Previous Page Next Page 
మట్టి మనిషి పేజి 32


    "మా అమ్మ పొద్దున్నా, సాయంకాలం వచ్చి వణ్ణం వండుద్ధి. మిగతా పనులన్నీ నేను చేసుకుంటా."
    "ఊఁ! ఏడ్చావ్ గానీ, ముందు నువ్వెళ్ళి మా దాసి బుచ్చమ్మనూ, సుబ్బడి పెళ్ళాం లక్ష్మినీ పిల్చుకురా. ఇక్కడున్నట్టు రావాలి."
    "అట్టానే అమ్మగోరూ!"
    "ఒరేయ్ రావుడూ, ఇంకా అక్కడేం చేస్తున్నావురా - అబ్బాయికి అన్నం పట్టుకెళ్ళకుండా?" బయటికి పోబోతున్న జీతగాడ్ని చూసి కేకపెట్టాడు సాంబయ్య. యజమాని మాట చెవినిబడ్డా వాడి బుర్రకెక్కలేదు. తలగుడ్డ బిగించుకొని బయటకి దౌడు తీశాడు. అలా వట్టి చేతుల్తో బయటికి వెళ్ళిన రాముడ్ని చూసి సాంబయ్యలేచి నట్టింట్లోకి వచ్చాడు. బల్లమీదున్న అన్నంమూట చూసి సాంబయ్య చిరాకుపడ్డాడు.
    "అన్నం ఇక్కడ పారేసి వాడెక్కడికి వెళ్ళాడూ?" దీర్ఘంతీస్తూ పడమటి గదికేసి తిరిగి అన్నాడు.
    వరూధిని తలుపు చాటుననిలబడి ఏమో చెప్పాలని ప్రయత్నించింది. కాని మాట పెగల్లేదు. మళ్ళీ మామగారు అడిగితే చెప్పాలన్న ప్రయత్నంలో మాటలు కూడబలుక్కుంది. రెండు క్షణాలు అక్కడే నిలబడి అన్నంమూట తీసుకొని వీధిలోకి వెళ్తూన్న మామగార్ని తలుపుచాటునుంచి బయటకు వచ్చి చూసింది వరూధిని---
    "మురికి మనుషులు!" అనుకుంది.
    ఆకలి వేసి వంట గదిలోకి వెళ్ళింది. మామ తిన్న ఎంగిలి పళ్ళెం వంటగది మధ్యలో వుంది. ఈగలు అన్నపు కుండమీదా, ఎంగిలి పళ్ళెం మీదా మూగి వున్నాయి. మునికాళ్ళ మీద నడిచి వంగి కూరగిన్నెమీద మూతవేసి చూసింది. సొరకాయ పులుసులా వుంది. నల్లగా అడుగు అంటిపోయివుంది. మరో గిన్నె మూతతీసి చూసింది. పచ్చిమిరపకాయల పచ్చడి. తొక్కలుతొక్కలుగా కన్పించింది. పెరుగుమీద మూతలేదు. పెరుగు బురబురలాడుతోంది. ముంత ఎత్తి ముక్కు దగ్గర పెట్టుకొని వాసన చూసింది. ముక్కూమూతి బిగించుకొని పెరుగుముంత దభీమని కింద పెట్టింది. అడుగువూడి పెరుగు చింది వరూధిని కాళ్ళమీద పడింది. అన్నం తినాలన్న ఆలోచన ఎగిరిపోయింది. ఈ కొంపలో ఈ తిండి తింటూ వుండే వీళ్ళు - మనుషులేనా?
    తను తెచ్చినవాటిల్లో ఇంత జిలేబీ, ఓ మైసూర్ పాక్ తిని నీళ్ళు తాగింది. రాముడికోసం ఎదురు చూస్తూ వాకిట్లో తలుపు పక్కగా నిలబడింది వరూధిని.
    సాంబయ్య పొలంనుంచి వచ్చేసరికి దీపాలు పెట్టారు. మెట్లమీద లాంతరు పెట్టివుంది. నడవా అంతా వెలుతురు పడుతోంది. అరవై ఏళ్ళుగా చీకటిలో నడవటం అలవాటుపడ్డ సాంబయ్యకు వెలుగుబాటులో నడవటం కొత్తగా అనిపించింది. ఉన్న లాంతరు నడవలో పెడ్తే ఇంట్లో ఎట్టా? తలయెత్తి చూసిన సాంబయ్యకు  ఇల్లంతా వెలుగు కనిపించింది. గదికొక దీపం పెట్టివుంది. గొడ్ల చావిట్లో కూడా దీపాలు వెలుగుతున్నాయి. వరండాలోకొచ్చిన సాంబయ్య తన ఇంటిని తనే గుర్తుపట్టలేనట్టయిపోయాడు. అక్కడ చెయ్యి విరిగిన కుర్చీగాని, నెర్రెలు విచ్చిన బల్లగానీ లేవు. గోడలకు తగిలించినవి ఏమీ కన్పించలేదు. నేలంతా మెరుస్తూవుంది. పైపంచెతీసి పెట్టడానికి వరండాలో ఏమీ కన్పించలేదు. నేలంతా మెరుస్తూవుంది. పైపంచతీసి పెట్టడానికి వరండాలో ఏమీ కన్పించలేదు. కూర్చోడానికి కూడా ఏమీ కన్పించలేదు. చొక్కావిడిచి చేతులో పట్టుకొని తన ఇంట్లో తనే కొత్తవాడిలా తిరుగుతున్నాడు సాంబయ్య.
    "ఒరేయ్ రావుడూ!" అంటూ కేకపెట్టాడు. దాసి బుచ్చమ్మవచ్చి "బాబుగారూ! అని ఇట్టా ఇవ్వండి" అంటూ పైపంచా, చొక్కా అందుకొంది.
    "ఎవరూ?" సాంబయ్య నొసలు పైకెత్తి చూశాడు.
    "నేనే బాబుగారూ, బుచ్చమ్మని!"
    బలరామయ్య ఇంట్లో వుండే దాసీదని గుర్తుపట్టాడు సాంబయ్య.
    "నువ్వా! బుచ్చమ్మా? బాగున్నావా?" అన్నాడు సాంబయ్య.
    "స్నానానికి లేవండయ్యగారూ! నీళ్ళు తోడించాను" అంది బుచ్చమ్మ.
    "అరె! అప్పుడే నీళ్ళు పెట్టేశారా?" అప్రయత్నంగానే అనేశాడు సాంబయ్య.
    మామూలుగా అయితే తను పొలాన్నుంచి వచ్చాక రాముడ్ని నాలుగు కేకలు వేశాక కాని నీళ్ళు పెట్టటం జరగదు. స్నానానికి వెళ్ళబోతూ తుండుగుడ్డా, కట్టుపంచెలకోసం వెతకసాగాడు. కాని నాటి అయిపూ, అజా ఎక్కడా లేదు.
    వరూధిని మామగారి తడవుళ్ళాట చూసి "బుచ్చమ్మా!" అంటూ కూనిరాగం తీసింది.
    "అన్నీ అక్కడే ఉంచాం. తమరు స్నానం చెయ్యండి?" అంది బుచ్చమ్మ. అలవాటుగా గాబుదగ్గిరకు వెళ్ళాడు సాంబయ్య.
    "అయ్యగారూ, ఇక్కడ!" అంటూ గోడవారగా ఎత్తుపీట వున్నచోటు చూపించింది బుచ్చమ్మ.
    సాంబయ్య స్నానం పూర్తికాగానే ముందు తుండు, ఆ తర్వాత కట్టుపంచె అందించింది బుచ్చమ్మ. సాంబయ్యకు ఆ రోజు తన కెవరో స్నానం చేయించినట్టుగా వుంది. అదీ చాలా తేలిగ్గా, సుఖంగా, తొందరగా అయిపోయినట్టుంది. ప్రతీరోజూ స్నానానికిముందు బట్టలు వెతుక్కోవటానికి ఐదు నిముషాలు పట్టేది. రాముడు మసిలే నీళ్ళకాగు అక్కడపెట్టి, రెండు కడవల చన్నీళ్ళు దించి వెళ్ళిపోయేవాడు. ఒకోసారి తపాళే కన్పించేదికాదు. కాని ఇవ్వాళ నీళ్ళు సమానంగా కలిపివున్నాయి. స్నానానికి పెట్టిన గుండెగా, తప్పేళా మెరిసిపోతున్నాయి. సాంబయ్య వాటిని వెంటనే గుర్తుపట్టలేకపోయాడు కూడా!
    సాంబయ్య స్నానం చేసి వంటింట్లోకి వచ్చాడు. ఇల్లంతా మారిపోయింది. తవుడుబస్తాలూ, వడ్లబస్తాలూ ఏమీ లేవు. ఎద్దుల పట్టేళ్ళూ, చిక్కాలూ, పగ్గాలు, భోషాణం కావిడి పెట్టె అక్కడ లేవు. గోడవారగా నవారుమంచంమీద పరుపు వేసివుంది. దానిమీద తెల్లటిదుప్పటి పరచివుంది. దిండ్లకు గలీబులు తొడిగి శుభ్రంగా వున్నాయి. మంచం పక్కగా సాంబయ్యకూర్చొనే కుర్చీ వుంది. సాంబయ్య కుర్చీలో కూర్చొని ఇల్లంతా పరికించి చూశాడు. అంతా మారిపోయింది. వడ్లబస్తాలూ, మినుముల బస్తాలూ ఎక్కడా కన్పించలేదు.
    "ఒరేయ్ రాముడూ! ఈ బస్తాలన్నీ ఎక్కడ పెట్టించార్రా?" అని కేకవేశాడు సాంబయ్య.
    "బుచ్చమ్మా! మమయ్యగార్ని భోజనానికి లెమ్మని చెప్పవే!" వరూధిని కంఠం మధురంగా విన్పించింది సాంబయ్యకు. పక్కగా వచ్చి నిలబడ్డ బుచ్చమ్మను చూసి "అబ్బాయిని కూడా రానియ్, ఇద్దరం కలిసి భోంచేస్తాం!" అన్నాడు సాంబయ్య.
    బుచ్చమ్మ ఓ క్షణం ఆగింది. "అమ్మాయిగారూ, అబ్బాయిగారూ కలిసి భోంచేస్తారు - ముందు మీరు లేవండి" అంది.
    ఎక్కడో ఎవరో సన్నగా హాయిగా నవ్వినట్లయింది సాంబయ్యకు. లేచి వంటగదివేపు నడిచాడు.
    వరూధిని వడ్డనంతా పూర్తిచేసి రాబోతూ మామగారిని చూసి గోడవైపుకు తిరిగింది. సాంబయ్య రెండడుగులు వెనక్కువేసి నిలబడ్డాడు. కోడలు వంటగదిలోనుంచి బయటకు వెళ్ళగానే బుచ్చమ్మ "అయ్యగారూ, రండి!" అంది.
    సాంబయ్య పీటమీద కూర్చొని పళ్ళెంచుట్టూ ప్లేట్లల్లో, గిన్నెల్లో వున్న పదార్ధాలను చూసి విస్తుబోయాడు. మూడుకూరలు, రెండుపచ్చళ్ళు, పప్పూ, పప్పుచారూ, అప్పడాలూ, జిలేబి, మైసూర్ పాక్, పాయసం, తోడుపెట్టిన పెరుగూ---ఓస్! సాంబయ్య తింటూంటే చెమటలు పోస్తున్నాయి. బుచ్చమ్మ వెనకాల నిలబడి విసనకర్రతో విసరసాగింది. చెమట ఆరి, వళ్ళు చల్లబడుతూ దివ్యానుభూతి కలిగింది సాంబయ్యకు. కోడలుచెయ్యి అమృత హస్తం. దివ్యంగా వున్నాయి వంటకాలు! ఎంత శుభ్రంగా వుంది వంటగది? కోడలే స్వయంగా వండి వడ్డించింది. మూడేళ్ళు ఈ అదృష్టాన్ని చేజేతులా జారవిడుచుకున్నాడు తను.
    సుష్టుగా భోజనం చేసి సాంబయ్య పొగాకుపట్టాకోసం వెతికాడు. ఎంత వెతికినా దొరకలేదు. బుచ్చమ్మా, రాముడూకూడా వెతికారు. సాంబయ్య భోజనం చెయ్యగానే చుట్టముక్క కాలిస్తేగాని బుర్ర పనిచెయ్యదు. చిరాకుపడ్డాడు. వరూధిని బుచ్చమ్మను పిల్చి చిట్టుబస్తాల మీద వుందేమో వెతకమంది. బుచ్చమ్మ పొగాకు పట్టా వెతికి సాంబయ్య కిచ్చింది. చుట్ట చుట్టుకొని ఊళ్ళోకి బయలుదేరాడు సాంబయ్య కోడల్ని కాపరానికి తీసుకొచ్చిన సంగతే రచ్చబండమీద కూర్చొని మాట్లాడుకుంటున్నవాళ్ళు, సాంబయ్య రావటంచూసి విషయాన్ని మార్చారు.
    పొద్దుపోయి పొలాన్నుంచి వచ్చిన వెంకటపతి నేరుగా పడక గదిలో కాలుబెట్టి ఆశ్చర్యపోయాడు. వరూధిని నైలాన్ చీరకట్టుకొని, తల్లో మల్లెపూలు పెట్టుకొని అప్సరసలా కన్పించింది. తను పెళ్ళినాడు చూసిన పిల్లకూ ఈమెకూ సంబంధం లేదు. దివినుండి దిగివచ్చిన దేవతలా కళ్ళు మెరిపిస్తూ వెంకటపతికేసి చూసింది. వెంకటపతి ఉద్రిక్తుడైపోయాడు. భార్యతో ఏం మాట్లాడాలో తెలియలేదు. గాలి ఆడని రావిచెట్టులా నిలబడిపోయాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS