మళ్ళీ పై కెగబాకి మైక్ టెస్టింగ్ ని కొనసాగిస్తున్నట్లు "నైన్" అంటూ కళ్ళమీద పెదవులతో అద్దాడు.
హరికథ నా శరీరం మీద మొదలైనట్లనిపించింది. నా మెడలో పూలదండలేసినట్లు అతని శ్వాస మెత్తగా తగుల్తోంది.
"ఎయిట్" నాటో ముక్కుమీద వయొలిన్ తీగలను సవరిస్తున్నట్లు ముక్కుతో రాశాడు.
ఇంకాస్త కిందకు దిగి నా కంఠాన్ని నోటితో అదిమాడు సెవెన్ అన్నాడు.
"సిక్స్" అంటూ నాఎదపై తబలాలను శృతి చేస్తున్నట్లు కదిపాడు.
"ఫైవ్"
నా నడుము అతని పిడికిట్లో తాబేలు ముడుచుకున్నట్లు ఇమిడిపోయింది.
"ఫోర్" అని, గజ్జెల డప్పుమీద కొడుతున్నట్లు వేళ్ళతో ఏదేదో చేస్తున్నాడు.
"త్రీ" అనేటప్పటికి నా నడుము ముడతలు అతని వేళ్ళ మధ్య నలుగుతున్నాయి.
"టూ" అని చీర కుచ్చిళ్ళమీద చేయివేశాడు. నేను సిగ్గునంతా అరచేతుల్లో దాచి పెట్టుకున్నట్లు కుచ్చిళ్ళు వూడకుండా పట్టుకున్నాను.
"ఒన్" అంటూ నా పొత్తి కడుపు వైశాల్యాన్ని అతని నాలుక కొలుస్తోంది.
"అదిగో అటు విను హరికథ - పద్మవ్యూహం మొదలైంది" అన్నాను కొంటెగా చూస్తూ.
"నాకూ పద్మవ్యూహమే- ఓనమాలు కూడా రావు" అన్నాడు.
"ఏం ఫరవాలేదు ఆ పద్మవ్యూహాన్ని ఎలా ఛేదించాలో కడుపులో వున్న అభిమన్యుడికి అర్జునుడు ఎలా చెప్పాడో అలానే కౌగిలిలో వున్న నీకు నేను చెబుతాలే"
నా నవ్వు చందమామకే చక్కిలిగింతలు పెట్టినట్లుంది. అందుకే చందమామ మబ్బులమాటుకు తప్పుకుంది.
నాకు అంతకుముందున్న అభద్రతా భావం అంతా ఎగిరిపోయింది పెదరెడ్డి కొడుకే నా కౌగిలిలో వున్నాడు మరి.
ఇకనుంచీ నన్ను చూసి కూతోడు ఇష్టం వచ్చినట్లు జోకులెయ్యడు- కుర్రకరంతా మెలికలు తిరిగిపోతూ కన్నుగీటరు. మసకచీకట్లో నా నడుం మడతల మీద ఇక ఏ చెయ్యీ పడదు.
ఈ ఆనందమంతా ఎప్పటికీ ఎగిరిపోకూడదన్నట్లు గోకుల్ ని గట్టిగా అదిమి పట్టుకున్నాను.
పద్మవ్యూహంలోకి అభిమన్యుడు ప్రవేశిస్తున్న ఘట్టాన్ని చెబుతున్నాడు హరిదాసు" - అంటూ చెప్పడం ముగించింది చాముండి.
10
సూర్యాదేవికి మెలకువ రావడంతోనే ఆరోజు ఆదివారం అన్న విషయం గుర్తొచ్చింది.
ఆరోజు సాయంకాలమే బీచ్ కి రమ్మనమని వసంత్ పిలిచింది. ఆమెకు వెళ్ళాలని లేదు. కానీ తను వచ్చేవరకూ తలకిందులా తపస్సు చేస్తాననడం వల్ల వెళ్ళకపోతే అతను చచ్చిపోతాడేమోనన్న భయం గుండెలో కుమ్మర పురుగులా కదులుతోంది. అందుకే ఎటూ నిర్ణయించుకోలేక పోతోంది.
ఇలాంటప్పుడే మనిషి వేదనకు గురౌతాడు. ఇప్పుడు ఆమె ముందు రెండు ఛాయిస్ లున్నాయి. అతను ఏమైపోతే తనకేమంటూ వెళ్ళకపోవడం, రెండు- అక్కడికి వెళ్ళి కాసేపు అతనితో గడపడం ఛాయిస్ ఆమెదే. ఆమె వెళ్ళనూ వచ్చూ, వెళ్ళక పోవనూవచ్చు. ఇలాంటి సమయాల్లో ఇలానే ప్రవర్తించాలన్న నిమయాలు ఏమీలేవు. ఈ విధంగా చేస్తే ఈ లాభాలున్నాయని కూడా ఎవరూ చెప్పలేరు.
మనుషులందరూ ఒక్కటే కాదు. డిఫరెంట్ మనస్తత్వాలు, డిఫరెంట్ పరిస్థితులు, ఇలాంటప్పుడు ఇలానే ప్రవర్తించాలని చెప్పడం అన్యాయం, ఎవరికి వారు నిర్ణయించుకోవాలి. కానీ మనిషి ఈ స్వేచ్చను వినియోగించుకోలేక పోతున్నాడు. తనకు స్వేచ్చలేదని ఆత్మ వంచన చేసుకుంటాడు. స్వేచ్చలేదని అనడం కూడా స్వేచ్చలో ఒక భాగమే.
కానీ నిజంగా మనిషికి ఇంత స్వేచ్చ వుందా అన్న అనుమానం కలిగిందామెకు.
ఈ ఆలోచనలను పక్కకు తోసెయ్యడానికి ఆమె పడకమీద నుంచి లేచింది.
జగదీష్ అప్పటికే స్నానం చేసి వర్క్ స్పాట్ కి వెళ్ళడానికి తయారవుతున్నాడు.
ఇది రోజూ జరిగేదే. ఆమె రాత్రి ఎక్కువసేపే మేల్కొని ఆలస్యంగా నిద్ర లేస్తుంది. అతను త్వరగా పడుకుని త్వరగా లేస్తాడు.
రాత్రి బాగా పొద్దు పోయేవరకూ చదువు కోవడం ఆమెకి అలవాటు. అతను ఎప్పుడూ పుస్తకాన్ని తాకడు. ఎప్పుడైనా పుస్తకం తెరిస్తే అది వారఫలాల కోసమే. భోం చేయడం తరువాయి నిద్రలోకి జారిపోతాడు. అతన్ని చూస్తే ఆమెకు విచిత్రంగానూ ఆశ్చర్యంగానూ వుంటుంది.
అతనికి ఎలాంటి సమస్యలూ లేవు. ఫక్తు మెటీరియలిస్ట్ తన కాంట్రాక్టులు తప్ప మరో ధ్యాస లేదు, సినిమాలు కూడా సరిగా చూడడు.
"సినిమాల్లో ఏం వుంది? జనం ఎందుకంత విరగబడి చూస్తారో నాకర్ధం కాదు. హీరో హీరోయిన్ ను పొగిడితే హీరోయిన్ హీరోను పొగుడుతుంది. వీళ్ళిద్దరి మధ్యా ఓ విలన్. రామాయణం నుంచి అదే కథ కదా" అంటాడు నిరసన భావంతో.
టీవీలో భరతనాట్యం వస్తున్నా తన క్యాలిక్యులేటర్లో లెక్కలు వేసుకుంటూ వుంటాడు.
కవిత్వమంటే చాలా అయిష్టం అతనికి. ఏమిటి కావాలంటారు వీళ్ళంతా! ఏమిటీ నిగూఢ అర్ధాలు, ఈ కవిత్వం కంటే ఎస్ ఐ రాసిన ఎఫ్ ఐ ఆర్ ఇంట్రస్టింగ్ గా వుంటుంది చదవడానికి" అంటాడు.
ఎంతసేపూ పని, డబ్బూ తప్ప మరొకదానికి తావులేదు అతని దినచర్యలో.
దీనికి అపోజిట్ ఆమె కవిత్వం, చందమామ, తాత్త్విక చింతన, గాఢమైన అనుభవాలు- వీటినీ కోరుకుంటోంది. ఇలా విభిన్న ధృవాలైన వాళ్ళిద్దరూ పెళ్ళి బంధంతో ఒకటై ఒకే పంచలో కలిసి బతకడం విచిత్రం. అతనికి జనం అక్కర్లేదు. తన జీవితం తప్ప మరో జీవితంలోకి తొంగి చూడడమంటే అతనికి పూర్తిగా ఇష్టం లేదు. కానీ ఆమె అలాకాదు. ఇంటి నుంచి బయటకి నడిచె అవసరమే లేదామెకి. పుట్టింట్లోనూ అంతే, మెట్టింట్లోనూ అంతే.
కాపురానికి వహ్చిన మొదట్లో ఉద్యోగం చేయాలని చాలా ఆరాటపడింది ఆమె.
"జీవితమంటే మనమే కాదు కదా. చుట్టూ వున్న మనుషులతో కలిసి వుంటేనే కదా జీవితానికి పరమార్ధం. వాళ్ళ కష్టసుఖాల్లో పాలు పంచుకోకుండా తలుపులు బిడాయించుకుంటే ఏం బావుంటుంది చెప్పండి. అందుకే నలుగురి మధ్యా తిరగడానికి నేను ఉద్యోగం చేస్తానండీ" అంది.
అతను దానికి సుతరామూ ఇష్టపడలేదు.
"నువ్వు సంపాదించాల్సింది కూడా నేను సంపాదిస్తాను. నీలాంటి అమ్మాయికి బయటికి వెళ్ళి తిరగాల్సిన ఖర్మేం పట్టింది" అన్నాడు.
