"ఇంకా ఎవరినీ నిర్ణయించుకోలేదండి"
"వెరీగుడ్. మంచి పిల్లని చూపిస్తాను, చేసుకుంటావా" - రామం ఉలిక్కిపడ్డాడు.
'ఇప్పుడే ఎందుకండీ. ఈ కేసులు అవి అయ్యాక ఆలోచిస్తాను'-
ఏమో - ఒకవేళ మంచి సంబంధమయితే చూడచ్చుగా ఇంతవరకు తను ఎవరినీ గట్టిగా అనుకోలేదు - తను అనుకున్నది అవుతుందా కాదా తెలియదు. ప్లీడరుగారి తరపునుండి వస్తే అది మంచి సంబంధమె అవుతుంది - అండదండలున్న సంబంధమయితే మరీ మంచిది ఇప్పుడే వద్దని అనటం ఎందుకూ - చూస్తే తప్పేముంది - ఇంతకీ, విధి ఎలా నడిపిస్తే అలా నడవాల్సిందేగా మనం - ఏదారెటుపోతుందో ఎవరికీ తెలియదు !
'ఏమంటావు' - ఏదో ఆలోచనలోవున్న రామానికి మళ్ళీరామనాధ గొంతు వినిపించింది.
'అలాగేనండి, చూస్తాను' అన్నాడు ముభావంగా.
'నా స్నేహితుడు శంకర్ అని వున్నాడు - అతని బాబాయి కూతురుంది - పిల్లబంగారం - వంకపెట్టేపనిలేదు - ఎంతో బాధ్యత తెలిసినపిల్ల - అన్నలిద్దరూ వాళ్ళ సంసారంగొడవల్లో మునిగి తేలుతూ దీని విషయం పట్టించుకోలేదు తండ్రి పెద్దవాడు - తల్లిలేదు - పాపం, మంచిపిల్ల - మా శంకరుకి అది అంటే ప్రాణం - నీ గురించి మరి ఎవరు చెప్పారో ఏమో, నిన్ననాదగ్గర కొచ్చాడు. నీతో మాట్లాడుతానన్నడు వద్దులే, ముందు అతనితో మాట్లాడనీ అని అన్నాను. ఆలోచించుకో, బి.ఎ దాకా చదివింది. ఉద్యోగం లేదు మరి - బుద్దిమంతురాలు అంతే నే చెప్పగలిగింది - రామనాథం బల్లమీదున్న చిన్న పిన్నుతో పళ్ళు కుట్టుకుంటున్నాడు - రామం ఎటోచూస్తున్నాడు.
'రేపొస్తానండి' లేచాడు రామం.
'ఎన్ని గంటలకొస్తావూ మధ్యాన్నం మూడుగంటలకి రా- వాళ్ళని రమ్మని కబురు పెడతా. తరవాత దైవాధీనం -" - రామం, వకీలుగారికి నమస్కారం చేసి బయటకెళ్ళాడు.
నిద్రలేచిన రాజారావుకి శివమెత్తి నట్టే అయింది.
'మమ్మల్ని వొదిలి వాడెళ్ళిపోయాడా అంటే, ఇక్కడ నేను గుండె ఆగిచచ్చిపోయినా, ఏ బస్సుకిందో పడిచచ్చినా, వాడికి అక్కర్లేదన్నమాట. నేనసలు ఇక్కడే వుండి పోతా నాతోటదొడ్డి అన్నీ అమ్మించేశారు. - నే నెక్కడుంటే ఏమిటి - ఏం, వాళ్ళనే కన్నానా - దీన్ని కనలేదా - వాళ్ళమీద ఎంత ఖర్చుపెట్టానో దీనిమీద అంతకంటే ఎక్కువ ఖర్చు పెట్టాను - నా ఆస్తితినగలదుకానీ నన్నుచూడదా - ఏవమ్మా రాజమ్మా నీదోవన నువ్వు వెళ్ళు -నాకెవరూ అక్కర్లేదు. - ఒకటే అరుస్తున్నాడు. రాజమ్మ ఉలిక్కిపడిలేచింది.
'ఏమిటి బావా - ఏమిటీ రంకెలు, ఎవరిమీద అంది ఆవులిస్తూ.
రాజారావు చెప్పాడు.' పోన్లే పెద్దాడు ఊరెళ్ళిపోతే మనం వెళ్ళలేమా - అయినా టిక్కట్లు నాకిచ్చాడు. వాడి మనసూ విరిగి పోయింది దీని వ్యవహారం చూసి. నువ్వు కాస్త తమాయించుకో నిన్ను క్షేమంగా ఊరుచేర్చే బాధ్యత నాది" - రాజమ్మ వంటింట్లో కెళ్ళి హార్లిక్సు కలిపి తెచ్చింది. రాజారావు కోపమంతా అటునించి ఇటుతిరిగింది.
'అది వుందాయింట్లో - ఎక్కడికయినా పోయిందా - శారదా, శారదా' అరిచాడు, శారద వచ్చి గుమ్మంలోనుంచుంది.
'అది వుందాయింట్లో - ఎక్కడికయినా పోయిందా - శారదా, శారదా' అరిచాడు, శారద వచ్చి గుమ్మంలోనుంచుంది.
'నేను అన్నయ్యని వెళ్ళద్దని బతిమాలాను వినకుండా వెళ్ళి పోయాడు' అంది నసుగుతూ.
'పోనీ - నేను ఇక్కడే వుంటా - నాటిక్కట్టుకాన్సిల్ చేయి వెళ్ళి - రాజమ్మ పిన్నిని బస్సు ఎక్కించు - ఏం, ఆపాటి తిండి పెట్టలేవా వండి - నేనేం బయటవాడినికాదుగా. మీ అమ్మ ఎప్పుడూ గోలపెట్టేది దీని బతుకే ఏదారికీ రాలేదు - ఆస్తి ఆ మగపిల్లలతో సమంగా ఇవ్వండని - నీకూ యిచ్చాను - వాళ్ళే నన్నెందుకు చూడాలీ - నువ్వెందుకు చూడద్దూ - అది ఎప్పటి మాటో, ఆడపిల్ల ఇంట్లో పుట్టింటివారుపడితినకూడదని - ఇప్పుడది చెల్లదు - నేను వెళ్ళను - ఇక్కడే వుండిపోతా - రాజారావు ఆయాసపడ్డాడు.
శారద గజగజా వణికిపోయింది. నిజంగానే తండ్రి తన దగ్గరే వుండిపోతే ఇంకేమైనా వుందా. తను ఆరోతారీఖున ఈ ఊరే వదిలివెళ్ళింపోతోంది - నాన్ననితనెలా ఉండమంటుందీ - ఏం చేయాలిప్పుడు - తనకి సలహాచెప్పేవాళ్ళులేరే - అన్నయ్యవెళ్ళిపోతుంటే ఆపకుండా తనెందుకు ఊరుకుంది - అన్నయ్య తన వ్యవహారాలన్నీ పసిగట్టేస్తాడనే భయంతోనేగా - ఇప్పుడు మరి, రాజారావు అలసిపోయి నిద్రపోయాడు. రాజమ్మ పిన్ని గుమ్మంలో కూచుంది.
"శారదా ఇలారా" అంది నెమ్మదిగా
"నాన్న పెద్దవాడు - నాలుగు రోజులు నీ దగ్గరుండాలనుకుంటున్నాడు - ఉండనీ - కూతుర్లేమిటీ, కొడుకులేమిటి - అంతా పిల్లలే, పాపం, పెద్దవాడూ - ఏమంటావూ" - రాజమ్మ నిలదీసింది శారదని.
శారదముఖం వెలతెలపోయింది. ఏం చెప్తుందీ వెంటనే, లోపల కెళ్ళి మంచినీళ్ళు తాగివచ్చింది. ప్రస్తుతం వీళ్ళని వదిలించుకోవాలి అని మనసులో నిశ్చయించుకుంది. శారద మనసంతా బొంబాయి ప్రయాణంచుట్టూ, దినేష్ చుట్టూ తిరుగుతోంది.
'కాదు పిన్నీ - నా మాట విను - సుబ్బలక్ష్మిగారు ఇల్లు ఖాళీ చేయమని చాలా రోజులుగా అంటోంది.'
'ఆ - అంటే -అందిలే చెప్తాను సుబ్బలక్ష్మితో ఓ రెండు నెలలు వుండనీయండని - నా మాట కాదనదు' అంది రాజమ్మ వెంటనే.
'అలా కాదులే - నేను మంచి యింటికి మారుతాను. అందులో బాత్ రూములు హాట్ వాటరూ పంపూ'
'అంటే'
అదే - వేడి నీళ్ళు పోసుకోవాలంటే ఇలా పంపు తిప్పుతే చాలు జర జర వచ్చేస్తాయి వేన్నీళ్ళు. పెద్దదొడ్డి నువ్వువుంటే హాయిగా పొట్లపాదులు, ఆనపపాదులు పెట్టచ్చు. కరివేపాకు మొక్క నాటుకోవచ్చు - చాలా హాయిగా వుంటుందిలే ఆ ఇల్లు - అందులోకి మారుదాం "అంతమంచి ఇంటికి బోల్డు అద్దె పెట్టదూ డబ్బంతా అద్దెలకింద తగిలేస్తామా - నేను సుబ్బలక్ష్మితో మాట్లాడతాగా" అంది మళ్ళీ రాజమ్మా.
'అమ్మపోయిన బెంగ ఇంకా మీ నాన్నకి పోలేదు. ఓ నాలుగు రోజులు పెద్దమ్మాయి దగ్గరా. ఓ నాలుగు రోజులు సీతమ్మ దగ్గరా'
'సీతమ్మ దగ్గరా'
'ఈ మధ్య వాళ్ళ అత్తగారు చచ్చిపోయిందిలే - దానికి కావలసినంత స్వేచ్చ వచ్చేసింది. ఇప్పుడందరం దానింటి కెడుతున్నాం - నేనెళ్ళి వారంరోజులుండి వచ్చాను. అలాగే, నాన్నని నీ దగ్గర ఒక్క నెల అట్టే పెట్టుకో" రాజమ్మకి ఉన్నట్టుండి శారద మీద చాలా కోపమొచ్చింది. అయినా ఏమిటి - ఎవరో పరాయి దాన్ని బతిమాలినట్టు నిన్ను బతిమాలుతున్నా. ఆలికి అన్నం పెట్టడం ఊరికి ఉపకారమా 'అన్నట్టుమీ నాన్నకి నాలుగు రోజులు వండిపెట్టడం ఎవర్ని ఉద్ధరించినట్టు నాకొడుకులు అమెరికాలో వుంటే నా కూతుళ్ళు కాదా నన్ను చూస్తోందీ - నువ్వు మరీ బరితెగించి పోయావు - అన్నయ్య నీ మీద కోపమొచ్చివెళ్ళిపోతానంటే, వద్దురా అన్నయ్యా, వెళ్ళద్దని బతిమాలలేవా - పాపం, నీ కోసం వాడు సెలవు పెట్టుకుని ఇంత దూరం వచ్చాడే, ఇదేమన్నా బాగుందా ఆడపిల్లవి అన్యాయమయిపోతున్నావని, పాపం, వాడు ఎంతో బాధపడి నీ ప్లీడరుతో మాట్లాడి, ఆ రామంతో మాట్లాడాలని అన్ని ప్రయత్నాలు చేస్తుంటే, వాడంటే లెక్కలేదా, - అయినా తెలియక అడుగుతాను ఆ దినేష్ ఎవడు, - వాడికి పెళ్ళాపిల్లలున్నారా - నీ రామంతో కాపురం చెడగొట్టింది వాడేనని విన్నాను - మాట్లాడవేం - ఏం, మీ అమ్మవుంటే అడగదా ఇవన్నీ చూస్తూ ఊరుకోలేక కుతకుతలాడిపోతున్నాను, - అన్నయ్య పెద్దవాడినీ లేదు, నాన్నగారు ముసలివారనీ లేదు, ఏదో పిన్ని అమ్మలాంటి దని గౌరవంలేదు - ఏం చూసుకుని నీకు అహంకారం. నీలా వున్నమరో ఆడపిల్లని చూపించునాకు - నీ ఫ్రెండు ఆ లలిత ఎంత ఒద్దికగావుంది. ఆ రోజు సుబ్బలక్ష్మిగారి దగ్గరకొచ్చింది నువ్వు వచ్చావాలేదా కనుక్కుందుకు - మేము ఊరుకుంటున్నాము కదా అని నువ్వు రెచ్చిపోతున్నావు. నీ యిష్టం - నేను గతిలేక రాలేదు నీ యింటికి -బావ ముఖం చూసి, చచ్చిపోయిన అక్కయ్య మీద ప్రేమకొద్దీ, నీగడపలోకొచ్చా. నేను ఇప్పుడే, ఈ క్షణం వెళ్ళిపోతా. నువ్వు మీనాన్నని ఇక్కడ ఉండనిస్తావో, పంపేస్తావో నీ యిష్టం" - రాజమ్మ చీరలు, రవికలు మడతలు పెట్టి సద్దుకోటం ప్రారంభించింది. శారద అవాక్కయి నిలబడిపోయింది. రాజమ్మ మాటలు రాళ్ళవానలాగ గుండెలకొచ్చి కొట్టుకున్నాయి.
