ఆపడానికి ఏమాత్రం ప్రయత్నించలా రేవంత్! ఆ శిక్ష తనకు సరిపోదనిపించింది. ఆ మనసును పట్టుబట్టి వెంటబడి గెలుచుకుని- ఇప్పుడు 'ఇంకో పెళ్ళి చేసుకో!' అన్న తనకు ఆ శిక్ష ఏమాత్రం సరిపోదనిపించింది! తనను కత్తితో కుళ్ళబొడిస్తే బావుండుననిపించింది.
కొట్టీకొట్టీ అలసిపోయి, రెండుచేతుల్తో మొహం కప్పుకుని వెక్కివెక్కిపడుతూ కూర్చుండిపోయింది జ్ఞాపిక!
లేపి గుండెలకు హత్తుకుందామని వంగి, తనను ముట్టుకోబోతూ ఆగిపోయాడు. తనకా అదృష్టం లేదు.... తనకా అదృష్టం లేదు. తన జ్ఞాపీని తను హత్తుకునే హక్కులేదు! అలాగే శిలలా, రాయిలా నిర్జీవంగా ఉండిపోయాడు-
'వద్దే మనసా... ప్రేమించకే నువ్విలా?' అని అదిలిస్తూ!
సమాజం కోసం కాదు! సంస్కృతి కోసం కాదు! అంతరాత్మల కోసం కాదు! అమ్మానాన్నల కోసం, వాళ్ళిద్దరూ తమకోసం పోగొట్టుకున్న జీవితం అందించడం కోసం...తామిద్దరూ గుండెలోని ఆ ప్రేమశబ్దాన్ని పెకిలించాలని చూసీ, వీలుకాక కూకటివేళ్లు కదిలిరాక- పైగా...గుండె ఛిద్రం కాగా; ఆ చితికిన చిత్తడిలోంచి నిర్ణయం తీసుకున్నారు.
* * *
ఇంటికొచ్చిన పిల్లలిద్దర్నీ "ఎన్ని రోజులుంటే మీ ఫ్రెండ్స్ తో మీకు తృప్తి తీరుతుందీ? చక్కగా అందరూ ఇక్కడే ఉండొచ్చుగా! మేం కూడా మీతో కలిసి ఎంజాయ్ చేసేవాళ్ళం!" ముద్దుగా కోప్పడింది మమ్మా.
"సరేలే హాసినీ....ముందు వాళ్ళను ఫ్రెష్ వ్వ నివ్వు!" మెత్తగా పిల్లల్ని సమర్థించారు శరత్ గారు!
అప్పటికే వాళ్ళిద్దరూ ఎంత సన్నిహితం అయిపోయారో అర్థం అయిపోయింది రేవంత్, జ్ఞాపికలకు! ఎన్నోఏళ్ల నుండీ సంసారజీవితం గడిపిన వాళ్ళలాగా, పాత దంపతుల్లాగా అనిపించసాగారు.
ముభావంగా ఉన్న పిల్లల్ని చూసి- 'ఫ్రెండ్స్ ను విడిచిరావడం వలన' అనుకున్నారు వాళ్ళు.
సాయంత్రం గదిలో బోర్లాపడుకున్న జ్ఞాపికను లేపి, "జుట్టు చూడు హనీ- ఎంత చిక్కుపడిందో! లే... ఆయిల్ రాసి చిక్కు తీస్తాను! హెడ్ బాత్ తీసుకుందువు!" అని కూర్చోబెట్టి మెత్తగా చిక్కుతీస్తూ- "ఎంతబావుందో.... నీ జుట్టు! పెంచుకుంటే ఇంకా బావుంటుంది. ఇక హెయిర్ కట్ చేసుకోకు. ఇన్నాళ్లూ ఉన్నావు కనుక కోంబింగ్ ప్రాబ్లమ్! ఇకనుంచీ నేను రోజూ చిక్కుతీసి, జడేస్తాను....సరేనా!" అంటూ సుహాసిని మెత్తగా కోప్పడుతుంటే...అసలెన్నడూ ఎరుగని అమ్మప్రేమకు కరిగి ఏడ్చేసింది.
"ఛ...చిన్న పిల్లలా ఏంటీ?" అంది తల గుండెకు హత్తుకుంటూ.
"మమ్మా! నాకు ఎలాగో ఉంది!" నిజమైన కూతురిలా ఒళ్ళో తలపెట్టుకుని వెక్కివెక్కి ఏడ్చింది.... గుండెబరువు తీరేలా!
ఓదారుస్తూ తలనిమురుతూ ఉండిపోయింది సుహాసిని! తనకు'అమ్మ' దొరికిందనే ఉద్వేగం అనుకుంది ఆవిడ!
జ్ఞాపిక బాధ చెప్పలేదు! చెప్పందే ఆవిడ అర్థంచేసుకోలేదు! కానీ, బాధ, ఓదార్పు... అంతే- కారణం తెలియకపోయినా!
రేవంత్ ని బలవంతంగా కారమ్స్ ఆటలో కూర్చోబెట్టి ఆట మొదలెట్టారు డాడ్! ఇంట్రస్ట్ లేకపోయినా ఆయన ఆఫర్ కాదనలేక కూర్చున్నాడు.
మధ్యలో ఆయనకో ఐడియా వచ్చి, "హాసినీ....నువ్వూ, హనీ కూడా జాయిన్ అవ్వోచు కదా!" అన్నారు.
"ఓయస్...రెడీ! బిట్టూ, మీరూ ఒక పార్టీ- నేనూ, హనీ ఒక పార్టీ ....ఓ.కే! కమాన్ హనీ!" చెయ్యిపట్టుకు తీసుకొచ్చింది జ్ఞాపికను! బలవంతంగా నవ్వుతూ జాయినయింది!
రేవంత్ తలెత్తి కూడా చూడలా!
"ఇదుగో... మగవాళ్ళం- అసలే నేనూ, బిట్టూ అమాయకులం! చీటింగ్ చేస్తే ఒప్పుకునేది లేదు! వంద గుంజీళ్లు తీయాలి" అన్నారు శరత్.
"మేం చీటింగ్ చేసినా వంద గుంజీళ్లూ అవలీలగా తీసేస్తాం! కాస్త మీరే చీటింగ్ చేసేముందు ఆలోచించుకోండి!" అని ఆయన పొట్ట చూపించింది.... తీయలేరన్నట్టు!
"ఓ...,సారీ! అయితే ఈ పనిష్ మెంట్ వద్దు! చీటింగ్ చేసిన బాచ్- నైట్ కు వంట చెయ్యాలి ఓ.కే!" అన్నారు.
"ఓ.కే! కానీ, వంటచేసే నెపంతో వంటింట్లో కనబడ్డవన్నీ తినేయకూడదు" సుహసినీ కండిషన్ పెట్టింది.
"నేను కాస్త బొద్దుగా ఉన్నాను కానీ, రెండు నిముషాలకో చిరుతిండి తప్పితే ఎక్కువేమీ తినను హాసినీ! డాక్టర్ను కదా! ఆమాత్రం డైట్ కంట్రోలింగ్ తెలీదా?" సమర్థించుకున్నారు.
గలగలనవ్వతూ సుహాసిని- "రెండు నిముషాలకోసారి చిరుతిండి తింటూ డైటింగ్?" అడిగింది.
"య్యా!" ఆయనా నవ్వుతూ, "ఏరా బిట్టూ... అంతేనా?" సపోర్ట్ కోసం చూశారు!
పలకకపోయేసరికి తల భుజానికి అదుముకుని, "ఫ్రెండ్స్ విడిపోయారని దిగులుపడితే ఎలా బిట్టూ! మనందరం ఫ్రెండ్స్ కాదూ! నాకు మీ మమ్మా , మీ మమ్మాకు హనీ, హనీకి నువ్వు, నీకు హనీ, మనం కూడా ఫ్రెండ్స్... కమాన్-నవ్వాలీ!~" అన్నారాయన.
నవ్వుతూ స్ట్రైకర్ తీసుకున్నాడు రేవంత్- ఆట మొదలుపెడుతూ! ఎలాంటి జీవితాన్ని వాళ్ళు కోరుకున్నారో అది వచ్చింది! అయితే.... తనకూ, జ్ఞాపికకూ మధ్య అగ్నిగుండం పరుస్తూ!
ఆటలో కావాలనే చీటింగ్ మొదలెట్టారు శరత్ గారు!
"అదుగో.... లైన్ మీద పెట్టి కొట్టారు. ఒప్పుకోను!" గొడవచేసింది సుహాసిని చిన్నపిల్లలా! "చూస్తూ ఊరుకుంటావేంటి హనీ.... దొంగల్ని పట్టుకోవాలిగానీ! మనం ఓడిపోతాం లేకపోతే!" జ్ఞాపికలో ఉషారు రేపుతూ!
'ఓటమి' పదం విన్న జ్ఞాపిక కళ్ళలో నీళ్లు! అవి కనబడకుండా లోపలికెళ్లింది.
"డాడ్! మీరాడుతూ ఉండండి! ఫ్రెష్ అయ్యి నేనలా లైబ్రరీకి వెళ్లోస్తాను" అని రేవంత్ లేచి బాత్ రూమ్ లో కెళ్లబోయాడు.
టవల్ భుజాన వేసుకుని బాత్ రూమ్ లో నుండి కళ్ళు కడుక్కుని వెనక్కితిరిగి బయటకు రాబోయిన జ్ఞాపికను ఢీ కొట్టబోయి తమాయించుకున్నాడు.
ఇద్దరికీ మధ్య అంగుళం దూరం! ఒకరి కళ్ళు ఒకరి కళ్ళను ఢీ విడివడలేక పోయాయి. పిడికిళ్లు బిగపట్టింది.... జ్ఞాపిక ఉద్వేగానికి! ఒకరి శ్వాస ఒకరికి తగులుతోంది.
గొంతు నరాలు పొంగాయి రేవంత్ కు.... ఉద్వేగానికి! పెదవులు కంపించాయి జ్ఞాపికకు...ఉన్మత్తానికి! ఏవో గతం తాలూకు జ్ఞాపికలు!
చివ్వున వెనుదిరిగి వెళ్లిపోయాడు రేవంత్! బాత్ రూమ్ తలుపేసుకుని ట్యాప్ వదిలి ఆ చప్పుడులో వెక్కివెక్కి పడింది జ్ఞాపిక.
'మనసా....నువ్వు ప్రేమించకూడదే! ప్లీజ్... మానేయవే!" బ్రతిమాలుకుంది మొండి మనసును! హాల్లోంచి మమ్మా డాడీలు అల్లరిగా తగువులాడుకుంటూ కారమ్స్ ఆడుతూనే ఉన్నారు...ఎంతోసేపు! ఆ అల్లరి అలా వింటూ వింటూ రిలాక్సయింది జ్ఞాపిక.
రాత్రి పదయినా రేవంత్ రాలా!
అందరూ డైనింగ్ దగ్గర వెయిట్ చేస్తున్నారు.
"తలనొప్పిగా ఉంది మమ్మా.... పడుకుంటాను!" అని జ్ఞాపిక అన్నా- "నో హనీ... బిట్టూ వచ్చేస్తాడు! అందరం కలిసి భోంచేసి పడుకుందువు! గుడ్ గళ్.... డాడీ మాట వినాలి!" మెత్తగా ఆర్డర్ వేశారు.
పదిన్నరకు వచ్చాడు రేవంత్! కాలింగ్ బెల్ కొట్టాడు.
"హనీ! డోర్ తియ్యి ప్లీజ్!" మమ్మా ఫ్రిజ్ లోంచి ఏమో తీస్తూ రిక్వెస్ట్ చేసింది.
వెళ్లి తలవంచుకుని డోర్ తీసింది!
చేతిలోని ఏదో బుక్ తో రేవంత్! ఇద్దరూ విష్ కూడా చేసుకోలా! మౌనంగా లోపలికొచ్చాడు రేవంత్.
"హాయ్ఁ బిట్టూ! ఏవిటింత ఆలస్యం? కమాన్.... ఫ్రెషవ్వు- డిన్నర్ చేద్దాం! లేట్ డిన్నర్ బ్యాడ్ హాబిట్...తెలుసా? ఈజిట్ హాసినీ?!" సపోర్ట్ కోసం చూశారు.
"య్యా! బట్...వింటే కదా! బుక్ ఉంటే టైమే తెలీదు బిట్టూకు!" తనూ మెత్తగా కోప్పడి రేవంత్ తో పాటు లోపలికెళ్లింది!
షర్ట్ బటన్స్ తీస్తున్న రేవంత్ షర్ట్ ను భుజంమీంచి ఊడదస్తూ- "ఏవిటిది బిట్టూ! మునుపటి ఉషారంతా ఏవయిందీ? ఫ్రెండ్స్ కోసం డీలా పడేంత సెన్సిటివ్ కాదే ణా కొడుకు! ఎనీ థింగ్ రాంగ్?!" అంది ఆవిడ ఏదో సస్పెక్ట్ చేస్తూ!
"నో మమ్మా! జస్ట్ డిప్రెషన్.... దట్సాల్! వన్ వీక్ లో కవరయిపోతాను....ఓ.కే.!" మమ్మా భుజాల చుట్టూ చేతులువేసి డైనింగ్ దగ్గరకు తీసుకొచ్చి, లేని ఉషారు తెచ్చుకుని "షల్ వుయ్ స్టార్ట్ డిన్నర్ డాడ్!" అని డాడ్ కు వడ్డించసాగాడు!
జ్ఞాపిక తలెత్తకుండా ఖాళీప్లేట్ లో గీతలు గీస్తూ ఉండిపోయింది!
"జ్ఞాపీ! నీకు చిప్స్ ఇష్టంగా... సాంబారులో వేసుకో- బావుంటాయి!" మమ్మా రైస్ వడ్డిస్తూ అంది.
వాళ్ళ సీరియస్ నెస్ పోగొట్టడానికి- "నేనో తమాషా చెప్తా...వినండి! మీ మమ్మాని నేను మొదటిసారి కలవడాని కెళ్లినపుడు బిట్టూ ఆరునెలల బాబనుకుంటా... కదూ హాసినీ!" డౌట్ క్లియర్ చేసుకోబోయారు.
"నో! నో! ఏడు.... ఏడు నెలలు !" క్లియర్ చేసింది.
"ఆఁ.... ఏడు నెలల! మీ మమ్మా బాబును ఎత్తుకుని ఆడిస్తూ ఉంది. మీ మమ్మా అన్ మారీడ్ అనుకున్నా! దగ్గరికెళ్లి ఎలాగోలా పలకరించాలని, "మీ అక్కయ్యగారి బాబా.... చాలా బావున్నాడు- పేరేంటి?' అని పలకరించాను...ఏదో ఒకటి అనాలికదా- అని!
"కాదు.... నా బాబే!" అంది.
"తమాషా చేస్తోందనుకుని, 'మరి- పెళ్ళేపుడు చేసుకుంటారు? బాబు పుట్టేశాడుగా!' అన్నా, ఈడ్చికొట్టి లోపలికెళ్లింది. దిమ్మతిరిగిపోయిందనుకో!"
సుహాసిని ముఖానికి ఎడంచెయ్యి అడ్డం పెట్టుకుని నవ్వింది.
"అవునూఁ... ఏ చేత్తో కొట్టావు హాసినీ?" అడిగారాయన అనుమానం వచ్చి,
"కుడిచేత్తోనే!" ఎంగిలి చెయ్యి చూపించింది. "నిజం బిట్టూ!" అంది.
చిన్నగా నవ్వాడు రేవంత్.
"ఆఁ....కుడిచేత్తో ఎడం చెంపమీద! ఆరోజు నిద్దర్రాలేదనుకో! మరుసటిరోజు మళ్లీ వెళ్లా- ఎందుకో వెళ్లాలనిపించి! ముఖాన బొట్టు లేకపోతే క్రిస్టియన్స్ అనుకున్నా! మళ్లీ ఏదోటి మాట్లాడాలి కదా- అని, 'మీవారు లేరాండి ఇంట్లో?' అనడిగా! మళ్లీ కొట్టింది! ఈసారెక్కడ హాసినీ?!" అనుమానం వచ్చి అడిగారు.
"ఈసారీ కుడిచేత్తోనే, ఎడంచెంప మీదే!"
"కొట్టి 'ప్లీజ్... నన్ను పలకరించకండి! మావారు చనిపోయారు! నాకీబాబు ఒక్కడే ఈ ప్రపంచంలో! నేనీ ఇంట్లో ఆయాతోపాటు ఉంటున్నా నేను టీచర్ గా జాబ్ చేస్తూ చదూకుంటున్నా ఇవీ వివరాలు! ఇంకెప్పుడూ వివరాలకోసం నన్ను పలకరించాలని ప్రయత్నింఛవద్దు" అని వెళ్లిపోయి దఢాల్న తలుపేసుకుంది."
జ్ఞాపిక, రేవంత్ లు తలవంచుకుని తింటూ మధ్యమధ్యలో బలవంతంగా నవ్వుతున్నారు.
"నేనూరుకున్నానా.... లేదే! మళ్లీ వెళ్లా! 'ఏఁవండీ... మీకభ్యంతరం లేకపోతే మీ బాబుతో సహా నేను మిమ్మల్ని స్వీకరిస్తాను' అన్నాను. అవునూఁ... అంతేనా అన్నాను?!" మళ్లీ డౌటోచ్చింది ఆయనకు.
"స్వీకరిస్తాను.... కాదు! జీవితంలోకి ఆహ్వానిస్తాను.... అన్నారు!" సవరించింది.
"రెండూ ఒకే అర్థాలుగా హాసిని! ఎందుకలా దబాయిస్తావు! సరే.... ఈసారి రెండు చెంపలూ కొడుతుందనుకున్నా. నిశ్శబ్దంగా లోపలికెళ్లిపోయింది. మరుసటిరోజు నేను వెళ్లేసరికి ఇల్లు ఖాళీ చేసేసింది. ఆ తరువాత అడ్రసు కోసం వెతికి ఊరుకున్నాను. ఓరోజు ఉత్తరం వచ్చింది- 'మీ హృదయానికి థాంక్స్! కానీ, ఎదుటివాళ్ళ అభిప్రాయం తెలుసుకోకుండా మీరలా మాట్లాడడం సబబు కాదు! నాకు బాబు తప్ప ప్రపంచంలో ఇంకెవ్వరూ అక్కర్లేదు!' అని. తన అడ్రస్ ఎక్కడా లేదు. అయినా ఎలాగో తెలుసుకుని మీ అంకుల్ ను కాంటాక్ట్ చేశా! ఆయన చెప్పారు! తను మరోపెళ్ళికి సిద్దంగా లేదు....అని! ఇక మరిచిపోయా!"
రేవంత్ మమ్మా వైపు ఆర్థ్రతగా చూశాడు-
"నిజంగానా మమ్మా..' అన్నట్టు!
తలూపింది... అవునని!
"ఇంతలోకి నాకూ పెళ్ళి! ఆ చిట్టితల్లి పుట్టి ప్రపంచాన్నే మరిపించేసింది.... వాళ్ళ అమ్మతోపాటు!" జ్ఞాపిక తల భుజానికి హత్తుకున్నారు. ఆయన కళ్ళలో నీళ్లు!
"ఈ చిట్టితల్లిని అరచేతుల్లో పెంచడంలో అన్నీ మరిచిపోయా! ఇన్నాళ్లకు మళ్లీ భార్యా, కొడుకూ, కూతురుతో కలిసి జీవించే సంపూర్ణజీవితం లభించింది! చాలా ఆనందంగా ఉందనుకో!" అన్నారాయన కళ్ళు తుడుచుకుని, బిట్టూ వైపు నాప్ కిన్ తో తుడుచుకున్న అరచేతులు చాస్తూ.
బిట్టూ తనూ చేతులు తుడుచుకుని రెండు చేతుల్లోనూ రెండుచేతుల్తో క్లాప్స్ కొట్టాడు.
"ఈ కలను ఇలాగే కొనసాగనిస్తారా?!" అడిగారాయన- ఇద్దరి పిల్లల్నీ, భార్యనీ కళ్ళనిండా చూసుకుంటూ.
"ఇది కలెలా అవుతుందీ....నిజం! నిజం కొనసాగే తీరుతుంది! కదూ హనీ! కదూ బిట్టూ!" హెల్ప్ కోసం చూసింది హాసిని.
కళ్ళనీళ్లతో తలూపారు వాళ్ళిద్దరూ! ఆ రోజు తల్లిదండ్రీ పిల్లలయ్యారు! పిల్లలు తల్లీతండ్రీ అయ్యారు.
అలాగే పదిరోజులు రేవంత్ లేవగానే వెళ్లిపోవడం..., కరక్ట్ గా డిన్నర్ టైమ్ కు వచ్చి హడావిడిగా డిన్నర్ చేసి పడుకోవడం, మళ్లీ ప్రొద్దుటే వెళ్లిపోవడం!
ఒకరోజు బయటికెళ్తున్న కొడుకుని ఆపి-
"ఏంటి బిట్టూ ఇది! మాతో అసలు స్పెండ్ చేయడం లేదు నువ్వు?" అంది మమ్మా కోప్పడుతూ! "నువ్వోసారి అద్దంలో చూసుకో.... దేవదాసులా అయిపోయావు!" మెత్తగా మందలించింది....వేళకు ఇంటికి రమ్మని ! "జ్ఞాపిక కూడా బాగా సిక్ అయింది" అని చెప్పింది.
"మమ్మా... నీతో స్పెండ్ చెయ్యడానికి డాడ్ ఉన్నారుగా! నేను నీకు దూరంగా ఉండడం ప్రాక్టీస్ చేస్తున్నా! రేపు ఫారిన్ వెళ్తే ఎలా ఉంటావో చూద్దామని, జ్ఞాపికను ఎలా చూసుకుంటావో చూద్దామని!" అని నవ్వేశాడు.
"నన్ను డాడీ, జ్ఞాపికను నేనూ చూసుకుంటాం సరే- మరి, నిన్ను నీవు చూసుకోనక్కర్లా?!" మందలించింది.
"మీరు ముగ్గురూ ఒకరినొకరు చూసుకుంటే చాలు మమ్మా! నన్ను నేను చూసుకోగలను. నీ కొడుకు మీద కాన్ఫిడెన్స్ లేదా?" చిన్నపిల్లాడిలా తల్లి చుట్టూ చేతులేసి అడిగాడు.
"ఉంది బిట్టూ! కానీ, ఎలా అయిపోయావో చూసుకో!" అడ్డం చూపించింది.
"బావున్నానే! నీ అంతకాదులే!" నవ్వేశాడు.
తనూ నవ్వింది....తలమీద కొట్టి!
"నన్ను మరిపించడం నీకు తెలిసిన విద్యేగా! చూడు బిట్టూ... పెళ్ళయిందనే సంతోషం- నువ్వు బిజీ అయిపోవడం, హనీ సిక్ అవ్వడంతో ఆవిరయిపోతోందిరా! నాకెందుకో దిగులుగా ఉంది!" అంది.
