13
మర్నాడు మధ్యాహ్నం భోజానాలైనాక మైసూరు కు వెళ్ళే బస్సులో కూర్చున్నారు కళ్యాణీ, కాంతారావు.'
'మరో మూడు రోజుల్లో మన ప్రేమ యాత్ర ముగిసి పోతుంది.' అన్నాడు కాంతారావు చిన్నగా నవ్వుతూ.
అతనా సంగతి గుర్తు చెయ్యగానే కళ్యాణి మనసు అదోలా అయిపొయింది. ఈ తీయని కల అప్పుడే చెదిరి పోతుందా? అనిపించింది. అలా అనుకోగానే ఆమె భర్తకు మరింత దగ్గిరగా జరిగి కూర్చుంది. అతనికి ఏ మాత్రం దూరం లో కూడా ఉండలేనట్లు.'
కాంతారావు కూడా, ఎవరూ చూడకుండా ఆమె పమిట చెంగు క్రిందుగా ఆమె నడుము చుట్టూ చెయ్యి వేసి కూర్చున్నాడు.
మైసూరు వెళ్ళేసరికి సాయంత్రం ఆరు గంటలయింది. బెంగుళూరు లో లాగానే అక్కడ కూడా మర్నాటి ప్రయాణం కోసం టూరిస్టు బస్సులో టిక్కెట్లు రిజర్వు చేసుకుని వచ్చేడు కాంతారావు.
ఆ రాత్రి స్నానాలు , బోజనాలు అయినాక సర్దాగా పెద్ద బజారు లు షాపులు అవీ చూసి వచ్చేరు.
పక్క మీద పడుకోగానే కళ్యాణి అతని గుండె మీద తలానించి పడుకుని 'మన యాత్ర ముగిసి పోతోందంటే నాకేమిటో దిగులుగా ఉందండి. ఇలా స్వేచ్చగా మనిద్దరం యింత దగ్గిరగా ఉండగలుగుతామా యింటికి పోయేక?' అన్నది.
కళ్యాణి జడలోని మల్లె పూలను సుతారంగా నలుపుతూ.
'నువ్వు దిగులు పడకు కళ్యాణీ! తీపిని అతిగా తింటే వెగటు పుడ్తుందని నీకు తెలుసుగా అందుకే యీ మధురానుభవాలు మొహం మొత్తక ముందే మనం యింటికి పోవటం మంచిది. ఐతే యీ యాత్రలో నేను గ్రహించిన సత్యమేమంటే మన అసలైన వ్యక్తిత్వం మనం బయటకు వచ్చినపుడే మనకి అర్ధమవుతుంది. నిర్మలంగా వున్న ఎదుటి మనిషి వ్యక్తిలో మన ప్రతిబింబాన్ని చూసుకోవటానికి యిద్దరం ప్రయత్నిస్తున్నాం. అందుకే ప్రతి సంవత్సరం యిలా వేసవి లో పది, పది హీను రోజుల పాటు మనం కులాసాగా యాత్రలు చేసుకుంటూ కాలం గడుపుదాం.' అన్నాడు.
కళ్యాణి మాట్లాడకుండా అలాగే తన ముఖాన్ని అతని గుండె కానించి పడుకుంది. 'ఊ ఏదీ! యింకలే! ఒక్కసారి నన్ను నీ ముఖం, చూడనీ!' అంటూ రెండు చేతులతో నూ ఆమె ముఖాన్ని పట్టుకుని తన ముఖానికి దగ్గరగా లాక్కున్నాడు కాంతారావు. మరుక్షణం లోనే ఆమె పెదవి నుండి రక్తం చిమ్మటం తో 'అమ్మో!' అంటూ అరిచింది కళ్యాణి
'హుష్ అరవకలా!' అంటూ తన పెదవులతో ఆమె నోటిని మూసి వేసేడు కాంతారావు.
ఐతే అరుపుకు పిల్లలు లేవనే లేచారు. పాప పక్కలోనే పడుకుని నిద్ర చెదిరి పోయి నందుకు బిగ్గరగా ఏడుస్తుంటే బాబిగాడు అమాంతం లేచి కూర్చుని తల్లిని బందిస్తున్న తండ్రి వంక కోపంగా చూసి "అమ్మని కొడ్తావెందుకు?' అన్నాడు.
'పడుకోవోయ్ వెధవా! మీ అమ్మను నేను కొడితే చాలా యిష్టం లే! పడుకో మాట్లాడక.' అంటూ వాణ్ణి పడుకో బెట్టి జోకోట్టేరు పిల్లలిద్దరినీ.
మరో ఐదు నిమిషాలు గడచిన తరువాత తన దగ్గరకు వచ్చిన భర్త మెడ చుట్టూ చేతులు వేసి 'కొంటె కాంతారావు' అంటూ నవ్వింది కళ్యాణి.
మర్నాడు ఉదయం ఏడు గంటలకే టూరిస్టు బస్సులో కూర్చుని మైసూరు నగరాన్నంతటినీ చూసేరు.
మొదట చాముండి కొండ దగ్గరకు తీసుకు పోయింది టూరిస్టు బస్సు.
చామున్దేశ్వారి దేవాలయానికి బస్సుదిగిన చోటు నుండి నాలుగు ఫర్లాంగుల దూరం ఉంది. కళ్యాణి కాంతారావు చెరో పిల్లను ఎత్తుకుని మాట్లాడుకుంటూ నడుస్తున్నారు. త్రోవలో ఒక చేతిలో దండాన్ని- మరొక చేత్తో సర్పాన్ని పట్టుకుని, బుంగ మీసాలతో , బాన బొజ్జతో , మిడి గుడ్లతో భయంకరంగా కనిపిస్తున్న మహిసాసురుని విగ్రహాన్ని చూస్తూనే కాంతారావు బాబిగాడి కా విగ్రహాన్ని చూపించి 'ఒరేయ్ . బాబిగా చూసేవా! వాడు మీ మామ' అన్నాడు, అన్నవాడు ఊరుకోక కళ్యాణి వంక కొంటెగా చూసి నవ్వేడు.
బాబిగాడు 'మామ, మామ!' అని చప్పట్లు చరుస్తుంటే అమాంతం వాడిని ఆపి కళ్యాణి 'ఔనురా బాబిగా వాడు మీ మామే! స్వయానా మీ మేనత్త మొగుడు' అంది మొగుడు వంక గర్వంగా చూస్తూ.
కాంతారావు కి తన ఓటమిని అంగీకరించక తప్పలేదు.
'శెభాష్! కళ్యాణీ! మొత్తానికి అన్నిటి లోనూ నీదే పై చెయ్యి అనిపించు కుంటున్నావు. ఏం చేస్తాం? ఆడవాళ్ళ రాజ్యం వచ్చేసింది' అన్నాడు.
'అలా దారిలోకి రండి' అంది కళ్యాణి .
చాముండేశ్వరి దేవాలయం లోకి వెళ్ళి , వచ్చేటప్పుడు కొబ్బరి బొండాల లో నీళ్ళు తాగి, దోసకాయ ముక్కలు కొరుక్కు తింటూ బయటకు వచ్చేరు అందరూ.
తరువాత సైంట్ ఫిలోమినా చర్చి కి తీసుకు వెళ్ళేడు గైడు. కళ్యాణి చర్చిని చూడటం అదే మొదటి సారి. ఎంతో ఎత్తుగా, నున్నగా, తళతళ మెరూస్తున్న గోడలతో ఉన్న ఆ చర్చిని చూస్తూనే సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయింది కళ్యాణి.
టిప్పు సుల్తాను కోట, అతని మృత కళేబరం కనపడిన చోటు, గోరీలు అన్నీ చూసుకుంటూ వెళ్ళి తరువాత శ్రీరంగ పట్టణం లోని రంగనాధ స్వామి దేవాలయాన్ని కూడా చూసేరు.
.jpg)
శేషతల్పశాయి అయిన శ్రీరంగ నాధుని విగ్రహం మనిషి కంటే పెద్ద సైజులో ఉండి నేత్రానంద కరంగా ఉంది.
మధ్యాహ్నం భోజనాలు ముగించిన తరువాత 'జు' చూసి, ఆ తరువాత టిప్పు సుల్తాను కు చెందిన వస్తువులు, ఫోటోలు ఉన్న 'జగన్మోహన్ మహల్' అనే భవనాన్ని చూసేరు. టిప్పు సుల్తాను పెండ్లి కి హైదరాబాద్ నవాబు పంపిన కానుకలు, చైనా జపాను దేశాల నుండి పంపబడిన కానుకలు, టిప్పు సుల్తాను పడుకున్న మంచం, అతను, అతని వంశీకులు వాడిన కత్తులు, తదితర ఆయుధాలు, బ్రిటీష్ వారితో టిప్పు సుల్తాను తన దర్భారు లో కూర్చుని సంప్రదింపులు జరుపుతున్నప్పుడు తీసిన ఫోటోలు మొదలైనవి చాలా ఉన్నాయ్.
ఆ భవనం లోనే ఒక గదిలో ప్రత్యేకించి హిందూ దేవతలకు రూపాలనిచ్చిన ప్రఖ్యాత చిత్రకారుడు రవివర్మ పెయింటింగ్స్ కూడా ఉన్నాయ్. 'రవివర్మ చిత్రాలు మొదటిసారిగా చూడగానే కళ్ళను ఆకర్షిస్తాయ్. కాని ఓ పది, పదిహేను చిత్రాలు చూసేక విసుగని పిస్తుంది. అతని చిత్రాలలో వైవిద్యం లేదు. కళ ఉన్నా సహజత్వం ఉండదు అతని చిత్రాలలో' అంది కళ్యాణి. ఆ భవనం లోని మరో విశేషం బియ్యపు గింజ లో చెక్కబడిన దేవుళ్ళ విగ్రహాలు , రాజ దర్భారు మొదలైన ప్రతిమలు. వాటిని అద్దంలో నుండి చూస్తె పెద్దగా కనిపిస్తాయ్. 'మన సాలార్ జంగ్ మ్యూజియం లో కూడా వడ్ల గింజలో చెక్కబడిన కళా ఖండాలున్నాయ్ తెలుసా?' అనడిగాడు కాంతారావు . 'నాకు చూసిన గుర్తు లేదే!' అంది కళ్యాణి.
'ఈ సారెప్పుడైనా చూద్దాం లే మ్యూజియం ని తీరిగ్గా' అన్నాడు.
'ఎప్పుడో కాదు. ఈ సెలవు ల్లోనే చూద్దాం. మ్యూజియాన్ని కొత్త బిల్డింగు లోకి మార్చిన తరువాత నేను చూడనే లేదు. అక్కడ ఎరెంజి మెంటు చాలా బాగుందిట.' అన్నది కళ్యాణి.
'చిత్తం!' వినయంగా అంగీకరించేడు కాంతారావు.
'అతి వినయం ధూర్త లక్షణం తెలుసా?' అంటూ అతని చెవి మేలి పెట్టింది కళ్యాణి
మైసూర్ లో చూడదగ్గ మరొక భవనం 'లలితా మహల్' కృష్ణరాజ వడయారు అనే రాజు చిన్న వయసు లోనే చనిపోయిన తన చెల్లెలు 'లలిత' స్మారక చిహ్నంగా కట్టించిన భవనం అట.
కొన్ని లక్షల ఖరీదు చేసే ఆ భవనం ఏ అలంకారాలు , విగ్రహాలు లేకుండా బోసిగా ఉంది. కనీసం ఎవరి స్మారక చిహ్నంగా ఆ మహాలు కట్టబడిందో ఆ వ్యక్తీ ఫోటో కాని, విగ్రహం కాని కూడా లేదు. కృష్ణ రాజ వడయారు చిత్రం మాత్రం భవనం లోకి ప్రవేశించ గానే కనిపిస్తుంది.
'పెద్ద పెద్ద రాజులు భార్య కోసం తల్లి కోసం స్మారక చిహ్నాలు కట్టించటం సాధారణంగా జరిగే విషయాలే. కాని చెల్లెలి కోసం స్మారక చిహ్నం కట్టించిన మొదటి రాజు యీయనే!' అన్నాడు గైడ్.
అది విని కళ్యాణి . 'ఐతే ఆ రాజుకు చెల్లెలి మీద గల ప్రేమ నిజంగానే చాలా గొప్పది . ఎందుకంటె 'బంగారు గాజులు' 'చోటి బహెన్' , 'నాచెల్లెలు' , 'చిట్టి చెల్లెలు, ' చెల్లెలు కోసం,' 'భాయీ బహెన్' మొదలైన సినిమా లేవీ చూడక మునుపే సిన్సియర్ గా చెల్లెలిని ప్రేమించి, అయన యీ స్మారక చిహ్నాన్ని కట్టించేడు ' అంది కళ్యాణి.
'మొత్తానికి ఏదో ఒకటి విమర్శించకుండా ఉండవు కదా నువ్వు.' అన్నాడు భార్యతో కాంతారావు.
చివరకు సాయంత్రం ఆరు గంటలకు బృందావన్ గార్డేన్సు దగ్గర బస్సు నాపి 'ఎనిమిదింటి వరకు మీ యిష్టం వచ్చినట్టు తిరిగి రండి'అన్నాడు గైడు.
'బృందావన్ అన్న పేరు వింటూనే యువతీయువకుల హృదయాలు పరవశం చెందుతాయ్. యౌవనం, ఆనందం, శృంగారం.... యీ మూడే మనిషి జీవితం లోని సత్యాలు అనిపించక మానదు ఆ బృందావన్ గార్డెన్స్ ను చూస్తుంటే.
చిరుగాలి కి రెపరెప లాడే సుకుమారమైన పూలు, నిగనిగలాడే పచ్చని ఆకులు యౌవనానికి ప్రతి రూపాల్లా ఉన్నాయ్. ఎత్తుగా, అందంగా, నిటారుగా ఎగజిమ్ముతున్న పౌంటేన్ల లోని నీటి తుంపరలు ప్రణయౌద్వేగంతో ఎగసి పడే ప్రేమికుల హృదయాలను జ్ఞప్తి కి తెస్తాయ్. ఆ నీటి తుంపరుల మీద ఏటవాలుగా వాలిన అస్తమయ భాస్కరుని కిరణాలు ఏడు భాగాలుగా చీలి ఇంద్ర ధనుస్సును సృష్టిస్తూ యువ ప్రేమికుల కళ్ళల్లోని కోర్కెలను మరింత ప్రజ్వరిల్ల జేస్తున్నాయ్. ఉద్వేగాన్ని వేగాన్ని సూచించే యీ వాతావరణం లోనే ఒక వైపున నిశ్చలంగా ఉన్న కావేరీ నది, ప్రియుడి మోహ పాశాల మధ్య పడి నలిగి, అలసిపోయి, వాలిపోయిన ముగ్ధలా మనోహరంగా ఉంది.
బుధ, శుక్రవారాలలో బృందావన్ గార్డెన్ కు 'స్పెషల్ ఇల్యూమినెషన్' ఉంది అదృష్టం కొద్దీ ఆరోజు బుధవారం అవటం టూరిస్టూలకందరికీ ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఎప్పుడు ఆరున్నర అవుతుందా, ఎప్పుడు లైట్లు వెలుగుతాయా అని ఆత్రంగా ఎదురు చూస్తూ నడచేరు వాళ్ళంతాను.
