Previous Page Next Page 
ది సినీ స్టార్ పేజి 32


    ఇలాంటి వాక్యాలు ప్రయోగించడం సుదర్శనరావుకి కొత్తకాదు....కానీ ఎప్పటిలా నవ్వులాటగా తీసుకోలేదు నారాయణశెట్టి. "జోకులేయడం మాని ఎందుకు ఫోన్ చేశారో చెప్పండి?"
    ఫీల్డులో పెద్ద డైరెక్టరుగా తనకున్న స్థాయి మరిచి శెట్టి మాట్లాడుతున్నాడనిపించిన రావు యిక నిగ్రహించుకోలేకపోయాడు. "జోకులు వేయడంలేదు శెట్టిగారూ.... నీ విషయం మొత్తం యిండస్ట్రీ అంతా చర్చించుకుంటూంది. ఓ ఆడపిల్ల మత్తులో చిక్కుకున్న మీరు దానికి ఫ్లాటూ, కామా కొన్నారటగా?"
    "అది నా డబ్బేగా.....పైగా నేను కట్టుకున్న దాన్ని వదిలేయలేదు."
    తగలకూడనిచోట తగిలింది సుదర్శనరావుకి.
    శెట్టి తన దాంపత్య జీవితాన్ని పరిహాసం చేస్తున్నాడు. కోపాన్ని దిగమింగుకుంటూ అడిగాడు- "మీరు రామన్ గారి ఫైనాన్స్ చేస్తామని చెప్పి యిప్పుడు లేదంటున్నారని తెలిసింది."
    "అది నాకూ రామన్ కీ సంబంధించిన విషయం."
    సుదర్శనరావుకి ముచ్చెమటలు పోశాయి. శెట్టి వెనకడుగు వేయడం లేదు.
    "మీరు యిండస్ట్రీలో మంచి ఫైనాన్సర్ గా పేరున్న వ్యక్తి. ఓ ఆడపిల్ల ప్రలోభంలో పడి యిలా చేయడం బాగోదు."
    "మిస్టర్ సుదర్శనరావ్! నా వ్యక్తిగత విషయంలో జోక్యం చేసుకుంటే నేను దేనికి వెనుకాడను."
    "అంటే....."
    "మీ నిర్మాతకీ ఫైనాన్స్ చేస్తున్నది నేనే.... ఆ విషయం మీరు గుర్తుంచుకోవడం మంచిది."
    "మీరు కాదన్నా నా సినిమా ఆగదు"
    "అంత దమ్మున్న నిర్మాతకాదు మీవాడు."
    "అదికాదు శెట్టిగారూ...." చికాకుగా అన్నాడు సుదర్శనరావు అనవసరంగా యీ విషయంలో తల దూర్చాలనిపిస్తున్నా తనముందు కూర్చున్న రమ్యశ్రీ ముందు ఓడిపోవడం యిబ్బందిగా వుంది. "అసలు సుకృతి మీద అంత మక్కువ చూపించటానికి అదేం కన్నెపిల్ల కాదు. వేషం కోసం ఓ రాత్రంతా నాతో గడిపింది."
    క్లిక్ మన్న చప్పుడు వినిపించింది.
    స్తబ్దంగా వుండిపోయాడు సుదర్శనరావు.
    ఫోన్ పెట్టేస్తుంటే అడిగింది రమ్యశ్రీ- "ఏమైంది?"
    "ముసలాడ్ని బలంగా ట్రేస్ చేసినట్టుంది."
    "నేనూ అదే అన్నానుగా?"
    "అయినా అదేం చేస్తే మనకెందుకు?" విసుగ్గా లేచాడు. "ఆఫ్ట్రాల్ ఓ పిచ్చుక రాబందులా రెక్కల చప్పుడు చేయాలనుకుంటే మాత్రం మన మెందుకు కేర్ చేయాలి" అన్నాడే కాని ఆ సాయంకాలందాకా మనశ్శాంతిగా వుండలేకపోయాడు. రమ్యశ్రీ రెచ్చగొట్టినందుకో లేక సుకృతి చేజారిపోయినందుకో తను రియాక్టయి శెట్టితో గొడవపడ్డాడే తప్ప నిజానికి అది తనకు సంబంధించిన విషయం కాదు.
    తనున్న స్థాయికి రమ్యశ్రీలాంటి కథానాయిక వున్న సినిమాని శెట్టి ఫైనాన్స్ తో సంబంధంలేకుండా పూర్తిచేయడం కాని, రిలీజ్ చేయడంకాని సమస్యకాదు.
    కానీ ఒకేసారి పది సినిమాలకి పెట్టుబడి పెట్టగల నారాయణశెట్టి లాంటి వాడ్ని రెచ్చగొడితేనే ప్రమాదం.    
    చిత్రరంగంలో చాలా విచిత్రాలు జరిగింది కేవలం పట్టుదలల మూలంగానే.
    దానికి తొందరపాటుతో బీజం వేసేశాడు సుదర్శనరావు.
    హిట్ సినిమాలను తీసినవాడు గొప్ప డైరెక్టరేమోగాని, గొప్ప డైరెక్టరు అనిపించుకున్నవాడు తీసే ప్రతి సినిమా హిట్ సినిమా కాదు. మాట చెల్లేది మహర్దశలో వున్నప్పుడే తప్ప మామూలు సమయాల్లో కాదు.
    అందుకే.....
    కొంతకాలం వెలిగి ఆనక ఆరిపోయిన డైరెక్టర్లు డబ్బున్న నిర్మాతలకన్నా, డబ్బు పెట్టుబడి పెట్టగల నారాయణశెట్టిలకన్నా బలహీనులయిపోతారు. ఇది సినిమా సూక్తి.....
    
                                                         *    *    *    *
    
    రాత్రి పదిగంటల సమయం.
    ఖరీదయిన ఫ్లాట్ లోని పడకగది శోభనం రాత్రిలా అలంకరించడమే కాక, పరుపుపై మల్లెలు నలిగిపోతున్న సుకృతి సౌరభానికి నేపధ్యంగా మారాయి.
    గళమెత్తిన కాలంలా సుకృతి గొంతునుంచి వినిపిస్తున్న సంగీతం రవమై అనుభవమై జలపాతపుడెక్కల పదఘట్టనలై అతడ్ని దిగంతాల ధృవాల్లోకి నెడుతుంటే.....
    సజీవ స్వప్నాశాఖల్లో చిక్కుకున్న బాటసారిలా ఆర్తిగా అలసిపోతున్నాడు నారాయణశెట్టి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS