Previous Page Next Page 
ఎండమావులు పేజి 32


    "అవును జ్యోతీ. వారిద్దరూ చదువుకునే రోజుల్లోనే ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. పదేళ్ళు దాటినయ్యి. కట్నం పోయిందనే మా పెదనాన్న బాధ. పెద్దవాళ్ళ దృష్టిలో ప్రేమించి పెళ్ళి చేసుకోటం తప్పుకాదా మరి." అన్నది జయలక్ష్మి. జ్యోతి ఏమంటుందోనని.
    "ప్రేమించి పెళ్ళి చేసుకోడం తప్పుకాదు. కాని అది కూడా ఒక హద్దులో ఉండాలి. అన్య కుల స్థులు కాకుండా ఉంటే సరి. ఆ రకమైన ప్రేమ పెళ్ళిళ్ళయితే చాలా బాధాకరమైన సంగతే." అన్నది.
    జయలక్ష్మి గుండె ఝల్లుమంది.
    "అన్యకులస్థుల ప్రేమ వివాహాలు జీవితంలో శాంతి, సౌఖ్యాల నివ్వలేవంటావా జ్యోతీ"
    'పర్యవసానం ఎట్లా ఉంటుందో మనం చెప్పలేం. కాని సాధారణ పరిస్థితులో అది అంత మంచి పద్దతిగా కనిపించదు. వర్ణాంతర వివాహాలు చేసుకునేంత పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలో నాకు అర్ధంకావటంలేదు. అలాంటి దంపతుల్ని నే నెప్పుడూ చూడలేదు".
    పరిస్థితి చిలికి చిలికి గాలివాన చిమ్మేటట్లుంది. ఇంత చిన్న వయస్సులో జ్యోతి ఇంత సూటిగా తన అభిప్రాయాలు చెపుతుంటే జయలక్ష్మికి కొంచెం ఆశ్చర్యం కలిగింది. ఇంక ఈ రకమైన ప్రస్థావన సాగిస్తే అది ఎంతవరకూ పోతుందో నని భయపడింది జయలక్ష్మి.
    "అయితే స్వాతివదినె మన కులస్తులు కాదా"
    హఠాత్తుగా వేసిన ఈ ప్రశ్న వినేసరికి జయలక్ష్మి కలతచెందింది. అయినా ఇంతవరకూ వచ్చింది ఇంక దాచటం మంచిదికాదనుకుంది.
    "గుణం మంచిదయితే కులం ప్రధానం కాదు జ్యోతీ. స్వాతివదినెలాంటి వ్యక్తిని కేవలం కులప్రాతిపదిక మీద అదో విధంగా భావించటం వెర్రితనమే అవుతుంది. ఏమంటావు"
    "నిజమే స్వాతివదినె ఉత్తమురాలు, ఆవిడ హృదయం మంచిది."        
    "అవునా, ఈ ఉద్దేశ్యం మనస్పూర్తిగానే వ్యక్త పరుస్తున్నావుగా"    
    "ఆహా"
    "అదే అభిప్రాయం నీ మనస్సులో ఎల్లప్పుడూ ఉంటుందనీ, ఏమీ మారదనీ నాకు మాట ఇస్తావా"
    చెయ్యిజాపింది జయలక్ష్మి. చేతులో చెయ్యి వేస్తూ "అట్లాగే స్వాతివదినె మీద నాకే దురభిప్రాయమూలేదు. ఆమె నాకు నిజంగా వదినె. ఆవిడ రాక కోసం, ఆవిడతో మాట్లాట్టం కోసం స్వాతి నాకు ముత్యాపు చిప్పలా ఎదురు చూస్తుంటాను." అన్నది జ్యోతి.    
    సగం ఆదుర్దా తీరింది జయలక్ష్మికి.
    "వారిది ప్రేమ వివాహంలాంటిదే. స్వాతి వదినె హరిజన కులస్థురాలు. అందుకనే తల్లి దండ్రులు వెలివేసారు. వాళ్ళు వీళ్ళింటికి పోరు. కొద్ది రోజులవరకూ జానకిరాం అన్నయ్యకూడా వెళ్ళేవాడుకాదు.' అన్నది.
    జ్యోతి ఆశ్చర్యంగా వినసాగింది. ఆమె మనస్సులో అనేక భావాలు పరుగెత్తసాగాయి.
    "అయితే ఈ రోజునుంచీ స్వాతితో మాట్లాడటం మానేస్తావు కదూ" నవ్వుతూ అన్నది జయ లక్ష్మి.
    "ఎప్పటికీ మానెయ్యను. స్వాతి వదినె అంద ఛందాలలో గాని, మాటపొందికలో గాని, పని పాటలలో గాని ఏ జాతి వంశస్థురాలినీ తీసిపోదు. నువ్వు చెప్పినా నేను నమ్మలేకుండా ఉన్నాను. చాలా ఆశ్చర్యంగా ఎన్నడూ వూహించలేనంత తీరుగా ఉంది. అందుకనే కామోలు ఒకసారి మా ఇంట్లో భోజనం చెయ్యమంటే ఎంత బ్రతిమాలినా వంటింట్లో కూర్చోటానికి వప్పుకోలేదు. అతి కష్టం మీద ఇవతల హాల్లో కూర్చోటానికి వప్పుకుంది. చివరకు తన విస్తరి తనే ఎత్తి పారేసింది. అప్పట్లో గాని, ఇప్పుడుగాని నాకా విషయం తెలీలేదు. ఎవరయితేనేం చెయ్యెత్తి నమస్కరించతగిన ఉత్తమ ఇల్లాలు". అన్నది జ్యోతి.
    జయలక్ష్మి మనస్సు శాంతించింది.
    "నాకు తెలీదుగాని ఇలాంటి వర్ణాంతర వివాహాలు చేసుకున్నా వాళ్ళు ఎక్కువ కాలం సభ్యతగా ఉండలేరంటారు. ఆ అభిజాత్యం ఎప్పుడూ వాళ్ళ మనస్సులో కలక వేస్తు ఉంటుందిట. ఇంక అలాంటి కాపురాలు సాగక విడాకులు పుచ్చుకున్న కూడా చాలామంది ఉన్నారుట. మా నాన్నగారు ఎవరితోనో చెపుతుంటే విన్నాను. ఈ సంగతి మా నాన్నగారికే తెలీదేమో" అన్నది జ్యోతి.
    "పోనీలే ఎవరికి తెలిసినా, తెలియక పోయినా ఆ పరమాత్ముడికి తెలుసు. వాళ్ళని ఆ పరంధాముడు చల్లగానే చూస్తున్నాడు. సరే మరేం విశేషాలు" అన్నది జయలక్ష్మి.
    జయలక్ష్మి తెల్సుకుందామని వచ్చిన విషయం వేరు. మాటల సందర్భంలో అది మర్చిపోయి ఈ మాటల్లో పడ్డారు.
    "మీ బావగారు కూడా ఆనర్సు చదువుతున్నారని చెప్పావు. శలవులకు వచ్చారా".
    జ్యోతికి కళ్ళు ఆనందంతో మిలమిల లాడాయి. కళ్ళింతని చేసుకొని అమృత ఝరులు ప్రవహించినట్లుగా అతి సరళంగా, మృదువుగా అన్నది జ్యోతి.
    "మా మురహరి బావకూడా విశాఖలో ఆనర్సు చదువుతున్నాడు. వచ్చి వారం రోజులయింది. మా అత్తయ్య మావయ్య పోయారు. మా బావ వక్కడే ఉంటాడు. నువ్వూ విశాఖపట్నంలో చదువుతున్నావు కదా. మా మురహరి బావ నీకు తెలుసా జయా. బావచ్చాడని మొన్న చెప్పానుగా గుర్తులేదా"
    ప్రశాంతంగా ప్రవహిస్తున్న సెలయేటిలో మధ్యలో కొంత దూరం పోయాక చిన్న వాగు కలిసింది. ఈ వాగు, సెలయేటి కలయికవల్ల పెద్ద దయిన ఆ ప్రవాహ వేగం మరింత ఇనుమడించి గల గలమని శబ్దం చేస్తూ కొండరాళ్ళనూ, బండ రాళ్ళనూ ఒరుసుకుంటూ తీవ్రమైన ఒరవడిగా ప్రవహించి మహానదిలో కలుస్తుందో లేక మళ్ళా రెంపాయలుగా చీలి ఎక్కడో సంబంధంలేకుండా అంతమవుతయ్యో తెలియదు.
    ఏం సమాధానం చెప్పాలో తోచలేదు. తన బావ మాట ప్రస్తావించేసరికి జ్యోతి సంతోషాన్ని పదిపెట్టి హెచ్చవేసినట్లయింది. ఈ హెచ్చవేత వల్ల వచ్చిన ఆన్సరుతో తను తృప్తి చెంది ఆ ఆన్సరు రైటేనని తను టిక్కు కొట్టి మార్కులు వేయగలదా?
    "మీ బావ మురహరిని నేను ఎరుగున్నాను. ఇద్దరం ఓకే కాలేజీ, ఒకటే కోర్సు, ఒకటే గ్రూపు, చాలా మంచివారాయన. చక్కగా నవ్విస్తూ, కవ్విస్తూ హృదయపూర్వకంగా అందరితోనూ మాట్లాడుతారు. నలుగురిలోనూ పేరు ప్రతిష్టలు తెచ్చుకోగల సమర్ధుడు. మురహరి మీ బావగారని వింటుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. మన కుటుంబాలన్నీ ఇంత సన్నిహితంగా ఉంటం తల్చుకుంటే నా మనస్సు సంతోషంతో నిండి పోతున్నది." అన్నది జయలక్ష్మి.
    మురహరి బావను గురించి అంత గొప్పగా చెపుతుంటే జ్యోతి హృదయం పులకరించింది. మురహరి బావ అందర్నీ చక్కగా నవ్విస్తూ, కవ్విస్తూ మాట్లాడుతాడని జయ చెప్పింది. కాని తన విషయంలో అది పూజ్యం. తనతో ఎప్పుడూ నాలుగు మాటలుకూడా మనస్పూర్తిగా సంతోషంగా మాట్లాడలేదు. ఎప్పుడూ తప్పించుకునే తిరుగుతాడు. తను పలకరించినా అంటీ ముట్టనట్లుగానే సమాధానం చెపుతాడు. పరాయి వాళ్ళతో అంత ఇష్టతగా మాట్లాడేవాడు. మేనమామ కూతురయిన తనతో ఎందుకు మాట్లాట్టం లేదు. తనంటే ఇష్టంలేదా?
    ఈ ప్రశ్నకు సమాధానం దొరక్క తల్లడిల్లి పోయింది జ్యోతి. ఇందాకటివరకూ విప్పారిన ముఖంలో సంతోషంతో ఉన్న జ్యోతి ముఖం వివర్ణమైపోయింది.
    ఈ పరిస్థితి జయలక్ష్మికి అర్ధంకాలేదు.
    "అట్లా మాట్లాడకుండా కూర్చుండిపోయావేం. జ్యోతీ నేనేమయినా కష్టంగా మాట్లాడానా."
    "లేదు జయా, మా బావ ఇంట్లో ఏం మాట్లాడకుండా ఉంటాడు. చిన్నప్పట్నుంచీ చూస్తున్న బావ స్వభావం అంతేననుకున్నాను. అంత చక్కగా నవ్విస్తూ, కవ్విస్తూ బావ ఎప్పుడూ ఎవ్వరితోనూ ఇక్కడ మాట్లాడలేదు. బహుశా కాలేజీ స్నేహితులంటే బావకు మక్కువ కామోలు" అన్నది నిర్లిప్తంగా.
    జయలక్ష్మి మనసులో ఏదో ఒక అనిర్వచనీయమైన ఆలోచన కలిగి అంతలోనే అంతమైంది.
    "మీ మురహరి బావ నీతో సరిగ్గా మాట్లాడడా జ్యోతీ".
    వీపు మీద చెళ్ళున చరచినట్లయింది జ్యోతికి. ఇంత తీవ్రమైన ప్రశ్న హఠాత్తుగా అడుగుతుందని జ్యోతి అనుకోలేదు. అయినా ఈ ప్రశ్న తన కెందుకు? మురహరి తన బావ. తన కుటుంబంలోని వాడు. ఈ ప్రశక్తి ఇంతటితో ఆపుచెయ్యటం మంచిదేమో అనుకుంది. లేకపోతే మీ జ్యోతి నీ మీద ఈ మాటలు చెప్పిందోయ్ మురహరీ అంటూ జయలక్ష్మి ఎప్పుడయినా విశాఖపట్నం వెళ్ళాక చెపుతుందేమో? పైగా క్లాస్ మేట్ కూడాను. ఆలోచించింది జ్యోతి.
    "మాట్లాడకేం జయా. మా బావ చక్కగా మాట్లాడుతాడు. అంటే మీరంతా సహాధ్యా యులు కనుక చనువు ఎక్కువ. ఇంట్లో అట్లా ఛలోక్తులు విసురుతూ మాట్లాడటానికి వీలు పడదుగా, అదే నేననేది. అంతకన్నా మరేంలేదు" అన్నది జ్యోతి.
    అంతలోనే జ్యోతి తల్లి పేరంటం నుంచి వచ్చింది. ఆమెను చూడగానే జయలక్ష్మి మందహాసంతో నమస్కరించింది.'
    "ఏం జయా కులాసాగా ఉన్నావా, ఎట్లా ఉన్నయ్యి ఇక్కడి ఎండలు, విశాఖలో పట్నంలో కొంచెం చల్లగా ఉంటుందనుకుంటాను" అన్న దావిడ.
    "అవునండి ఇక్కడ ఎండలు జాస్తే. అక్కడ యితే ఆ సముద్రపు గాలికి చల్లగా ఉంటుంది." అన్నది.
    "మా మురహరి కూడా అక్కడే చదువుకుంటున్నాడు. శలవులకు ఇక్కడికే చేరాడులే. అతనికి మేమే శరణ్యం" అని వెళ్ళింది.
    ఆ మాటల్లోని ఈర్ష్య, కటుత్వం, అయిష్టత స్పష్టంగా ఆమె ముఖ కవళికల్ని బట్టి అర్ధం చేసుకుంది జయలక్ష్మి.
    "వెళ్లొస్తాను జ్యోతీ. రెండుసార్లు మీ ఇంటికి వచ్చాను. ఈ సారి నువ్వు మా యింటికి రావాలి. అదే మా పెద్దనాన్న గారి ఇల్లేననుకో, మా ఇల్లు కాదు. జానకిరాం అన్నయ్యనూ, శ్రీలక్ష్మి అక్కయ్య నూ చూద్దువుగాని" అన్నది.
    "అట్లాగే తప్పక వస్తాను. స్వాతి వదినె, నేను వస్తాము" అని అంతలోనే నాలిక కర్చుకొని,
    "ఓ మర్చిపోయాను ఆవిడ రాకూడదుగా, సరే నేనే వస్తా జయా" అన్నది జ్యోతి.
    జయలక్ష్మి వెళ్ళింది రెండుసార్లు వచ్చినా మురహరి కనబడనందుకు నిరాశపడ్డది జయలక్ష్మి.
    
                                  24

    గౌతమి పుట్టింటికి వెళ్ళి రెండునెల్లు దాటి నయ్యి. ఆమె రాసిన ఉత్తరానికి జానకిరాం జవాబు రాయలేదు. అతనికి మనస్కరించలేదు. అతని కాలకృత్యాల్లో కూడా విలంబన ఏర్పడింది. గౌతమి ఇక్కడ ఉన్న రోజుల్లో ఉదయం ఏడు గంటల్లోనే కాలకృత్యాలు తీర్చుకోని అనుష్టానం కావించి తనకు తోచిన పురాణగ్రంథాలు చదువుకుంటూనో, తల్లికి భారత భాగవతాలు చదివి కొంతసేపు వినిపించి దేవాలయానికి వెళ్ళిరావటమో చేసేవాడు. ఇదంతా ఉదయం పదిగంటల్లోపే అయేది. గౌతమి ఉంటే ఆమె కబుర్లతో, ఉద్యోగాధ్యాయాన్ని గురించి చేసే తర్కవితర్కాలతో కొంచెం కాలం గడిచేది. తండ్రి తో మాత్రం ఎప్పుడోగాని మాట్లాడేవాడు కాదు. అదయినా ఆయన పలకరిస్తేనే. ఆ రోజులన్నీ ఆ తీరుగా గడచిపోయినయ్యి.
    ఇప్పుడు రాను రాను ఏమీ తోచని పరిస్థితే వచ్చింది. ఒక్కొక్కరోజున ఏమిటో, ఏదో ఆలోచిస్తూ ఎనిమిది గంటలయినా పక్కమీంచి లేవటంలేదు. కాలకృత్యాలు తీర్చుకునే సరికి తొమ్మిది గంటలు దాటుతున్నది. అతనిలోని ఈ మార్పు తల్లి, తండ్రీ, శ్రీలక్ష్మి గ్రహించినా ఎవ్వరూ జోక్యం కలుగచేసుకోలేదు.
    ఆ రోజున ఉదయం తొమ్మిది గంటలయినా జానకిరాం నిద్ర పక్కమీంచి లేవలేదు. ఏమిటో ఆలోచన, దిగులు, అవ్యక్త వ్యధ ఆలోచిస్తూనే క్యాలండరు వైపు చూశాడు. నిరాశగా నవ్వు న్నాడు. తారీఖుల లెక్క ప్రకారం ఆ రోజు అతని పుట్టిన రోజు. ముఫ్ఫై వెళ్ళి ముఫ్ఫై ఒకటి ప్రవేశించింది. రోజులూ, నెలలూ, సంవత్సరాలూ గడచిపోతున్నయ్యి. కాలపు ప్రవాహంలో మునుగుతూ, తేలుతూ కొట్టుకు పోవటమే తప్ప కాలు నిలదొక్కుకొని ఈ ముఫ్ఫై ఏళ్ళలో తను చేసిన ఘనకార్య మేమీ కనబడలేదు. మన స్ఫూర్తిగా ఎవ్వరినీ సంతోషపెట్టలేదు. ఇన్నేళ్ళు కాపురం చేసినా భార్య తన మనస్సును గ్రహించలేదు. ఆమె భావాలనూ, అభిప్రాయాలను, ఎప్పుడూ మన్నించ లేదు. ఎప్పుడూ కన్న తల్లిదండ్రుల్ని కనిపెట్టుకుని ఉండాలనే మూఢ భావన తప్ప ఆ తల్లిదండ్రుల మనస్సుల్లో తన వల్ల ఏర్పడిన ఆందోళన పోగొట్టడానికి దోహదం చెయ్య ప్రయత్నించలేదు. తన కష్టార్జితంగా, తన సంపాదనగా ఒక్క రూపాయి ఏనాడూ తేలేదు. తన జేబులోకి ఆ రూపాయి కావాలన్నా తండ్రిమీద ఆధారపడవలసిందే. భార్యకు పూలుకావాలన్నా పెద్దల చేతుల్లోనుంచి రావలసిందే. కాలేజీ వదిలాక కాఫీ హోటలుకు వెళ్ళి రెండు మూడేళ్ళు అయింది. అదయినా ఎవరయినా ప్రాణ స్నేహితులు కనిపించి కాఫీకి రమ్మని బలవంతం చేస్తేనే. గౌతమి ఉన్న రోజుల్లో ఒక రోజున ఒక చిన్న సంఘటన జరిగింది.
    ఏనాడో ఎవరో బొట్టుపెట్టి ఇచ్చిన రెండు జాకెట్టు గుడ్డలు గౌతమి పెట్టెలో అడుగన పడిఉన్నయ్యి. ఆ జాకిట్టు గుడ్డలు అప్పట్నుంచీ కుట్టించుకోలేదు. కారణం అవి ఏమంత నచ్చకనే. తొడుక్కునే జాకిట్లు చిరిగిపోతుంటే చేత తనను అడిగింది. నాలుగు జాకిట్లు కుట్టించమని. శ్రీలక్ష్మి తో చెప్పమన్నాడు తను. శ్రీలక్ష్మితో గౌతమి చెప్పలేదు. ఆ మర్నాడే సెట్లో ఉన్న ఆ రెండు జాకిట్టు గుడ్డలు తీసి కుట్టించుకుంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS