Previous Page Next Page 
మనసా....ప్రేమించకే నువ్విలా పేజి 33

    తమాషా చూస్తున్నావు!"
    ...అని నిర్వేదంలోకి నెట్టించింది! నిప్పులు కక్కిన కలం నిరాశను రాల్చింది!
    'కాలమా...జీవితాలు నీ చేతిలో తోలుబొమ్మలు- ఆడించు.... ఆడించు! కాలానికి కట్టుబడ్డవాళ్ళం... మనసులను హింసించు! మౌనంగా హసించు! నిన్ను మించిన హంతకులు లేరు! నిన్ను మించిన ప్రాణదాతలూ లేరు! హత్య చేసేదీ నువ్వే!  ప్రాణం పోసేదీ నువ్వే! కాలమా....చక్రంలా తిరుగుమా! బాధలకూ, వ్యధలకు మందేసి నవ్వులుగా మార్చుమా!' అని ఫ్రెండ్సందరూ కోరుకున్నారు....తామేమీ చెయ్యలేక!
                                           23
    ఏంచెయ్యాలి? ఏమని ఆలోచించాలి?
    అమ్మాయిలు సెలవులకు హాస్టల్ ఖాళీచేసి క్రాంత్, కామినిల రూమ్ కొచ్చేశారు! తమకంటూ పోర్షన్లు వెతుక్కుని కాపురాలు పెట్టుకోవడానికి సిద్దమయ్యారు!
    'రెండురోజులుగా క్రాంత్ కు జ్వరంగా ఉందనీ,  తను తనను కనిపెట్టుకుని ఉండా'లానే వంకతో రేవంత్ ఇంటికి వెళ్లడం లేదు.
    'ఈ ఇయర్ తో అందరం విడిపోతాం గనుక- రెండు, మూడురోజులు అందరం కలిసి ఉండాలనుకున్నా'మనే నెపంతో జ్ఞాపిక ఇంటికి రమ్మన్న తండ్రిమాటను మృదువుగా త్రోసిపుచ్చింది.
    ఆ తర్వాతయినా వెళ్లాలిగా!
    ఎక్కడికి వెళ్లాలి! ఏ బంధుత్వంలో వెళ్లాలి?
    "కోడలు కావాలనుకున్న ఇంటికి కూతురిగానా?
    భార్య కావాలనుకున్న వ్యక్తికి చెల్లెలుగానా?
    ఇన్నిరోజులు ఒకరిమీద ఒకరు పెంచుకున్న ప్రేమను ఒకేసారిగా చంపేసుకుని అన్నాచెల్లెళ్ళయి పోవడం సాధ్యమా? ఎన్నోసార్లు  తమకంతో, మమకంతో పెనవేసుకున్న హృదయాలు ఏమీ ఎరగననట్లు అన్నచెల్లెళ్ళుగా ఉండిపోవడం సాధుమా? అలాకదని అన్నాచెల్లెళ్ళ వరుసలో పెళ్ళిచేసుకోవడం సాధ్యామా?
    ఎవరిది నేరం? ఎవరికి శిక్ష? ఏవిటి పరిష్కారం? ఏ సిద్దాంతాన్ని తాము అమలుపరచాలనుకున్నారో.... అదే తమ జీవితాలను తారుమారు చేసేస్తే ఆ పసిహృదయాలు ఏ నిర్ణయాలు తీసుకోగలవు?    అసలు ఏసిద్దాంతకర్త తను తన సిద్దాంతానికి బలికాకుండా ఉన్నాడు కనుక? బలికాందేకానీ ఆ సిద్దాంతం సాగదు గనుక, వీళ్ళు కూడా అందరి సిద్దాంతకర్తల్లా అతిచిన్న వయసును బలి చేయల్సిందేనా? ఎవరిస్తారు జవాబు? ఏ సంస్కృతిలో దాగుంది దీనికి ఊరట?
    అందరూ జంటలుగా కూర్చున్నారు!
    రేవంత్, జ్ఞాపిక దూరంగా ఒకరికొకరు సంబంధంలేనట్టు మౌనంగా , ఎవరికీ ఎవరూ తెలీనట్టు నిర్లిప్తంగా.
    ఎన్నో చర్చలు, ఎన్నో సిద్దాంతాలు, ఎన్నో అభిప్రాయాలు ఖరాఖండీగా వాదించుకున్నా ఆ యువతరం- 'ఈ అన్నాచెల్లెళ్ళకు వైవాహిక బంధం వేయాలా? ఆ ప్రేమజంటను అన్నాచెల్లెళ్ళుగా విడదీయాలా?'....  అనేది చర్చంచడానికి మాట పెగలనీని మౌనం! చర్చనీయాంశం కానీని స్తబ్దత! ఊహించని,  ఎన్నడూ ఉదాహరణగా కూడా వినని సమస్య! ఆమె ఎదురుగా నిలబడి తీర్పు చెప్పమంటోంది యువతరాన్ని!
    అందరూ భోంచేసి, నిద్రపోయి మాట్లాడి రెండురోజులయింది! మౌనం.... మౌనం... మౌనంలోంచే ఘర్షణ! అప్పటివరకూ క్షణం కూడా అల్లరి చేయకుండా ఉండలేని అమ్మాయిలు జీవితం ఇచ్చిన పెద్ద షాక్ కు జడత్వంలో  మునిగిపోయారు... స్పందన లేకుండా!
    రేవంత్ వైపు కళ్ళెత్తి కూడా  చూడలేదు జ్ఞాపిక ఈ రెండురోజులూ! చూస్తే... తనలో ఏ సుడిగాలి రేగో అతనివైపు చుట్టుకొమ్మని నెట్టేస్తుందనే భయంతో, తనలోని ప్రేమ అతని బహువుల్లోకి తరిమేస్తుందనే బిడియంతో, తనలోని మమత్వం అతన్ని చుంబిస్తుందనే బెదురుతో! తనలోని అణువణువులోనూ నిండిన 'తన' అనే భావం అతనిలో ఇమిడి పొమ్మంతుందనే చేతకానితనంతో!
    'మనసా... ప్రేమించకే నువ్విలా!'
    మనసా... ప్రేమించకే నువ్విలా!'
    మనసా... ప్రేమించకే నువ్విలా!'
    ఎన్నిసార్లు హిప్నటైజ్ చేసుకున్నా- మొండి మనసు 'ఇలాగే ప్రేమిస్తాను. మరణించినా సరే!" అని మొండికేస్తుంటే ఎలా బుజ్జగించుకోవాలో తెలీక ఘర్షణపడుతూ!
    ఎన్నో పుస్తకాలు చదివి, ఎన్నో ప్రపంచ సిద్దాంతాల్ని అవలీలగా వల్లించి, ఘర్షించి వివరించే రేవంత్ మేధస్సు కూడా- ఈ సిద్దాంతాన్నెలా జీర్ణంచేసుకోవాలో తెలీక- గానుగలో నలిగి తైలం చిమ్ముతోంది.
    ఎలా...? ప్రేమించుకుని భార్యభర్తలయిన సిద్దాంతం తెలుసు! ప్రేమించుకుని ఓడిపోయి మరణించిన సిద్దాంతం తెలుసు! ప్రేమించుకుని దూరంమయి విరహంలో మరిగిన సిద్దాంతం తెలుసు! ప్రేమించుకుని ఒకరినొకరు మరొకరికి త్యాగం చేసిన సిద్దాంతం తెలుసు! కానీ, ఇలా ప్రేమించుకుని అన్నాచెల్లెళ్లయిన సిద్దాంతం మాత్రం తెలీదు! దానికి పరిష్కారం ఎక్కడా చదవలేదు. ఎలా చర్చించగలడు? ఏమని వాదించగలడు?
    కనురెప్పలు ఎత్తని జ్ఞాపికను లాలించుకుని, బుజ్జగించుకుని, ఓదార్చుకోవాలని ఉంది! కానీ ఏ అనుబంధంతో...? ప్రియతమగానా? అన్నయ్యగానా? తన కోమలత్వాన్ని కోటి ఘర్షణలు కాటేస్తుంటే ఏవీచేయకుండా దూరంగా కూర్చున్న తన జన్మపై తనకే అసహ్యం అనిపిస్తోంది. అందుకే తనూ కళ్ళు మూసుకున్నాడు.
    ఎన్నో సమస్యలకు తలొక అభిప్రాయం చెప్పి అండగా నిలచిన స్నేహబృందం మాటలు కోల్పోయి- వాళ్ళూ నిస్సత్తువగా దృష్టినీ ,సృష్టినీ మరిచిఉన్నారు. ఏం చెయ్యమని చెప్పాలి? తమకోసం ప్రతిక్షణం ఆరాటపడి, ఆలమటించి, ఒకే అత్మలుగా జీవించిన ఆ జంట మనోవేదనకు పరిష్కారం ఏమని చెప్పాలి?
    "మీరు పెళ్ళి చేసుకోవచ్చు!" ఈష్ మౌనాన్ని చేధిస్తూ అన్నాడు.
    ఎవ్వరూ కళ్ళెత్తి కూడా చూడలా!
    "ముస్లిమ్ సంస్కృతిలో అన్నాచెల్లెళ్ళ వివాహాన్ని సంస్కృతి అనుమతించింది! కాసేపు మీరు హిందువులమని మర్చిపోతే  చాలు!" కంటిన్యూ చేశాడు.
    "వాళ్ళ పెళ్ళి సంస్కృతీ, సమాజం కోసమా? వాళ్ళకోసమా?" క్రాంత్ కళ్ళు తెరవకుండానే అడిగాడు.
    "సంస్కృతి కోసమంటే సమర్థింపులు వెతుక్కోవాలి! వాళ్ళకోసమే అయితే అంతరాత్మలను ఆదేశం అడుక్కోవాలి!" ఆనంద్ అన్నాడు.
    "ఏ సమస్యయినా ప్రాపంచిక సమస్యగా ఆలోచించాలనుకుంటే...ఇదసలు సమస్యే కాదు" ఈష్ అన్నాడు.
    "క్రిస్టియన్ సంస్కృతి ఆదిలో 'ఆడమ్ అండ్ ఈవ్' సంతానం. ఆడామగా  అన్నాచెల్లెళ్ళే వివాహం  చేసుకున్న కథనం ఉంది!" కామిని మరో ఉదహరణ.
    "అసలు ఏ సంస్కృతైనా  ఆదిమతెగలలో తెగలలోనే, ఆ కుటుంబంలోనే వివాహాలు జరిగేవి.... అన్నాచెల్లెళ్ళ మధ్య!" స్ఫూర్తి     మరోపాయింట్.
    జ్ఞాపిక, రేవంత్ గోడకు తలాన్చి కూర్చుని కళ్ళు తెరవలేదు. వింటున్నారో, లేదో కూడా తెలీదు.
    "అన్నాచెల్లెళ్ళాంటే... ఏకరక్త సంబంధీకులు అయిఉండాలి. మీరు ఏకరక్త సంబంధీకులు కారుగా! ఏదో ఒక సంఘటనతో ఆ వరుస కలిసింది! ఇది కేవలం సెంటిమెంటే! మీరు అన్నాచెల్లెళ్ళమని అనుకోనక్కర్లేదేమో!" ఈష్ సవరించచూశాడు.
    "అసలు ఏకరక్త సంబంధీకుల మధ్య వివాహంవల్ల సంతానం బలహీనమవుతుందనే కారణంతో అన్నాచెలెళ్ళ వివాహలు ఏ సంస్కృతైనా నిషేదించింది! అంతేకానీ, అదేమంత నేరంకాదు! అందులోనూ మీరు ఏకరక్త సంబంధీకులు కారు!" రేవతి అభిప్రాయం చెప్పింది.
    "మీరు అన్నాచెల్లెళ్ళమనే భావనలో పడకుండా ఉంటే గనుక- వివాహం నేరమేమీ కాదు" ఆనంద్ తనవంతు బలం ఇచ్చాడు.
    "ఆలోచించాల్సింది- వీళ్ళు అన్నాచెల్లెళ్ళని కాదు! వీళ్ళ తల్లిదండ్రులు భార్యాభార్తలా, కాదా.... అని! వీళ్ళ మనసులు మాత్రమే ఏకమయ్యాయి. కానీ, వాళ్ళు సాంఘికంగా, భౌతికంగా, నైతికంగా భార్యభర్తలయ్యారు! కనుక వీళ్ళకు అన్నాచెల్లెళ్ళనే సాంఘికభావం- వీళ్ళెంత కాదన్నా వెన్నంటి తరిమికొడుతూనే ఉంటుందేమో!" ఈష్ సాలోచనగా అన్నాడు.
    మళ్లీ అందరూ మౌనమయ్యారు.... ఏ  సమాధానంతో వాళ్ళని సంతృప్తి పరచాలా...అని! ఎవరి పాయింట్ వాళ్ళకే అసంపూర్తిగా అనిపించింది.
    'ప్రేమ' రెండక్షరాల మనోభావన! ఏ మనోభావనకీ లేనంత ప్రాముఖ్యత దీని కెందుకుందో! అదెవ్వరూ ఘర్షణ పడందే గెలిపించదనేమో! ప్రేమ తేలికగా లభించేదయితే దానికంత ప్రాముఖ్యత ఉండేదికాదేమో! గాఢంగా ప్రేమించుకున్న అన్ని హృదయాలను విడదీసి తీరాలన్న ముగింపే ప్రేమ సిద్దాంతమేమో! ప్రేమ అన్ని భావాలనూ దాటి ఉన్నతంగా యుగయుగాలుగా నిలిచిందంటే....విడదీసే లక్ష్యాన్ని పెట్టుకున్నందుకేనేమో! ఆ లక్ష్యం దానికి లేకపోతే-
    సలీం- అనార్కలిల పరిచయం అందరికీ అయ్యేది కాదు.
    లైలా- మజ్నూ ప్రపంచానికి గుర్తుండేవారు కాదు.
    రాదాకృష్ణులు అమరులయ్యేవారూ కారు.
    "రోమియో- జూలియట్ ల ప్రసక్తి ప్రపంచంలో నిలిచేది కాదు.
    పార్వతీ- దేవదాసు రచనం సాగేది కాదు.
    తాజ్ మహల్ నిర్మాణం జరిగేది కాదు.
    భాగ్యనగరం వెలిసేదీ కాదు!
    హృదయాలను కత్తిరి స్తేనే ప్రేమ! జీవితాలను విడదీస్తేనే ప్రేమ! అందులోనే వ్యక్తిని అలమటింప చేస్తేనే ప్రేమ! మౌనంతో మరణహొమం చేస్తేనే ప్రేమ! దానికి త్యాగమనే పేరు పెడితేనే ప్రేమ! నిట్టూర్పుల మధ్య రగిలిస్తేనే ప్రేమ! నిరాశల మధ్య కొట్టుమిట్టాడిస్తేనే ప్రేమ! మనసును చంపేసినా, ఏదో ఆశతో శరీరాన్ని జీవశ్చవంలా బ్రతికిస్తూ బాధపెట్టేదే ప్రేమ! ఏ ప్రేమికుల  కథ సుఖాంతం అయ్యింది కనుక?! సుఖాంతం అయ్యాక ప్రేమకు నిలువదేమో గనుక! విలవిలలాడించకుండా ఎవరిని అలరారించింది ప్రేమ? విడదీసి నవ్వకుండా  ఎవరిలో జీవించింది ప్రేమ? అందుకే విడదీసి తన ఉనికిని నిలుపుకుంటుంది కనుకే.... అన్ని భావాల్లోనూ అది అమరత్వం పొంది అజరామరమయింది. ఏదో ఒక కారణంతో విడదీసి తీరుతుంది తన ఉనికి కోసం! ప్రేమంత నిర్థాక్షిణ్యం ఇంకేదీ లేదు... మధురమైన మనోవేదన ప్రేమ!
    మనసా....ప్రేమ జోలికి పోకే! జీవించీ మరణించకే! దాన్ని ఆశ్రయించి ఓడిపోయి రోదించకే! దానితోబాటు గుండెలు రక్తసిక్తం చేసుకుని జన్మలను ధారనోయకే! ఏదో ఒక కారణంతో నిన్ను నీవు ప్రేమలోపడి బలిచేసుకోకే!
    'మనసా... ప్రేమించకే నువ్విలా!'
    'మనసా... ప్రేమించకే నువ్విలా!'
    'మనసా... ప్రేమించకే నువ్విలా!'
    రేవంత్ ఎంత అదిలించినా, అజమాయిషీ చేసినా , ఆజ్ఞలు జారిచేసినా... కళ్ళు తెరిస్తే ఎదురుగా ఉన్న తన జ్ఞాపీని, తన హనీని, తను గెలిచి సాధించుకున్న అపురూప బహుమతిని, తనలోని తనను వదులుకోలేనేని మూర్జిస్తున్న మనస్సును- వాస్తవం బాక్సింగ్ దెబ్బలతో బాధపెడుతూంటే... కళ్ళు రక్తం వర్షిస్తున్నాయి! రెప్పల్ని దాటి రక్తం గుండెల్ని తడుపుతోంది!
    కళ్ళు మూసుకుని రెండురోజుల్నుండీ ఒకమాట కూడా మాట్లాకుండా- మౌనమైన తమ నేస్తాలను ఏమని పలకరించాలో, ఏమని ఓదార్చాలో, ఏమని సమర్థించాలో, ఎలా పరిష్కరించాలో.... ఏవీ - ఏవీ తెలీక  అందరూ తలా ఒకవైపు జంటలుగా సాగిపోయారు... వాళ్ళిద్దర్నే నిర్ణయించుకోమన్నట్టు!
    ముందుగా రేవంత్ కోలుకున్నాడు! "జ్ఞాపీ.... ఇంటికెళ్దాం!" లేస్తూ అన్నాడు.
    "ఎవరింటికి?"
    "మనింటికి!"
   "మనింటికంటే..?"  
    "మన అమ్మానాన్నల ఇంటికి!"
    "వెళ్లి..?"
    "ఉందాం!"
    "ఉండి...?"
    "వాళ్ళకు విషయం చెప్పేద్దాం!"
    "ఏమని...?"
    "మనం ప్రేమించుకున్నామని!"
    "రేపు మనకు పుట్టబోయే బాబూ- పాప ప్రేమించుకున్నామంటే నువ్వేం చేస్తావ్?"
    "అది వీలుకాదు! నేనోప్పుకోను."
    "ఎందుకు?"
    "వాళ్ళిద్దర్నీ మనమే కంటాం గనుక! చిన్నప్పటినుండీ మనం అన్నాచెల్లెళ్ళమనే భావనలోనే పెంచుతాం కనుక!"
    "ఇప్పుడు మీ మమ్మా, మా డాడ్ కూడా మనం అలానే భావించుకుంటున్నాం అనుకుంటున్నారు. మనమీ విషయం చెబితే వాళ్ళకు వాళ్ళు దోషులయి జీవితాంతం కుమిలిపోతారు. తాము చేయకూడని నేరం చేశామని తమని తాము శిక్షించుకుంటారు!"
    "మరేం చేద్దాం...?"
    "తెలీదు!" ఏదో ఒకరూపంలో నిన్ను చూడకుండా నేను బ్రతకలేను! చూస్తూ దూరంగా కూడా బ్రతకలేను."
    "నేనూ అంతే! పరిష్కారం ఏమిటి?"
    "తెలీదు! నేను సన్ గా వెళ్లిపోతాను."
    "వద్దు!"
    "ఏం...?"
    "నువ్వు అమ్మానాన్న సంరక్షణలో ఉండు! నేనే దూరంగా వెళ్లిపోతాను."
    "వెళ్లిపోయి?"
    "జీవంతో ఉంటాను! చివరిక్షణంలో నిన్ను కలుపుకుని వెళ్లేందుకు!"
    "అప్పటివరకూ నేను....?"
    "పెళ్ళి చేసుకో! అమ్మానాన్నలకు ఆనందం కలిగించు."
     చివ్వన లేచింది!
    రేవంత్ దగ్గరికొచ్చి కళ్ళలోకి చూస్తూ-
    "దయచేసి పెళ్ళికొడుకును వెతికి నువ్వే మారణహొమం చేస్తావా? అందులో పడి నేను కాలుతూ విలవిలలాడుతుంటే చూసి ఆనందిస్తావా?" అడిగింది కోపాన్ని కంట్రోల్ చేసుకుని!
    గోడవైపు తిరగబోయాడు రేవంత్.
    అతడి భుజాలు పట్టి తిప్పి- "నీకు నోరెలా వచ్చింది నన్నింకో పెళ్ళి చేసుకొమ్మని చెప్పడానికి! హాఁ... నేను మరబొమ్మనా! కాలం ఆడే ఆటకు కాళ్లూ, చేతులూ కదపడానికి? చెప్పు...ఇంకోసారి చెప్పు! చెప్పు చూద్దాం! మళ్లీ పెళ్ళి చేసుకొమ్మని చెప్పు! చెప్పు! పిచ్చిగా గుప్పెళ్ళతో ఛాతీ మీద ఇష్టం వచ్చినట్టు కొట్టసాగింది హిస్టీరిక్ గా!


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS