంటాడు.
    
    చివుక్కున తలపైకెత్తి టైమ్ చూసింది.
    
    గడియారం సగానికి బద్దలైనట్లు ఆరుగంటలను చూపిస్తోంది. అంటే ఫోన్ లో చెప్పి తపస్సు చేయడానికి వెళ్ళిపోతాడన్న మాట.
    
    ఇప్పుడేం మాట్లాడుతుంది తను?
    
    "నిద్రపోతున్నారని చెప్పెయ్, లేపినా లేవడం లేదని చెప్పు" అంది సూర్యాదేవి.    

    పనిమనిషి వెళ్ళిపోయింది.    

    ఇసుకలో గుంత తవ్వుతున్న వసంత్ కన్పిస్తున్నాడామెకు అదిగో గుంతలో మెడ పెట్టేసి రెండు చేతులతో ఇసుక తోసుకున్నాడు. కాళ్ళు పైకెత్తాడు.
    
    తన పేరే పలుకుతున్నాడు.
    
    గాలి బలహీనంగా తగులుతోంది.
    
    ఆఁ కిందపడిపోయాడు. ప్రాణం పోయింది.
    
    ఇదంతా కళ్ళ ముందు కదిలి ఆమె ఠక్కున పైకి లేచింది. క్షణాల్లో ముఖం కడుక్కుని తయారయింది.
    
    పనిమనిషికి చెప్పాలన్న ధ్యాస కూడా ఆమెకి లేదు. కారులో కూర్చుని యాక్సిలేటర్ నొక్కింది. కారు చిరుతపులిలా ముందుకు దూకింది.
    
    టైమ్ ఆరూ ఇరవై చూపిస్తోంది.
    
    వసంత్ కి ఏమీ కాకూడదని మొదటిసారి ఆమె దేవుడ్ని ప్రార్దించింది. కారు బీచ్ లోకి వెళ్ళే వరకు ఆమె క్షణానికోమారు దేవుణ్ణి వేడుకుంటూనే వుంది.
    
    కారు హోటల్ పక్కన పార్క్జ్ చేసి అతను చెప్పిన వేపుకి పరుగెత్తింది. సముద్రపు హోరు భయంకరంగా విన్పిస్తోంది. మసక చీకటి లోకాన్ని పెద్ద కొండచిలువలా చుట్టుకుంటోంది.
    
    దూరంగా ఏదో ఆకారం ఉన్నట్లు అనిపించడంతో అటుకేసి దూకిందామె. ఇసుకలో కూరుకుపోతున్న కాళ్ళను బలవంతంగా పైకి లేపుతోంది.
    
    ఆమె దగ్గరికి వెళ్ళడం వసంత్ దబ్బున కింద పడిపోవడం ఒకేసారి జరిగాయి.
    
    భయం, కంగారు, ఆందోళన, ఏడుపు అన్నీ ఒక్కసారిగా మీద పడడంతో తను ఇసుకలో కూరుకుపోతున్నానన్న భావన కలిగిందామెకు.
    
    అతన్ని రెండు చేతులతోనూ పైకి లేపింది. ముఖమంతా యిసుక, మచ్చల అమ్మోరు పోసినట్లుంది. చేతుల్తో గబగబా తుడిచింది. శ్వాస ఎక్కడో బలహీనంగా కొట్టుకుంటోంది. అది ఆగిపోతుందో, కొనసాగుతుందో తెలియని పరిస్థితి.
    
    "వసంత్... వసంత్...." ఆమె అరుస్తూ చెంపలను మెల్లిగా తడుతోంది.
    
    అతను కళ్ళు తెరవలేదు. ఈలోకంలో వున్నట్లు లేదు. ఆమె అతన్ని కింద పడుకోబెట్టి నీళ్ళవేపు పరుగెత్తింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS