Previous Page Next Page 
మనసా....ప్రేమించకే నువ్విలా పేజి 35

    "ఎందుకు మమ్మా! జ్ఞాపిక కోలుకుంటోంది తొందరలో! డోంట్ వర్రీ!" అనునయించాడు.
    ఆ మాటలకు కొద్దిగా రిలాక్సయింది!
    అంతే... క్యాజువల్ గానే ఉంది. తనే అనవసరంగా పిల్లలమీద ప్రేమతో కంగారుపడుతోంది... అనుకుంది.
    "సర్లే... ఈరోజు తొందరగా  వచ్చెయ్యి... కాసేపు బయటికెళ్దాం!" ఆర్డర్ జారీ చేసి వెళ్లిపోయింది.... ఆన్సర్  అనవసరమన్నట్టు.
    కాలేజ్, ఇల్లూ, తనూ, పుస్తకాలూ తప్ప వేరే ప్రంపంచం తెలీకుండా స్తబ్దంగా, నిశ్శబ్దంగా, ఎప్పుడూ దేన్నో కాగితాల మీద,  అక్షరాల మధ్యా,  పదాల కిందా వెతుకుతూ వెతుకుతూ తనచుట్టూ తాను గూడల్లుకుని జీవించే 'ప్యూపా' లా ఉండే అమ్మకు- ఇంత అందమైన, ఆనందపు రెక్కలున్నాయని ఏనాడూ ఊహించలేదు. "ఏవండీ...." అంటూ డాడ్ చుట్టూ, "జ్ఞాపిక అన్నం సరిగా తినడం లేదు! రేవంత్ ఇంటికి వేళకు రావడం లేదు. మీరేవిటీ...మరీ కొంచెం పెరుగే వేసుకున్నారు!" అంటూ అందర్నీ పట్టించేసుకుంటూ, తనకు తనే పనులు పురమయించుకుంటూ... అచ్చమైన ఇల్లాలుగా,  పరిపూర్ణ స్త్రీగా మారిపోయి సంబరంగా, సందడిగా తిరుగుతున్న మమ్మాని చూస్తుంటేప 'ఇన్నాళ్లూ ఎలా  ఆపుకుందీ...' అనిపించసాగింది రేవంత్ కు. మమ్మాని చూస్తుంటే-  'ఇన్నాళ్లూ ఎలా  ఆపుకుందీ...' అనిపించసాగింది రేవంత్ కు. మమ్మాని చూస్తుంటే ఆనందంగా, తను చేసిన పని చాలా న్యాయంగా, ఆమె తనకు జన్మనిచ్చినందుకు తాను ఆమెకు జీవితాన్నివ్వగలిగినందుకు గర్వంగా కూడా ఉంది. అయితే... జ్ఞాపిక ఎదురుపడగానే గుండెల్లో ముల్లు గుచ్చినట్టు ఒక బాధ మొదలయి, అది మెదడును తాకి  శరీరాన్ని, మనసునీ అలుముకుని తనను తానే కాక,  జ్ఞాపికకు తీరని ద్రోహం చేసినట్లనిపించసాగింది. అందుకే ఇంట్లో ఎక్కువసేపు ఉండలేకపోతున్నాడు.
    జ్ఞాపికకు కూడా- డాడ్ కు తనను తప్ప ఎవర్నీ ప్రేమించడం రాధనుకుంది. 'అమ్మ' అనే వ్యక్తీని తనకన్నా మిన్నగా ప్రేమించగల మమత్వపు చెలమ ఒకటి డాడ్ లో దాగి ఉందనీ, ఇన్నాళ్లూ తనకోసం అక్కడ తేమ కూడా రానివ్వలేదనీ, ఎడారిని  చేసుకున్నారనీ అనిపించసాగింది! ఆయన మమ్మాని టీజ్ చేస్తూ, నవ్విస్తూ, నవ్వుతూ, ఆ నవ్వులలో తననూ కలిపేసుకుని నవ్వించాలని ప్రయత్నిస్తుంటే.... డాడ్ కు  తను సరైన న్యాయం చేశాననే అనిపిస్తోంది!  ఇలా చెయ్యకపోయుంటే జీవితంలో ఏదో తప్పు చేసినట్టు గిల్టీగా  ఫీలవ్వాల్సి వచ్చేదని అనిపించసాగింది. డాడ్  కళ్ళలో వెలుగు  వెన్నెలలా  అనిపించి చల్లబరిచేది.
    కానీ, రేవంత్ కళ్ళల్లో నిప్పులాంటి ఎరుపు- 'మరి...నేనేవిటీ?' అని ప్రశ్నించినపుడు గుండె కాలిపోతున్న సెగ రగలసాగింది! ఆ కళ్ళలోకి చూడలేక రెప్పలు ఎత్తడమే మానేసింది.... రేవంత్ సమక్షంలో! ఆ కళ్ళ ప్రశ్నకు సమాధానంగా మౌనాన్నీ, నిర్లిప్తతనూ ఆశ్రయించసాగింది. చూపు మరిచి అంధత్వం కొనితెచ్చుకుంది! మనసు చంపి మూగతనాన్ని పేర్చుకుంది.
    ఆరోజు రూమ్ లో నుండి చిన్నగా మూలుగుతున్న శబ్దం వినిపించింది.
    మమ్మాని లేపాలనుకున్నాడు. వాళ్ళని డిస్టర్బ్ చెయ్యడం మానర్స్ కాదని తనే వెళ్లి డోర్ తీసి చూశాడు. జ్ఞాపిక వణికిపోతూ ముడుచుకుని మూల్గుతూ ఉంది.
    వెళ్లి రెజాయ్ కప్పుతూ చూశాడు. నుదుటి మీద చెమటలు! చెయ్యి వేశాడు... వేడిగా కాలిపోతూ ఉంది! ఆ మగతలో జ్ఞాపికకు మళ్లీ సంపెంగలూ, మొగలిపుప్పోడీ కలగలిపిన వాసన! రోమియో జ్ఞాపకం! రేవంత్ చెయ్యి అదిమిపట్టుకుని వణికిపోతోంటే... అపుడు చూశాడు- ఈ పదిరోజుల్లో పేషంట్ లా అయిపోయింది జ్ఞాపిక! ఎన్నోఏళ్ల రోగ పీడితురాలిలా ప్రేతకళ వచ్చింది మొహంలో.
    "ప్లీజ్! రోమియో! నన్ను వదిలి వెళ్లకూ! నన్ను వదిలి వెళ్లకూ!" కలవరిస్తోంది. రేవంత్ కళ్ళలో నీళ్లు! రెజాయ్ సరిచేసి ఫాన్ ఆఫ్ చేశాడు. మెడికల్ కిట్ తీసి టాబ్లెట్ తెచ్చి లేపి గుండెల కదుముకుని టాబ్లెట్ వేసి నీళ్లు  తాగించాడు. అలాగే గుండెకు అతుక్కుపోయి మగతలోనే వెక్కివెక్కి పడుతోంది జ్ఞాపిక!
    'ఆడవాళ్ళెంత అదృష్టవంతులు...! మ దుఃఖాన్ని ఎంత స్వేచ్చగా వెలువరించగలరు?!' అనుకున్నాడు....పట్టేసిన గుండె తడుముకుంటూ! అలాగే కొద్దిసేపు పొదివి పట్టుకుని వెక్కిళ్లు తగ్గాక పడుకోబెట్టాడు.
    టాబ్లెట్ కేమో.... నిద్రపట్టేసింది జ్ఞాపికకు! మెల్లగా రూమ్ లో కొచ్చి నిద్రపోకుండా తిరగసాగాడు అటూఇటూ.
    తెల్లవార్లూ జ్ఞాపిక వెక్కిపడుతూ, వేదనపడుతూ, మౌనంగా ఘోషిస్తూనే ఉంది.... మూగగా! అది  వింటున్న రేవంత్ గుండె - నిప్పుల్లో పెట్టిన ఆవియన్ లాగా పొరలుపొరలుగా  కమిలిపోసాగింది!
    తుషారమయిన నీవు-
    తుళ్లింత మరచిపోతుంటే....
    ప్రశాంతి లాంటి నన్నూ-
    నిశాంతి చెరుపుకు పోతుంటే...
    ఎలా మరిపించుకోను నిన్నూ!!
    జీవించలేనూ ప్రియా... మరణించలేనూ!
    జీవించలేనూ ప్రియా...మరణించలేనూ!!... అంటూ.
    ఎదురుగా ఉండీ ఒకరినొకరు చూసుకుంటూ, కలుసుకోకుండా ఉంటే ఇద్దరం మరణించడం ఖాయం అనుకున్నాడు. ఆలోచించి, ఆలోచించి వేగుచుక్క పొడిచేసరికి ఒక  నిర్ణయానికి వచ్చాడు. తను దూరమయితే జ్ఞాపిక- మమ్మా, డాడీల లాలనలో మళ్లీ జీవితంలో పడుతుందనిపించింది! తను ఎదురుగా ఉన్నంతసేపూ జ్ఞాపిక తనను మరవడం అసాధ్యం అనిపించింది. అందుకే తొందరపాటులో ఏకపక్ష నిర్ణయం తీసుకున్నాడు. తనేమయిపోయినా ఫర్వాలేదనుకున్నాడు.
                                  *    *    *
    ఆరోజు డాడ్ ఏదో బుక్ చదువుకుంటున్నారు.... మెడికల్ ఇన్ ఫర్మేషన్ కు కావచ్చు!
    మమ్మా జ్ఞాపికకు జ్యూస్ తీసి తెచ్చింది తాగడానికి!
    జ్ఞాపిక వద్డంటూంటే.... డాడ్, మమ్మా కోప్పడుతూ తాగిస్తున్నారు! వాళ్ళ ముగ్గుర్నీ  అలా చూస్తుంటే ముచ్చటగా అనిపించింది. వాళ్ళలా ఆత్మీయంగా ఉండిపోతే తాను ఏమయిపోయినా ఫర్వాలేదనిపించింది. వాళ్ళనలా అలవాటు చేయడానికే గుండెను చప్పుడు మాన్పించి, వాళ్ళకు దూరమవుతూ వస్తున్నాడు....నెమ్మదినెమ్మదిగా!
    "హాయ్ఁ డాడ్, హాయ్ఁ మమ్మా!" ఎంటరయ్యాడు రూమ్ లోకి.
    "హాయ్ఁ... బిట్టూ... ఏంటీ- నీ బిజినెస్ నాకు నచ్చలా! ఫామిలీమెంబర్స్ కు టైమ్ ఇవ్వలేని ఏ బిజినెస్ కూడా అంత మంచిదికాదు.... మానసిక, శారీరక ఆరోగ్యాలకు!" డాడ్ కోప్పడ్డారు.
    "నథింగ్ డాడ్! జస్ట్... వీసా వచ్చేసింది కదా! స్టేట్స్ కు వెళ్లడానికి డేట్ దగ్గరకు జరిపించుకోవడంలో కొంచెం బిజీ అయిపోయా.... అంతే!"
    "ఏవిటంత తోదంర- వెళ్లిపోవాలని?!" అడిగారాయన బుక్ మూస్తూ.
    "మీరోచ్చేశారు కదా డాడ్... ఇక్కడి విషయాలు చూసుకోవడానికి! నేనిక హయ్యర్ స్టడీస్ కు  వెళ్ళోద్దా? ఫలానా డాక్టర్ గారి అబ్బాయంటే మీరు గర్వంగా చెప్పుకునేలా ఉండొద్దా?" కొంచెం రిలాక్స్ చేశాడు మాటలతో ఆయన్ను-లేని ఉషారూ, లేని నవ్వూ, లేని ఆనందం ముఖంలో ప్రతిఫలించడానికి శతవిధాల ప్రయత్నిస్తూ!
    "వెల్ డన్ మై బాయ్! కానీ, దానికింత తొందరెందుకూ... అని!"
    "ఆలస్యం అమృతం విషం అనీ! ఇంకా మూడురోజులే ఉంది- ణా ప్లైట్ కు డేట్! ఎలాంటి హంగామా లేకూ నన్ను పంపించేలా మమ్మాని, జ్ఞాపికనీ మీరే ప్రేపేరు చెయ్యాలి!" రిక్వెస్టింగ్ అన్నాడు.
    చివుక్కున తలతిప్పి చూసింది సుహాసిని! జ్ఞాపిక చేతిలోంచి ఖాళీ జ్యూస్ గ్లాస్ జారిపడింది.... చప్పుడు చేస్తూ!
    వంగి ముక్కలేరబోతున్న మమ్మాని ఆపి, తను ఆ ముక్కలు ఏరుతూ.... జ్ఞాపిక కాళ్ల దగ్గరకు వచ్చాడు.
    "ఇంక మీ గురించి నాకే టెన్షన్ ఉండదు! అలాగే నన్ను కూడా మీరు సంతోషంగా సాగనంపితే బావుంటుంది!" అన్నాడు కళ్ళేత్తి జ్ఞాపిక కళ్ళలోకి చూస్తూ!
    లేచి రూమ్ లోకి వెళ్లిపోయింది జ్ఞాపిక.
    "సరే! నువ్వు హయ్యర్ స్టడీస్ కు వెళ్తున్నావే కానీ, అక్కడ ఉండిపోవడానికి కాదుగా! డానికి బాధపడడం ఎందుకా...సంతోషంగానే పంపిస్తాం! ఏం హాసినీ!" అన్నారాయన.
    లేచి రూమ్ లోకి వెళ్లిపోయింది జ్ఞాపిక.
    "సరే! నువ్వు హయ్యర్ స్టడీస్ కు  వెళ్తున్నావే కానీ,  అక్కడ ఉండిపోవడానికి కాదుగా! డానికి బాధపడడం ఎందుకూ.... సంతోషంగానే పంపిస్తాం! ఏం హాసిని!" అన్నారాయన.
    "ఏమో! నా కింకొన్నాళ్లు బిట్టూ మనతో ఉంటే బావుండనిపిస్తూంది!" సుహాసిని బరువుగా అంది.
    "ఎంత మమ్మా...త్రీ ఇయర్స్! జస్ట్.... మూడేళ్లు!...వచ్చేస్తాగా నేను! ఇక మీతోనే ఉండిపోతాగా! నేనేవీ అక్కడే ఉండిపోతాననడం లేదే! నేను వెళ్లిపోవాలనే - తొందరపడి నీ పెళ్ళికి వత్తిడి తెచ్చింది. డాడ్ లాంటి వ్యక్తి చేతిలో నిన్ను చూశాక నాకు వెళ్తున్నానన్న దిగులే లేదు మమ్మా!" అల్లాగే మమ్మా ఒళ్ళో తల పెట్టుకున్నాడు.
    "మీరయినా చెప్పండి డాడ్!" గారాబంగా అడిగాడు.
    "అవును హాసినీ... మనబ్బాయి ఎదుగుతానంటే నువ్వు వద్దంటావేమిటి? మూడేళ్లేగా! మూడురోజులుగా మార్చేస్తాలే నేను!"
    "పిచ్చి బిట్టూ....అలాగే! నీ ఇష్టం కాదనడం నాకూ ఇష్టంలేదు" అన్నారావిడ.
    మమ్మా బాధ్యత  తాను సమర్దునికే అప్పగించాననే సంతృప్తి రేవంత్ కి కొంత ఊరట నిస్తోంది.
    "థాంక్యూ మమ్...!" అని లేచి లోపలికెళ్లాడు.
    గాజుముక్కలు డస్ట్ బిన్ లో వేసి జ్ఞాపిక రూమ్ లోకి చూశాడు. చాలా వీక్ గా అయిపోయింది! మరీ చిన్నపిల్లలా అనిపిస్తోంది! జాలేసింది! ఎంత తుళ్లుతూ ఉండేది?! ఎంత అల్లరిగా ఉండేది?! పదిమంది అల్లరి తనే చేసేది! ఏమయింది అదంతా?! తన మీద ప్రేమ ఆ అల్లరిని  దూరం చేసింది, తనను పిచ్చిదాన్ని చేస్తోంది! స్తబ్ధత తెస్తోంది! తనెళ్లిపోవాలి దూరంగా! జ్ఞాపీకీ కనిపించనంత దూరంగా! జ్ఞాపిక జ్ఞాపకాలలోకి కూడా తానెన్నడూ రానంతమేరా కాలాన్ని విస్తరింపచేసుకుని కఠినమయి, శూన్యంలోకి సాగిపోవాలి! కొత్త కాలమానాల వేగంతో, కనిపించని పాలపుంతలలో జీవితానికి కామా పెట్టుకుని, కలలు నింపుకున్న కనులలో జ్ఞాపికను ముద్రించుకుని!
    'వద్దు.... వద్దు జ్ఞాపీ... ప్రేమించకు నన్ను! మెల్లగా మరచిపో!'
    -మనస్ఫూర్తిగా కోరుకున్నాడు.
    లోపలికి వెళ్లి "హాయ్ఁ....జ్ఞాపీ!" విష్ చేశాడు.
    ఎన్నాళ్లకో మళ్లీ వాసంతం పిలిచినట్టు తిరిగిచూసింది.... కళలేని కళ్ళతో! కోయిల పాడినట్టు పులకరించింది..., గున్నమావి పిలిచినట్టు గుబగుబలాడింది..., గుండెల్లో మళ్లీ ఆరని గాయం రేగింది.
    "నీ కేవయినా అభ్యంతరమా....నేను స్టేట్స్ వెళ్లాడం?"
    "డేట్ పెట్టుకున్నాక నన్ను అడగడమెందుకు?"
    "వద్దంటే మానేస్తా!"
    "మానేసి..?"
    "ఇక్కడే ఇద్దరం జీవశ్చవాల్లా ఉండీఉండీ చచ్చిపోదాం!"
    "స్టేట్స్ వెళ్తే..?"
    "నువ్వు నేనూ కనబడకపోతే నన్ను మెల్లగా మరచిపోవచ్చు! అమ్మానాన్నలు నీకు కోఆపరేట్ చేస్తారు! మళ్లీ మామూలు మనిషవుతావు!"
    "అయ్యి...?"
    "అవుతావంతే! ఇక వాళ్ళే చూసుకుంటారు నీ భవిషత్తు!"
    "మరి నువ్వు...?"
    "నేను చదువుకునీ, చదువుకునీ, చదువుకునీ చదువుకునీ..." మాటలు రాలా ఆ తర్వాత ఏం చెయ్యాలో చెప్పడానికి! తెలిస్తేగా చెప్పడానికి!
    నవ్వింది! గమ్యం తెలీని ఆ సమాధానంలోని  అసంపూర్తినీ, అసంతృప్తినీ గమనించి! 'తను నాకు దూరమయితే మరచిపోగలననుకుని సంతోషపడుతున్నాడు....పడనీ!' అనుకుంది.
    "నాకు దూరంగా ఉంటే నువ్వు శాంతిగా ఉండగలవా?"
    "నీ బాధను చూడను కాబట్టి శాంతిగా ఉండగలవా?"
    "నువ్వు శాంతిగా ఉంటానంటే నాకేవీ అబ్యంతరం లేదు."
    "థాంక్యూ జ్ఞాపికా! నాకు సంతోషంగా వీడ్కోలు ఇస్తావా?"
    నవ్వింది చిన్నగా! అది పెరిగి అలలుగా అలలుగా మెల్లగా తగ్గి, ఏడుపుగా మారింది! నవ్వూ, ఏడుపూ కలిపి తలూపింది.... ఇవ్వగలనంటూ!
    వెనుదిగిరి వెళ్లిపోయాడు. ఇంకాసేపుంటే తెలిసేది- జ్ఞాపిక అక్కడే కుప్పకూలి పోయిందని..., ఆమె ఎన్నటికీ తను వెనుదిరగడం చూడలేదని! ఓడిపోవడం భరించలేదని! మానసికంగా రోజురోజుకూ కృంగి మృత్యువుకు దగ్గరవుతోందని!
    ఇన్నాళ్లూ తామిద్దరూ ఒక స్వాప్నిక ప్రపంచం నిర్మించుకుని అందులో తమ భవిష్యత్తును నిర్మించుకుని, అందులోనే జీవిస్తామనే బలమైన నమ్మకం ఒక్కసారి తారుమారయి, అందుకు భిన్నంగా మారిపోయేసరికి- కలలో కూడా ఇద్దరూ ఆ వాస్తవాన్ని జీర్ణింపచేసుకోలేక పోతున్నారు!
    ఇప్పటికీ ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రేమ భావనలే కాని, అన్నాచెల్లెళ్ళ బంధాన్ని ఆమోదించదానికి మనస్సు స్థిరం కావడంలేదు. కలలింకా వాస్తవంలోకి రావడానికి మరి వాళ్ళిద్దరికీ ఈ జన్మంతా పడుతుందేమో! ఇద్దరూ మానసికంగా స్వాప్నికం, వాస్తవం మధ్య మానసిక ఉన్మాదులు అవుతున్నారన్న విషయం ఇద్దరికీ స్పష్టంగా అర్థంఅవుతూనే ఉంది!
    ఒకరికొకరు ఏదయినా చేసి ఎదుటివాళ్ళ బాధను తొలగిస్తే బావుండన్న విచిత్ర మానసిక పరిస్థితి నెలకొంది! అందుకు తాము బలైపోయినా ఫర్వాలేదన్న తెగింపు వచ్చేసింది. ఆ తెగింపు ఇద్దరిలోనూ బలంగా ఏర్పడి ఒకరు వేరొకరు కోసం బలికి సిద్దమై పరోక్షంగా ఇద్దరూ బలైపోతున్నారు మౌనంగా!
    జ్ఞాపిక తన పరిస్థితిని దాచుకోలేకపోతూ అనారోగ్యమైంది శారీరకంగా, మానసికంగా! రేవంత్ తన పరిస్థితిని అణుచుకోవడానికి వెచ్చించే శక్తి పెరగడంతో ఇంకా బలహీనమవసాగాడు అంతరంగంగా! కానీ, ఆ విషయం వెల్లడి కావడం లేదు... జ్ఞాపికలో వెల్లడవుతున్నట్లుగా!
    ఎప్పుడో పెలిపోయే అగ్నిపర్వతంలా రేవంత్, మండుతూ తిరిగే అగ్నిగుండంలా జ్ఞాపికా కాలిపోసాగారు...మౌనంలో!
    ఇది వారిని పిచ్చివాళ్ళను చేయడమో..., మరణానికి దారితీయడమో జరిగి తీరుతుందనిపిస్తుంది. కానీ, వాళ్ళూ ఏవీ చెయ్యలేని పరిస్థితి!
    ఇద్దరూ కలిసి బ్రతుకు నేర్పరచుకుందామని దగ్గరయి- ఆ బ్రతుకు చిద్రం అయ్యిందన్న బాధ.... తమను ఎంత ఘర్షణకు గురిచేస్తుందో అనుభవ  పూర్వకంగా తెలుసుకున్నారు కనుక ఎదుటివాళ్ళను ఆ ప్రేమకు దూరంచేసి ఆ బాధ నుండి విముక్తుల్ని చెయ్యాలన్న మరో 'యాంటి ప్రేమ' డెవలప్ అవ్వసాగింది.
    'మనసా.... ప్రేమించకే నువ్విలా! ...ప్రేమించకే నువ్విలా!'.... అని ఎదుటి మనసును మందలించాలనే మమత్వం పెరగసాగింది! యాంటీ మమత్వం! ఇది ఒక్కోసారి విచిత్ర మానసిక ప్రవర్తనకు కూడా దారితీయొచ్చేమో! అది కలిపేందుకు కలిగిన ప్రేమయితే-  ఇది  విడదీసేందుకు కలిగిన ప్రేమ! ఒకర్ని ఒకరు బ్రతికించుకునేందుకు మొదలయిన ప్రేమ- ఒకరినొకరు చనిపోకుండా బ్రతికించేందుకు  తమ నుండి ఎదుటివాళ్ళను విడదీయాలనేంత గాఢంగా మారింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS