Previous Page Next Page 
మిసెస్ కైలాసం పేజి 32


    "ఊరుకో పాపం, చెయ్యాలని చెయ్యలేదుగా!" ఆ పక్కనే కూర్చొని భర్తతో కబుర్లు చెబుతూ పల్లీలు తింటున్న ఓ యువతి అంది.
    మల్లమ్మ నాగేషును తిట్టుకుంటూ వచ్చి దుకాణం దగ్గర కూర్చుంది. నాగేషు పిల్లిలా వచ్చి పళ్ళ దుకాణానికి అల్లంత దూరంలో నిల్చున్నాడు. అశాంతిగా అటూ ఇటూ తిరగసాగాడు. వాడి అవస్థ అంతా పళ్ళమ్మి మళ్ళీ పిలవాలనే అని అర్థంచేసుకున్న విశ్వనాథంగారు లోలోపల నవ్వుకున్నారు. మల్లమ్మ వాడిని గమనించనట్లే కూర్చుని పళ్ళు అమ్ముకోసాగింది. నాగేషు విశ్వనాథం కూర్చున్న బెంచీకి వెనగ్గా వచ్చి నిలబడ్డాడు....
    "ఇట్టారారా! సచ్చినోడా!" పిల్చింది మల్లమ్మ. నాగేషు ఉత్సాహంగా ముందుకు దూకాడు.
    తట్టలో గుడ్డకిందగా వున్న చెంబు తీసి ఇచ్చింది మల్లమ్మ. వాడు హుషారుగా చెంబు తీసుకొని పరుగెత్తుకెళ్ళాడు. అయిదు నిముషాల్లో నీళ్ళు తెచ్చి పళ్ళమ్మికి అందించాడు. పళ్ళమ్మి చెంబెడు నీళ్లు గటగటా తాగేసి, కొద్దిగా మిగిల్తే దూరంగా విసరికొట్టి, మళ్ళీ చెంబును తట్టలో పెట్టుకొంది. ఈసారి నాగేషు మల్లమ్మకు ఎదురుగా గొంతుకూర్చున్నాడు. అరచేతిలో గడ్డాన్ని ఆనించుకొని, పెద్ద కళ్ళను పూర్తిగా విప్పుకొని మామిడిపళ్ళకేసి చూడసాగాడు., పెదవులు తడుపుకుంటున్నాడు. వాడి కళ్ళలో మామిడిపళ్ళ తాలూకు పసిమి తళుక్కుమంది.
    పళ్ళమ్మి వాడిని కళ్ళతోనే దగ్గిరకు పిలిచి ఏదో చెప్పింది. నాగేషు ఆమె పక్కగా నిలబడి "మామిడిపళ్లూ! రసాలు! పెద్దరసాలు. ఒక్కసారి తిని చూడండి!" అంటూ గట్టిగా కేకలు పెడుతుంటే, గొంతు నరాలు ఉబుకుతున్నాయి. విశ్వనాథంగారు నాగేషునూ, మల్లమ్మనూ కుతూహలంగా చూస్తూ కూర్చున్నారు. వ్యాపారం జోరుగా సాగింది. చాలావరకు పళ్ళు అమ్ముడుపోయాయి.
    నాగేషు మల్లమ్మ దగ్గరగా వెళ్ళి చెయ్యి చాపాడు. "చచ్చినోడ! ఏం తొందర్రా! ఇస్తాలే! ఇంకా సగమన్నా అమ్ముడు పోలేదు." అంది మల్లమ్మ. నాగేషు మళ్ళీ కేకలు పెట్టాడు. తారాస్థాయిలో వాడి కంఠస్వరం కీచుమంటున్నది. మరో పావుగంటలో పళ్ళన్నీ అమ్ముడుపోయాయి.
    కుర్రాడిలో సహనం నశిస్తున్నట్లు గమనించారు విశ్వనాథంగారు. వాడు అరవటం మానేసి దుకాణం దరిదాపుల్లోనే అశాంతిగా తిరగసాగాడు. అంతలో ఓ పాతిక సంవత్సరాల యువకుడు, ఓ ఐదేళ్ళ కుర్రాణ్ణి వెంటబెట్టుకొని పళ్ళ దుకాణం కేసి వచ్చాడు. ఒక పండు కొని ఇచ్చాడు. నాగేషు కుతూహలంగా చూస్తూ కుర్రాడి పక్కగా వెళ్ళి నిల్చున్నాడు. ఓ చేత్తో రసం పీలుస్తూ, మరో చేత్తో తండ్రి చెయ్యి పట్టుకొని వెళుతున్న, ఆ కుర్రాడి వెనకే నాగేషు కొంతదూరం నడిచాడు. పండు తింటున్న కుర్రాడి ముఖంలోని ఆనందాన్ని అందిపుచ్చుకొని నాగేషు తిరిగి మల్లమ్మ దగ్గిరకొచ్చి నిలబడ్డాడు. ఈసారి వాడి ముఖంలో మొండితనం కనిపించింది. పళ్ళమ్మి ఓ నిముషం వాడి ముఖంలోకి చూసి ఏమనుకుందో, తట్టలో చెయ్యిపెట్టి, ఓ చిన్నపండు తీసి నాగేష్ చేతులో విసురుగా వేసింది. నాగేషు ఆశగా అందుకున్నాడు. ఆ పండు తాలూకు స్పర్శవల్ల హృదయంలో కలిగిన ఆనందం కళ్ళలో మెదిలింది. ఆత్రంగా మూతి దగ్గిర కొంచెం కొరికి పండురసం జుర్రుకున్నాడు నాగేషు. క్షణంలోనే వాడిముఖం వికృతంగా మారిపోయింది. నోట్లో మిగిలిన రసాన్ని ఊసేసి, చేతిలో పండును నేలకు కసిగా విసిరికొట్టాడు.
    "ఓరి సచ్చినోడా! బంగారంలాంటి పండును నేలపాలు చేశావు!" అంది మల్లమ్మ.
    "కుళ్ళిపోయింది ఇచ్చావు. ఇంకోటి ఇయ్యి!" చేతిని చొక్కాకు తుడుచుకుంటూ అడిగాడు నాగేషు.
    "దొంగ సచ్చినోడా! ఇంకోటి ఇయ్యాలా! పో దూరంగా!" కళ్ళెర్రజేసి కసిరింది మల్లమ్మ.
    నాగేషు ముఖంలో దుఃఖం, కోపం ముప్పిరిగొన్నాయి. దుకాణం దరిదాపుల్లోనే పళ్ళమ్మిని ఉరిమిఉరిమి చూస్తూ తిరగసాగాడు. ఆకాశంలో పూర్తిగా వెలుగు ఆరిపోలేదు. కాని గార్డెన్ లో దీపాలు వెలిగాయి.
    "మనదేశం నుంచి ఎగుమతి అవుతున్న మామిడిపళ్ళకు రష్యాలో చాలా గిరాకీగా వుంది__" రేడియోలో తెలుగులో వార్తలు వినిపిస్తున్నాయి.
    మల్లమ్మ నాగేషును దగ్గరకు పిల్చింది. వాడు ఉత్సాహంగా వచ్చాడు. చెంబు అందిస్తూ నీళ్లు తెమ్మంది. వాడు చెయ్యిచాపలేదు. ముందు పండు ఇవ్వు నీళ్లు తెస్తాను."
    "ఇచ్చాగా?"
    "అది కుళ్ళిపోయింది."
    "రేపిస్తాలే!"
    "ఉహూ! ఇప్పుడే ఇవ్వాలి!"
    "ఇస్తాలే నీళ్లు తే!"
    "అదేం కుదరదు. ముందు పండిస్తేనే!" మొండిగా అన్నాడు నాగేషు.
    "దొంగసచ్చినోడా! ముప్పయ్ పైసల కూజా ముక్కలు చేశావు. ఆరణాలపండు, బంగారంవంటి పండు మట్టిపాలు చేశావ్" అంటూ మల్లమ్మ చెంబు తీసుకొని లేచి నిలబడింది. దుకాణంకేసి ఓసారి పరీక్షగా చూసుకుంది.
    "బాబుగారూ!" తమవైపే చూస్తున్న విశ్వనాథంగారిని సంబోధించింది. మల్లమ్మ ఏమీ చెప్పకపోయినా పళ్ళమ్మి ఉద్దేశాన్ని గ్రహించారు విశ్వనాథంగారు. మల్లమ్మ తిరిగి తిరిగి చూసుకుంటూ వెళ్ళిపోయింది. అలా పోతున్న మల్లమ్మనీ, కింద గోనె పట్టామీద పరచివున్న పళ్ళనీ మార్చి మార్చి చూశాడు నాగేషు. ఒకడుగు ముందుకు వేసి, ఏదో జ్ఞాపకం వచ్చినవాడిలా బెంచీమీద కూర్చున్న విశ్వనాథంగారివైపు చూశాడు. ఆయనగారు తనను గమనిస్తున్నట్లు చూసి, ఏమీ ఎరగనట్లు దూరంగా నిలబడ్డాడు. దారేపోతున్న కుక్కమీద గడ్డ విసిరాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS