Previous Page Next Page 
ఏటి ఒడ్డున నీటిపూలు పేజి 33


    శంకరం, చారుమతి కాకినాడ తిరుగు ప్రయాణానికి రైల్లో ఎక్కి కూర్చున్నారు. ఆ రైలు ఇంకా అరగంటకి కాని సామర్ల కోట నించి బయలుదేరదు. ప్రయాణీకులు ఒకొక్కరుగా వచ్చి ఎక్కుతున్నారు. కంపార్టుమెంటు చాలామట్టుకు ఖాళీగానే ఉంది.
    చారుమతి ఆలోచనలు మారుస్తూ శంకరం అన్నాడు: "ఆ రోజు వంతెనదగ్గిరకి తీసుకువెళ్ళి మీ పద్మ కథంతా నాకు ఎందుకు చెప్పావో ఇప్పుడు తెలిసింది."
    "ఎందుకు?"
    "నేను పద్మని పెళ్ళిచేసుకోవాలని నీ ఊహ." చారుమతి శంకరాన్ని చూస్తూ మౌనంగా ఊరుకుంది.
    "అవునా?" సందేహంగా అడిగాడు శంకరం.
    అప్పటికికూడా చారుమతి తన ఉద్దేశం చెప్పలేదు.
    "ఏం నువ్వు పద్మని చేసుకోవాలనుకుంటున్నావా?" అంది.
    "చేసుకోవాలనుకోవడం తప్పా?" శంకరం ఎదురు ప్రశ్న వేశాడు.
    శంకరం మనస్సు తెలిసినందుకు సంతోషించింది చారుమతి.
    "టప్పు లేదు, ఎంతో ఒప్పు!" నవ్వుతూ అంది.
    చెల్లెలి నవ్వు చూసి తనూ నవ్వాడు శంకరం.
    "ఆనాడు పద్మదే తప్పంతా అన్నట్టు మాట్లాడావు." చారుమతి అడిగింది.
    "ఆ రోజు మొదటిసారి వినడం. ఎక్కువ ఆలోచించ లేదు. పద్మ తొందరపడిందేమో ననుకున్నాను."
    "మరి, ఇప్పుడు పద్మ తప్పేం లేదని ఎలా తెలిసింది?"
    "పద్మని చూశాక నా అభిప్రాయాలు మారిపోయాయి."
    "పద్మని చూశాకా? లేక పద్మ అందం చూశాకా?" చారుమతి కొంచెం హేళనగా అంది.'
    "చారూ, నువ్వు అలా మాట్లాడితే నేను ఏం చెప్పలేను. ఆడదాని అందానికి ప్రాముఖ్యం లేదనను. కాని అది ఒక్కటే మగవాన్ని మారుస్తుంది. ఆకర్షిస్తుంది అంటే పొరబాటే అందం వెనక ఉండే మనస్సు, మనిషి ప్రవర్తన ఎంతో ముఖ్యమయినవి. పద్మ స్థితి చూసిన న మనసులో ఇప్పుడు ఎంతో బాధగా ఉంది. పాతికేళ్ళు అయినా నిండని ఆమె జీవితం అంతా అడివి కాచిన వెన్నెలలా అయిపోయిందంటే జాలి వేస్తూంది. నిజంగా ఆమె భర్త దురదృష్ట వంతుడు. రంభలాంటి భార్యని పెట్టుకుని అలా ఎలా ఉన్నాడో? అనుభవించడానికి కూడా అర్హత కావాలి
    "ఆ అర్హత నీకు ఉందంటావా?"
    "నువ్వు అలా వ్యంగ్యంగా మాట్లాడితే నేను నీతో మాట్లాడను, చారూ! నేను తీవ్రంగా అడుగుతున్నాను. పద్మని నేను తిరిగి పెళ్ళి చేసుకుంటానంటే పద్మ ఒప్పుకుంటుందా? ఆమె తల్లిదండ్రులు అంగీకరిస్తారా?"
    "పద్మ, వాళ్ళ నాన్నగారు, అమ్మగారు ఇష్టపడతారో లేదో నా కెలా తెలుస్తుంది?"            "మరి ఎవరికి తెలుస్తుంది?" చెల్లెలు తనతో ఆటలాడుకుంటూందని తెలుసుకున్నశంకరానికి కోపం వచ్చింది.
    "ఏమో?" చారుమతిలో ఇంకా చిలిపితనం పోలేదు. శంకరం కోపంగా ఉండటం చూసి ఫక్కుమని నవ్వింది.    "చారూ! నువ్వు చాలా మారిపోయావు. ఎదటి మనిషిని అర్ధం చేసుకోవేం? నువ్వు వంతెనదగ్గిర పద్మని గురించి చెప్పిన దగ్గిరనించి రోజూ నేను ఆమెను గురిచే ఆలోచిస్తున్నాను. పద్మని భగవతి పెళ్ళిలో చూసిన దగ్గిరనించి 'పెళ్ళి చేసుకోవడం ఎలాగా? సాధ్యమౌతుందా?' అని ఒకటే మధనపడుతున్నాను. నాకు నువ్వే సహాయం చేస్తావని, ఆమె నీ స్నేహితురాలు కనక నువ్వు నా అభిప్రాయం విని సంతోషిస్తావని అనుకున్నాను, ఇప్పుడు నువ్వేమో ఇలా మాట్లాడుతున్నావు!"    
    చారుమతి నవ్వడం మానేసి, గంభీరంగా మారిపోయింది.
    "నువ్వు పద్మని పెళ్ళి చేసుకోవడం నాకు చాలా సంతోషం. అంతకంటే నాకు ఏం కావాలి? నీ హృదయపూర్వకంగా నువ్వే పద్మని పెళ్ళి చేసుకోడానికి నిశ్చయించుకోడం ఇంకా సంతోషం. ఆ మాట నీ నోటి ద్వారానే చెప్పించాలని అలా వ్యంగ్యంగా మాట్లాడాను. మరోలా భావించకు, శంకరం! నువ్వు పద్మని చేసుకుంటే బాగుంటుందని నేను, శ్రీదేవి చాలారోజులకిందటే అనుకున్నాం. అందుకే నీతో పద్మ కథ చెప్పాను."        
    చారుమతి ఆప్యాయంగా శంకరం చేతిలో తన చెయ్యి వేసింది.    
    "పద్మని, వాళ్ళ తల్లిదండ్రులని ఒప్పించడం బాధ్యతంతా నీమీదే పెడుతున్నాను చారూ! అది నువ్వు ఒకర్తినే నిర్వహించగలవు" అన్నాడు శంకరం.
    "మీ ఇద్దరి పెళ్ళి అంత సుళువుగా తేలిపోయేది కాదు. ముందర మాధవరావుకి విడాకులు ఇప్పించాలి. తరవాత పద్మని, తల్లిదంద్రుల్ని ఒప్పించాలి. తలుచుకుంటేనే చాలా కష్టం అనిపిస్తూంది. అన్నిటికంటే ముఖ్యం, పద్మ రెండవ పెళ్ళికి ఒప్పుకుంటుందా అని! అదే భయం."    
    "నాకూ అదే భయం, చారూ! ఆ రోజు 'భార్యాభర్తలు' సినిమాకి వచ్చినప్పుడు చూశానుగా,  పద్మ ఎంత ముభావంగా ఉందో! ఒక్కమాట మాట్లాడలేదు. నమస్కారం చేస్తే తిరిగి నమస్కరించి ఊరుకుంది. నన్ను అసలు కళ్ళు ఎత్తి చూడనుకూడా చూడలేదు."        
    స్టేషన్ లో గంట మోగి, రైలు కదలడంతో సంభాషణ ఆగిపోయింది. రైలు శబ్దంలో మాటలు వినిపించాలంటే గొంతు పెద్దదిచేసి మాట్లాడుకోవాలి. పక్కన కూర్చున్న ప్రయాణీకులకు వినిపిస్తాయి మాటలు.
    కాకినాడ టౌను స్టేషన్ లో దిగి, ఇంటికి రిక్షా మాట్లాడుకున్నారు.
    "ఇంటికి వెళితే ఇంక ఈ పెళ్ళి విషయం మాట్లాడుకోలేము. రేపు నేను ఊరు విడిచి వెళ్ళిపోతున్నాను. ఇప్పుడే మాట్లాడుకోవాలి" అన్నాడు శంకరం. రిక్షా ఎక్కి కూర్చోగానే.        
    "పద్మ విషయమే నేనూ ఆలోచిస్తున్నాను, శంకరం. ఒకసారి చేసుకున్న వివాహం విఫలమైతే, అది హృదయానికి మాయని గాయంగా మారిపోతుంది. తను ఆ దెబ్బ నుంచి కోలుకుని నిన్ను తిరిగి వివాహం చేసుకోడానికి ఇష్టపడుతుందా అన్నది సంశయమే. వైవాహికజీవితంలో ఒకసారి మోసపోయిన స్త్రీ అది తొందరగా మరిచి    పోలేదు.
    పోతే, పద్మ తల్లిదండ్రుల విషయమూ మనం చూసుకోవాలి. ఒకసారి నలుగురి పెద్దల ముందు, బంధువుల ఎదట కూతురికి వైభవంగా పెళ్ళిచేసి, ఇప్పుడు ఆ కూతురిచేత విడాకులు ఇప్పించగలరా? తిరిగి అదె పెద్దల ముందు రెండవ వివాహం చెయ్యడానికి ధైర్యం ఉంటుందంటావా?" అంది చారుమతి.
    "తిరిగి కూతురి వివాహం చెయ్యగలగడం, ధైర్యంగా ఉండటం తల్లిదండ్రుల సంస్కారం మీద, ఆత్మవిశ్వాసం మీద ఆధారపడి ఉంటాయి. కూతురితో కాపరం చెయ్యడానికి ఇష్టపడని అల్లుడికి విడాకులు ఇప్పించడంలో ఏ తప్పు లేదు. రెండోది, కూతురి ముఖంకోసమే వారు రెండవ వివాహం చేస్తున్నారు. పద్మ, తల్లీ, తండ్రీ కొంచెం దీర్ఘంగా ఆలోచిస్తే విడాకులకి, రెండవ వివాహానికి తప్పక అంగీకరిస్తారనిపిస్తూంది" అన్నాడు శంకరం.
    చారుమతి శంకరం మాటలు వింటూ మౌనంగా ఊరుకుంది. తిరిగి శంకరమే అన్నాడు: "పెళ్ళి చేసుకున్నాక, పద్మని ఈ ఊళ్ళో ఉంచబోను నేను. నా ఉద్యోగం ఎలాగా ఉత్తర దేశంలోనే స్థిరమౌతుంది. ఈ పరిసరాలకి దూరంగా ఉన్న పద్మ పాత జీవితం మరిచిపోవచ్చును తొందరగా."    
    "నిజమే! కాలము, పరిసరాలు మనిషి జీవితాన్ని మారుస్తాయి. పద్మ దూరంగా వెళ్ళిపోతే, మంచి భర్త లభిస్తే తప్పక సంతోషంగా ఉంటుంది" అంది చారుమతి.                "రేపు నేను మధ్యప్రదేశ్ వెళ్ళిపోతున్నావా? ఇంక బాధ్యత అంతా నీదే. ఇటు అమ్మని, అటు పద్మా వాళ్ళని ఒప్పించాలి. నాకు అన్నీ వివరంగా ఉత్తరాలు రాయి. అవసరమైతే నేను పద్మకి, వాళ్ళ నాన్నగారికి ఉత్తరాలు రాస్తాను" అన్నాడు శంకరం.
    'ఏమిటీ బాధ్యతలు! ఒకటి తప్పింది అనుకుంటే వేరొకటి! భగవతి పెళ్ళిభారం తీరిందంటే, శంకరం పెళ్ళి మీద పడింది.
    ఎవరి ఆలోచనలు, ఎవరి సుఖాలు వాళ్ళవి. పాతికేళ్ళేనా నిండని పద్మ జీవితం అడివి కాచిన వెన్నెల అయిపోతూందిట! ఇటు నా జీవితం చీకటిలా అయిపోవడంలేదా? చెల్లెలు జ్ఞాపకం రాదా? చెల్లెలికి మాత్రం పెళ్ళి, సుఖాలు అక్కరలేదా?' తనలో తనే నిట్టూర్చింది చారుమతి.    
    పైకిమాత్రం, "అలాగే, శంకరం. నా సాధ్యమైనంతవరకు ప్రయత్నిస్తాను" అంది.
    రిక్షా ఇంటిదగ్గిర ఆగింది.
    మరునాడు శంకరం తన భారం చెల్లెలిమీద వదిలేసి మధ్యప్రదేశ్ వెళ్ళిపోయాడు.

                                                               30

    పెరటిదారిగుండా చుట్టు తిరిగి లోపలి ఇంట్లోకి వచ్చాడు గోపాల్. వరండాలో జాకెట్టు కుట్టుకుంటూ కూర్చుంది చారుమతి.
    "వదినా, ఇవిగో పూలు" అంటూ జేబులోంచి బొగడ పువ్వులు తీసి చారుమతి దోసిలి నిండా పోశాడు గోపాల్.
    "రోజూ కష్టపడి ఎందుకు తెస్తావు, బాబూ!" అంది చారుమతి, పువ్వులు ఆప్యాయంగా అందుకుని, వాసన చూస్తూ.
    "నీ కిష్టమైన పువ్వులు ఇవ్వడంలో నా కెంతో సంతోషం ఉంది" అన్నాడు గోపాల్, చెమట పట్టిన ముఖాన్ని రుమాలుతో తుడుచుకుంటూ.
    అతనికి తనమీద ఉండే అభిమానానికి ఆర్ద్ర మయింది చారుమతి హృదయం. 'గోపాల్ వంటి మంచి స్నేహితుడు, సహృదయుడు లభించకపోతే తన జీవితం ఎంత నిస్సారంగా ఉండేదో!' అనుకుంది చారుమతి.
    "విజయనగరంనించి ఎప్పుడు వచ్చావు?" చారుమతి అడిగింది.    
    "నిన్న రాత్రి" అన్నాడు గోపాల్. తిరిగి అతనే, "భగవతికి కవలపిల్లలు పుట్టారని విన్నాను, ఎక్కడా?" అన్నాడు.
    "రా రా, చూద్దువుగాని. గదిలో ఉన్నారు" అంది చారుమతి లేస్తూ.    
    సాయంత్రం ఆరుగంట లవుతూంది. భగవతి పురిటిగదిలో వెలుతురు ఎక్కువగా లేదు. మంచం మీద భగవతికి రెండువైపులా ఇద్దరు ఆడపిల్లలు - పదిహేను రోజుల పసివాళ్ళు -పడుకుని ఉన్నారు.
    'భగవతీ, బాగున్నావా?" పలకరించాడు గోపాల్.
    "రా, బావా" అంటూ లేచి కూర్చుంది భగవతి.
    గోపాల్ స్టూలు తెచ్చుకుని భగవతి మంచానికి కొంచెం దూరంలో వేసుకుని కూర్చున్నాడు. పెళ్ళి అయిన నాలుగేళ్ళలో రెండు సార్లు పురిటికి వచ్చి, ముగ్గురు పిల్లల తల్లి అయింది భగవతి. పెళ్ళికి ముందు ఉండే చిన్నతనం, ఉద్రేకం పోయి పెద్దరికం వచ్చింది. తమలపాకులతో ఎర్రబడిన పెదవులతో నడుంకట్టుతో పురిటాలు ఎంతో అందంగా ఉంది.
    "అభినందనలు" అన్నాడు గోపాల్.
    "ఎందుకు?" అంది భగవతి.
    "ఎందుకేమిటి? ఒక్కసారే ఇద్దరిని కన్నందుకు" అన్నాడు గోపాల్ నవ్వుతూ.
    "నాకేం సంతోషంగా లేదు, బావా! నాకు కూతుళ్ళు వద్దనుకున్నాను. ఏకంగా భగవంతుడు ఇద్దరిని ప్రసాదించాడు" అంది భగవతి విచారంగా.
    "ఒక కొడుకు ఉన్నాడుగా నిన్ను ఉద్ధరించడానికి? అయినా విచారం ఎందుకు? ఈ కాలంలో కొడుకులు, కూతుళ్ళు ఒకటే" అన్నాడు గోపాల్.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS