Previous Page Next Page 
ప్రియా.....ప్రియతమా పేజి 32


    "అసలు... నేనే బయటనుంచి బోల్ట్ వేయాలి" అనుకుంది ప్రనూష.
    అర్దరాత్రి పన్నెండైనా నిద్ర రావడం లేదు ప్రనూషకు.
    విశాలమైన ఆ హాలులో పడుకోవాలంటే భయంగానే వుంది. పోనీ తన గదిలో పడుకుందామంటే మంచం లేదు. కింద పడుకుంటే వీపు నొప్పెడుతుంది. ఎప్పుడో చదివిన భయంకరమైన నవల్సు గుర్తొస్తున్నాయి. మెల్లగా శ్రీచరణ్ గదివైపు వెళ్ళి తలుపు నెట్టింది. అన్నట్టుగానే లోపలి నుంచి బోల్ట్ పెట్టలేదు. అటు తిరిగి పడుకుని వున్నాడు శ్రీచరణ్.
    ఒక్క క్షణం లోపలికి వెళ్ళి  పడుకోవాలనుకుంది. కానీ మరో క్షణమే "ఛ..." అతను... అతని పక్కన పడుకోవడమేమిటి? అనుకుంది.
    సోఫాలో పడుకుని కళ్ళు మూసుకుంది.
    సీలింగ్ ఫ్యాన్ ఫుల్ స్పీడ్ తో తిరుగుతోంది.
    అంతా నిశ్శబ్దంగా వుంది.
    బయట ఎక్కడో కుక్కల అరుపులు వినిపించాయి.
    అర్దరాత్రి కుక్కలు ఏడుస్తాయని, దయ్యాలు కనిపిస్తే భయంతో మొరుగుతాయని... ఎక్కడో పుస్తకాల్లో చదివిన విషయాలు గుర్తొచ్చాయి. భయమేసింది.
    "రేపట్నుంచి....తప్పనిసరిగా తను శ్రీచరణ్ పక్కనే పడుకోవాలి. లేకపోతే అమ్మా నాన్నలకు అనుమానం వస్తుంది. ఇవ్వాళ ఒక్కరోజూ అక్కడ పడుకున్నంత మాత్రాన ఏమవుతుంది?" అనుకుంది.
    ఇలా భయంతో తెల్లవార్లూ మెలకువగా ఉండటం కన్నా, శ్రీచరణ్ రూములోకి వెళ్ళి పడుకోవడమే బెటరనుకుంది.
    మెల్లిగా లేచి, శ్రీచరణ్ గది తలుపులు తెరిచింది. రెండు సింగిల్ కాట్ల మధ్య పడుకున్నాడు.
    అతడ్ని లేపి ఓ మంచాన్ని కొద్దిగా ఎడం చేసి పడుకోవాలనుకుంది.
    అతడు లేచేలా కనిపించలేదు.
    వెంటనే అటువైపు మంచంలోకి నెట్టే ప్రయత్నం చేసింది.
    అప్రయత్నంలో మంచం ఎక్కి, కాస్త తలను వంచి, రెండు చేతులతో శ్రీచరణ్ ను అటువైపు దొర్లించబోయింది.
    "హమ్మో...నా శీలం..." అంటూ కళ్ళు తెరిచి అరిచాడు.
    ఉలిక్కిపడి చూసింది. అతను కళ్ళు తెరిచి అల్లరిగా తనవైపే చూస్తున్నాడు.
    "ఛీ...సిగ్గు లేకపోతే సరి....వేషాలేస్తున్నావా?" అంది.
    "మరే... నాకేం పని..." అని "అయినా ఇదేం దరిద్రపు అలవాటు....నిద్రపోయిన వాళ్ళ మీద రేప్ అటెంప్ట్ చేయడం. నన్నడిగితే నేనే రేప్ చేసి పెడతాగా..." అన్నాడు.
    కోపంగా ఏదో అనబోయి...అనవసరంగా అతన్తో వాదన పెంచుకోవడం యిష్టం లేక... మంచం లాగి, సింగిల్ కాట్ ని కాస్త ఎడంగా జరిపింది, బలమంతా ఉపయోగించి ప్రనూష.
    రెండు సింగిల్ కాట్ల మధ్య పడుకోవడం వల్ల, ఓ సింగిల్ కాట్ ప్రనూష జరపడంతో బ్యాలెన్స్ తప్పి కిందపడిపోయి "హమ్మా..." అన్నాడు.
    "అయ్యిందా అబ్బాయి గారి పని. ప్చ్....వెన్నుపూస విరిగిందేమో చూసుకోండి..." అంది వెక్కిరింతగా ప్రనూష.
    "శ్రీచరణ్ కోపంగా చూశాడు. ప్రనూష నాలిక బయటకు పెట్టి వెక్కిరించి, అతని వైపు చూసి కెవ్వుమంది.
    శ్రీచరణ్ కు అర్ధంగాక తనవైపు చూసుకొని, తనూ కెవ్వుమన్నాడు. అతని లుంగీ మంచంమ్మీదే వుండిపోయింది.
    "ఛీ.... ఛీ..." అంది.
    "థాంక్స్....నీ దూల తీరిందా? అసలు ఇవ్వాళ్టి నుంచి నేను లుంగీలు కట్టుకోను.... ఇలాగే వుంటా..." అన్నాడు ప్రనూషను ఉడికించాలనే.....
    వెంటనే బ్లాంకెట్ తీసి అతని మీదికి విసిరేసింది.
    నవ్వుకున్నాడు శ్రీచరణ్.
    
                                                            *  * *


    ఇంకా పూర్తిగా తెల్లవారకుండానే. డోర్ బెల్ అదే పనిగా మోగడంతో శ్రీచరణ్ బద్దకంగా కళ్ళు తెరిచాడు.
    బహుశా పాలబ్బాయ్ అయివుంటాడు. అయినా ఇవాళ డోర్ తీసి పాల ప్యాకెట్ తీసుకోవాల్సిన డ్యూటీ ప్రనూషది కదా....అనుకొని కోపంగా లేచి డోర్ తీసి..."ఇవ్వాళ నీక్కావాల్సిన బెల్ రైట్ సైడ్ ది...." అన్నాడు కోపంగా.
    "రైట్ సైడ్ ఏమిటి బాబూ...
    బెల్లు బాబు..." అని ఎదురుగా వున్న శాల్తీని చూసి "మీరా మామగారూ.." అన్నాడు.
    "అవునల్లుడుగారూ....మీరేమిటి రైట్ సైడ్ బెల్లు...అంటున్నారు" అడిగాడు అయోమయంగా శర్మ.
    శర్మ అతని భార్య సత్యవతి, మరదలు ప్రియ వచ్చారు.
    ప్రియ బావను చూసి ముసి ముసి నవ్వులు నవ్వుతోంది. సత్యవతి మూతికి చీరకొంగు అడ్డంపెట్టుకుంది. శర్మకూడా మొహం తిప్పుకుని. 'సరే బాబూ...నువ్వు నీ గదిలోకి వెళ్ళి డ్రెస్ మార్చుకో అన్నాడు.
    "డ్రెస్సా....నేను డ్రస్ మార్చుకోవడమేమిటి?" అని ఓసారి తన వంక చూసుకుని తన గదిలోకి పరుగెత్తాడు.
    హడావిడిగా రాత్రి ప్రనూష తన మీద విసిరేసిన బ్లాంకెట్ లుంగీలా చుట్టుకున్నాడు. అది సంగతి.
    ఏంటమ్మా ప్రనూ....ఎలా వున్నావు?" అడిగాడు కూతుర్ని దగ్గరకు తీసుకుని శర్మ.
    "బాగానే వున్నాను నాన్నా... మీరు, అమ్మ, ప్రియా అందరూ బావున్నారా?" అడిగింది ప్రనూష. రెండు నెలల తర్వాత తల్లిదండ్రులను చూసేసరికి కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
    పెళ్ళయ్యాక ఏ ఆడపిల్లకైనా తప్పనిసరి దూరం. కానీ ఎందుకో వాళ్ళతో అటాచ్ మెంట్ ఎక్కువ ప్రనూషకు.
    ప్రయాణ బడలిక కూడా పక్కకు పెట్టి రాగానే కూతురితో మాట్లాడుతూ కూచున్నాడు శర్మ.
    "అబ్బ.... ముందు మీరు స్నానమూ, టిఫినూ చేసి తెమలండి....తీరిగ్గా కూచొని కూతురితో కబురు చెప్పుకోవచ్చు" అంది సత్యవతి మొగుడ్ని ఉద్దేశించి.
    గుండెలో రాయి పడినంతపనయింది ప్రనూషకు.
    తమ ఉద్యోగం చేస్తోన్న విషయం చెప్పలేదు. ఉత్తరాల్లోనూ ఆ విషయం ప్రస్తావించలేదు. ఇప్పుడెలా?
    "ఏంటమ్మా అలా వున్నావు..." అడిగాడు కూతురి మొహంలో వస్తోన్న మార్పులు గమనించి.
    "అబ్బే...ఏమీ లేదు నాన్నా...ముందు మీరు స్నానం చేయండి. ఈ లోగా టిఫిన్ రెడీ చేస్తాను.
    "అవునవును ముందా పనే చేస్తాను. నీ దగ్గరికి వస్తున్నానన్న సంతోషంలో రాత్రి అన్నం కూడా సహించలేదు" అని కూతురి తల మీద ప్రేమతో నిమిరి బాత్రూం వైపు వెళ్ళాడు.
    "ఏంటో...ఈయనకు ఏదొచ్చినా పట్టడం కష్టం..." అంది సత్యవతి.
    ఇంతలో తండ్రి "అమ్మాయ్....బాత్రూం ఎటువైపు" అని అడిగాడు.
    రెండు వున్నాయి డాడీ. కుడివైపు గదిలోనూ, ఎడమవైపు గదిలోనూ..." అంది ప్రనూష.
    తండ్రి అటు వెళ్ళగానే శ్రీచరణ్ ను తన గదిలోకి లాక్కెళ్ళిపోయింది.
    "ఏంటీ....మీ అమ్మా నాన్న వాళ్ళు రాగానే మూడొచ్చిందా చెప్పు....చెప్పు.... నేను రెడీ...హమ్మో....వద్దులే....నా శీలం పోతే.... ఆనక నన్నెవరు పెళ్ళి చేసుకుంటారు. ఓన్లీ టచ్చింగులైతే ఫర్లేదు" అన్నాడు అత్యుత్సాహంగా శ్రీచరణ్.
    "నీకు ఆ ఆలోచనలు తప్ప  మరే ఆలోచనలు రావా?" కోపంగా అంది ప్రనూష.
    సాయంత్రం రాములవారి కోవెలలో భక్త శబరి హరికథ వుందట. వెళ్దామా? ఆ ఆలోచన బావుందా?" అన్నాడు వ్యంగ్యంగా శ్రీచరణ్.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS