Previous Page Next Page 
అర్ధరాత్రి ఆర్తనాదం పేజి 32


    ఏమాత్రం ఆలస్యం చేయకుండా కామినీ రంగప్రవేశం చేసేది. వాళ్ళ బాబాయిని ఏదో అన్నారంటూ లబలబలాడుతూ సాధించేది. కామినీ ముందు నోరు ఎత్తేధైర్యం లేని కిరణ్ గత్యంతరం లేని పరిస్థితులలో కామినీకి తల వగ్గేవాడు అంతకన్నా గత్యంతరం లేదు అతనికి.
    బాబాయ్ కి తిండికి కావాలి, ఆయన అవసరాలకి కావాలి బీడీలకు కావాలి, మందులకి కావాలి అంటూ కామినీ డబ్బు తీసుకుని దామోదరానికి ఇచ్చేది.
    దామోదరం ఆ డబ్బుని పేకాటలో కాని, రేసు కోర్స్ లోగాని పెట్టేవాడు. మొత్తానికి అయిదు నిమిషాలలో హారతి కర్పూరం చేసేవాడు.
    దామోదరానికి దగుల్భాజీ ఫ్రెండ్స్ కొందరు వుండేవారు. వీడే పెద్ద దగుల్భాజీ వీడికి జోడు మళ్ళీ దగుల్భాజీ స్నేహితులు. వాళ్ళకో రూమ్ వుంది. ఆ రూమ్ ని క్లబ్ గా చేసుకుని తరచు అక్కడ వాళ్ళు కలుసుకుని, చేతిలో ఎంత డబ్బువుంటే అంతా పెట్టి పేకాడేవారు. అప్పుడప్పుడు వారి ఆటలో తనూ కలసి ఒక చెయ్యేసేది కామిని.
    కళ్ళారా ఇది తిలకించక పోయినా ఈ విషయం కిరణ్ కి చూచాయిగా తెలుసు. దగుల్భాజీ వెధవలతో చెయ్యి కలిపే కామినీ పిశాచం తన భార్య అనుకునేవాడు.
    ఈ ఇంటికి వచ్చిన వారం నుంచీ ఆ నగ కావాలి, ఈ నగ కావాలి అంటూ ఏదో ఒక నగ చేయించుకుంటూనే వుండేది. ఒకసారి పెట్టుకున్న నగ మళ్ళీ ఆమె వంటిమీద కనకపడేది కాదు. నగ ఏదని అడిగితే తీసి దాచాను, ఎక్కడ దాచానో కూడా చెప్పాలా! నా యిష్టం వచ్చినపుడు మళ్ళీ పెట్టుకుంటాను, నగ గురించి ఇన్నిసార్లు అడుగుతావు అసలు నీ ఉద్దేశ్యమేమిటి? నేనేమన్నా దొంగనా! మోసగత్తెనా! ఖూనీకోరునా! ఏదో పెద్ద నేరమో ఘోరమో జరిగినట్టు అడుగుతావేమిటి అంటూ పెద్ద గొంతుకతో ఎదురు తిరిగి అరచేది.
    అంతే.
    కిరణ్ పెదవి కదిపే సాహసం చేసేవాడు కాదు ఆ దెబ్బతో అతని నోరు మూతపడి పోయేది.
    గంటక్రితం దామోదరం సరాసరి బెడ్ రూంలో వచ్చాడు. అప్పుడు కిరణ్ అక్కడే వున్నాడు.
    "అయ్యో! అబ్బాయ్ వున్నట్టున్నారే! హాలులో! కూర్చుంటాను లేమ్మా!" అన్నాడు దామోదరం.
    "పెద్ద వాడివి నా తండ్రిలాంటి వాడివి బెడ్ రూమ్ లోకి రాకూడదని ఎవడంటాడో ఆపమను చూద్దాం! నువ్వు ఈ ఇంట్లో ఎక్కడైనా కూర్చోవచ్చు బాబాయ్!"
    కామినీ ఆ మాట అనంగానే దామోదరం వచ్చి కుర్చీలో కూర్చునే వాడుకాదు. బెడ్ మీద కాళ్ళు పెట్టుకుని కూర్చున్నాడు. వెంటనే బీడీ తీసి వెలిగించి, చచ్చు కబుర్లు చెప్పటం మొదలు పెట్టాడు. ఇంతా ఏడ్చి ఆ కబుర్లు చెప్పుకో దగ్గవేమీకాదు. ఫలానా మంత్రి ఫలానా తార దగ్గరపడి దొర్లాడు. పెద్ద హీరో కొడుకు శృంగార తార ఇంట్లో దూరాడు. అన్నీ ఇలాంటి కబుర్లే.
    దామోదరం చెప్పే కబుర్లని ఆసక్తిగా విని మధ్య మధ్య ప్రశ్నలు వేసేది కామిని.
    ఒంటికి కారం పట్టించుకుని సలసలా కాగే నీళ్ళు ఆ వంటిమీద పోసుకున్నట్లుండేది కిరణ్ కి.
    ఒళ్ళు మంట, మనస్సు మంట, మంటల్లో నిలువునా దహించుకుని పోతున్నట్లుండేది కిరణ్ కి.
    "అబ్బా మంట!" అని బాధను కూడా వ్యక్తం చేయలేక కసిగా ఆలోచిస్తూ మొహం ప్రక్కకు త్రిప్పుకుని కూర్చున్నాడు కిరణ్.
    దామోదరం వచ్చిన అరగంట తరువాత అసలు విషయంలోకి వచ్చాడు.
    "అమ్మాయ్! రెండు వేలుంటే సర్దు నా దగ్గరున్నపుడు మళ్ళీ ఇస్తాను. తప్పక ఇవ్వటం మాత్రం ఇస్తాను. డాక్టరు అర్జంట్ గా మందులు కొని వాడమన్నాడు. మందులు వాడకపోతే కడుపులో వున్న పుండు పగిలి రక్తం కక్కుకుని ఛస్తావు అన్నాడు. నేను ఛస్తే నష్టమేమీ లేదనుకో, కాని, చూస్తూ చూస్తూ చావలేము కదా!"
    "అయ్యో అదేమిటి బాబాయ్! నువ్వు నోరు తెరిచి అడిగితే నేను కాదంటే నాకు పుట్ట గతులుంటాయా! ముష్టి రెండు వేలదేముంది. వెంటనే ఇస్తాను. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మందులు కొను." ఆప్యాయంగా అంది కామిని.
    "కడుపులో నీకు మంటా! ముసలి నక్కా! నీ వళ్ళంతా పుండ్లేరా! వళ్ళు అంతా గజ్జిపట్టిన చీడ కుక్కని! మా ఇంటి గేటు దాటి లోపలికి అడుగుపెట్టే అర్హతలేని నీకు నా బెడ్ రూంలోకి చొరబడి మంచం ఎక్కి కూర్చున్నావంటే అది నీకు పట్టిన యోగమూ! నాకు పట్టిన శని. మీ యిద్దరి ప్రేమలూ చూస్తుంటే ఇద్దరినీ కలసి ఒకే గోతిలో కప్పెట్టాలనిపిస్తున్నది. రెండు వేలు! నీ తాతగాడి సొమ్మేదీ ఇక్కడ లేదు." ఈ మాట పైకనే ధైర్యంలేని కిరణ్ లోలోపల కసిగా పళ్ళు నూరుకున్నాడు. కిరణ్ బీరువాలోంచి రెండు వేలు తీసి ఆప్యాయంగా దామోదరం చేతికి అందించింది కామిని.
    "వెళ్తున్నాను అమ్మాయ్! మందులు కొనుక్కోవాలి" అంటూ దామోదరం లేచాడు.
    "నేనూ వస్తానుండు బాబాయ్! కాసేపు బయటి గాలి పీలుస్తూ వుంటేగాని మనసు హాయిగా వుండదు. నా ప్రాణానికి ఇదొక పెద్ద జైలనుకో! ఆయన చూడపోతే బెల్లం కొట్టిన రాయిలా అలా కుర్చీకి అంటుకుపోయి కూర్చుని గంటలతరబడి ఆలోచిస్తూంటాడు. ఈ యింట్లో ఎవరి దోవవారిదే. ఒక సరదాలేదు, పాడూలేదు." అలా మాట్లాడు తూనే కామినీ డ్రస్ అయి తన వానిజీ బాగ్ లో మరోవెయ్యి రూపాయలు పడేసుకుని "కాసేపు అలా బాబాయ్ తో వెళ్ళొస్తాను." అని మాట మాత్రం కిరణ్ కి చెప్పి దామోదరంతో కలసి వెళ్ళిపోయింది.
    అడవిలో స్వేచ్చగా తిరిగే పులిని తీసుకువచ్చి బోనులో బంధించినట్లు వాళ్ళు వెళ్ళిన తరువాత కిరణ్ ఆ గదిలో అటూ యిటూ కసిగా ఆలోచిస్తూ తిరగడం మొదలు పెట్టాడు.
    ఇలాంటి సంఘటన కామిని ఇంట్లో అడుగుపెట్టాక చాలా జరిగాయి. అప్పుడంతా చేతకాని కోపంతో ఆలోచించి ఊరుకునేవాడు కిరణ్. బాధతో ఆక్రోశించేవాడు. అయోమయంలో అల్లల్లాడేవాడు.
    ఈ రోజు ఆలోచనలు మాత్రం మరోదారి పట్టాయి.
    కామినీని శాశ్వతంగా తన జీవితంలోనుండి అడ్డుతొలగించుకుంటే తనకీవేదన వుండదు.
    ఆ పని చేయాలంటే    
    మరో హత్య తప్పదు.
    అతనిది అనుకోని హత్య.
    ఇది అలా కాదు.
    ముందుగా ప్లాన్ వేసి శాశ్వతంగా కామినీ నోరుమూసుకునేలాగా చెయ్యాలి. లేకపోతే తన జీవితం రోజురోజుకీ నరకంలా మారుతుంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS