Previous Page Next Page 
చిత్రం భళారే విచిత్రం పేజి 32

    "ఏంటి బాబూ. మావాడికి ఒంట్లో బాగోలేకపోతే నీకు సంతోషమా బాబూ?" గోపివంక అదోమాదిరిగా చూస్తూ అడిగాడు తాత.
    గోపి నాలుక కొరుక్కున్నాడు.
    "ఛ ఛ... నా ఉద్దేశం అదికాదు తాత. నేను చాలాసంతోషం అని ఎందుకన్నానంటే ఆరోజు నిన్ను రిక్షాలో తీసుకెళ్ళే అదృష్టం తప్పిపోయినా ఈరోజు మళ్ళీ ఆ అదృష్టం నాకు మళ్ళీ దక్కింది తాతా... మళ్ళీ దక్కింది. రా తాతా నా రిక్షా ఎక్కు! నిన్ను మీ అబ్బాయ్ ఇంటికి క్షేమంగా తీసుకెళ్తా" రిక్షా సీటూ దులుపుతూ చెప్పాడు గోపి.
    "బహాబూ!" ఆనందంగా అన్నాడు తాత.
    "సర్లేతాతా. త్వరగా ఎక్కు"
    తాత గోపీ రిక్షా ఎక్కాడు.
    గోపీకూడా రిక్షా ఎక్కాలని అనుకునేంతలో పెద్దగుంపు "గోపీబబూ, గోపీబాబూ" అంటూ పరిగెత్తుకొని వచ్చారు.
    వాళ్లను చూడగానే తాత బావురుమన్నాడు.
    "ఏంటి? ఏమైంది?" ఆందోళనగా వాళ్లని అడిగాడు గోపి.
    "గోపీబాబూ... మరేమో మేము రేషన్ షాపుకి వెళ్ళాం. బియ్యం అడిగితే నోస్టాక్ అన్నాడు సుబ్బిశెట్టి. చక్కెరా, గోధుమలు, కిరోసిన్ ఏవడిగినా నోస్టాక్ అన్నాడు బాబూ" అని మొరపెట్టుకున్నారు వాళ్ళు.
    "ఆ! అంతమాటన్నాడా? పదండి వాడి సంగతి తేలుద్దాం" ఆవేశంగా చెప్పాడు గోపి.
    "బాబూ మరి నాసంగతి ఏంటి?" బాధగా అడిగాడు తాత.
    "వాడెవడో పుణ్యాత్ముడు పావలాకే మీ అబ్బాయి యింటికి రిక్షా కట్టాడని  చెప్పావుగా! వాడి దగ్గరకే వెళ్ళుతాతా" అన్నాడు గోపి బాధని కంట్రోల్ చేస్కుంటూ.
    "బాబూ!" తాత గొంతు పూడుకుపోయింది.
    గోపి చటుక్కున తల ప్రక్కకి తిప్పేశాడు. తన కళ్ళలోంచి ఉబుకుతున్న కన్నీరు తాతకి కనబడనీయకుండా "నిన్ను రిక్షాలో కూర్చోబెట్టుకుని తొక్కే అదృష్టం నాకులేదు తాతా - నాకులేదు"
    చొక్కా ఎత్తి కళ్ళు తుడుచుకున్నాడు గోపి.
    "బాబూ... త్వరగా బాబూ"
    గుంపు గోలగోలగా అరిచారు.
    "పదండి"
    గోపి అడుగులు ముందుకు వేశాడు.
    తాత నెత్తి కొట్టుకుంటూ రిక్షాదిగి గోపిని బూతులు తిట్టుకున్నాడు.
                                                                 * * *
    రేషన్ షాపు సుబ్బిశెట్టి రాయుడి మనిషే. రేషన్ షాపులోని సరుకుని బ్లాక్ మార్కెట్ లో అమ్మి అముడ్లో కాస్త షేర్ రాయుడికి కూడా ఇస్తుంటాడు.
    గోపి గూడెంజనాలతో రేషన్ షాపుకి వెళ్ళి షాపు దోచుకున్నాక సుబ్బిశెట్టి లబోదిబోమంటూ రాయుడి దగ్గరికి పరుగుతీశాడు.
    "రాయుడుగారూ - రాయుడుగారూ - నా కొంప మునిగింది రాయుడుగారూ."
    రాయుడు ముందు నిల్చుని గుండెలు బాదుకున్నాడు.
    "ఏమైందయ్యా?" అడిగాడు రాయుడు.
    "నా షాపు దోచుకుపోయాడయ్యా ఆ గోపీగాడూ, వాడి మనుషులూ?"
    "ఆ!... అంత పనిచేశాడా? అసలు ఎందుకలా చేశాడు?"
    సుబ్బిశెట్టి జరిగిన విషయం చెప్పాడు.
    "గోపీ"
    పళ్ళు నూర్తూ అన్నాడు రాయుడు.
                                                           * * *
    గోపి ఇంటికెళ్ళేసరికి రాధ పెద్ద మామిడికాయ ఉప్పులో ముంచుకుని కొరుక్కుతింటూ ఉంది.
    ఆ దృశ్యం చూడగానే గోపి ఉక్కిరిబిక్కిరి అయ్యాడు.
    సంతోషం పట్టలేక 'రాధా..." అని అరిచాడు గోపి.
    ఆ అరుపుకి రాధ ఉలిక్కిపడింది. ఆమె చేతిలోని మామిడికాయ జారి నేలమీద పడింది.
    "ఛీ... ఏవిటండీ ఆ అరుపులూ.... ఉలిక్కిపడి వచ్చాను. మీవల్ల బంగారంలాంటి మామిడికాయ నేలపాలైంది!!" అంది రాధ బాధగా.
    "ఏంటి రాధా... ఈ సమయంలో సంతోషించాలిగానీ ఆఫ్టరాల్ మావిడికాయ గురించి అలా బాధపడకూడదు!... నీకు ఒకటేంటి - బుట్టడు మామిడికాయలు నేను కొనిపెడ్తాగా! ఏదీ నువ్వు నవ్వాలి మరి!"
    రాధవ్ బుగ్గ వాచిపోయేలా చిలిపిగా గిల్లాడు గోపి.
    "ఇంతకీ మీ సంతోషానికి కారణం ఏంటండీ? మీరు ఇంకో రిక్షాగానీ కొన్నారా?"
    ఆనందంగా అడిగింది రాధ.
    గోపి రాధవంక ఆశ్చర్యంగా చూశాడు.
    "అదేంటి ఇలా అడుగుతున్నావ్? నువ్వు మావిడికాయ తింటున్నావు కదా అందుకని సంతోషించాను" అన్నాడు రాధ మొహంలోకి పరీక్షగా చూస్తూ.
    రాధ మొహం వివర్ణమయింది.
    "నేను అందుకని తినడంలేదండీ.... ఊర్కే ఏదయినా పుల్ల పుల్లగా తినాలపించీ..." నసిగింది రాధ.
    "ఏడవలేకపోయావ్?.... మరి అలాంటప్పుడు పోయినసారి నువ్వు మావిడికాయ, చింతపండూ ఊర్కే తింటున్నావని నేననుకుంటే నన్నో వెర్రి వెంగళప్పని చేసి నువ్వూ, మా అమ్మ నాకు చర్చపెట్టి జల్లకాయలు ఎందుకు కొట్టారు?" విసుగ్గా మొహం పెట్టి అన్నాడు గోపి.
    సరిగ్గా అప్పుడే సరస్వతి గదిలోకి అడుగుపెట్టింది.
    ఆమె గొంతు సవరించుకుంది.
    "జీవితం అంతే బాబూ.... చాలా విచిత్రమైంది. అన్నీ మనం ఊహించినట్టు జరగవు. మనం ఒకలా ఊహిస్తే మరోలా జరుగుతుంది. మనం మంచి జరుగుతుందని అనుకుంటే చెడు జరుగుతుంది. చెడు జరుగుతుందని భయపడినప్పుడు మంచి జరుగుతుంది. ఈ జీవన రంగులరాట్నం తిరుగుతున్నప్పుడు పైవాళ్ళు క్రిందికీ, క్రిందివాళ్ళు పైకీ మారుతూ ఉంటారు బాబూ. నీ విషయమే తీస్కో.... అప్పుడేమో రాధ మావిడికాయలూ, చింతపండూ అన్నీ ళప్ ళప్ మని చప్పరిస్తూ తింటుంటే నువ్వేమో తను ఊర్కే తింటుందేమో అని అనుకున్నావ్. కానీ అప్పుడేమో రాధ కాలుజారింది.
    "కాదు... నెల తప్పింది" పళ్ళునూరుతూ తప్పుని సరిదిద్దాడు గోపి.
    "అదే... అదే ఏదో ఒకటిలే. మొత్తానికి రాధకి గర్భం వచ్చింది. కానీ ఇప్పుడో? ఆమె ఊరికే మావిడకాయలు తింటుంటే నువ్వేమో రాధ కాలుజారింది-అదేలే నెల తప్పిందని అనుకున్నావ్...అదే బాబూ జీవితం అంటే" ముగించింది సరస్వతి.
    "అబ్బా!"... చాల్లేవే!! ఇంకా నీ స్పీచ్ చాలించు... ఏది ఏమైనా రాధ మళ్ళీ నెల తప్పిందేమోనని నేనెంతో ఆశపడ్డాను" బాధగా అన్నాడు గోపి.
    "ఎక్కడా? మీకు ఎక్కడలేని టైమూ అ రైతు కూలీలతో తిరగడానికే సరిపోతుంది... ఇంక నేనెలా నెల తప్పుతానూ?" నిష్టూరంగా అనేసింది రాధ.
    మళ్ళీ తను అలా అనకూడదేమో అనిపించి నాలుక కొరుక్కుంది.
    "రాధా... రాధా... రాధా హెంత మాటన్నావ్ రాధా. వాళ్ళతో నేనేమైనా జల్సాల కోసం తిరుగుతున్నానా రాధా? వాళ్ళు అట్టడుగు ప్రజలు రాధా - అ బడుగుజాతి ఎండే డొక్కలకు పూటకింత గంజి కూడా దొరకని స్థితిలో వారి కంటివెంట రక్తాశృవులు  చిందే తరుణంలో" గోపి ఆవేశంగా చెప్పుకుంటూ పోతున్నాడు.
    "బాబోయ్"
    రాధ, సరస్వతి ఒక్క గెంతు గెంతి బయటికి పారిపోయారు చీర కుచ్చిళ్ళు ఊడిపోయేలా.
                                                           27
    రిక్షాకి బ్రేక్ వేసి ఆపాడు గోపి.
    "దిగండమ్మా!" అన్నాడు వెనక్కి తిరిగి రిక్షాలోకి చూస్తూ.
    రిక్షాలోంచి ఓ అందమైన పడుచు దిగింది.
    ఆమె పర్సులోంచి వందరూపాయల నోటు తీసింది.
    "ఇంద - తీస్కో" ప్రేమగా గోపీవంక చూస్తూ అంది ఆమె.
    "వందా? అమ్మో! అంత డబ్బుకి నా దగ్గర సిల్లర ఎక్కడుంటుంది అమ్మాయ్ గోరూ" బుర్రకాయ్ గోక్కుంటూ అన్నాడు గోపి.
    "పర్లేదు - చిల్లర నువ్వే ఉంచుకో" అంది ఆమె.
    "అదేంటమ్మా - నేను మీకు రెండు రూపాయలకే బేరం కట్టాను - మీరు రెండు రూపాయలే ఇవ్వాలి!"
    "పర్లేదు - తీస్కో" అనవసరంగా కిలకిలా నవ్వింది ఆమె.
    వెంటనే గోపి మొహంలో రంగులు మారాయ్.
    "హమ్మాయ్ గారూ!" గాఠిగా అరిచాడు గోపి.
    ఆమె తృళ్ళిపడింది.
    "మీరు ఊర్కే డబ్బులు ఇస్తే తీస్కోడానికి నేను మానాభిమానాలు లేని నికకృష్ణుడిని కాను అమ్మాయ్ గోరూ - నేను కూటికి పేదనే కానీ గుణానికి పేదనుకాను హమ్మాయ్ గోరూ. మీకు అంతగా డబ్బు ఎక్కువ అయితే ఏ కళ్ళు లేనివాడికో, కాళ్ళు లేనివాడికో దానం చెయ్యండి అమ్మాయ్ గోరూ - అంతేగానీ కాళ్ళూ, చేతులూ అన్నీ సవ్యంగా ఉండి, దుక్కలా ఉన్న నాలాంటివాడికి ఇచ్చి అవమానపరచకండి అమ్మాయ్ గోరూ."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS