"ఎక్కడో విదేశాల్లో జరిగినా పుక్కిటి పుకార్లను మీరు నమ్మివుండొచ్చు. మీ అసిస్టెంట్ వేణుకు కూడా అలాంటిదేమయినా జరిగిందా? మీరు చూశారా?"
శరత్ వితండ వాదనకు....అమితేష్ ముందు మీరు నా మాటను నమ్మితే? అన్నట్లుగా చూశాడు. 'బిస్కెట్స్ ప్లీజ్...' ఎయిర్ హోస్టెస్ చిరునవ్వు వైపు ఒకసారి చూసి చెరో రెండు అందుకున్నారు.
"అవును! నిజానికి వేణూది సిటీ లైఫ్. వాళ్ళ కుటుంబంలో ఎదురయిన కష్టమే వేణుకు ఈ శక్తిని ఆపాదించి పెట్టింది పరోక్షంగా. తండ్రి త్రాగుబోతు. తల్లి పనిమనిషి. రోజూ తప్పత్రాగి వచ్చి భార్యను కొడుతూ వుండేవాడు వాళ్ళకిద్దరు పిల్లలు. అప్పుడు వేణుకు పదిహేనేళ్లుంటాయి. అందరి ఇళ్ళలో చాకిరీ చేసి సంపాదించిన డబ్బుల్ని భార్యను కొట్టి తీసుకుపోయి సారా తాగేవాడు. వేణు వాళ్ళ చెల్లికి పదేళ్ళుంటాయేమో. ఒకరోజు మొగుడి దెబ్బలు భరించలేక వాళ్ళ తల్లి ఈ పిల్లల్ని తీసుకుని వెళ్ళి ఊరవతల బావిలో పడింది. అందరూ ఒకేసారి కట్టగట్టుకొని పడ్డారు. బావిలో పడేటప్పుడు అంచులు తాకి వేణు తలకు బలమయిన గాయాలయ్యాయి. అయితే తల్లీ, చెల్లీ చనిపోయినా అదృష్టవశాత్తు వేణు బ్రతికిపోయాడు. భర్త పారిపోయాడు. మొదటిసారి కేసు కోసం వెళ్ళిన నాకు....ఇతర పోలీసు సిబ్బందికి ఆశ్చర్యం గొలిపిన విషయం వేణు, తండ్రి గుడ్డలు ముట్టి....అతనిలో ప్రవేశించిన ఏదో మానసిక శక్తితో చెప్పిన ఆధారాలతో కూడా ట్రై చేశాం. చిత్రంగా ఆ ఆధారాలను అనుసరించిపోతే వాళ్ళ నాన్న బొంబాయిలో దొరికిపోయాడు.
అప్పట్నించి వేణు నా దగ్గిరే వుంటాడు. మొదట్లో మేమందరం కూడా అతని మాటల్ని మీలాగే నమ్మలేదు. కాని అతడో వస్తువుని తాకి ట్రాన్స్ లోకి వెళ్ళి ఏవేవో చెప్పేవాడు. నేర పరిశోధనలో అలాంటి అతీంద్రియ శక్తుల వ్యక్తులు తోడ్పడుతున్నారంటే ఎవరూ నమ్మకపోవచ్చు. కానీ....ఇది నగ్నసత్యం! నేను అప్పటి నుండే ప్రపంచంలోని పీటర్ హర్కోస్ లాంటి వ్యక్తుల గురించి తెలుసుకుంటున్నాను..." అన్నాడు అమితేష్.
"పీటర్ హర్కోస్ గురించిన ఏమైనా నిదర్శనాలున్నాయా?" అడిగాడు శరత్. విమాన ప్రయాణీకుల్లో ఎవరి మాటల్లో వారున్నారు.
"నిదర్శనాలు చాలా వున్నాయి. ఆయనకు నేర పరిశోధకులు మంగళము పట్టిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అతనిలో వున్న మానసిక శక్తి...మీరనే అతీంద్రియ శక్తి ఎంత బలీయంగా ఉందంటే నేను చదివిన ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి.
1958లో అనుకుంటా...క్రీస్తుశకం 0079 వ సంవత్సరంలో ఇటలీలోని 'వెసూ వియస్' అనే అగ్నిపర్వతంనుంచి పెల్లుబికిన వాలెనో (లావా) తాలూకు బూడిదను సీల్ చేసి దాన్ని పీటర్ చేతి కందించారు.
పీటర్ హర్కోస్ ఆ సీల్ ను చేత్తో నెమ్మదిగా తడుముతూ చాలాకాలం క్రిందట...చాలా చాలా కాలం క్రిందట...భయంకరమైన ప్రేలుడు ఏదో ప్రవహించింది. అర్ధం కాని భాష.....చాలా పాత భాష విన్పిస్తోంది.
అంటూ చెప్పుకుపోయాడంటే అతని మానసిక శక్తిని అంచనా వేయండి. మా డిపార్ట్ మెంట్ అంతా వేలు చూపితే కొండ పాక్కుపోయినట్లుగా ఉంటుంది. అలాగే కేసు పూర్తి వివరాలు చెప్పకపోయినా, వేణు కూడా అలాగే చెప్పగలడు. చాలా కేసుల్లో కూడా పీటర్ హర్కోస్ లా వేణు మాటల్తో మేం ప్రొసీడ్ అయ్యాం...." అని ఆగాడు అమితేష్ అతిగా వాగుతున్నానేమో అన్పించి.
శరత్ అమితేష్ వైపు విచిత్రంగా చూస్తూ ఫోటో ఇచ్చేశాడు. అతడు చెప్పిన విషయాలు కొద్దిగా రుజువులతో చెప్పేసరికి నిజమే అయివుంటుందనిపించింది.
"మరి పాత బస్తీ కేసులో కూడా ఏదయినా క్లూ ఇచ్చాడా మీ అసిస్టెంట్....?"
"మీరిలా అడిగితే ఇంటర్ నేషనల్ గూఢచారిగా అనుమానించాల్సి వస్తుంది మరి" నవ్వుతూ అన్నాడు అమితేష్. ఆ మాటకు శరత్ కూడా నవ్వాడు.
ఎక్కడో క్రింద బెంగుళూర్ సిటీ ఛాయలు కన్పిస్తున్నాయి.
"పాతబస్తీ కేసులో హంతకుడి 'చెప్పు' ఒక కాలిది దొరికింది. దాన్ని బట్టి చూసి అతడిచ్చిన క్లూస్ ప్రకారం హంతకుడు బెంగుళూర్ పారిపోయి వచ్చి ఉంటాడని ఊహిస్తున్నాం!! అందుకే గదా ఈ పయనం" అన్నాడు అమితేష్.
కాని అమితేష్ కే తెలుసది తను ఆడింది అబద్దమని...
బోయింగ్ 707 బెంగుళూర్ విమానాశ్రయంలో దిగింది. వాళ్ళిద్దరూ ప్లేన్ దిగి ట్రావెలర్స్ బాల్కనీలోకి వచ్చాక....
"మే ఐ గో నౌ సార్" అన్నాడు అమితేష్ వినయంగా. "విష్ యూ ఆల్ ది బెస్ట్ మైబోయ్" భుజం తడుతూ చెప్పాడు శరత్.
కాని వాళ్ళు విడిపోతున్న తరుణంలో.
అతడు పాతబస్తీ హంతకుడి గురించి రాలేదని, ఏదో అనుమానంతో తననే ఫాలో కావడానికి బెంగుళూర్ వచ్చాడని....క్షణంపాటు కూడా ఊహించలేకపోయాడు శరత్!!
** ** ** **
బెంగుళూర్ ఏరోడ్రోమ్, ట్రావెలింగ్ బాల్కనీలోంచి బయటపడబోతున్న అమితేష్ కి మైక్ లో ఏదో ఎనౌన్స్ మెంట్ విన్పించి...ఆ ఎనౌన్స్ లో తన పేరు విన్నట్టు అన్పించి ఆగిపోయాడు. ఎనౌన్స్ మెంట్ ఇంగ్లీషులో విన్పించింది.
"అర్జంట్ ఫోన్ కాల్ వచ్చివున్నందున బోయింగ్ 707 లో వచ్చిన అమితేష్ అనబడే ప్యాసింజరు తొందరగా ఆఫీస్ రూంలోకి రావల్సిందిగా కోరుతున్నాం..."
మళ్ళీ మళ్ళీ విన్పిస్తున్నారు మైక్ లో ఆ విషయాన్ని.
మెట్ల అంచుననిల్చుండి విన్న అమితేష్ గిరుక్కున తిరిగి ఒక్క పరుగులో ఆఫీస్ రూంలోకి చేరాడు.
