Previous Page
ఏటి ఒడ్డున నీటిపూలు పేజి 34


    "కొడుకు, కూతురు ఎప్పటికీ సమానంకారు, బావా! కూతురు ఎప్పటికీ భారమే. కూతుళ్ళ పెళ్ళిళ్ళకి ఎంత అవస్థపడాలని!" అంది భగవతి విచారమైన ముఖం పెట్టి.        
    గోపాల్ పెద్ద పెట్టున నవ్వాడు.
    "భగవతీ! నిన్ను చూస్తే, నీ మాటలు వింటే నవ్వు వస్తూంది. కూతుళ్ళు పుట్టి ఇంకా పదిహేను రోజులు కాలేదు. అప్పుడే వాళ్ళకి చెయ్యబోయే పెళ్ళిళ్ళని గురించి ఆలోచిస్తున్నావు. అది ఇంకా ఎన్నాళ్ళ మాట?" గోపాల్ పగలబడి నవ్వుతూ ఉండగానే, శాంతమ్మ కుంపటిలో నిప్పులు వేసుకుని వచ్చింది.
    "ఏమిటి, బాబూ, అంత నవ్వుతున్నావ్?" అంది, చంటిబిడ్డని చేతిలోకి తీసుకుని, సాంబ్రాణి పొగ వేస్తూ.
    "చూడత్తా, మీ భగవతి ఎంత తెలివైనదో! కూతుళ్ళ పెళ్ళిళ్ళ ని గురించి ఇప్పటినించే ఆలోచిస్తూంది" అంటూ మళ్ళీ నవ్వాడు. అప్పుడే పుట్టిన బిడ్డలకి ఎప్పుడో జరపబోయే పెళ్ళిళ్ళని గుఇర్న్చి భగవతి ఆలోచిస్తూ ఉందంటే, గోపాల్ కి విపరీతంగా నవ్వు వస్తూంది. వరండాలో కూర్చున్న చారుమతితో, వంట చేస్తున్న భానుమతి తో, భగవతి పెద్దకొడుకు వాసుని ఆడిస్తున్న మాలతితో - అందరితోను చెప్పి, మళ్ళీ మళ్ళీ నవ్వాడు.
    ఆ మాట విన్న ఎవ్వరికీ గోపాల్ కి వచ్చినట్టు నవ్వు రాలేదు. భగవతి మాటల వెనక ఉన్న వ్యథ అర్ధమయింది.
    గోపాల్ కాస్సేపు మాలతితో డాబా మీద కూర్చుని మాట్లాడి, ఇంట్లో అందరిదగ్గిర సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. మాలతి, గోపాల్ అందరి ముందరా మాట్లాడుకోవడానికి పూర్వంలా సిగ్గుపడటం లేదు. ఇద్దరు కలిసి అప్పుడప్పుడు సినిమాలకి, షికార్లకి వెళ్ళుతున్నారు. స్కూలు ఫైనల్ మాత్రం చదివాడని పెళ్ళి చేసుకోవడానికి భగవతి తోసిపుచ్చిన గోపాల్ ఇప్పుడు ప్రైవేటుగా పి. యు. సి. పాసై, బి. ఎ. పరీక్ష కూడా రాశాడు. ఈ ఏటితో అతని బి. ఏ. పరీక్ష పూర్తి అవుతుంది. మాలతినికూడా ప్రోత్సహించి ప్రైవేటుగా పి.యు.సి. పరీక్షకి చదివిస్తున్నాడు. 'ఈడైనవాడు, సహృదయుడు, సరసుడు అయిన గోపాల్ ని భర్తగా పొందుతున్న మాలతి అదృష్టవంతురాలు అనుకుంది చారుమతి. గోపాల్ ని చూసినప్పుడల్లా మాలతి అదృష్టమే తలపులోకి వస్తుంది ఆమెకు. వాళ్ళిద్దరి పెండ్లికి తను అడ్డుగా ఉందే అని బాధ పడుతుంది. అక్క పెండ్లి కానిదే తను చేసుకోనని పట్టుబట్టి కూర్చుంది మాలతి.
    ఈ నాలుగేళ్ళలోను ఎన్నో మార్పులు వచ్చాయి. చెల్లెలికంటే ముందు పెళ్ళి అయిన భానుమతికి పిల్లలు కలగలేదు. భగవతికి నాలుగేళ్ళలోను ముగ్గురు పిల్లలు. శాంతమ్మకి భానుకి పిల్లలు కలగనందుకు ఒకపక్క విచారము, భగవతికి పిల్లలు పుట్టినందుకు సంతోషం ఒకపక్కాను.
    ఒంటరిగా కాపరం పెట్టటానికి వెళ్ళిన భగవతి ఇల్లు రెండేళ్ళలో ఉమ్మడి కుటుంబంగా మారిపోయింది. భగవతి తోటికోడలు ఇద్దరు పిల్లల్ని, భర్తకి ఈ లోకంలో వదిలి పరలోక యాత్ర చేసింది. పెద్దకొడుకు పిల్లల్ని పెట్టుకుని అత్తగారు భగవతి ఇంట్లోనే ఉంటూంది.
    'ఏ మార్పూ లేనిది నా జీవితమే' అనుకుంది చారుమతి. రెండేళ్ళకి ఒకసారి కాకినాడ వచ్చే  శంకరానికి చారుమతి పెళ్ళిమీదకంటే, పద్మతో తనకి జరగబోయే పెళ్ళిమీదే శ్రద్ధ ఎక్కువ. అతని నిరంతర కృషివల్ల, చారుమతి పద్మకి ఇచ్చిన ప్రోత్సాహంవల్ల పద్మ, మాధవరావు విడాకులు తీసుకున్నారు. పద్మ ఇప్పుడు శంకరంతో పెళ్ళికోసం ఎదురుచూస్తూంది.
    చారుమతికి ఒకటి రెండు సంబంధాలు వచ్చినా, కట్నాలు ఇవ్వటానికి భయపడి అంతా వెనకతీశారు. భగవతి పెళ్ళికి చేసిన అప్పు తీరటానికి అతి కష్టమయింది. తాకట్టుమీద ఉన్న ఇల్లు అప్పు తీర్చి, విడిపించుకోవడానికి తాతలు దిగివచ్చారు. పైగా మధ్య మధ్య భగవతి పురిటిఖర్చులు, ప్రయాణాలు, ఇక ఎవరి సంసారాలు వారికి ఏర్పడబోతున్నప్పుడు, మళ్ళీ చారుమతి పెళ్ళికి అప్పు చేస్తే ఎవరు తీర్చుకుంటారు? మాలతి, గోపాల్ చారుమతి పెళ్ళికోసం ఎదురుచూస్తున్నారు. అక్కపెళ్ళి అవగానే మాలతి వివాహం చేసుకుని భర్త గృహానికి వెళ్ళిపోతుంది. శంకరం వివాహం చేసుకుని సంసారం పెట్టుకుంటే, డబ్బు ఎత్తి పంపి అప్పులు తీర్చడం కాని పని.
    ఇరవైఏడేళ్ళు వచ్చిన చారుమతి కన్యగానే మిగిలి పోయింది.    
    రాత్రి ఏడు గంటలు అవగానే భగవతికి భోజనం పెట్టేస్తుంది శాంతమ్మ. పురిటాలు తొందరగా భోజనం చేస్తే, పడుకునేలోగా అన్నం అరిగిపోతుందని, ఆరోగ్యంగా ఉంటుందని ఆవిడ నమ్మకం.
    "ఇంకొంచెం నెయ్యి వేసుకు తిను." బలవంత పెడుతూంది శాంతమ్మ.
    "ఇంకెంత వేసుకోనమ్మా కంపునెయ్యి?" అంది భగవతి విసుగ్గా.
    "ఏమోనమ్మా, కంపో, మంచో ఏదో ఒక నెయ్యి వేసి, దగ్గిర కూర్చుని పెడితేనే నాకు తృప్తి. నువ్వు పుష్టికరమైన ఆహారం తీసుకోకపోతే తరవాత నీరసించిపోతావు. పిల్లలందరిని చూసుకోవద్దూ? మీ అత్తగారు రోగిష్టి అంటున్నావు!" శాంతమ్మ అంది.
    "ఆవిడ ఒక రోజు లేచి తిరిగితే, రెండు రోజులు పడక వేస్తుందమ్మా. చూశావుగా మనిషి ఎంత లావో! ఒకటే ఆయాసం. పని చెయ్యకపోతేనే నయం! ఆవిడ మంచం ఎక్కిందంటే నా పని అవుతుంది. ఇటు ఈ పిల్లలిని చూసుకోవడము అటు ఆవిడ సేవలూను." భగవతి తల్లితో సంసారంలో ఉండే కష్టాలు చెప్పుకుంటూంది.
    "చంటిపిల్లలతో, అందులోను కవలలతో ఎలా అవస్థపడతావో?" అంది నిట్టూరుస్తూ శాంతమ్మ.
    "చంటిపిల్లలు ఫరవాలేదమ్మా. కాలు వచ్చిన వాసుతోనే అవస్థ. అటు, ఇటు వెళ్ళిపోతాడు. ఏ రోడ్డుమీదికి వెళ్ళిపోతాడో అని భయం. అస్తమానం కార్లు, సైకిళ్ళు తిరుగుతూంటాయి."        
    "మీ బావగారి పిల్లలు కొంచెం పెద్దవాళ్ళేమో! పెద్ద పిల్లావాడికి పదేళ్ళు ఉంటాయా? వాళ్ళు వాసుని ఆడించరా?" అంది శాంతమ్మ.
    "అయ్యో! మా బావగారి పిల్లలా! వాసుని ఆడించడమా! అంత అదృష్టమా? వీణ్ణి ఏడిపించకుండా ఉంటే చాలు! ఆ పిల్లలిద్దరూ తెగ అల్లరి చేస్తారు. మాట వినరు. పైగా, తల్లిలేని పిల్లలు అంటూ తెగ ముద్దుచేస్తారు మా అత్తగారు" అంది భగవతి.
    "పాపం, తల్లిలేని పిల్లలు! మీ బావగారు మళ్ళీ పెళ్ళి చేసుకోరా?"
    "ఎందుకు చేసుకోరమ్మా? మన చారుఅక్కని ఇవ్వకూడదూ? మా అత్తగారుకూడా ఒకసారి అన్నారు."
    వరండాలో కూర్చుని వీళ్ళ సంభాషణ వింటున్న చారుమతి, వెంటనే కోపంగా లోపలికి వచ్చింది.    
    "భగవతీ, అక్కకి పెళ్ళికొడుకుని చూసేఅంత ఆరిందావైపోయావా? ఇన్నాళ్ళు నాకు తెలియదు. నువ్వు అక్కకోసం అంత జాలిపడి, సంబంధాలు చూడ నవసరంలేదు" అంటూ విసురుగా వెళ్ళిపోయింది.    
    శాంతమ్మ, భగవతుల నోళ్ళు కట్టుబడ్డాయి. తిరిగి వాళ్ళు ఆ ప్రసక్తి తీసుకురాలేదు.
    భగవతిమీద కోపగించుకుంది కాని, చారుమతి ఆలోచనలనించి తప్పించుకోలేకపోయింది.
    ఏమిటీ జీవితం! ఎన్నాళ్ళీ జీవితం! జీవితమంటేనే అయిష్టంగా ఉంది. రోజూ తినడం, స్కూలుకు వెళ్ళడం, వచ్చి నిద్రపోవడం. ఎన్నాళ్ళైనా అదే స్కూలు, అవే పాఠాలు. ఇటు జీవితంలో మార్పు లేదు. అటు ఉద్యోగంలో మార్పు లేదు. చెప్పిన పాఠాలే చెప్పడం విసుగు.
    పోనీ, తనూ మాలతిలా పరీక్షలకి చదివి, పాసై, డిగ్రీ తెచ్చుకుందామనుకుంది. డిగ్రీ తెచ్చుకుని ఏం చేస్తుంది? పెద్ద ఉద్యోగం వచ్చి, ఇంకొంచెం జీతం వస్తుంది. తన జీతం ఎవరికి కావాలి? ఎవరికోసం  సంపాదన? తల్లి తప్ప అందరికి అందరూ ఉన్నారు. తల్లిని చూసుకోవడానికి శంకరం ఉన్నాడు. తను ఎవరిని చూసుకోవాలి? ఎవరికోసం ఎక్కువడబ్బు సంపాదించాలి?    
    మంచి సంబంధం దొరుకుతుంది, పెళ్ళి అవుతుంది అంటే ఆ ఆశా లేదు. భానుమతిలాగా ధైర్యంగా భర్తని ఎన్నుకుని, అర్ధించి పెండ్లి చేసుకోలేదు. ఈడైన వరుడు వెతుక్కుంటూ వచ్చిన మాలతి అదృష్టం తనకు లేదు. పోతే, భగవతిలా ఇంట్లో అందర్ని బెదిరించి, సాధించి మంచి ఉద్యోగస్థున్ని చేసుకునే చొరవా లేదు. తన తల్లి ఏమైనా సహాయం చేస్తుందా అంటే, అక్కడా చుక్కెదురే! ఆవిడ మాటలలో బాధ వెల్లడించగలదు. ఎదటి వాళ్ళ అదృష్టం చూసి ఈర్ష్య పడగలదేకాని, తనంతట తను ఏ పనీ సాధించలేదు. ఏ కూతురికీ పెళ్ళి చెయ్యలేదు. ఆవిడ అదృష్టం బాగుండి నలుగురు కూతుళ్ళకి భర్తలు దొరికారు. దురదృష్ట వంతురాలు చారుమతి మిగిలిపోయింది.
    జీవితంలో ముందు జరిగే అభివృద్ధిని చూసి, తలుచుకునే మనిషి ఉత్సాహంగా జీవించగలడు. ప్రగతి లేని జీవితం సారవిహీనంగా ఉంటుంది. రైలు కదులుతూ ఉంటే ఎన్ని రోజులైనా ప్రయాణం చెయ్యగలం. కదలని రైలులో ఎంతసేపు కూర్చోగలం? ఉద్యోగంలో అభివృద్ది, కుటుంబ పురోభివృద్ధి చూసుకునే మనిషి జీవించగలుగుతున్నాడు పెళ్ళి, సంసారం, పిల్లలు కొండలు, కోనలు దాటుకుంటూ ముందుకు పరిగెడుతున్న ప్రవాహంలాంటి జీవితం పెళ్ళి, సంసారం లేని జీవితం నిలిచిపోయిన నూతిలోని నీరులా నిశ్శబ్దమైనది. ప్రతి మనిషి ఉత్సాహంగా పరుగులిడే ప్రవాహంలాంటి జీవితాన్ని వాంఛిస్తాడు.        
    ఆగిపోయిన జీవితం చారుమతిది. తను ముందరికి జరుపుకోలేదు. ఇంకొకరు వెనకనించి వచ్చి ముందరికి తోసి సహాయం చెయ్యరు. మరి ఎలా కదులుతుంది?    
    కదలని జీవితాన్ని తలుచుకుంటే చారుమతికి దుఃఖం వస్తూంది. శ్రీదేవి, పద్మ, తను స్నేహితురాండ్రు. అయితేనేం! మూడు జీవితాలూ మూడు రకాలు. శ్రీదేవి పుట్టినప్పటినించి అదృష్టవంతురాలు. వడ్డించిన విస్తరి ఆమెది. పద్మ మధ్యలో అగాధంలో చిక్కుకుని పోయినా, ఎలాగో ఒడ్డు చేరి, శంకరం అనే అదృష్టాన్ని చేయూతగా తీసుకుని కొత్త లోకాలకు పయనిస్తూంది. ఎటూ మిగిలింది తనే. ఎవరికీ అక్కరలేనిది, ఏ అదృష్టం వరించనిదీను!
    కదలని ఈ జీవితం విసుగు. ఉద్యోగం విసుగు. తన చేతులతో తనే ప్రాణాలు తీసుకునే ధైర్యం లేదు; ఇచ్చా లేదు. అలా అని జీవచ్చవంలా బ్రతకనూ లేదు.
    భగవతి బావగారిని పెళ్ళి చేసుకుంటే జీవితంలో వచ్చే మార్పయినా ఉంది. అయితే తాను కలలు కనే జీవితం ఎలాగా మృగ్యమే! కాని ఒక ఉద్యోగం నించి ఇంకో ఉద్యోగానికి మార్పు ఉంటుంది. ఒక వాతావరణం నించి ఇంకో వాతావరణానికి మార్పు. ఒక ఊరినించి ఇంకో ఊరు మార్పు. ఒక విసుగు నించి ఇంకో విసుగైన జీవితానికి మార్పు. జీవితంలో చలనము, ముందుకు కదలిక లేకపోయినా, మార్పు ఉంటుంది. ఏదో ఒకటి తను సామాన్యురాలు. తన జీవితం ఏటి ఒడ్డున పూచే సామాన్యమైన పూవులాంటి జీవితం. కోటిమంది సామాన్యులలో, దురదృష్ట వంతులలో తను ఒకర్తి.        
    తెల్లవారి లేస్తూనే భగవతితో చెప్పింది: "మీ అత్తగారికి రాయి. మా అక్క మీ పెద్దబ్బాయిని చేసుకుంటుందని."    
    చారుమతి మాటలు విన్న భగవతి ఆశ్చర్యంతో బొమ్మలా నిలబడిపోయింది!


                              (సమాప్తం)


 Previous Page

WRITERS
PUBLICATIONS