ఆ పులిపిల్లను తెచ్చి ఇమ్మంటూ సైగలు చేయటం ప్రారంభించింది. ఆమె ముఖంలో చిరునవ్వు ప్రసన్నతా భావాన్ని చూడటం ఒక వ్యసనంగా మారిన అర్ధమానవుడు మాలతి మనసు గ్రహించాడు. ఇంకా ఆ తరువాత అరక్షణ మైనా ఆలస్యం చేయలేదు. వెనుకంజ వేయలేదు.
గుహ ముఖం దగ్గర నిలిచి రిక్కచేయడం ప్ర్రారంభించాడు. రవంతసేపటికి ఎవరో తట్టిలేపినట్టుగా పులి వులిక్కిపడి లేచింది. రిక్కవిని అది బాగా రెచ్చిపోయింది.
గుహ అంతర్భాగం నించి బిడ్డల్ని వదిలి తుఫాను వేగంతో వచ్చి పడిందది. మాలతి విభ్రాంత అయింది. కొయ్యబొమ్మలా నిల్చిపోయిందామె.
అర్ధమానవుడు దానితో పోరాటానికి సంసిద్ధుడయి వాడు. అతడు నిరాయుధుడు. అయినా కత్తులు చురికలవంటి వాటిని ప్రయోగించడం అతనికి తెలియదు. రాతిని పగలగొట్టి పదునయిన ఆయుధాలుగా మలుచుకోవడం తెలుసు. చేవ కలిగిన ముక్కలను ఛావర్స్ (బ్లేడు ముక్కల్లా మిక్కిలి పదునయిన పనిముట్టు)గా మలుచుకోవడం తెలుసు.
ముందుగా సంసిద్దుడు కాలేదు. అందునించి అలాంటివి కూడా అతని చేతిలో లేవు. కాని బెబ్బులికి జన్మతః వచ్చిన గోళ్ళున్నాయి. అవి ఆయుధాలకన్నా పదును అయినవి. బలమయినవి. పంజా విప్పి దెబ్బ కొట్టింది బెబ్బులి.
అర్ధమానవుడి జబ్బ చీరుకుపోయింది. శరీరంమీద కోసి నట్టుగా గీతలు పడ్డాయి. లోతయిన గీతలనించి రక్తం ధారలుగా కారుతోంది.
అతడు రవంత అయినా లక్ష్యపెట్టలేదు. దానిగురినించి పక్కకు తప్పుకున్నాడు. బెబ్బులి బాలెంతరాలు. మంచి ఆకలిమీద వుంది. పులులకు ప్రసవం తరువాత వాటికి ఆకలి అధికమవుతుంది.
అందునా అది తన బిడ్డలతో ఆవాసముంటున్న నెలవుకు చేరువలో కదలికలు జరుగుతున్నాయని భావిస్తే అది మరింతగా చికాకు పడుతుంది. క్రోధంతో బుగ్గలు కొడుతుంది.
దాని శరీరం ఇంచుమించు అయిదున్నర అడుగుల పొడవుంది తోక నాలుగు అడుగులుంది. ఆడ బెబ్బులులకు మూతిమీద మీసాలుంటాయి.
అది నోరు తెరిచినప్పుడు అది మృత్యువు గుహలా కనిపిస్తోంది. ఎర్రని నాలుక కాళిక నాలులా భయంకరమనిపిస్తోంది. వొంకీలు తిరిగిన తెల్లని కోరలు ఆకలితో దొరికిన వేటను చీల్చేందుకు ఆవురావురుమంటోంది.
బెబ్బులి ఒక్కసారి పెద్దగా చొచ్చిపెట్టింది.
అర్ధమానవుడు దొరికిన అవకాశాన్ని వృధా పోనివ్వలేదు.
బెబ్బులి తిరిగి అతనిమీదికి లంఘించేందుకు సమాయత్తమవుతోంది. పొజిషన్ తీసుకునేందుకు అది రెండు అడుగులు వెనుకకు వేసింది. రెండు క్షణాలు.
ఆ రెండు క్షణాలలో చేతికి దొరికిన ఒక పొడవాటి రాతి ముక్కను అందుకున్నాడు అర్ధమానవుడు. దానిని ప్రక్కనే ఉన్న మరొక రాతికేసి బలంగా కొట్టాడు. పొడవాటి రాయి రెండుగా చీలింది.
చీలిన అంచులు పదును తేలినాయి. ఒక వంక కోసుగా ఇంచుమించు చారికలా తయారయింది. అద్భుతమయిన ఆటవిక మయిన ఆ భీకర పోరాటాన్ని రెప్ప వేయకుండా చూస్తుంది మాలతి.
అర్ధమానవుడు ఆటవికుడయినా మానవుడే మేధావి. బెబ్బులి ప్రకృతి రీత్యా తనకు లభించిన గోళ్ళు కోరలు మాత్రమే ఆయుధాలుగా వాడుకొంటోంది.
కాని మనిషి!
దాని శారీరక శక్తిముందు తాను నిలువలేనని అనుకున్నప్పుడు ఒక పరికరాన్ని సృష్టించగలిగాడు. అది రాతిముక్కే కావచ్చు, కాని పరికరం.
అటువంటి ఆటవికుని ఆలోచించనించే ఈనాటి యంత్ర పరికరాల యుగం ప్రారంభమయ్యింది. తన అల్పాతి అల్పమయిన శక్తితో ప్రకృతి శక్తులమీద ఆధిపత్యాన్ని చెలాయించాలన్న తపన అనాది మానవుడికే వుంది.
అది మేధావి లక్షణం.
తన తెలివితో పరికరాన్ని రూపొందించి తనకన్నా శక్తివంతమయిన జంతువుల్ని ఎదుర్కోవాలన్న సాంకేతిక పరిజ్ఞానం ఆనాటి ఆటవికునికే ఏర్పడింది.
అది పరిణామ దశలో ఈనాటి సాంకేతిక విజ్ఞానంగా రూపొంది విశ్వ క్షేత్రంలో మనిషి విలక్షణత చాటి చెబుతోంది. ఈనాడు కుటిల స్వార్ధానికి రూపొందించుకుంటున్న మారణాయుధాలు ఆనాటి ప్రకృతి పుత్రుడయిన మానవుడు ఆత్మరక్షణకోసం రూపొందించినాడు.
