"మీరా"
తృళ్ళిపడింది మీర. కుడి చేతిలోని మట్టిని దాచుకొని 'ఎవరూ' అంది.
"నేనే, ఏం చేస్తున్నా నిక్కడ?"
మీర పాలిపోయిన బుగ్గలు ఎర్రబడ్డాయి.
"ఏంలేదు" అంది మెల్లిగా.
"ఏమిటి తింటున్నావు"
"ఏమీ లేదే!"
శాము ఆమె చేతిని పట్టుకొని మెల్లిగా వేళ్ళను విడిపించాడు. అర చేతిలోని మన్ను కనిపించింది. మీర సిగ్గుతో తల వంచుకుంది. శాము నవ్వి,
"ఈ మన్ను తింటున్నావన్నమాట! ఇలాటి కోర్కెలే అయితే సులభంగా తీర్చేయవచ్చునే!" అంటూ, కాస్త పెద్ద మట్టిపెళ్ళ తీసుకుని, పొడిచేసి, ఆమె ముందుంచి "తీసుకో" అన్నాడు.
"నాకేం వద్దు."
"ఇది నీ కిష్టమయిందే కదా?"
"అయితే ఈ మట్టి తినిపించటంలోనే నా కోర్కెలంతా తీర్చేస్తారన్నమాట."
శాము చేతిలోని మన్ను క్రింద పారవేసి ఆమె నడుముచుట్టూ చెయ్యివేసి,
"నారాణి ఏం కోరినా తెచ్చివ్వగలను. కాని వీలులేనిది మాత్రం కోర రాదు" అన్నాడు.
మీర తన నడుం మీద నుండి అతని చేతిని తీసి వేస్తూ, "ఎవరైనా చూడగలరు. కాస్త దూరంగా ఉండండి" అంది.
"చిత్తం. రాణిగారి ఆజ్ఞ."
"ఈ పుట్ట కొట్టించేసి, కాస్త ఇసుక తెప్పించి వేయించండి."
"పుట్ట కొట్టించేయనా! తరువాత నీ గతేమిటి?"
"నాకేం ఫరవాలేదు గాని, ముందు పుట్ట కొట్టించేయండి. లేకపోతే పామువచ్చి చేరుకోవచ్చు."
"అత్తయ్య రొట్టె చేశారు. చాలా బాగుంది. రుచి చూద్దురుగాని రా."
"ఊహ, నా కది సయించదు."
"మరి నీకేం సయిస్తుంది. పోనీ నే నిచ్చే దేదో వద్దనకుండా తీసుకుంటావా?"
మీర తల అడ్డంగా వూపి "ఊహు మీ రిచ్చే దాంతో నా ఆకలి తీరదు. నాకు పళ్ళు తెప్పించి పెట్టండి" అంది.
లోపలికి వెళ్ళగానే "మీరు టిఫిన్ తినేసి రండి" అంది,
"ఊహు. నువ్వు వచ్చి అక్కడ కూర్చుంటే గాని నేను తినను" పసి పిల్లాడిలా మారాం చేశాడు శాము.
నిండు పున్నమినాడు వెన్నెల్లో భోంచేయాలని కోరింది మీర.
రాత్రి పదింటికి బండిలో చెరువు దగ్గరికి బయలు దేరారు. వెంకమ్మగారు 'బిసిబెళేహుళి' అన్నం, పెరుగన్నం, అప్పడాలు వడియాలు క్యారియర్లో సర్దిచ్చారు.
వీరు చెరువు దగ్గరికి చేరుకునే సరికి చంద్రుడు తూర్పువేపునుండి పైకి వస్తున్నారు. నారింజ పండు వన్నెలో నున్న చంద్రుడు పైకి రాను రాను బంగారు చాయ దాలుస్తున్నాడు. నీలాకాశంలోని చంద్రుడి ప్రతిబింబం నీటిలో మెరుస్తోంది. అపుడపుడూ చెరువులో పడే గడ్డి పరకలవల్ల, పిల్ల తరంగాలులేచి చంద్రుని ప్రతిబింబం చెదిరి మళ్ళీ మామూలుగా కనిపిస్తోంది.
నింగడు ఎడ్లనువిప్పి వాటిముందు గడ్డి పడేశాడు. మీర క్యారియర్ మూత తీసింది. శాము ముందు అరిటాకువేసి, "నింగా, నువ్వూరా"అని పిలిచింది.
నింగడు సిగ్గుపడుతూ, "మీరు భోంచేయండమ్మగోరూ నేను ఆనక తింటాను" అని దూరంగా వెళ్ళాడు. శాము మీర వేపు చూసి,
"నింగడు బుద్దిమంతుడు" అన్నాడు.
ఇద్దరూ ఒకరి కొకరు బలవంతంచేసి వడ్డించు కుంటూ నెమ్మదిగా భోంచెయ్యసాగారు.
శాము కొంటెగా "నీకు అబ్బాయి కావాలా, అమ్మాయా?" అని అడిగాడు.
మీర విసుగ్గా "అసలు నాకు పిల్లలు కావాలని లేదు. ఇపుడిక ఏదైనా ఒకటే" అంది.
"నాకేమో అమ్మాయే కావాలనునుంది. పిల్లలు లేక ఇల్లంతా బోసిపోయినట్టుంది. ఇక ఇల్లంతా కళకళలాడుతుంది. ఇంటినిండా పిల్లలుంటేనే బాగు. నంద గోకులంలా ఉండాలి."
"ఏం బాగో బాబూ. నా కేమిటో ఈసారికి ఈ గండం గడిస్తే చాలనిపిస్తోంది."
"నీకు ఒక బిడ్డ చాలంటావా మీరా?"
"ఒక బిడ్డ కావాలని కూడా కోరుకోలేదు. నేను ఇప్పుడు ఒక్క బిడ్డే చాలునని చెప్పక తప్పదు."
"నాకేమో ఆరుగురు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు ఉండాలని కోరిక."
మీర అదిరిపడి, "అప్పటికి నా పని అయిపోయినట్టే." అంది.
శామూ, అర్ధంకాక "ఏం నీకేం కష్టం?" అన్నాడు."
"నాకు కాకపోతే మరెవ్వరికి కష్టం? పిల్లలు ఆకాశంనుండి వూడి పడతారనుకొన్నారా? మగవారికేం తెలుసు బిడ్డ విలువ? తొమ్మిది నెలలూ మోసి కనటం అంత తేలిక అనుకుంటున్నారా? ఒక్కో బిడ్డకూ తల్లి, తన రక్త మాంసాలనే పంచాల్సి ఉంటుంది. ఒక్కోసారి ప్రాణాన్నే పణంగా పెట్టాల్సుంటుంది. తొమ్మిదిమంది పిల్లల్ని కనడమంటే నా సమాధి సిద్ధపర్చుకున్నట్టే."
శాము మృదువుగా అడిగాడు, "నీకు పిల్లలంటే ఇష్టం లేదూ?"
మీర నెమ్మదిగా తల అడ్డంగా వూపుతూ, "ఊహు. నాకు పిల్లలంటే కొంచెం కూడా ఇష్టం లేదు" అంది.
శాము నోట మాట రాలేదు. పురుషుడైన తాను, పిల్లలకోసం తహతహలాడుతూండగా ప్రేమ మూర్తి స్త్రీ తన హృదయాంతరాళంలోని మాతృత్వాన్ని కాదని, 'నాకు పిల్లలువద్దు' అనటాన్ని విని తన చెవులను తనే నమ్మలేకపోయాడు.
మీర హృదయంలో మరో రకమైన పోరాటం జరుగుతోంది. ఆడదాన్ని పిల్లల్ని కనే యంత్రంగా మార్చివేసే మగవారి పశుత్వం ఆమెలో ద్వేషాన్ని రేకెత్తించింది. పురుషుడంటేనే ద్వేషమూ, తిరసకారమూ ఏర్పడింది. భగవంతుడు ప్రతి ఒక్క మగవాడిని కూడా ప్రసవవేదనకు గురి చేస్తే అపుడైనా ఆడదాని కష్ట మెంతటిదో వారికి తెలిసి వస్తుందన్న తీరులో ఆలోచిస్తోంది మీర.
మీర పరధ్యానంలో అన్నం తినకుండా కూర్చోవటం చూసి శాము,
"భోంచేయి మీరా" అని హెచ్చరించాడు.
ఆరోజు భోజనాలు ఆ సమాధానంతోనే పూర్తయ్యాయి. పరస్పర భిన్నాభిప్రాయాలవల్ల ఆ చల్లటి వాతావరణం కూడా వేడెక్కింది.
అప్పటినుండి శాముకు తాను 'అపరాధి' నన్న భావన పీడించసాగింది. తన ముద్దుల భార్యమీద ఆమె కక్కర్లేని బరువు మోపానన్న బాధతో క్రుంగిపోసాగాడు. కాని. భావోద్వేగాల దాసుడైన శాము, ఏం చేయగలడు!!
మీర భోజన పానీయాల్లో ఏ విధమైన లోటూ రాకుండా చూసుకునేవాడు. రోజూ సాయంత్రం ఇద్దరూ కాస్త దూరం షికారెళ్ళేవార్. మరీ నీరసపడినప్పుడు పండితులిచ్చిన కషాయం సేవించి తెరుకునేది మీర.
మీరకు మొదట్లో తల్లి కావాలన్న కోర్కె లేకపోయినా, మూడు నెలలు నిండి, తన గర్భంలో కదలిక కలుగగానే ఒకవిధమైన మార్దవం, కోమల భావనలు హృదయాన్ని నింపివేసేయి. ఒక్కో సారి తన బిడ్డ ఎలా ఉంటుందోనన్న పిచ్చి ఆవేశంలో ఆ నిమిషమే తన బిడ్డను చూడాలన్న తీవ్రమైన ఆకాంక్ష కలిగి వెర్రిగా తహతహ లాడిపోయేది.
వెంకమ్మ గారి శుశ్రూషతో తన నెంతో శ్రద్దా సక్తులతో చూసుకుంటున్న తన భర్త సాన్నిధ్యంలో ఆమె రోజులు నిర్విచారంగా దొర్లిపోతున్నాయి.
మీరకు అయిదు నెలలు నిండుగానే కృష్ణయ్య గారు కూతురిని పురిటికి పంపవలసినదిగానూ, తీసుక పోవటానికి తాను వస్తూన్నట్టుగానూ ఉత్తరం రాశారు. పల్లెవాసంతో విసుగెత్తిపోయిన మీర సంతోషం అవధులు దాటింది. మీరను పంపించడానికి శాముకు కొంచం కూడా ఇస్జ్హ్తం లేదు. కాని తొలికాన్పవటంవల్ల, వైద్య సదుపాయాలులేని పల్లెలో వుంచుకొనే ధైర్యంలేక, ఆమె సౌఖ్యాన్ని గురించి ఆలోచించి, మైసూరు పంపించడానికే నిశ్చయించుకున్నాడు.
మీరకు పెదనాన్నను చూసి, ఎన్నో యుగాలయినట్టుంది. ఆయన వచ్చేరోజున, ఎదురుచూస్తూ గుమ్మందగ్గరే నుంచుంది. దూరంలో బండి కనిపించగానే, గబగబా నడచివెళ్ళి, బండి వెనుక వేపుకువచ్చి, "పెదనాన్నా" అంది. అల్లుడితో మాటల్లోపడ్డ కృష్ణయ్యగారు మీర కంఠంవిని, "బండి ఆపవయ్యా" అని క్రిందికి దిగారు. శాము కూడా బండిదిగి, నింగడితో "నువ్వెళ్ళు. మేమొస్తాం" అన్నాడు.
కృష్ణయ్యగారు ప్రేమతో మీర తలనిమిరి,
"చిక్కిపొయ్యా వేమిటమ్మా" అన్నారు.
"లేదు పెధనాన్నా, చిక్కి పోవటానికి, నాకేం?"
మొదట చిన్న పిల్లలా గెంతుతూ, నడకే తెలియనట్టున్న మీర, ఇప్పుడు నిండుగా, స్త్రీత్వాన్ని నింపుకుని, గంభీరంగా అడుగులు వేస్తోంది. గులాబి రంగు చీరలో, గులాబిపువ్వులా తమకెదురుగా వచ్చిన కుమార్తె పరిపూర్ణ సౌందర్యాన్ని చూసి, సంతోషమూ, గర్వమూ కలిగాయి, ఆయనకు. మీర అడుగుతున్న వంద ప్రశ్నలకూ నవ్వుతో బదులు చెప్పుతూ నడవసాగారు.
కృష్ణయ్యగారు వచ్చిన మరుసటిరోజే, మీరని తీసుకుని బయలుదేరాలను కున్నారు. కాని శాము బలవంతంవల్ల రెండురోజులాగక తప్పలేదు. లక్ష్మీ నిలయమైన శాము ఇంటినిచూసి, మీర అదృష్టానికి ఎంతో సంతోషించారాయన.
ప్రయాణానికి ముందురోజున కృష్ణయ్య గారికి విందు చేశారు. మీర తన సామాన్లు సర్దుకోవటం పూర్తయింది. రాత్రి వరండాలో కూర్చొనిశాము, కృష్ణయ్యగారూ, మీరా కబుర్లోపడ్డారు.
కృష్ణయ్యగారు" నామాటవిని, నువ్వూ రారాదటయ్యా శామన్నా రెండురోజులుండి తిరిగి రావచ్చు" అన్నారు. మీర శామువేపు సాభిప్రాయంగా చూసింది.
"లేదు మామయ్యా. నేనిప్పుడు రాలేను. మరోసారెప్పుడయినా వస్తాను."
"గోవిందు పెళ్ళికి ఎల్లాగూ రావాలనుకో. వచ్చేనెల మొదటివారంలోనే పెళ్ళి."
"ఏవూరమ్మాయి?"
"మైసూరే- ఇంటర్ పాసైంది. బెంగుళూరులో హోటల్ భోజనంతో విసుగెత్తింది, గోవిందుకి. బొంబాయి నుండి గోపాల్ కూడా వస్తున్నాడు, పెళ్ళికి."
"రాధవదిన వచ్చిందా, పెదనాన్నా?"
"ఊఁ. సుబ్బారావుగారే వెళ్ళి తీసుకొచ్చారు. ఇప్పుడు పురుటి రోజులు."
"కిశోర్ ఎల్లావున్నాడు?"
"వాడికేం! ఫైల్వానులా వున్నాడు. ఒక్కటే అల్లరి. 'తాత' అంటూ భుజమెక్కి కూర్చున్నా డంటే ఇక ఒక పట్టాన దిగడు. శామన్నా, నువ్వూ వస్తే బాగుంటుందయ్యా."
శాము సంకోచంతో "మీరు మరోలా అనుకోకండి మావయ్యా. ఇప్పుడు రాలేను. గోవిందు పెళ్ళికి తప్పక వస్తాను." అన్నాడు.
మీర ఆవలించింది. కృష్ణయ్యగారు అది గమనించి, "వెళ్ళమ్మా పడుకో నాకూ నిద్రొస్తూంది పడుకుంటా నిహ" అన్నారు.
రాత్రి చాలా సేపటివరకూ భార్యా భర్తలు కబుర్లు చెప్పుకుంటూ గడిపారు. పల్లె జీవితం ఎంత విసుగు తెప్పించినా తనకూ భర్తకూ మధ్య ఎన్నో భిన్నాభిప్రాయాలున్నా, ఇప్పుడు తను ఇంచుమించు వో సంవత్సరంపాటు భర్తను వదలి ఉండాలంటే బాధగానే ఉందామెకు. భర్త క్రాఫును నిమురుతూ.
"ఆదివారం తప్పకుండా తలంటు పోసుకోండి. లేకపోతే మళ్ళీ తల నొప్పి, కళ్ళు మంటలూ అవి బాధ పడతారు. రాత్రి పాలు త్రాగటం మరచి పోకండి....."
శాము మధ్యలోనే నవ్వి, "మీరా ఇవన్ని గుర్తుంచుకోలేను నేను. కాగితంలో వ్రాసి ఉంచు" అన్నాడు.
మీర తన చేతిలోవున్న అతని జుత్తును లాగి,
"తమాషాగా ఉందా, మీకు? నిజంగా చెపుతున్నాను నేను" అంది.
"సరే నువ్వు చెప్పిందంతా గుర్తుంచుకుంటాను. కాని నేనొక టడుగుతాను. చెప్పుతావా?"
"అడగండి"
"మీరా నీకు నిజంగా పిల్లలు కావాలని లేదా?"
మీర వెంటనే బదులు చెప్పలేకపోయింది. తనకు కడుపు వచ్చిన మొదట్లో బిడ్డ వద్దనిపించినా, "పీగుల్లోని బిడ్డ పెరుగుతున్నకొద్దీ తనకు తెలియకుండానే తన బిడ్డను ప్రేమించసాగింది మీర.
"పిల్లలంటే నాకు ద్వేషమేమీ లేదు."
శాము మీర రెండు చేతులనూ తన చేతుల్లోకి తీసుకొని, "నువ్వు అలాంటి వ్యధ మనసులో పెట్టుకోకు. మనోరోగాన్ని మించిన జబ్బు వేరే ఉండదు. నాకోసం, నీకోసం, మన బిడ్డల కోసం, నీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకో. డబ్బు కావాల్సినపుడు రాయి. ఏం కావాలన్నా తెప్పించుకో. నాకుమాత్రం వారానికో ఉత్తరం రాయటం మరచి పోకు...."
ఏ ఏ కారణాలచేతనైతేనేమి, దూరంగా ఉండి పోయిన రెండు హృదయాలూ, వాళ్ళ జీవితంలో ప్రవేశించనున్న నూతన శిశువువల్ల దగ్గరగా వచ్చాయి.
మీర వచ్చిందన్న వార్త వినగానే, రాజు, చంపా, నర్మదా ఆమెను చూడటానికి ఆత్రుతతో వచ్చారు.
"కంగ్రాటులేట్స్ మీరా"
"చాల్లే. హాస్యం చేయక్కర్లా"
"అన్ని పదవులకన్నా గొప్ప పదవి, మాతృత్వం పొందబోతున్నావు. నీ కింకా ఏం కావాలి?"
"ఛ! వూరుకోమంటూంటే. నర్మదా, రాధ వదిన ఎలా ఉన్నారు?"
"నీలాగే ఉంది. కాని బయటికి వచ్చే స్థితిలో లేదు. రేపు నువ్వేరా చూద్దూగాని."
"అలాగే. కిషోర్ ఎలా ఉన్నాడు?"
"రాజాలా ఉన్నాడు. నాకేమో పరీక్షలాయె. ఒక్క నిమిషం చదువుకో నివ్వడు."
"ఓహో మీ కందరికీ పరీక్ష లొచ్చాయి కదూ?"
అలా అంటున్నప్పుడు మీర కంఠం వణికింది. తనూ మెడికల్ కాలేజీలో చేరిఉంటే?......ఈపాటికి హాయిగా చదువు గొడవల్లో పడి ఉండేది. మీరకు శాముమీద, తనమీద, తనను సృష్టించిన బ్రహ్మమీదా కోపం ముంచుకొచ్చింది. నర్మదనూ, రాధ వదిననూ చూడటానికి వాళ్ళింటికి వెళ్ళాలనుకుంది మీర.
