Previous Page Next Page 
ఆంతస్తులూ అంతఃకరణలూ పేజి 32

 

    విశాలను పరీక్ష చేసిన విజయ ఏం మాట్లాడకుండా కార్లో కూర్చుంది.
    భానుమూర్తి వెనకాలే వచ్చి కారు దగ్గర నిల్చున్నాడు.
    "ఏవిటీ , విజయా?" అన్నాడు కాసేపటికి విజయ మౌనంగా ఉండడం చూసి.
    "ఇంటికి పోదాం పద ' అంది.
    రాఘవయ్య వరండాలో నిల్చుని విజయ మాటకోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు. మీనాక్షి గూడా ఆదుర్దాగానే ఉంది.
    "త్వరగా వచ్చేస్తాను , మాస్టారూ! మీరేం గాబరా పడకండి!' అంటూ కారెక్కాడు భానుమూర్తి.
    ఐదు నిమిషాలకు కారు ఇంటి ముందు ఆగింది. విజయ మేడమీదకు దారి తీసింది.
    "ఊ....ఇక చెప్పు" అన్నాడు భానుమూర్తి. విజయ కెదురుగా కూర్చుంటూ.
    "నువ్వెంతో బుద్ది మంతుడి వనుకున్నాను!" "కాదా?" నవ్వుతూ అడిగాడు.
    "ఎంతో సంస్కారమూ, సంయమన శక్తీ కలవాడి వనుకున్నాను గానీ యిలా ఉద్రేకాలకు దాసుడవై పోతావని అనుకోలేదు."
    'అబ్బ! చంపక ఆ చెప్పే దేదో సూటిగా చెప్పరాదూ?"
    "నువ్వు తండ్రివి గాబోతున్నట్లు విశాల నీతో చెప్పలేదా?: క్రీగంట చూస్తూ నవ్వి అంది విజయ.
    భానుమూర్తి , నెత్తిన పిడుగు పడ్డట్లయింది. తాన చెవులే తన్ను మోసం చేస్తున్నాయేమో అనిపించింది కాసేపటికి.
    "విజయా! ఏవిటి నువ్వన్నది?" అన్నాడు తడబడే గొంతుతో.
    'అలా మాట్లాడతావేం? నీకు నిజంగా తెలీదా? ఈ విషయం కప్పుపుచ్చాలనేగా ప్రత్యేకంగా నన్నే వచ్చి పిలుచుకెళ్ళావు!' ఆశ్చర్యాన్నంతా కళ్ళల్లో కుమ్మరించింది విజయ.
    "చాలు! ఇక మాట్లాడకు!' అన్నాడు భానుమూర్తి ఎర్రబడిన కళ్ళతో. ముక్కు పుటాలు క్రోధంతో చలిస్తున్నాయి. దవడలు అదురుతున్నాయి.  పెదవులు వణుకుతున్నాయి. కాస్సేపటి వరకూ మనిషల్లా నిలువుగా సన్నగా కంపించి పోయాడు.
    ఎనలేని దుఃఖము. కోపమూ హృదయాన్ని సమంగా పంచుకున్నాయి.
    విజయ ముందు ఉండలేక వరండాలోకి వచ్చేశాడు.
    బాగా చీకటి పడింది. నక్షత్రాలు అక్కడక్కడా మెరుస్తున్నాయి. నైట్ క్వీన్ పూలవాసన గుప్పుమంది. విశాల కళ్ళ ముందు నిలిచినట్లయింది. దుఃఖం పెల్లుబికింది. కన్నీళ్ళు పొంగాయి. కోపాగ్ని జ్వాలలు రగిలాయి. కళ్ళల్లో నుండి నిప్పురవ్వలు రాలాయి.
    "ఛీ! పాతకి! కాముకి! తన జీవితాన్ని నాశనం  చేసిన రాక్షసి! నమ్మక ద్రోహం చేసిన ద్రోహి! భగవాన్! నేనేం పాపం చేశాను? నా జీవితం ఎందుకిలా భ్రష్టు చేశావు? అందుకే గాబోలు డాక్టరు దగ్గరకు ఎంతమంది చెప్పినా వెళ్ళలేదు. భవిష్యత్తు మీద ఎన్నికలలు మేడలు కట్టుకున్నాను? అన్నీ కూలిపోయాయి!"
    కళ్ళల్లో నుండి నీళ్ళు రాలి 'టప్ టప్ ' మంటూ చెక్కిళ్ళ మీదుగా జారాయి. పెల్లుబికి వస్తున్న ఏడ్పును గొంతులోనే మింగేశాడు.
    "విశాలా! ఎందుకలా చేశావు? సద్గుణాలకు మరో ప్రతిరూపమే నువ్వనుకున్నానే? నా అభిప్రాయాల నన్నింటిని ఎందుకలా వమ్ము చేశావు? నా సుఖమూ, సంతోషమూ, జీవితమూ - అన్నీ నువ్వే అనుకున్నాను. నా హృదయాన్నెందుకిలా బ్రద్దలు చేశావు? భగవాన్! ఈ హృదయం లోని గాయం ఎలా మానుతుంది? విశాల నెలా మరిచిపోగలను?" గోడకు తల ఆన్చి విలవిల్లాడి పోయాడు భానుమూర్తి.
    చల్లని గాలి రివ్వుమంటూ వచ్చి తాకింది. దానితో పాటే మృదు హస్తం భానుమూర్తి భుజాన్ని తాకింది.
    తలెత్తి కన్నీటి పారగుండా చీకటిని చీల్చుకుని చూశాడు.
    విజయ కళ్ళు పరితాపాన్ని కుమ్మరిస్తున్నాయి.
    "ఎందుకలా బాధపడతావు , భానూ?"
    "బాధపడక ఏం చెయ్యను? జీవితమే నాశనమైంది." జీర గొంతుతో అన్నాడు.
    "అది నీ భ్రమ! అలా అనుకుంటున్నావు. అంతే!" విచారంగా నవ్వి అంది.
    "లేదు, విజయా! నీకు తెలిదు. నా ప్రాణం కన్నా ఎక్కువ విశాల. అలాంటి విశాల యీ రోజూ నా హృదయాన్ని ప్రయ్యలు చేసింది. బ్రతుకులోని తీపినంతా మాయం చేసిన రాక్షసీ! ఈ విషయం అసలు నీ కర్ధం కాదు." ఉప్పటి కన్నీరు పెదవులను తాకి జీవితంలోని కఠినత్వాన్ని ఋజువు చేసింది.
    "కులం తక్కువ వాళ్ళకు గుణం కూడా తక్కువేనని నిరూపించింది!" కఠోరంగా అంది విజయ.
    'అలా అనకు, విజయా! అది ఎంతమాత్రం నిజంకాదు."
    "హు.... ఇంకా నీకు పిచ్చి పోలేదు, భానూ! విశాలను మించిన వాళ్ళు ప్రపంచంలో ఎందరో వున్నారు. జీవితంలో క్రొత్త అవకాశాలు ఎన్నో వుంటాయి. జరిగిపోయిన దాన్ని గురించి ఆలోచించడం , విచారించడం వివేకుల లక్షణం కాదు. జీవితా న్నేప్పుడూ సుఖమయం చేసుకొనే మానవుడు ప్రయత్నించాలి. అంతేగాని ఏడుస్తూ కూర్చోరాదు." భానుమూర్తి ముఖంలోకి పరీక్షగా చూస్తూ అంది.
    "కలిగిన ఈ అవకాశాలూ, అనుభవాలూ చాలు!" విరక్త కంఠంతో అన్నాడు భానుమూర్తి.    
    "పోనీ విశాల నింకో డాక్టరుకు చూపించు."
    "వద్దు, నీమీద నాకు పూర్తీ నమ్మకముంది."
    విజయ ముఖం ఒక్క క్షణం మరీ కఠినంగా ఉండిపోయింది.
    "అందుకు కృతజ్ఞురాల్ని!" అంది నిమిషం తర్వాత నిర్లిప్తంగా.
    ఇద్దరూ మౌనంగా నిల్చుండి పోయారు ఆ చీకట్లో , నైట్ క్వీన్ పూల వాసన ఉండీ ఉండి గాలిలో తేలి వస్తుంది. దూరంగా ఎక్కడో పక్షి అరిచింది.
    కారు హరన్ లూ, రిక్షా గంటల గలగలలూ వినిపిస్తున్నాయి. ఒక్కో మబ్బే ఆకాశాన్ని పలచగా కప్పుతుంది.
    "భానూ!"
    భానుమూర్తి ఉలిక్కిపడి ఊకోట్టాడు.
    "నేనొక మాట చెప్తాను. వింటావా?" భానుమూర్తి దగ్గరగా వెళ్ళి భుజం మీద చెయ్యి వేసి అంది.
    "ఏవిటి?"
    "జరిగిన విషయం మరిచిపో. జీవితం యిచ్చే ప్రతి అవకాశాన్ని వినియోగించుకో. జీవితాన్ని సుఖప్రదం చేసుకో."
    "ఊహు..... అది అసాధ్యం. విశాల రూపాన్ని నా హృదయం మీద నుండి చెరిపి వెయ్యలేను. జీవితం మీదే అసహ్యం వేస్తుంది." విజయ చేతిని భుజం మీద నుండి తీసేస్తూ విచారంగా అన్నాడు.
    విజయ ముఖం మరీ కఠినంగా తయారయింది. చలిగాలి మరీ జివ్వు మనిపిస్తుంది. చలిగాలికి ఇద్దరూ సన్నగా వణికారు. లోపలికి వెళ్ళాలన్న ఆలోచన ఇద్దర్లో ఒక్కరికీ కలగలేదు.
    "భానూ! ఒకవేళ...."
    "ఊ....ఏవిటి?" నీరసంగా అన్నాడు.
    "ఒకవేళ నేనే నిన్ను పెళ్ళి చేసుకోమని అడిగితె ...." నవ్వడానికి ప్రయత్నించి అంది విజయ.
    "విజయా?"
    "ఏం?"
    "వద్దు! అలా ఎప్పుడూ ఆలోచించకు."
    విజయ అదో రకంగా నవ్వింది. "ఏవిటది?" భానుమూర్తి ముఖంలోకి చూస్తూ భయంగా అంది.
    "తల తిరుగుతుంది."
    "పడుకుంటావా?"
    "వద్దు, వెళ్తాను."
    భానుమూర్తి తడబడుతున్న అడుగులతో వెళ్ళిపోయాడు. విజయ చీకట్లో నిల్చుని గేట్లో నుండి వెళ్ళిపోతున్న భానుమూర్తి ఆకారం వేపు తదేకంగా చూస్తూ నిల్చుంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS