Previous Page Next Page 
చదువు పేజి 32

   

   అయినా సుందరం గుండె పిచపిచ లాడుతూనే వుంది. కొత్తమేష్టరు ఇది వరకల్లా ఫస్టుఫారానికి మాత్రమే చెప్పినవాడు; సెకండుఫారానికి చెప్పగలడా అని. ఈ భయం మొదటిరోజునే పోయింది. సీతప్పగారికన్న  ఈయన పాఠాలు చాలా బాగా చెప్పేవాడు.
   
                                        *    *    *    *   

    తిలక్ మహాశయుడి చావుగురించి జనం మరిచారో లేదో గాంధీ ముందుకువచ్చి సహాయ నిరాకరణోద్యమం  ప్రారంభించాడు. ఎవరినోటవిన్నా గాంధీపేరే, సత్యాగ్రహమన్నమాటే.

    తిలక్ చావునుగురించి వినప్పుడే సుందరం గాంధీపేరు కూడా వినిఉన్నాడు. గాంధీనిగురించి ఇప్పుడింకా చాలా విషయాలు తెలిశాయి. తిలక్ పొయ్యేటప్పుడు గాంధీ దగ్గరే వున్నాట్ట. జాతీ యోధ్యమాన్ని గాంధీకి వప్పగించి తిలక్ ప్రాణం విడిచాట్ట. గాంధీ చెప్పే కొత్తపద్దతుల్లో ఒకటి స్వదేశీ ఉద్యమంతో విదేశవస్తు బహిష్కారం. ఇంగ్లీషువాళ్ళు వర్తకంతో ఇండియాను దోస్తున్నారు. ఈ దోపిడీకోసమే ఇక్కడ పరిపాలన తతంగమంతానూ, మనదేశంలో వాళ్ళ వస్తువులను ఎవరూ కొనకుండా మానేస్తే వాళ్ళరోగం కుదిరిపోతుంది. ఏటా ఎన్నో కోట్ల రూపాయల సరుకులు ఇంగ్లండునుండి ఇండియాకు దిగుమతి అయి అమ్ముడుపోతున్నాయి. వాటిని కొనటం మానాలి. ముఖ్యంగా విదేశీ వస్త్రాలు బహిష్కరించాలి. అందరూ నూలువడికి నేయించుకుని ఆ బట్టలే కట్టాలి. అదే ఖద్దరు. అదే స్వదేశీదీక్షా వస్రం.........

     ఒకనాడు సుందరం, నాగేశ్వర్రావూ స్కూలుకు వచ్చేసరికి అక్కడ పికెటింగు సాగుతున్నది. వందలకొద్దీ విద్యార్దులు గేటుబయట నిలబడివున్నారు. పికెటర్లు వాళ్ళని లోపలికి పోవద్దని నయానా భయానా నివారిస్తున్నారు. పికెటింగు  చేసేవాళ్ళు విద్యార్దులు కారు. కాని చాలా పెద్దవాళ్ళూ కారు.

    ఒకాయన సైడుకాలవ కల్వర్టుమీద నుంచొని ఉద్ఘోషిస్తున్నాడు.
 
    "ఒరే అబ్బాయిలూ, మీ రెవరూ స్కూలుకు పోనక్కర్లేదు. స్కూళ్ళు మానమని గాంధీ చెప్పాడు. ఆ మాటే నేనూ మీకు చెబుతున్నా... ఇదుగో, అభిమానం ఉన వాళ్ళెవరూ లోపలికి పోకండి. సిగుమాలినవాళ్ళు  పోతేపోవచ్చు, నేవొద్దన్ను. మీ రెవరూ వెళ్ళకపోతే పాఠాలు జరగవుటా, పిచ్చివాళ్ళాల్లారా! రెండు మూడురోజు లాగారంటే జాతీయ కళాశాల పెడుతున్నాం. అందులోకివచ్చి నిజమైన చదువు చదువుదురుగాని."

    మేష్టర్లు మాత్రం లోపలికి వెళ్ళారు. పిల్లలు దాదాపు ఎవరూ వెళ్లలేదు. దాదాపు పదకొండు గంటల ప్రాంతాల సుందరం నాగేశ్వర్రావు తో కలసి ఇంటికి తిరిగిపోయినారు.
 
    శ్రీరామ్మూర్తి స్నేహితులంతా చేరారు. వాళ్ళలో ఒక్కడూ స్కూలుకు వెళ్లలేదు. వాళ్ళంతా ఉద్రేకంగా మాట్లాడుకునే విషయాలన్నిటినీ సుందరం ఆలకించాడు. ఈ చదువుపద్దతి ఇంగ్లీషువాళ్ళు కావాలని తెచ్చిపెట్టారు. ఇంకోభాష నేర్చుకుంటేనేగాని ఉద్యోగాలు దొరకనిపద్దతి భూ ప్రపంచంలో ఎక్కడా లేదు. ఇంగ్లీషువాళ్ళు ఇండియాలో తెచ్చిపెట్టారు. ఎందుకూ పనికిరాని చదువు ప్రవేశపెట్టారు.నూటికి తొంభైతొమ్మిదిమంది ఏవో వృత్తులు చేసుకునేవాళ్లయితే దేశంలో వృత్తివిద్యలు లేకుండాచేశారు. చరిత్రనిండా అబద్ధాలు రాశారు. ఈ చదువు బహిష్కరించాలిసిందే.

    అట్లాగే విదేశ వస్తువులు కూడా బహిష్కరించాలి. అవి కాకుండా మనం గడుపుకోవాలి. మంచో చెడో మనదేశంలో తయారయేవే కొంటే దేశంలో ఉండేడబ్బు దేశం దాటిపోకుండా ఉంటుంది. ఆ తరువాత ఇంగ్లీషువాళ్ళు మనల్ని దోచుకోలేరు. ఈ విషయాలు సుందరం విన్నాడు, అర్ధంచేసుకున్నాడు. ఇవి వాడికి క్రొత్తవిషయాలే. అయినా తెలియదగిన విషయాలల్లే కనిపించాయి.

    స్కూలుముందు రోజూ ఒకటే పికెటింగు సాగుతూనేఉంది. సుందరానికి ఒకటే సందేహం కలిగింది. ఇట్లా ఎని రోజులు సాగుతుంది? ఎప్పుడో  ఒకనాడు పికేటింగు మానరా? ఆ తరువాత మళ్ళీ స్కూలు యధావిధిగా సాగదా ? అని!
 
    అయినా సుందరం పికెటింగు జరిపేవాళ్ళ పక్షాన్నే ఉన్నాడు. స్కూలూ, హెడ్మాష్టరూ, మేష్టర్లూ జాతీయోధ్యమానికి శత్రువులుగా వాడికి కనపడ్డారు. పికెటింగ్ లక్ష్యపెట్టకుండా లోపలికి వెళ్ళి ఖాళీ క్లాసుల్లో కూర్చుని యాభై అరవైమంది విద్యార్ధులూ, స్వార్దపరుల్లాగానూ, పిరికి వెధవల్లాగానూ కనిపించారు.

    మొదటి రోజుకంటె రెండోరోజు తక్కువమంది విద్యార్దులు క్లాసులకు వెళ్లారని విని సుందరం సంతోషించాడు. మూడో రోజు రెండు వందల మదిదాకా వెళ్ళారని విని ఎందుకో భయపడ్డాడు. ఎవ్వరూ స్కూలుకు వెళ్ళరాదని సుందరం కోరాడేగాని, ఎవరు బడికిపోయినా తాను పోకూడదన్న  నిర్ణయం సుందరం చెయ్యలేదు. అదీకాక క్లాసులు నడిచి తాను వాటికి హాజరు కాకుండా ఉండటం సుందరాని కెంతమాత్రమూ ఇష్టంలేదు.

    పికెటింగు నివసించేవాళ్ళ పక్షంకూడా సుందరం విన్నాడు. ఇంటో ఆడవాళ్ళకు ఆదినారాయణ చిన్న ఉపన్యాసం ఇచ్చాడు.
 
    "వీళ్ళమొహం పికెటింగు! రెండురోజులు పికెటింగు చేసి మూడోరోజు మానేస్తారు. స్వరాజ్యం రావటానికి పిల్లలు చదువులు మానుకోవాలా? అందరూ చదువులుమాని బడుద్దాయి లైతే స్వరాజ్యం వచ్చేసి చదువురాని వాళ్ళకి ఉద్యోగాలొస్తాయి కాబోలు, ఏమిటో!"

    ఆదినారాయణగారు ఈమాట అన్న మర్నాడే ఊళ్ళో జాతీయ విద్యాలయం మంత్రపూర్వకంగా శంఖుస్థాపన జరిగింది. హైస్కూల్లో పనిచేసే ఉపాధ్యాయులిద్దరు అందులో ప్రవేశించారు కూడానూ. విద్యాలయం ప్రారంభమైన రోజు ఉదయం సుందరం అక్కడికి వెళ్ళాడు. పెద్ద పందిరివేశారు. భజంత్రీలు వాయించారు. అనేక వందలమంది అక్కడ చేరారు. వాళ్ళలో చాలావరకు స్కూలుకువెళ్ళని విద్యార్ధులే. బ్రాహ్మడు మంత్రాలు చదివాడు. బరంపురం వంగపండు పట్టుబట్టలు కట్టుకుని ఎర్రగా, అందంగావుండే ఒకాయన హడావుడిగా అటూ ఇటూ పెత్తనం చేశాడు. ఆయన శ్రీ దుగ్గిరాల గోపాలకృష్ణయ్యని సుందరానికి ఎవరో చెప్పారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS