14
ఏళ్ళ తరబడి మా సంసారం హాయిగా సాగిపోడానికి అన్నిటి కంటే ముఖ్య సూత్రం ఒకళ్ళ ఖర్చులు మరొకరు తెలుసుకుందామనే కనీసపు కోరిక కూడా లేకపోవడమే అనుకుంటాను. అయన ఎప్పుడు తెచ్చేవారో ఎక్కడ తెచ్చేవారో పర్సు నిండా ఎప్పుడూ నోట్లూ చిల్లరా ఉండేవి. నేను అందులోంచి తీసుకున్నప్పుడు కూడా ఆయనకు చెప్పవలసిన అవసరం లేకపోయేది.
'అందులో ఇంత ఉండాలి, కనపడదేం, ఏం చేశావ్' అని వారు ఒక్కసారయినా నన్ను అడిగితె కదా! పైగా అనేవారు పెద్ద వేదాంతి లా 'ఎన్నాళ్ళు ఉంటామో, ఎప్పుడు నడిచి వెళ్ళిపోతామో ఎవరికి తెలుసు? ఉన్నన్నాళ్ళు రెండు చేతులా ఖర్చు పెట్టకపోతే , కొవ్వొత్తి రెండు వైపులా వెలిగించి ఆనందించక పొతే కూడా పట్టుకు పోతామా? ప్రపంచంలో యింత కలిగి ఉండడమే ఒక అదృష్టమైతే దాన్ని ఖర్చు పెట్టుకుని సుఖించే అరుదైన లాభాన్ని ఎందుకు పొందకూడదు?' ఇలా ఉండేవాయన కబుర్లు మొదట చిత్రంగా కనిపించినా తరువాత నాకు సహజమై పోయాయి. అలాగని ఒళ్ళు తెలియకుండా కనపడినవన్నీ కొనేసే ఖర్చుదారి మనిషి కాదు. మాట్లాడితే, ' మూడు ఎభైలు ఎవడు బతికాడు లెద్దూ! మూడు ఎనబైలు మాత్రం మహా ఎంతమంది సంపాదిస్తున్నారు చేబుదూ!' అనేవారు. అనవసరంగా వాదించడం లేనిపోని అల్లర్లు కొని తెచ్చుకోడం నాకే యిష్టం లేకపోయింది. బ్యాంక్ ఎకౌంటు ఓపెన్ చేయించాలని మాత్రం చాలాసార్లు చెప్పి చూశాను. 'ఇవాళ వెయ్యడం రేపు తియ్యడం ' యీ 'ఇస్తి నమ్మ వాయనం పుచ్చుకొంటి వాయనం' గొడవ కూడా ఎందుకూ? అన్నీ భరించడానికి పర్సు ఉండనే ఉంది. ఇదో కొత్త సోద కూడా ఎందుకూ!" అనేవారు. ఎందురు చెప్పడం యిష్టం లేక వూరుకునేదాన్ని, అప్పుడప్పుడు ఏవైనా చిన్న చిన్న యిబ్బందులు వచ్చిన సెకండ్ల మీద డబ్బు తేగలిగే వారుండగా నాకెందుకీ లేనిపోని విచారం అని సరిపెట్టుకునేదాన్ని. ఇక మధురిమ విషయంలో సరేసరి. టాయ్ సెంటర్ లోకి ఏ కొత్త వస్తువు వచ్చినా యింట్లో ఉండవలసిందే. రెండ్రోజులకైనా ఓ కొత్త రకం గౌను తేవలసిందే. నేనిప్పుడేనా ఎందుకింత ఖర్చు చేశారంటే యిద్దరూ కలిసి నామీదకి యుద్దానికి వచ్చేవారు, అది గోళ్ళతో నన్ను బరికేసేది కూడా. నేనే ఓడిపోయి ఊరుకునేదాన్ని. మొత్తమ్మీద అతి ముఖ్యమైన ఆర్ధిక బాధ లేకుండా ఉల్లాసంగా సల్లాపం లా మా సంసార నౌక యిన్నాళ్ళూ గడిచి పోయింది. ఇటువంటి విషయాలు యిదివరకే నేను పట్టించుకునే దాన్ని కాదు. ఈ రెండేళ్ళూ యీ చదువోకటి వచ్చి పడడంతో మామూలు నిఘా కూడా ఉంచలేదు. ఇంటికి కావలసింది తేవడం, ఖర్చు పెట్టడం - ఈ రెండూ అయన చెయ్యకపోతే నేనీ సారస్వత సాగరాన్ని యీదుకు రాగల్గుతానా!
'మునపట్లా కాదక్కా నువ్వు! ప్రతీ విషయం గంటలతరబడి ఆలోచించడం నేర్చుకున్నావు-- ఎదురుగుండా మనుషులు కూచుని ఉన్నా సరే' నేను త్రుళ్ళిపడి యిటు తిరిగింది. ఏదో మాట్లాడ్డానికి ప్రయత్నించాను.
'ఆ, ఏమిటీ కామేశ్వరి వదిన ఖర్చు గురించా చెబుతున్నావ్? ఈ విషయంలో ఆయన మాత్రం ఏం తక్కువ తిన్నారా ఏమిటి సరళా! సినిమాకు వెడితే హైయెస్ట్ క్లాసు కొనుక్కుంటే గాని నామోషి ఆయెను.'
'సరే బావ సంగతి నాకు తెలియదా! కాని కామేశ్వరి ఖర్చుకీ అతని ఖర్చుకీ పోలికే లేదు. నువ్విక్కడ లేనప్పుడు ఆవిణ్ణిక్కడికి పిలిపించడం నాకేం నచ్చలేదు సుమా! నువ్వేమనుకుంటే అది అనుకో, ఆ విషయంలో మీరు చాలా పొరపాటు పని చేశారని నా ఉద్దేశం.'
'పోన్లే, అవిడిప్పుడు వెళ్ళిపోయింది గదా!'
'అంతటితో అది ఆగిపోతే సంతోషమే!' ఏమైనా ఆవిడా గురించి నీ అభిప్రాయం సరైనది కాదని నా నమ్మకం. లేకపోతె ఆమె గురించి నీకు సరిగ్గా తెలియనే తెలియదేమో!'
సరళ యిలా మాట్లాడ్డం చూసి నే నాశ్చర్యపోయాను. నాకంటే ఆవిడ కెక్కువ తెలిసిందేమిటో నా కర్ధం కాలేదు.
'ఏదీ, యిదివరకు ఏమీ తోచక మీ గుమ్మంలోకి వస్తే, మాట్లాడేదానివే కాదు! ఎక్కడ నీ టైం వెస్టయిపోతుందో అని అలా కూచునే దానివి గాని ఎక్కువగా కబుర్ల లోకి దిగేదానివే కాదు. ఇప్పుడు మరేం అడ్డు లేదు గనక నీతో ఒకటి చెప్ప బుద్దేస్తోంది.'
'ఇంతకీ మా కామేశ్వరీ గురించి నీకేక్కువెం తెలుసూ?'
'మా పుట్టింటి వారు మెడ్రాసని యిదివరకు ఓసారి నీతో చెప్పినట్లు జ్ఞాపకం. కిందటిసారి కామేశ్వరి వచ్చినప్పుడు వారి పుట్టింటి వారి భోగ భాగ్యాలను పొగిడి వాళ్ళ ఇంటికి నేనక్కడికి వచ్చినప్పుడు రమ్మని మరీ మరీ చెప్పింది. ఆమధ్య మా నాన్నగారి వంట్లో బాగులేదని ఉత్తరం వస్తే మెడ్రాసు వెళ్ళేగా! తీరా కనుక్కుంటే వాళ్ళ యిల్లు ఆ వీధిలోనే అని తెలిసింది. రెండు మూడు సార్లు నేను వాళ్ళింటికి వెళ్ళి రావడం జరిగింది.
'సరే కవళమ్మ గారి జబ్బు గురించి అరంభిస్తావు కాబోలు. వినివిని ఇప్పటికీ చెవులు తడకలు కట్టి పోయాయి!' సరళ నవ్వింది.
'నాకు తెలిసిన విషయాలు కామేశ్వరి గురించి. ఆవిడ అమ్మగారు సరేసరి. అసలు కామేశ్వరికీ నాకూ ఇంతగా కలిసిపోడానికి కారణ మేమిటో నీకు తెలుసా/ నేను చదువుకున్నదాన్ని కానని ఆవిడకి నా మీద అపరిమితమైన మోజు.'
'అదేమిటి చిత్రం?'
'అదే మరి. ఆవిడ మొగుడు గురవయ్య ఆమెను అస్తమానూ చదువూ సంధ్యా లేని మొరటు మనిషివని సాధించి పోస్తుంటాడుట. ఆఖరికీ తెలుగులో కూడా భార్య తప్పులు లేకుండా రాయలేదని, యింతకంటే చావడం మంచిదని, అడ్డమయిన మాటలూ అడిపోస్తుంతాడట. ఆ హింస పడలేక ఆవిడ మెట్రిక్ కి కడితే అన్ని సబ్జక్టుల మార్కులూ కలిసి ఒక సబ్జెక్టు కు వచ్చే ప్యాసు మార్కు కూడా దాటలేదట! ఆ మార్కులు చూసి నలుగురి మధ్యా చిన్నబుచ్చి గురవయ్య వీలైనన్ని విధాల ఏడిపించాడట. అప్పట్నుంచీ యీ విడకి తనకి రాకపోవడం మాట అటుంచి చదువుకున్నవాళ్ళని చూస్తె విపరీతమైన కసీ, ఈర్ష్యాను. మొగాళ్ళే తప్ప అడవాళ్ళు చదువుకోడానికి అసమర్దులూ, అనర్హులూ అనీ, ఒకవేళ అలా కాక పరీక్షలు ప్యాసైతే ఎవళ్ళచేతో ఏదో రెకమెండేషన్ చేయించుకునో డబ్బు ఖర్చు పెట్టి మార్కులు వేయించుకునో ప్యాసై ఉంటారని ఆమె దృడమైన నమ్మకం. అందుకనే చదువుకున్న ఆడవాళ్ళని చూస్తె ఆవిడకు మాత్రం ఏవిధంగానూ మంచి అభిప్రాయం లేదు. ఈ విషయాలు చాలావరకూ నాకు వసుంధరే చెప్పింది. ఆమె నిన్ను ఎరుగునటగా!"

'ఆ మేమిద్దరం చిన్నప్పుడు కలసి చదువు కున్నాం.'
'వసుంధర బియ్యే ప్యాసైందని విని కామేశ్వరి ఆవిడతో మాటలు మానేసిందట!'
'పోనిద్దూ , ఎవరి వెర్రి వాళ్ళ కానందం' అన్నాను ఏమనాలో తోచక.
'అలా అయితే బాగానే ఉందును. చదువుకున్న ఆడవాళ్ళు మొగాళ్ళ మాట వినరనీ, రేప్పొద్దున ఏదైనా ఉద్యోగం చేస్తే ఎదిరిస్తారని బావతో ఎన్నిసార్లు నీ గురించి హెచ్చరించిందో వినలేకపోయేవాళ్ళం మేం. బావ మంచివాడు కాబట్టి సరిపోయింది గాని.....'
'అయన మంచితనం నువ్వేం చూశావెం?'
సరళ నవ్వేసి వూరుకుంది. ఏం మాటాడలేదు.
'పోనీ, ఆవిడ బోధలు విని అయన ఎమనేవారు?'
'ఏమీ మాటాడేవారు కాదనుకుంటాను. మాకేం వినబడేది కాదు. ఎంత వినిపించుకొని వారైతే మాత్రం అస్తమానూ అదేపనిగా ఎక్కిస్తుంటే కొంచెమైనా మార్పు కలుగుతుందంటావా , కలగదంటావా?'
నా మనసు తీవ్రంగా ఆలోచిస్తోంది. నగను అమ్మిన ముఖ్య విషయం ఇంకా వారి చెవిని వెయ్యనేలేదు. నిజంగా కామేశ్వరి ఆనాడే వెళ్ళిపోవడం ఎంత అదృష్టమో! భాగావంతుడిలాగే ఎప్పటికప్పుడు ఏదోవిధంగా అడ్డుపడుతూ ఉంటాడు. లేకపోతె కేవలం సాధారణ మానవులం ఎమైపోతాం!
'ఇదంతా సరే - కామేశ్వరి యిక్కడి కొచ్చి ఏదో ఖర్చు పెట్టేసిందంటావ్ , ఆ మాట కేమైనా అర్ధముందా సరళా, ఆమెకేం లేదా, సోదా?'
'అవునవును అసలు విషయం మరచిపోయాను. కనపడిందల్లా కోనేస్తుందని గవరయ్య ఆవిడ కట్టే డబ్బు యివ్వడట. కవళమ్మగారు ఎంత యిస్తే మాత్రం ఆవిడ చిరుతిళ్ళకు సరిపోతాయి? తెలిసి తెలిసి ఆవిడేదో సాయమని మీరు పిలిపించుకున్నారు గాని యిల్లాలు ఒక్కనాడైనా పొయ్యిలో నిప్పేసి ఎరగదు. అంతా హోటల్ నుంచే దిగుమతి చేయించుకునేది. కాఫీ కోసమనీ ఐస్ క్రీం కోసమనీ, ఆ ఫ్లాస్కు ఆవిడ ఉన్నత కాలం క్షణం విశ్రాంతి ఎరగదు. ఏ రెండొందలు ఖర్చు చేసి వెళ్ళిందో మా తల్లి.... మళ్ళీ రాత్రి భోజనాలయ్యాక వస్తాను పనుంది.'
సరళ గబగబా వెళ్ళిపోయింది.
నేను ఆశ్చర్య పోయాను. 'సరళ ఇంతగా మాటకారి ఎప్పుడయిందా' అని కాదు . నాకు తెలియకుండా ఎన్ని విషయాలు జరిగిపోతున్నాయా అని. ముఖ్య విషయాలలో అశ్రద్ధ వహించినందువల్ల వచ్చే కష్టనష్టాలన్నీ నేను అనుభవిస్తున్నాను. చదువు విషయంలో పూర్తిగా లీనమై పోయాను-- ఆ రెండేళ్ళూ , బాగానే ఉంది, అతి ముఖ్య విషయాల విషయంలో ఇంతటి ప్రమత్తతా? రైలుకి వెళ్ళ వలసిన మనిషి దారిలో మంచి మేజిక్ ప్రదర్శనం కనబడితే అందులో తలదూర్చి అక్కడే ఉండి పొతే ఏమౌతుంది? రైలు వెళ్ళిపోదా?
రెండ్రోజులు పోయాక వదిన దగ్గర్నుంచీ మధుర దగ్గర్నుంచీ ఉత్తరాలు వచ్చేయి. వదిన ఉత్తరం విప్పడానికి వేళ్ళు ఒణికాయి. అన్నయ్య ఒంట్లో ఎలా ఉందొ, మందూ అదీ సరిగ్గా పుచ్చుకుంటున్నాడో లేదో. 'నేను చదువుకోనిదాన్ని. తెలివైనవాళ్ళతో మెలగడం కష్టంగా ఉంది' అని వదిన అనడం బాగా జ్ఞాపక ముంది. ఉత్తరం చాలా చిన్నది. వదినే రాసింది.
