Previous Page Next Page 
ప్రియా.....ప్రియతమా పేజి 33

   
    తల పట్టుకుంది ప్రనూష.
    "తలనొప్పా.....ఝండూబామ్....ఝండూబామ్.... తలనొప్పిని హరించే బామ్....ఝండూ బామ్..." యాడ్ పాటలా పాడాడు శ్రీచరణ్.
    రెండు చేతులూ జోడించింది ప్రనూష.
    "మహానుభావా....ఛాన్స్ వచ్చింది కదా అని రెచ్చిపోకు..." అంది.
    "సర్లే....విషయమేమిటో చెప్పు..."
    "మరేం లేదు...నేను ఉద్యోగం చేస్తోన్న విషయం నాన్నకు తెలియదు కదా....నువ్వే ఏదో మ్యానేజ్ చేసి చెప్పు" అంది ప్రనూష.
    "నేనా....నో...నెవర్...చస్తే చెప్పను. ఎందుకు... చెప్పి తిట్టించుకోవడానికా? "ఇదేం పోయేకాలం బాబూ....అమ్మాయితో ఉద్యోగం చేయిస్తావా?" అది ఆడపిల్ల మాదిరిగా మీ బాబు బుగ్గలు నొక్కుకుంటాడు. నో....నెవర్..."చేతులు స్టయిల్ గా పైకెత్తి అన్నాడు శ్రీచరణ్.
    "ప్లీజ్....ఈ ఒక్కసారికి..." రిక్వెస్టింగా అంది ప్రనూష.
    "రిక్వెస్ట్ చేసి, దేభ్యం మొహంతో నువ్వడుగుతూంటే ఎందుకో "నో అనాలనిపించడం లేదసలు" అన్నాడు శ్రీచరణ్.
    వళ్ళు మండింది ప్రనూషకు. మరోప్పుడైతే ఊర్కునేది కాదు. కానీ అవసరం తనది.
    "ప్లీజ్...." ఎక్స్ ప్రషన్ని మరికాస్త దీనంగా పెట్టి అడిగింది.
    "ఆల్ రైట్ అలాగే....కానీ ఖర్చవుద్ది..." అన్నాడు.
    "ఖర్చా...."
    "అవున్మరి....ఓ అబద్దం చెప్పి ఆనక మీ నాన్న అడ్డమైన మాటలు అంటే పడ్డం మాటలా? నో....నెవర్..." అన్నాడు.
    సరే" అంది చేసేది లేక.
    "టోటల్ ఫోర్ హండ్రడ్....అడ్వాన్స్ రెండు వందలు....అనక మరో రెండు వందలు..."
    "నాలుగు వందలా? ఇంత చిన్న అబద్దానికి?"
    "అయితే నేను నో...నెవర్." అన్నాడు.
    సరే....సరే....
    "అడ్వాన్స్..." అన్నాడు.
    "తర్వాతిస్తాను" అంది కసిగా.
    "అదిగో....అలా మొహంపెట్టి అంటే నో...నెవర్..."
    "అలాగే నండి..." అంది తను మొహం మీద పులుముకుని.
    "మరో కండిషన్" అన్నాడు.
    "మళ్ళా ఏంటి?" నీరసంగా అడిగింది ప్రనూష.
    "మీ నాన్న అవసరమైన అవాకులు, చెవాకులు....ఫరెగ్జాంపుల్..."మగాడి వయ్యుండీ సిగ్గులేదటయ్యా భార్యతో ఉద్యోగం చేయించడానికి..." లాంటి మాటలు అంటే మాటకి యాభై చొప్పున ఇవ్వాలి.....లేదంటే....నెవర్...."
    సరే...
    "అలా కాదు నవ్వుతూ చెప్పు..."
    "సరే...హి...హి.... హి..." సరేనా..." అంది.
    "దట్స్ గుడ్ అన్నట్టు ఓసారి ముద్దెట్టుకోనా?" అడిగాడు. ఉదయమే ఎర్రబడ్డ మొహంతో అందంగా వుంది ప్రనూష.
    "ఏంటీ..." ! కోపంగా అడిగింది" ప్రనూష.
    "పోన్లే....నా నాలుగు వందల్లో ఓ  వంద "కట్ చేస్కో...." అన్నాడు.
    "పీక పిసికి చంపుతా..." కసిగా అని అక్కడ్నుంచి వెళ్ళింది. అక్కడే వుంటే ఈ దెబ్బలాట ఇలాగే కంటిన్యూ చేస్తాడని తెల్సు.
    ఆమె ఆ గదిలో నుంచి బయటకు రావడంతోనే శ్రీచరణ్ గదిలోకి ప్రియా ఎంటరై, బావ వంక అనుమానంగా చూసి "ఏంటి బావా...మా అక్క నిన్ను "పీక పిసికి చంపుతా" అంటున్నట్టుంది అని అడిగింది.
    "అదా...అది సాయంత్రం ఎర్లీగా వచ్చి, నన్ను నీ కౌగిలిలో చుట్టేసి, కబుర్లు చెప్పకపోతే, పీక పిసికి చంపుతానంటోంది నోటికొచ్చిన అబద్దం చెప్పేసాడు శ్రీచరణ్.
    "కానీ....అక్క ఎక్స్ ప్రస్ లో ఆ రొమాన్స్ కనిపించలేదు."
    "పొద్దున్నే కదా..... రొమాన్స్ కాస్త వీక్ గా కనిపించి వుంటుంది. ఏ మాటకామాటే చెప్పుకోవాలి....మీ అక్క కంటే నువ్వే పిసరంత అందంగా వున్నట్టున్నావు ప్రియా..." అన్నాడు ప్రియవైపు చూస్తూ.
    "ఛీ....పో బావా...నాకు సిగ్గేస్తోంది" అంది ప్రియ సిగ్గుపడిపోతూ.
    "నువ్వే నయం. మీ అక్కకు అయితే అసలు సిగ్గే లేదు." అన్నాడు శ్రీచరణ్.
    "అదేంటి బావా?" అడిగింది ప్రియ.
    "అదే...ఏదో సరదాకి జోకాన్లేగానీ...ఇక్కడ ఎన్రోజులుంటారేంటి?" అడిగాడు.
    "అదేంటి బావా....వచ్చి పావుగంటయినా కాలేదు. అప్పుడే "ఎప్పుడెళ్తారని" అడుగుతున్నారు. మా రాక మీకేమైనా ఇబ్బందా...? అడిగింది ప్రియ.
    "అబ్బే....నా ఉద్దేశం అది కాదు, ఇంకా నీ అందమైన మొహాన్ని నేను ఎన్రోజులు చూస్తూ వుంటానో తెలుసుకుందామని."
    "ఛీ....పో....బావా.....నాకు మళ్ళీ సిగ్గేస్తోంది" అంది ప్రియ.
    "అదేంటి....ఇందాకే సిగ్గుపడ్డావుగా....మళ్ళీ ఎందుకు? పొద్దస్తమానం సిగ్గే పడితే ఎలా?" అన్నాడు.
    "నువ్వు చాలా చిలిపి బావా?" అంది ప్రియ.
    "ఆ విషయం పెళ్ళయిన రెండు నెలలైనా మీ అక్కకు తెలిసిరాలేదు" నిట్టూర్పుగా అన్నాడు శ్రీచరణ్.
    
                                                           * * *


    ఆహా....జీడిపప్పు ఉప్మా చేసేవా చిట్టితల్లీ....ఘుమఘుమ వాసన..." అన్నాడు ఉప్మా ప్లేటును చేతిలోకి తీసుకుంటూ శర్మ.
    "అదేంటమ్మయ్యా...అల్లుడింకా లేదు....అందరం కల్సే చేద్దాం. అల్లుడ్ని పిలువు..." అంది సత్యవతి.
    వెంటనే ప్రియా "బావా అని కేకేసింది.
    స్నానం చేసి డ్రెస్సప్ అయిన శ్రీచరణ్ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చాడు.
    "రా....అల్లుడూ....జీడిపప్పు ఉప్మా...అదిరింది....కూచో." అన్నాడు శర్మ అల్లుడ్ని చూసి.
    "ఫర్లేదు...మీరు కానీయండి.....నేను చేసుకుంటాను"
    "నువ్వు చేసుకోవడమేమిటి అల్లుడూ..."
    "అదే టిఫిన్"...అన్నాడు.
    వెంటనే ప్రనూష శ్రీచరణ్ కాలు తొక్కింది.
    "అబ్బా రాకాసీ..." అన్నాడు మెల్లగా ప్రనూషకు మాత్రమే వినిపించేలా శ్రీచరణ్.
    "ఏమైందల్లుడూ..."
    "ఏంటమ్మా...నువ్వూ, అల్లుడూ ఏదో గుసగుసలాడుకుంటున్నారు?" అనుమానంగా అడిగాడు శర్మ.
    "అబ్బా.... భార్యాభర్తల మధ్య ముచ్చట్లు మీకెందుగానీ, మీరు టిఫిన్ చేయండి... అమ్మ ప్రనూ...అల్లుడు గారు గదిలోకి రమ్మంటున్నట్టున్నారు....వెళ్ళమ్మా.." అంది ముసిముసినవ్వులు నవ్వుతూ సత్యవతి.
    శ్రీచరణ్ ఓ వెర్రి నవ్వు నవ్వి...."పద.... గదిలోకి..." అన్నాడు.
    ఏంటో...మా వయసులో ఇలా పెద్దవాళ్ళ ముందే సరసాలెక్కడివి? వాపోయేరు శర్మ.
    
                                                           * * *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS