Previous Page Next Page 
శ్రీ శ్రీ సంసార ప్రస్థానం పేజి 32


    అంతవరకూ వారి చిరునవ్వులు, ముసిముసినవ్వులే చూశానుగానీ గట్టిగా నవ్వడం చూడలేదు.
    "గంధర్వ కన్య - పిక్చర్ చూడడానికి మైసూరు ట్రిప్ ఉందిగా" అన్నారు.
    "ఇక్కడున్న పిక్చర్ మొదట పూర్తి చేస్తే ఫ్రీగా వుంటాం. లేకుంటే వెళ్ళిన రెండవ రోజే రమ్మని వైరిస్తారు. మీ యిష్టం" - అన్నాను.
    "వరుసగా వారం రోజులు డబుల్ కాల్ షీట్లు బుక్ చేశామని చెప్తూ" పిళ్ళైగారు కాల్ షీట్ల చార్టర్ తెచ్చి శ్రీశ్రీగారి చేతికిచ్చారు.
    ఇంతలో బాయ్ వచ్చి "అయ్యాగారూ! మీ కోసం ఎవరో వచ్చారండి. ఆఫీసులో కూర్చోపెట్టాను" - అని చెప్పాడు.
    వచ్చిందెవరో చూసి రమ్మన్నారు నాతో.
    "బాగుండదు. మీరే వెళ్ళిరండ"ని వారినే పంపాను.
    అరగంట తర్వాత నవ్వుకుంటూ వచ్చి "గుడ్ న్యూస్ సరోజా!" - అన్నారు.
    'ఏమిట'న్నట్లు చూశాను.
    "మనకి కొత్త పిక్చర్ వచ్చింది. పిక్చర్ పేరు 'వణంగాముడి' రాత్రి తొమ్మిది గంటలకి ప్రొజక్షన్ వేస్తారట. వెళదామా?" - అని నా ముఖం చూశారు.
    "అదేమిటి? వెళదామా అని నన్నడుగుతారు?"
    "రాత్రి తొమ్మిది గంటలకి ప్రొజక్షన్ కదా! నిన్నూ ఒక మాట అడిగి చెప్దామనుకున్నాను. అరగంటలో ఫోను చేస్తే ఏ విషయమూ చెప్తానని వాళ్ళతో చెప్పాను" "తప్పకుండా వెళదాం. మనకి చేతినిండా ఊపిరాడనంత పని కావాలనే కదా నా తాపత్రయం" - అన్నాను.
    మేం మాట్లాడుతూ వుండగానే ఫోన్ వచ్చింది. "రాత్రి వస్తున్నామ"ని చెప్పేశారు. ఆఫీసులో డబ్బింగ్ చార్ట్ అంతా చూసుకొని - కాల్ షీట్లు, డేట్లు ఫిక్స్ చెయ్యమని చెప్పి, ఏడుగంటలకే ఆఫీసునుండి బిచానా ఎత్తేశాం.
    ఎనిమిదిన్నరకే కారు వచ్చింది. నేనూ, అమ్మా బయలుదేరాం.
    శ్రీశ్రీగారింటికి వెళ్ళితీరాలి. స్టూడియోకి వెళ్ళే దారే అది.
    ఆయన ఇంటి దగ్గర కారు ఆగింది. కారులోనే కూర్చున్నాను కానీ దిగలేదు.
    శ్రీశ్రీగారు వారి శ్రీమతితో సహా వచ్చారు. ఆవిడ మమ్మల్ని చూసి, "వాళ్ళని దింపేసి రమ్మని డ్రైవర్ తో చెప్పండి" - అన్నాను.
    "అదేవిటమ్మగారూ! పెద్దకారు అయ్యగారు ముందు సీట్లో కూర్చుంటారు. మీ ముగ్గురూ ఆడవాళ్ళేకదా, వెనక సీట్లో కూర్చోండి" - అన్నాడు డ్రైవర్. అంబాసిడర్ కారది.
    శ్రీశ్రీగారొచ్చి ముందు సీట్లో కూర్చుండిపోయారు.
    "కాస్త జరగండి. నేను మీ దగ్గరే కూర్చుంటా"నని శ్రీశ్రీగారి ప్రక్కనే కూర్చున్నారావిడ.
    అందరం స్టూడియోకి చేరుకున్నాం.
    పిక్చర్ ప్రారంభం కాలేదు. ముందు సీట్ల వరుసలో వారుభయులూ కూర్చున్నారు రెండవ వరసలో నేనూ, అమ్మా కూర్చున్నాం.
    'మాంబలం' బస్స్ టర్మనీస్ దగ్గరున్న ఆనాటి 'జయంతి స్టూడియో'లో ప్రొజక్షన్ పెట్టారు. వచ్చిన వాళ్ళందరితో పరిచయాలయ్యాయి.
    పిక్చర్ ప్రారంభమయ్యింది. టైటిల్స్ అయినా ఇంకా పూర్తి కాలేదు.
    "సరోజా!" - అని పిలిచారు శ్రీశ్రీగారు.
    "ఏవిటండి" అన్నాను.
    "అక్కడ కూర్చుంటే ఎలా ముందు వరుసలోకి రా" అన్నారు.
    "ఫరవాలేదండి" అన్నాను.
    "ఫరవాకోసం కాదు సినిమా వేస్తున్నది. రా" - అన్నారు.
    వాళ్ళిద్దరూ కూర్చున్న సీట్ల తర్వాత మూడు సీట్లు వదిలేసి నేనూ, అమ్మా కూర్చున్నాం.
    పిక్చర్ చూసినంత సేపూ - ఆ లిప్, డైలాగ్స్ చూసి 'చచ్చాం. చచ్చాం' అంటూ కూర్చున్నాను.
    వెనకాల నా మాటలు వింటున్న ప్రొడ్యూసర్లు నవ్వుకుంటున్నారు.
    పిక్చర్  అవుతున్నంతసేపూ ఆవిడ కళ్ళు నా మీదే వున్నాయని గ్రహించాను.
    పిక్చర్ లో శివాజీ, సావిత్రి, కన్నాంబ, తంగవేలు, ఎస్వీ రంగారావు - ఇంకా ఎందరో కొమ్ములు తిరిగిన ఆర్టిస్టులు వున్నారు. ఆ పిక్చర్ అంతా క్లోజప్ లే. వెన్నముద్దలా తీశారు.
    పిక్చర్ అయిపోగానే ఓ నిట్టూర్పు విడిచాను.
    "పిక్చర్ ఎలా వుందండీ శ్రీశ్రీగారూ!" - అని శ్రీశ్రీగారిని అడిగారు ప్రొడ్యూసర్లు.
    "బాగానే వుంది" - అన్నారాయన.
    "ఏవమ్మా, మీరేమంటారు? నచ్చిందా?"
    "మా ప్రాణాలు తోడేటట్టుందండీ. నచ్చడం మాటంటారా? నచ్చడం నచ్చకపోవడం కాదు సమస్య. మనకి నాలుగు డబ్బులొస్తే సరి, పిక్చర్లో మసాలా లేకపోలే"దన్నాను.
    నేను గలగలా మాట్లాడడం చూసి అక్కడున్న వాళ్ళంతా నన్ను ఎగాదిగా చూశారు.
    శ్రీశ్రీగారి భార్య ఇబ్బందిపడుతున్నట్టు గ్రహించాను.
    "ఇక వెళదామండీ" - అన్నాను.
    "రేపు ఉదయం తొమ్మిది గంటలకి బండి పంపుతాం శ్రీశ్రీగారూ! అన్ని విషయాలూ మాట్లాడుకొని అగ్రిమెంట్లు చేసుకుందాం" అని "ఏవమ్మా మీరూ వస్తారుగా" అని నన్నడిగారు.
    "సరోజ లేకుండానా...." అని ఎవరో సణిగారు.
    వెనక్కి తిరిగి చూశాను. ఆవిడ మాత్రం కాదని తెలుసుకున్నాను.
    ఇంటికి చేరుకున్నాం.
    మర్నాడు ఉదయం జ్యోతీ ఆఫీసుకి ఫోన్ చేసి, "మధ్యాహ్నం ఆఫీసుకి వస్తామ"ని చెప్పేశాం. కొత్త ఆఫీసుకు వెళ్ళాం.
    అగ్రిమెంట్లు అవడానికి ముందే, సావిత్రిగారే ఆవిడ వాయిస్ కి మాట్లాడతారని చెప్పేశారు.
    శ్రీశ్రీగారి అమౌంట్ కి వారికొక అగ్రిమెంట్, నా అమౌంట్ కి వేరే అగ్రిమెంట్ చేశాం.
    రెండో పిక్చర్లికి ఇచ్చిన అమౌంట్ కన్నా ఎక్కువే మాట్లాడుకున్నాం. పెద్ద పిక్చర్ల కింద లెక్కవేస్తే ఇది రెండవ పిక్చర్లకి నా లెక్క.
    అలాగే అగ్రిమెంట్లు చెయ్యడంతోపాటు - "మాటలు, పాటలు - శ్రీశ్రీ, సహాయం యు. సరోజ" అని ఒక కార్డూ, "డైలాగ్ డైరెక్షన్ - యు. సరోజ" - అని వేరే కార్డు నాకు ఇవ్వాలనే శ్రీశ్రీగారు క్లాజ్ పెట్టించారు. (ఈ క్లాజ్ నా టైటిల్ కి మాత్రమే సంబంధించినదని మనవి.)
    మేం ఇద్దరం చాలా హుషారుగా వున్నాం. ముఖ్యంగా నా సంతోషానికి మేరలేదు.
    "మధురై వీరన్" డబ్బింగ్ కాల్ షీట్లు అయిన తర్వాత, మైసూరు వెళ్ళాలనీ 'జ్యోతీ' ప్రొడ్యూసర్లతో ఖచ్చితంగా చెప్పేశారు.
    "మైసూరు వెళ్ళి ఏం చేస్తార"ని శ్రీశ్రీగారిని అడిగాను.
    "ఈ పిక్చర్ ఫినిష్ చేసి, "వణంగాముడి' స్క్రిప్ట్ పట్టుకుని మైసూరు వెళదామ"ని చెప్పారు.
    కాల్ షీట్లు అరుణా థియేటర్లోనే వేశారు. ఉదయం ఏడు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకూ డబుల్ కాల్ షీట్లు ఆరు రోజులు వేశారు. అప్పటికి పాటలన్నీ రికార్డ్ చేశాం. రోజూ కాల్ షీట్లలో లంచ్ అయిన తర్వాత రిలీఫ్ కోసం పాటలు వేసుకునేవాళ్ళం.
    టి.జి. కమల పద్మినికి, మన సినీ ఆర్టిస్ట్ పల్లం నరసింహారావు ఎం.జి.ఆర్.కి. "డబ్బింగ్ బెబ్బులి" అని శ్రీశ్రీగారు టైటిల్ ఇచ్చిన వసంతకుమార్, 'నేటి మేటి సంగీత దర్శకులైన చక్రవర్తిని (నేను అతన్ని ఈనాటికీ ఆయన పాత పేరయిన 'అప్పారావు' అనే పిలుస్తుంటానులెండి.) హాస్య పాత్రలకి డబ్బింగ్ చెప్పే  మోదుకూరి సత్యం మొదలైనవారిని బుక్ చేశారు.
    అందరూ హేమాహేమీలే!
    డబ్బింగా చాలా త్వరగా, హాయిగా జరుగుతోంది.
    
                            *    *    *
    
                                         లేడి పిల్లబ్బాయ్
    
    రోజుకి పెర్ ఫెక్షన్ తో పది లూప్స్ కన్నా ఎక్కువ పని చేయలేని ఆ రోజుల్లో డబుల్ కాల్ షీట్లలో రోజుకి 25,30 లూప్స్ తీసేవాళ్ళం. దానికి ముఖ్యమైన కారణం. కవిగారు రాసిన డైలాగ్స్.
    శ్రీశ్రీగారు అద్భుతంగా రాశారు. డైలాగ్స్ ఎక్కువ మార్పులు వుండేవి కావు. పొరపాటున ఎక్కడైనా ఒకటీ రెండూ వుంటే జింకలా పట్టుకొని కరెక్ట్ లిప్ వచ్చేవరకూ వదిలేదాన్ని కాను. ఒకోసారి చెప్పగానే మార్చేసేవారు. ఒకోసారి, "ఆ స్పీడులో ఎవరు చూస్తారు సరోజా! డబ్బింగ్ చేసిన వాళ్ళం కాబట్టి నువ్వూ, నేనూ చూస్తాం" - అనేవారు. చీవాట్లు తిన్నా, మార్చేదాకా ఊరుకునేదాన్ని కాను. ఆయన కానీ మొండికేస్తే మూడ్ లో లేరని గ్రహించి, ఆ లూప్ మార్చేసి, అట్టే పెట్టి మరొక లూప్ వేయించేదాన్ని.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS