చారుమతి, శంకరం వంతెన దాటి ఏటికి అవతల వైపున కొంతదూరం నడిచి, మంచి చోటు చూచుకుని కూర్చున్నారు.
చారుమతి విషయాన్ని ఎలా మొదలుపెట్టాలా అని ఆలోచిస్తూ, తల వంచుకుని, చేతితో గడ్డి తుంపుతూ కూర్చుంది.
"నాతో ఏకాంతంగా మాట్లాడవలసినంత పెద్ద విషయం ఏమిటే?" అన్నాడు శంకరం, తనే ప్రసంగాన్ని కదుపుతూ.
"మా పద్మ తెలుసుకదూ?"
"ఎందుకు తెలియదు? మా కాలేజీ బ్యూటీ కదా, అంత తొందరగా ఎలా మరిచిపోతాను?" శంకరం ఆశ్చర్యంగా అడిగాడు.
"పద్మకి పెళ్ళి అయింది..." చారుమతి ఇంకా పూర్తి చెయ్యకుండానే శంకరం అందుకున్నాడు: "ఎప్పుడో నాలుగైదు ఏళ్లకిందటే అయింది కదూ?"
"అవును కాని పద్మ కాపరం వదిలేసి కాకినాడ వచ్చేసింది. ఏడాది అయింది."
"ఎందుకు వచ్చేసింది?"
"దానివెనక చాలా కథ ఉంది. పద్మ కాపరం ఒక హృదయవిదారకమైన కథ."
"మీ పద్మ కథ నా కెందుకు?" అన్నాడు శంకరం.
"నువ్వు ముందు విను, తరవాత ఎందుకో చెబుతాను" అంటూ చారుమతి పద్మ కాపరము, అత్తగారిప్రవర్తన, భర్త మూర్ఖత్వము - అన్నీ చెప్పింది.
"అంటే, మీ పద్మ తప్పేం లేదంటావు?" అన్నీ విని అడిగాడు శంకరం.
శంకరం ప్రశ్న విని ఆశ్చర్యపోయింది చారుమతి.
"అంటే, నీ ఉద్దేశ్యం?"
"పరిస్థితుల్ని అర్ధం చేసుకుని, సర్దుకుపోవడానికి ప్రయత్నించాలి. భర్త అనువుగా లేకపోతే, కొన్నాళ్ళు ఓపికగా ఉండి భర్తని మార్చుకోవాలి. అంతేకాని పుట్టిల్లు ఉంది కదా అని పరిగెత్తుకు వచ్చేస్తారా?"
"నాలుగేళ్ళు నోరు మూసుకుని అన్నీ సహించడం ఓపిక కాదా? 'నువ్వు నాతో మాట్లాడవద్దు, నువ్వు మాకు అనవసరం' అంటూ అసహ్యించుకునే మనుష్యులతో రెండేళ్ళు గడపటం ఓర్మి కాదా? ఆడదానికి మాత్రం అభిమానం ఉండదా?" చారుమతి ఆవేశంగా మాట్లాడింది.
"నువ్వు అలా ఉద్రేకపడిపోకు. మీ పద్మకి కూడా నీలాగే ఉద్రేకమేమో! భర్త తనతో మాట్లాడడం లేదనే అభిమానంతో తొందరపడి మొగుణ్ణి వదిలేసి ఉంటుంది."
"శంకరం! నువ్వు ఏదో సహృదయతతో పద్మ పరిస్థితి అర్ధం చేసుకుంటావనుకున్నాను. కాని లోకం అందరితోపాటు ఆడదానిదే లోపం అంటూ పద్మ భర్తని వెనకవేసుకు వస్తావనుకోలేదు. ఎంత ఆలోచించినా లోకుల ప్రవర్తన అర్ధం కాదు నాకు. ఒక భార్య, భర్త విడిపోతే, మగవాళ్ళు భర్తవైపే ఉంటారు. స్త్రీలూ భర్తనే చూసి జాలిపడతారు. ఆడ, మగ అందరు దుయ్యబట్టేది, తప్పుపట్టేది స్త్రీనే.
'మొగుణ్ణి వదిలేసి వచ్చింది' అని అందరు అనుకుంటూంటే, బయటికి రాలేక, ఇంట్లో పాత కథలు, బాధలు తలుచుకుంటూ కూర్చోలేక అవస్థపడే పద్మ ఏం సుఖపడిపోవాలని కాపరం వదిలేసి వచ్చిందంటావు? ఈ అవమానాలన్నిటికీ కూడా సహించడానికి సిద్ధపడిందీ అంటే, అత్తగారింట్లో ఇంక ఎన్ని బాధలు పడి ఉండాలి అంటావు? భర్త ప్రవర్తన ఎంత వ్యథ కలిగించి ఉండాలి? ఆడది తగిన కారణం ఉంటేనే కాని భర్త గృహాన్ని వదిలి ఎప్పుడూ రాదు" అంది చారుమతి. శంకరం పద్మని అర్ధం చేసుకోలేకపోతున్నాడని దుఃఖ పడింది. పద్మ మీది జాలితో హృదయం ద్రవించింది.
శంకరం చాలాసేపటి వరకు ఏమీ మాట్లాడలేదు. చివరికి, "నువ్వు చెప్పింది నిజమే అనవచ్చును, చారూ! ఆడది ఆడదాన్ని అర్ధం చేసుకున్నట్టు మగవాడు స్త్రీని ఎప్పటికీ అర్ధం చేసుకోలేడు" అన్నాడు.
"అవును. ఇది మగవాళ్ళ ప్రపంచం. వాళ్ళు ఏం చేసినా చెల్లుతుంది. ఏది చేసినా ఒప్పే. ఆడదాన్ని అర్ధం చేసుకోడానికి ఏ మగవాడూ ప్రయత్నించడు" అంది చారుమతి దూరంగా ఎక్కడో చూస్తూ.
"ఇంతకీ ఈ కథ ఇప్పుడు ఎందుకు చెప్పినట్టు?" అన్నాడు శంకరం.
"ఏమీ లేదు" అంటూ లేచింది చారుమతి. పద్మని పెళ్ళిచేసుకోమని శంకరాన్ని అడగాలనిపించలేదు. అడిగినా ఒప్పుకుంటాడనే నమ్మకం లేదు.
"ఏమిటో నువ్వు! ఏదో మాట్లాడాలి అంటూ నన్ను తీసుకువచ్చావు. ఇప్పుడు ఏమీలేదు అంటావు" అంటూ విసుక్కుంటూ చారుమతిని అనుసరించాడు శంకరం.
ఇద్దరూ మౌనంగా వంతెన మీదికి వచ్చారు. తట్టలలో అప్పుడే విచ్చుకున్న మల్లెదండలు అమ్ముతున్నారు చాలా మంది కుర్రవాళ్ళు.
"మల్లెపూలు కొంటావా?" అన్నాడు శంకరం.
"ఇప్పుడేం వద్దు" అంది చారుమతి.
చారుమతి మనస్సెందుకో బాగా లేదనుకున్నాడు శంకరం.
'శంకరాన్ని అడుగుతా'నని మాట ఇచ్చింది శ్రీదేవికి. శంకరానికి పద్మ అంటే ఇష్టమనీ, తప్పక పెళ్ళిచేసు కుంటాడనీ నమ్మింది ఇన్నాళ్ళూ. కాని శంకరం ఈ రోజు పద్మదే తప్పని మాట్లాడుతూంటే సహించలేక పోయింది చారుమతి. 'ఏం మగవాళ్ళు!' అనుకుంది. మగవాళ్ళమీద విముఖత్వంతో.
29

పెళ్ళికి ఒకరోజు ముందు, ఇరవై తొమ్మిదో తారీఖు సాయంత్రం దిగారు మగపెళ్ళి వారు. తమ ఇల్లు చిన్నదౌతుందని బంగారువారి సత్రంలో పెళ్ళిఏర్పాట్లు చేశాడు శంకరం. సత్రంలోనే ఒకపక్క మగపెళ్ళివారికని కొన్ని గదులు కేటాయించారు.
పెళ్ళి ఇంకా రెండు రోజులు ఉందనగానే ఆడపెళ్ళి వారు సత్రంలోకి మారిపోయారు. ఇంటినించి సత్రానికి ప్రతి వస్తువు తరలించుకువెళ్ళడం కష్టమే అనిపించింది.
పెళ్ళికొడుకు కృష్ణమూర్తికి ఒక అన్న, ఇద్దరు అక్కలు ఉన్నారు. అన్నకి అక్కలకి పెళ్ళిళ్ళు అయిపోయాయి. తండ్రి లేరు, పది సంవత్సరాల క్రిందటే స్వర్గస్థులయ్యారుట.
మగపెళ్ళివారంతా ఆడపెళ్ళివారికి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారు. ఆడపెళ్ళివారింట్లో అంతా తెల్లటి రంగు. మగపెళ్ళివారింట్లో అంతా నల్లటి నలుపు. వారంతా భగవతిని చూసి చాలా మురిసి పోయారు. తెల్లటి కోడలు వస్తూందని పెళ్ళికొడుకు తల్లి చాలా ఆనందించింది.
పెళ్ళికి పదిరోజుల ముందు విశాఖనించి రేవతి, భర్త, పిల్లలు వచ్చారు. రేవతి, భానుమతి పెళ్ళి పనులలో, భగవతిని అలంకరించడంలో చాలా శ్రద్ధ చూపారు. మాలతి ఇంటికి వచ్చిన అతిథులకు మర్యాదలు చేసింది. శాంతమ్మ, శారదమ్మ వంటలు, వడ్డనలు చూసుకున్నారు. మగవాళ్ళంతా పై పనులు, వస్తువులు అందించడం చూసుకున్నారు. చారుమతే దూరంగా ఉండిపోయింది.
చారుమతికి ఏమిటో ఈ లోకంలో తానే ఒంటరిగా మిగిలిపోయినట్టు అనిపించింది. అందరికి అందరు ఉన్నారు. మాలతికి కూడా గోపాల్ ఉన్నాడు. తనే ఎవరికీ చెందదు. పైగా, వచ్చిన ప్రతివాళ్ళు శాంతమ్మను అడగడమే, "పై పిల్లలిద్దరికీ పెళ్ళి చెయ్యకుండా చిన్నపిల్లకి చేస్తున్నారేం?" అని. శాంతమ్మ నసిగేది, బాధపడేది. "మాలతిని మా ఆడబడుచు కొడుక్కి స్థిరం చేసుకున్నాం. అతను రెండేళ్ళు పోయాక చేసుకుంటానన్నాడు. చారుమతికి ఇంకా ఏ సంబంధమూ కుదరలేదు" అనేది.
'చారుమతికి సంబంధం ఎందుకు కుదరలేదు? ఆ అమ్మాయిలో ఏమిటి లోపం? వయస్సు ముదిరి పోతూ ఉంటే ఇంకా ఎన్నాళ్ళు ఇంట్లో కూర్చుండ బెట్టుకుంటారు?' -రకరకాల ప్రశ్నలు ఉదయించేవి బంధువర్గంనించి, ఈ ప్రశ్నలు వినలేక చారుమతి విసుక్కునేది; కోపగించుకునేది; ఉక్రోషపడేది.
పెళ్ళిముహూర్తం రాత్రి పది గంటలకి. ఉదయం మగపెళ్ళివారు పెళ్ళికూతురికి ప్రధానము, పెళ్ళి కొడుక్కి స్నాతకము చేసుకున్నారు. ఏమీ తోచకుండా, అందరితోను సరదాగా తిరగలేకుండా ఉన్న చారుమతికి పద్మ రాక ఎంతో సంతోషాన్ని కలిగించింది. వీథిలో పద్మ రిక్షా దిగుతూ ఉండగానే, చారుమతి ముందుకి వెళ్ళి, చెయ్యి పట్టుకుని తీసుకువచ్చింది.
"చివరికి వచ్చావన్నమాట! రావని భయపడ్డాను" అంది చారుమతి.
"నువ్వంతగా చెప్పి, ఒట్టు వేయించుకున్నావు కదా! రాకుండా ఉంటావా! పైగా, అమ్మ, నాన్నగారు నిన్నటినించి ఒకటే పోరు, వెళ్ళమని" అంది పద్మ.
ఆకుపచ్చ పట్టుచీర కట్టుకుని, పూర్తిగా పైట చెంగుతో వీపంతా కప్పుకుని కూచుంది పద్మ. ఎంత అందంగా ఉన్నా, కళ్ళలో దీనత్వం, మనిషిలో ఒక విధమైన గంభీరత్వం మనిషిని మార్చేశాయి.
భగవతికి పసుపు, కుంకుమ, పట్టుచీర, ఉంగరం ఇచ్చి ప్రధానం చేసుకుంటున్నారు మగపెళ్ళివారు. మౌనంగా చూస్తూ కూర్చుంది పద్మ. ఆమెలో ఏ చలనమూ లేదు. కదలిక లేకుండా, భావరహితంగా ఉన్న అందమైన శిల్పంలా ఉంది.
ఎదురుగుండా జరుగుతున్న వేడుకలు చూస్తున్న చారుమతి ఎందుకో తల ఎత్తి చూసింది. కొంచెం దూరంలో శంకరం నిలుచుని తదేకంగా పద్మనే చూస్తున్నాడు. శంకరం పక్కన పద్మని నిలబెట్టి మనస్సులో ఒకసారి ఊహించుకుంది చారుమతి. వాళ్లిద్దరు అందమైన జంట అనిపించింది. కాని ఏం లాభం? దేనికేనా అదృష్టం ఉండాలి. పద్మలాంటి అందమైనది, మంచిది భార్యగా వచ్చే అదృష్టాన్ని కూలదోసుకుంటున్నాడు శంకరం.
పద్మ ఉన్నంతసేపు శంకరం దృష్టులు ఆమెమీదే ఉండటం గమనించింది చారుమతి. గోపాల్ మాలతిని అస్తమానం చూపులతో వెంబడిస్తున్నట్టే, శంకరం చూపులు పద్మని వెంటాడుతున్నాయి.
పెళ్ళి ఏ ఆటంకాలు, గొడవలు లేకుండా బాగా జరిగిపోయింది. కట్నకానుకలు, వియ్యాలవారు జరిపిన మర్యాదలు చూసి మగపెళ్ళివారు సంతుష్టులయ్యారు. భగవతి కృష్ణమూర్తి భార్య అయిపోయింది.
రెండోరోజు వధూవరులను తీసుకొని విశాఖపట్నం గృహప్రవేశం చేసుకోడానికి వెళ్ళిపోయారు మగపెళ్ళివారు. పెళ్ళి కూతురికి సాయంగా రేవతి వెళ్ళింది.
పెళ్ళివారు వెళ్ళిపోగానే ఇల్లు పెద్ద వాన కురిసి వెలిసిపోయినట్లు వెలితిగా అయిపోయింది. శంకరం, రామారావుగారు పెళ్ళివారిని దిగబెట్టి, స్టేషన్ నించి ఇంటికి వచ్చారు. 'అమ్మయ్య' అని కూలబడుతున్న శంకరాన్ని చూసి, "బాబూ, నీ పని ఇంకా అయిపోలేదురా. సామాను కొంచెం సత్రపుగదిలో ఉండిపోయింది. తీసుకురావాలి" అంది శాంతమ్మ.
"ఇంకా నాకోసం పని మిగిల్చావుటమ్మా!" అంటూ శంకరం తిరిగి సత్రువుకు ప్రయాణమయ్యాడు.
చారుమతి అక్కడే కూర్చుని పత్రిక చూస్తూంది.
"చారూ, నువ్వు రారాదూ? రిక్షాలో వెళ్ళి వచేద్దాం" అన్నాడు శంకరం. "సరే" అంటూ బయలుదేరింది చారుమతి.
రిక్షా ఎక్కాక అడిగాడు శంకరం:
"మీ పద్మ అలా అయిపోయిందేం?"
"ఎలా అయిపోయింది?" ఏమీ తెలియనట్టు అంది చారుమతి.
"పూర్తిగా చలనం లేని బొమ్మలా, ప్రాణం లేని మనిషిలా ఎంత మారిపోయింది!" అన్నాడు. శంకరం గొంతుకలో ఉన్న బాధ చూసి చకితురాలైంది చారుమతి.
"మద్రాసునించి వచ్చిన దగ్గిరనించి అలాగేస్తబ్దుగా తయారైంది పద్మ. పూర్వంకంటే ఇప్పుడు కొంచెం నయం. మద్రాసునించి వచ్చినప్పుడు చూడవలిసింది నువ్వు. ఉఫ్ అంటే పడిపోయేటంత నీరసంగా, ఎండుపుల్లలా ఉంది."
"పాపం, నువ్వు చెప్పిన పద్మ కథ అంతా నిజమే ననిపిస్తూంది ఇప్పుడు" అన్నాడు శంకరం తిరిగి నొచ్చుకుంటూ.
చారుమతి ఏమీ మాట్లాడలేదు. సామాను తీసుకుని సత్రంనించి వచ్చేస్తూ ఉంటే, తిరిగి శంకరమే అన్నాడు: 'భార్యాభార్తలు' సినిమా బాగుందిట. సాయంత్రం అందరం వెళదామా?"
"నీ ఇష్టం! కలిసి వెళితే సరదాగానే ఉంటుంది" అంది చారుమతి.
శంకరం కాస్సేపు తటపటాయించి, చివరికి అన్నాడు: "మీ పద్మనికూడా పిలుచుకు రాకూడదూ? సినిమా చూసినంతసేపైనా తన కష్టాలు మరిచిపోతుంది."
"నీ కెందుకో పద్మమీద అంత శ్రద్ధ?" చారుమతి హాస్యం చేస్తూ అంది.
"నీ స్నేహితురాలు కనక. బాధలలో ఉన్నవారిని ఎవరిని చూసినా కలిగే జాలివల్ల" అన్నాడు శంకరం.
కథ మలుపు తిరుగుతూంది మనస్సులోనే అనుకుంది చారుమతి.
* * *
ఆ రోజు మే పదవ తారీఖు. కృష్ణమూర్తి భగవతిని కాపరానికి హైదరాబాద్ తీసుకువెళ్ళిపోయాడు. కూతురు అంత తొందరలో కాపరానికి వెళ్ళిపోతుందనుకో లేదు శాంతమ్మ. భగవతి, భర్త హైదరాబాద్ ప్రయాణానికి రెండు రోజులు ముందుగా కాకినాడలో దిగారు. అప్పటికప్పుడు శంకరం, భానుమతి బజారుకి వెళ్ళి వంటగిన్నెలు, మంచినీళ్ళ బిందె, అన్నం తినే కంచాలు, గ్లాసులు, ప్లేటులు-సంసారం పెట్టడానికి కావలసిన సామానంతా కొని తెచ్చారు. మిఠాయి ఉండలు, చలిమిడి చేసింది శాంతమ్మ.
కొత్తచీర, పసుపు, కుంకుమ, చలిమిడి, కొబ్బరికాయ భానుమతి చేత చిన్నకూతురి చేతిలో పెట్టించి, కాపరానికి పంపుతూఉంటే కంటినీరు తిరిగింది శాంతమ్మకి. 'చిన్నపిల్ల సంసారం ఎలా దిద్దుకుంటుందో?' అనుకుంది మనసులో. ఎంత పెద్ద పిల్ల అయినా తల్లిదండ్రుల దృష్టిలో చిన్నపిల్లగానే కనపడుతుంది మరి!
"నా కాజువల్ లీవు అంతా అయిపోయింది.సెలవు దొరకదు" అంటూ మాలతి ఇంటిదగ్గిరే చెల్లెలికి, మరిదికి వీడ్కోలు చెప్పి ఆఫీసుకి వెళ్ళిపోయింది. తక్కినవాళ్ళంతా స్టేషన్ కు వెళ్ళి వధూవరుల్ని సాగనంపారు. ఇంటినించి వెళ్ళేముందర కొత్తచీర కట్టుకుని పెద్దలకి, అక్కలకి నమస్కరించింది భగవతి. అందరి కళ్ళల్లోను నీళ్ళు తిరిగాయి.
శాంతమ్మ రైలు కదిలేదాకా కూతురికి కొత్త కాపరం ఎలా చేసుకోవాలో చెబుతూనే ఉంది. భానుమతి ఉత్తరాలు మరిచిపోకుండా వారానికి ఒకటి రాయాలని కోరింది చెల్లెల్ని.
టిక్కెట్లు కొనడానికి వెళ్ళిన శంకరం తిరిగి వచ్చి, "చారూ! సామర్లకోటదాకా మనిద్దరికికూడా టిక్కెట్లు కొన్నాను. మనం వెళ్ళివద్దాం" అన్నాడు. చారుమతి ఆశ్చర్యపోయింది. ఇంతకుముందు సామర్లకోట దాకా వెళ్ళాలన్న ప్రసక్తే రాలేదు.
రైలు కదిలింది. రైల్లో కూర్చున్న భగవతి కళ్ళనీళ్ళు నింపుకుంటూ తల్లికి, తక్కిన వాళ్ళకి చెయ్యి ఊపింది. ప్లాటు ఫారం మీద నిలుచున్న శాంతమ్మ, భానుమతి కళ్ళు తుడుచుకున్నారు.
భగవతి భర్త పక్కనే కూర్చుంది. ఇద్దరు చాలా దగ్గిరగా, ఒకళ్ళ నొకళ్ళు తగులుతూ ఉన్నారు. భగవతిలో ఒక సంతోషం, కించిత్తు గర్వం తొంగి చూస్తున్నాయి. మాటలలో, చూపులలో చలాకీతనం హెచ్చు అయింది. 'వారం రోజులలోనే ఎంత మారిపోయింది భగవతి' అనుకుంది చారుమతి.
సామర్లకోటలో రైలు మారేదాకా నలుగురూ మాట్లాడుకుంటూ కూర్చున్నారు. కృష్ణమూర్తి చాలా నెమ్మది. అంత మాటకారి కాడు. భగవతి ఉరకలు వేస్తూ పరుగులు తీసే సముద్రమైతే, అతను నెమ్మదిగా పారే నది.
హైదరాబాద్ రైలు కదిలింది. భగవతి భర్తతో కాపరానికి సాగింది. 'భగవతి కోరిక తీరింది. పద్దెనిమిది ఏళ్ళకే పెళ్ళి కూతురైంది. మంచి ఉద్యోగస్థుడు భర్తగా లభించాడు. భగవతి సుఖంగా ఉండాలి. డబ్బు ఇబ్బందులు లేకుండా హాయిగా జీవించాలి' అనుకుంది చారుమతి.."
