ఆ రోజు- మీరు వాల్తేరు వెళ్ళిపోయిన రోజు జ్ఞాపకం ఉందా చిత్రంగా చివరి నిమిషంలో మేమూ, మీ శ్రీమతీ, శేఖర్ గారూ వొచ్చాం? మీ రారోజే వెడుతున్నామని చెప్పలేదు. కాని మీరు వెళ్ళగానే శశిగెస్ చేసి బయలుదేరించింది.
మీ ట్రెయిన్ వెళ్ళగానే మేమందరం స్టేషను కోలాహలంనించి బయటికి వొచ్చాము. టాక్సీలో పోతామన్నా. మీ శ్రీమతి బలవంతాన వాళ్ళ కారులో మీ ఇంటికి తీసికెళ్ళేరు.
ఆ రాత్రి అక్కడనించి పదకొండుగంటలు దాటేక వెళ్లేము.
శశి ఆమే ఆ రోజే కలుసుకోడం - కాని, నన్నూ, శేఖర్ నీ వొదిలేసి వాళ్ళు ఏదో మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ చాలా సన్నిహితులైపోయారు.
శశి అంటోంది- "అక్క, చెల్లెళ్ళలాగ ఉన్నాం అని రాయండి" అని.
ఆ తరవాత మేము నలుగురమూ తరుచుకలుసుకుంటూనే ఉన్నాము. శేఖర్ వారి నాన్న గారూ, ఆలీపూర్ ఫ్లాటు ఖాళీచేసి మీ ఫ్లాటులో కే వొచ్చేశారు.
మీరు ఒకసారివొస్తే చాలాబాగుంటుందని అంటోంది శశి. ఆమెనే రాయమన్నాను. కాని, నేను రాయాలిట.
బైదివే - శశి ఏంచేసిందో తెలుసా? దేశ క్షేమానికి విరుద్ధంగా ప్రవర్తించి, ఆ రా భాని అభివృద్ది చెయ్యబోయే నోటీసు ఇచ్చింది. ఈ పంక్తులు చదివి నేనూ ముద్దాయినేనని అంగీకరించకపోతే ఆలోచించుకోమని అంటోంది. నా శ్రేయస్సు కోసం అంగీకరించాను.
మీరు కనీసం ఉత్తరం రాయండి....మీకు ఏ సలహా ఇవ్వడం ఉచితమైనది కాదు మాకు! మీకే అవసరం ఉన్నా నిర్వర్తించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడం తప్ప.
మీ వొదినగారికి మా నమస్కారాలు.
భవదీయుడు
రామానంద్.
చాలాసార్లు చదివి సాయంత్రం వొదినకి ఉత్తరం ఇచ్చేడు.
"నేను శశిరేఖకి ఉత్తరం రాస్తాను అంది లలిత.
అతను వాదించలేదు - వసంతని గురించి ఆలోచిస్తున్నాడు - ఈ కొత్త పరిస్థితికి ఆమె బాగా అలవాటు పడిపోయింది...
హఠాత్తుగా అతనికి స్టెల్లా జ్ఞాపకం వొచ్చింది. విచిత్రమైన అసంతృప్తి ఆవరించింది.
33
మరో వారం రోజుల్లో కాలేజీ మూసేస్తారనగా ఒకనాడు రామ్మూర్తి గోపాలాన్ని తన గదిలోకి తీసికెళ్ళి. "మీతో అవసరంగా మాట్లాడాలి" అన్నాడు.
కొంచెం ఆశ్చర్యంగా చూసి కుర్చీలో కూర్చొని 'ఏమిటి?" అన్నాడు గోపాలం. ఆప్రియమైన విషయం ఏదో వినబోతున్న ప్రిమానిషన్ తో, డ్రాయర్ లోనించి ఉత్తరం ఒకటి తీసి ఇస్తూ "చదవండి" అన్నాడు.
అది రాసినదెవరో అతనికి తెలియదుకాని. ఉత్తరం పూర్తిగా చదివి అతనెవరో పెద్దవాడే బెజవాడలో ఏదో కాలేజీ విషయాలు రాస్తూ లెక్చరర్స్ కోసం ఉత్తరం రాసేడనీ తెలుసుకున్నాడు గోపాలం.
ఉత్తరం ఇచ్చి రామ్మూర్తి వైపు అనుమానంగా చూస్తూ "ఐతే ఏమిటి?" అన్నాడు గోపాలం.
నవ్వి "ఇంకా ముఫ్ఫై నిండలేదు మీకు- ఈ ఉద్యోగంలో పడి ఉంటారా?" అన్నాడు రామ్మూర్తి.
"నాకు బాగానే వుంది"
ఉండవొచ్చును......కాని మీక్వాలిఫికేషన్ తో. మీ నేర్పరితనంతో మీరిక్కడ పడివుండడం సరికాదు-మీరు బెజవాడ వెళ్ళిపోండి"
కొంచెంసేపు మాట్లాడలేదు గోపాలం, చాలా ఆలోచనలు దొంతరలలోవొచ్చి అతన్ని సరీగా ఆలోచించనియ్యలేదు.
"తొందరలేదు గోపాలం.....ఆలోచించండి. మీరు అక్కడ చాలాసుఖంగా ఉంటారు. మీకు టీచింగ్ సరదా కనక అక్కడ శాశ్వతంగా ఉండిపోవొచ్చును -"
"ఇక్కడా ఉండవొచ్చును - మీకు అభ్యంతరం లేకపోతే -"
"నాకు అభ్యతరం ఉంది. మిమ్మల్ని ఇక్కడ ఉంచే హక్కు లేదు నాకు. అదీకాక, నాకూ శాశ్వతం కాదిక్కడ"
"అంటే?"
"ఏదో ఒకరోజున ఈ గొడవలన్నీ వొదిలేసి నేనూ వెళ్ళిపోతాను."
"కావాలని అంటున్నారు"
"లేదు - నిజంగానే. అన్నయ్య గారితో మాట్లాడండి - ఈ వారంలో నాకు చెప్తే మిగిలిన ఏర్పాట్లు చేస్తాను"
ఆ సాయంత్రం చాలా సేపు లైబ్రరీలో కూర్చుని ఆలోచించాడు గోపాలం, ఇక్కడ తన కేముంది? - అనుక్షణమూ గాయపరిచే జ్ఞాన కాల సూదిమొనలు తప్ప? కలకత్తానించి నిష్క్రమణ చేసే సరికి ఇక్కడ తన ఇల్లు అని వొచ్చేడు. ఏమీ ఆలోచించకుండా, నిజానికి ఇదితప్ప తనకి ఇల్లు అంటూలేదు. కాని, ఇది అన్నయ్య ఇల్లు -వొదినది...
ఏదో ఒకరోజు ఇక్కడినించి తాను వెళ్ళక తప్పదు....ఎంతకాలం ఇలాగ? వెళ్ళిపోతే తన ఆలోచనలు కొత్త పరిసరాల్లో మళ్ళీ చిగురించవొచ్చును. నిర్విరామంగా తన హృదయంలో ఉండి పిక్కిరి వోన్న అఖాతంనించి తన జ్ఞాన కాబు బయటికి రావొచ్చును ..
కాని- ఈ వూరు తన జీవతంలో ఒక భాగం. ఇక్కడే తన జీవితం మారిపోయింది. తన జీవితంలో విలువ ఉన్న జ్ఞాపకాల నాటకానికి ముఖ్యరంగం ఇది. కొత్త వూళ్ళో, ఒంటరిగా, అందరికీ దూరంగా, ఏమిటి సుఖం?
కాని...
అతను ఇల్లు చేరేసరికి చాలా ఆలశ్యం ఐపోయింది.
లలిత అతన్ని చూసి, "ఏం అలాగఉన్నావు?" అంది, కొంచెం ఆందోళనతో.
"ఏమీలేదు"
"ఏమైనా - జరిగిందా?"
"లేదు వొదినా..... తరవాత చెప్తాను"
విచారంగా అతన్ని చూసి, "నేనూ తరవాత చెప్తాను. భోజనం చెయ్యి" అంది లలిత.
స్నానంచేసి భోజనం చేసేక బాబువొచ్చి అతని దగ్గిర కూర్చున్నాడు.
"ఏం? కథ చెప్పాలా?" అన్నాడు నవ్వుతూ గోపాలం.
"ఏం కథ చెప్తావు బాబయ్యా?"
"నీ ఇష్టం-"
"చెప్పు-"
కొంచెం ఆలోచించి, "అనగా అనగా ఒక రాజు అని ప్రారంభించేడు గోపాలం.
"ఏ దేశానికి!"
"కళింగ దేశానికి"
"అంటే?"
"అదే- ఒరిస్సా"
"చెప్పు"
"ఆ రాజుకి ఐదుగురు అమ్మాయిలు"
శ్రీనివాస్ నవ్వి, "రాజులందరికీ అమ్మాయిలే ఎందుకు ఉంటారు బాబయ్యా?" అన్నాడు
"కొందరికి అబ్బాయిలూ ఉంటారు!"
"ఆ కథ చెప్పు"
"ఒరేయ్! నువ్వు మరీ పెద్దవాడివై పోయావు-తొమ్మిదిన్నర అయినా నిద్రరాడం లేదు"
"లేదు బాబయ్యా- షికారు వెడదామా?"
"ఈ రాత్రివేళ ఎక్కడికి?"
"నీ ఇష్టం! బీచ్ కి వెడదామా?"
"వెళ్ళి పడుకో- రేపు ఆలస్యంగా వెడితే బయట నిలబెడతారు"
"రేపు సెలవు బాబయ్యా!"
"ఐతే వెళ్ళిపడుకో. సినిమాకి తీసికెడతాను"
"ఏ సినిమా?- శ్రీనివాస్ కి వెడదామా?"
"రైట్?"
వొట్టు వేయించుకుని వెళ్ళి పడుకున్నాడు శ్రీనివాస్- క్రమంగా వాడు తనకి స్నేహితుడై పోయాడు. అనుకున్నాడు గోపాలం.
లలిత పనులు ముగించుకుని వచ్చేసరికి గోపాలం ఏదో నవల చదువుతున్నాడు.
"బాబు పడుకున్నాడా?"
"ఆఁ - కనీసం అలాగ అన్నాడు"
"ఆయనా వొచ్చేవేళ ఐంది.... నువ్వేదో చెప్తానన్నావు?"
నెమ్మదిగా సాయంత్రం జరిగిన సంభాషణ చెప్పేడు!
"నువ్వేమన్నావ్?"
"ఆలోచిస్తానన్నాను"
"కొత్త వార్తలు తెలుసునా?"
"తెలీదు వొదినా"
మళ్ళీ అతన్ని భయం ఆక్రమించుకుంది. ఆమె విచిత్రమైన గొంతుక విని.
"శశిరేఖ ఉత్తరం రాసింది....."
ప్రశ్నిస్తోన్నట్టు చూశాడు - మాట్లాడే ధైర్యం లేదతనికి....తన గొంతుకలో వెయ్యితాళాలు.
"అక్కడ- చాలా జరిగేయట. ఫలితం ఏమి టంటే ఆ కంపెనీ పూర్తిగా దివాలాతీసి నట్టేట"
ఆశ్చర్యంగా ఉంది అతనికి. అతని ముఖములో రక్తంలేడు.
"ఐతే"
"ఆఁ మనవాళ్ళదీ చాలా నష్టమే, వసంత చెప్పినదాన్ని బట్టి అక్కడ ఏమీ మిగల లేదు.
చాలాసేపు ఇద్దరూ మాట్లాడలేదు.
వాళ్ళు ఇక్కడికి వొచ్చేస్తున్నారు ఇంకో నెల, రెండు నెలల్లో ఆయన ఇంక ఇక్కడే ఉండిపోతారుట. ప్రస్తుతం అక్కడ అన్నీ చక్కబెట్టుకుని కేంపు ఎత్తే ప్రయత్నంలో ఉన్నారుట."
చాలాసేపు ఎవరూ మాట్లాడలేదు. గోపాలం చాలా ఆశ్చర్యపడ్డాడు ముందర! క్రమంగా ఆశ్చర్యం అతనికే అర్ధంకాని ఏదో విచారానికి తావిచ్చింది.
స్లిప్పర్లు తొడుక్కుని త్వరగా బయటికి వెళ్ళి గంటపోయాక వొచ్చారు గోపాలం. అతను వొచ్చేసరికి అన్నా, వొదినా తన కోసం ఎదురు చూస్తున్నారు.
"ఎక్కడికి వెళ్ళేవు?" అంది లలిత, చెమట పట్టిన అతన్ని ఆందోళనగా చూస్తూ.
"రామ్మూర్తి దగ్గరకి-సమాధానం ఇచ్చేం దుకు"
లలిత ఆశ్చర్యపడలేదు.
"ఎంతదూరం వెళ్ళినా ఉండిపోయే సమస్య కాదు నీది-పద భోజనానికి లే" అంది లోపలికి వెడుతూ.
రామం ఏదో అనబోయి ఊరుకున్నాడు.
"నీది" అని లలిత అన్నప్పుడు గోపాలానికి ఒక్కసారి బాధకలిగింది? కాని సరిపెట్టుకు న్నాడు. లలిత ప్రయత్నించి తప్ప అబద్ధం ఆడదని అతనికి తెలుసును.
* * *
34
జూన్ లో గోపాలం బెజవాడ వెళ్ళిపోయాడు.
అక్కడ దొరికిన స్నేహితుల సహాయంతో వారంలోగానే బాగా సెటిల్ ఐపోయాడు. ఇల్లు సులువుగా దొరకడం: అతనికి మళ్ళీ అట్టే సమస్యలు లేనిజీవితం ప్రారంభించిన సంతృప్తి తోబాటు. తన ముఖ్యసమస్య పదేపదే బాధించడం ప్రారంభం ఐంది.
లలితకి తన పని ఏమీనచ్చలేదు: వసంతం మాటఏమిటి? అంటుంది.
"అక్కడికి రమ్మను" అన్నాడు తాను.
"వొస్తుంది - కానీ. చెప్పవలసింది నువ్వు' అంది లలిత.
"ఆమెకి ఉత్తరం రాయడంవొచ్చును."
"నీకూ వొచ్చును....నీకురానిది జ్ఞానం."
గోపాలానికి చాలకోపం వొచ్చింది.
"ఆమెని బ్రతిమాలడం నాకు ఇష్టంలేదు వొదినా. నీకంత ప్రేమగా ఉంటే తప్పకుండా బ్రతిమాలు - కాని. ఫలితం ఉంటుందని అనుకోను. ఈ జీవితానికి ఇంక ఎవరిదారి వారిదే!"
"జన్మాంతం బ్రహ్మచారిగా ఉంటావా?"
"ఉంటాను. ఆ నరకంకన్న ఈ బాధ చాలా నయం"
చాలా బాధపడింది లలిత - కాని, కర్తవ్యం ఆమెకీ తెలీదని తెలుసును గోపాలానికి.
"మళ్ళీ ఎప్పుడు వొస్తావు?"
సెలవుల్లో, ఈలోగా ఏరోజు నువ్వు రమ్మన్నా వొస్తాను.... నేను పారిపోవడం లేదు వొదినా! కాని నువ్వుకోరేది జరగడానికి ఎలాగా వీలుపడ దని గ్రహించి వెళ్ళిపోతున్నాను..."
వొద్దంటున్నా అన్నయ్యా. వొదినా స్టేషనుకి వొచ్చి దిగబెట్టారు. ఐదారు సీసాల్లో ఆవకాయలూ, ఊరగాయాలూ బలవంతంగా తన పెట్టెలో పెట్టింది వొదిన.
అన్నయ్య ఏమీ అనలేదు, తరుచు ఉత్తరాలు రాయమని చెప్పడం తప్ప, శ్రీనివాస్ బడికి వెడుతూ గుడ్ బై చెప్పేశాడు- వాడిలో ఏమీ బాధ కనిపించకపోవడం గోపాలానికి ఏదోలాగ అనిపించింది- కాని, జీవితంలోకి పెరుగుతోన్న వాడు తనకోసం ఎక్కువ బెంగపడడం అసహజం అని గమనించి సరిపెట్టుకున్నాడు గోపాలం.
అతను బాధపడ్డది లలిత కోసం....ఆమె రెండు లోకాల మధ్య పోరాడుతూ, తనకోసం బాధపడుతోంది. తన నిజాన్ని ఆమె అర్ధం చేసుకుంది. కాని, ఆ నిజాన్ని ఆమె అంగీకరించలేదు: వసంతని ఆమె అర్ధం చేసుకుంది : కాని ఆమెని నిందించలేదు. దూరం ఐపోయిన ఈ సమాంతర రేఖల్ని కలిపేశక్తిలేదు లలితలో- ఆ దౌర్భల్యానికే ఆమె పరితాపం.
ఆమెకితానెంతో ఋణపడిఉన్నాడు : తన పరిస్థితులన్నిటిలోనూ ఆమె సహోదరికన్న ప్రేమగా తనకి సహాయం చేసింది. తన బాధలో ఉపశమనం ఇచ్చింది : తన ఆనందంలో ఆమె పాల్గొంది; తన తప్పులో ఆమె క్షమాగుణం చూసింది: తన పొరపాట్లని ఆమె సున్నితంగా చూసింది.
ఈనాడు తన సమస్యని ఆమె పూరించలేక పోయింది. అదే భరించలేని ఓటమి ఐపోయింది వొదినకి.
అక్కణ్ణించి బయటికి రావడం మరో జీవితంలో కొత్త అధ్యాయం లాగఉంది గోపాలానికి. తనవాళ్ళనించి అతను దూరంగా వొచ్చేడు - కాని, తనకి తాను చాలాదగ్గర ఐపోతున్నాడు. అనుక్షణం తన వెలితి అతని మనస్సుని కలవరపరుస్తోంది! దినదినం ఈ ఒంటరితనం అతనికి భయంకరమైన గడియల్ని ప్రసాదిస్తోంది; నిరామయంగా అతని జ్ఞాపకాల వసంత అతన్ని బాధపెడుతోంది; వెనువెంటనే మరిచిపోలేని ఆ తరువాత వసంత అతనిలో కోపాన్ని రెచ్చగొట్టి అతన్ని అభిమానంతో మరోవేపు తిప్పుతోంది.
వెయ్యి భావాలమధ్య లక్ష బాధలతో అతను కాలం గడపసాగాడు! ఆ బాధలన్నిటికన్నా అతన్ని నిశితంగా. క్రూరంగా బాధపెట్టేది అతను మరిచిపోలేని ప్రశ్న: ఈ కథకి అంతం ఏమిటి? అనేప్రశ్న.
వసంత విడాకులిస్తుందా?
చట్టం అతనికి తెలుసును. ఇంకోనాలుగేళ్ళు పోతే తప్ప ఆమె చెయ్యగలిగిందేదీ లేదు; అప్పటి దాకా తాను చెయ్యగలిగిందేదీ కూడాలేదు. అనిశ్చితంగా, అశాంతిగా ఈ వారాలూ, మాసాలూ సంవత్సరాలు గడిచిపోవాలి....తాను గడపగలగాలి.
ఆనాడు బలంగా పెనవేసుకున్న హృదయాలు ఈనాడు - ఇంకోకొన్ని మాసాలతరవాత - శాశ్వతంగా వేరవుతాయా! పెళ్ళినాటి వాగ్దానాల మాటలు చట్టంరావే తీర్పు మాటల్లో నశించి పోవాలా?
