ఏ.సి.పి వాలకం చూస్తుంటే తమ ఇద్దరి వివరాలు పూర్తిగా తెలుసుకున్నట్టే వున్నది. విష్ణును ఒంటరిగా కలుసుకోవాలనే వచ్చానంటుంది........ఆశ్రమంలో ఎందుకు వుంటున్నామో కూడా పూర్తిగా తెలిసినట్టే మాట్లాడుతున్నది.
కొంపతీసి ఆమె తమకు పోటీగా వచ్చిన మూడవ వనిత కాదు కదా?
ఇప్పటికే తామిద్దరూ ఒకరినొకరు అడ్డుగా వున్నామని మధానపడి పోతుంటే తమ మధ్యన ఏ.సి.పి రంగ ప్రవేశం చేస్తున్నది.
కలెక్టర్ ధీరజ జోక్యాన్నే తామిద్దరూ - సహించలేకపోతుంటే ఇప్పుడు మరొక వన్నెలాడి రంగ ప్రవేశం చేస్తున్నదా?
"ఇద్దరూ అలా బొమ్మల్లా నిలిచిపోయారేమిటి?' సీరియస్ గా ఆలోచనలో పడినట్టున్నారు. ఇక నుంచి మనం ముగ్గురం స్నేహితులం సరేనా?"
ఆ మాటలు విన్న ఇద్దరి ముఖాలలో కత్తివేటుకు రక్తం చుక్క లేనట్టు తెల్లగా పాలిపోయాయి.
అది గమనించిన కిరణ్మయి తనలో తనే నవ్వుకుంది.
"అవునూ మీ గురువు గారు ఇంకా రాలేదా?" కిరణ్మయి ఉత్సుకతగా ప్రశ్నించింది.
'ఎందుకు రాలేదు? అదిగో అక్కడ కూర్చున్నారు."
నీరసంగా అంటూ వేలుపెట్టి చూపించింది రీటా.
"లెక్క ప్రకారం ఒంటరిగా రావాలి కదా -- మీ ఇద్దరినీ ఎందుకు వెంట పెట్టుకుని వచ్చినట్టు"
'అయన తీసుకురాలేదు. మేమే వచ్చాం.......ఇలా వచ్చిన విషయం ఆయనకు తెలిస్తే సహించరు" భారతి అక్కసు కొద్దీ అన్నది.
"ఓ....దొంగల్లా వచ్చారా/ అయితే మీరిద్దరూ తోడు దొంగలన్న మాట.'
కిరణ్మయి మాటతీరుకు తేలుకుట్టిన దొంగల్లా ఇద్దరూ గతుక్కుమన్నారు.
ఉన్నట్టుండి ఏ.సి.పి ముందుకు నడిచింది.
సాయం సంధ్య ప్రవేశించే కాలం అది......
కృష్ణా నదీ జలాల పై నుండి వస్తున్న చల్లగాలి రివ్వుమంటూ చెంపలను తాకుతుంటే అదొక విధమైన ఆహ్లాదంగా వున్నది అక్కడి వాతావరణం.
ఆమె ఎందుకు వచ్చిందో, ఏం చేయబోతున్నదో అర్ధం కాక తెల్ల ముఖాలు వేసుకుని చూస్తుండిపోయారిద్దరూ.
ఒడ్డున వున్న సమతలం లాంటి ప్రదేశంలో జింక చర్మం పై పద్మాసనం వేసుకుని నదీ జలాలకు అభిముఖంగా కూర్చుని వున్నాడు విష్ణు.
కిరణ్మయి అతనికి కొంచెం దూరంలో ఆగిపోయింది.
విష్ణు లేచి నిలుచున్నాడు.
బాహ్య స్థితి గురించి పూర్తిగా మరచిపోయినట్టు ....కనీసం పక్కకు కూడా తలతిప్పి చూడడం లేదాయన. తన గమ్యం ఎక్కడో వున్నట్టు అడుగులో అడుగు వేసుకుంటూ విష్ణు నదీ జలాల్లో దిగాడు.
అతని అలౌకిక నిష్టను గమనించిన కిరణ్మయి ఆశ్చర్యపోయింది.
తన కళ్ళను నమ్మలేనట్టు పరమాద్భుత దృశ్యం గోచరించడంతో అదిరిపాటుకు లోనయింది.
ఆమె కాదు....దూరం నుంచి చూస్తున్న భారతి, రీటాలు కూడా రెప్పవేయడం మరచిపోయారు. బొమ్మల్లా అచేతనావస్థలో వుండిపోయారు.
నీటిలోకి దిగినా విష్ణు పాదాలు తడిసిపోవడం లేదు సరికదా---నేలపై నడుస్తున్నట్టుగా అతను నీటిపై నడచి వెళ్ళిపోతున్నాడు.
అశ్చర్యం కాక మరేమిటి?
నీటిలో అడుగుపెట్టిన వాళ్ళు నీటిలోపలకు దిగిపోతారు. అలాంటిది ఎలాంటి తడబాటు లేకుండా అలా నీటిపై తేలుతూ నడిచి వెళ్ళడమంటే సామాన్యం కాదు...
హటయోగంలో నిష్ణాతులైన వారు మాత్రమే అలా సాఫీగా నీటిపై నడిచి వెళ్ళగలరని వినడమే తప్ప ఎప్పుడూ కంటితో చూడడం తటస్థించ'లేదు వాళ్ళకు.
అందుకే కంటి ముందు ఎదురుగా జరుగుతున్నది ఇంద్రజాలంలా తోచింది వాళ్ళకు.
దాదాపు పడి గజాల దూరం వెళ్ళిన తరువాత విష్ణు పద్మాసనం వేసుకు కూర్చున్నాడు. మరింత అశ్చర్యం గొలిపేలా నీటిపై నుంచి విష్ణు ఒక్కొక్క అంగుళం చొప్పున పైపైకి లేస్తూ శూన్యంలో తేలియాడసాగాడు.
ఎలాంటి ఆధారం లేకుండా నీటిపై మునగకుండా వుండడమే అద్భుతం అనుకుంటే శున్యంలోకి లేచి నిశ్చలంగా ధ్యాన సమాధిలోకి వెళ్ళడం పరమాద్భుతం అనిపించింది.
ఆ దృశ్యం చూస్తున్న కిరణ్మయి నోట మాటరాక స్తంభించి పోయింది.
అరగంట పాటు అలా శూన్యంలో హటం వేసుకుని కూర్చున్న విష్ణు శారీరం నెమ్మదిగా నీటిపైకి చేరింది. పద్మాసనంలో నుంచి యధాప్రకారం లేచి నిలుచుంటున్నాడు.
అప్పటికి చలనం వచ్చిన కిరణ్మయి వేగంగా ప్రక్కకు తప్పుకుని వత్తుగా పెరిగిన రెల్లుగడ్డి దుబ్బుల చాటున కూర్చున్నది.
అంతకు ముందే భారతి, రీటాలు రెల్లుగడ్డి చాటున దాక్కోవడం చూశాకనే అలా చేయాలనే ఆలోచన స్పురించిందామెకు.
మెల్లగా వెనుదిరిగిన విష్ణు నీటిపై తేలియాడుతూ నడచివచ్చి, జింక చర్మాన్ని చుట్టి చంకలో పెట్టుకుని పడవ వైపు సాగిపోయాడు.
కిరణ్మయి అతని ముఖాన్ని అప్పుడు స్పష్టంగా చూడగలిగింది.
బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోతున్న అతని ముఖ వర్చస్సు మరలా మరలా చూడాలనిపించేటంత ఆకర్షిణియంగా వుంది. దృడమయిన శరీరం ......ఏ అవయవం ఏవిధంగా అమరి వుండాలో తెలిసి బ్రహ్మ తీరిదిద్దినట్టు సలక్షణమైన , నిండయిన విగ్రహం అతనిది.
ఆమె ఆలోచనలలో మునిగివుండగానే విష్ణు ఎక్కిన పడవ ఆవలి ఒడ్డుకు చేరింది.
అప్పుడు బయలుదేరింది కిరణ్మయి.
విష్ణు ఎవరో తెలియకముందు పొట్టకూటి కోసం అవతారం ఎత్తిన స్వామీజీ అయి ఉంటాడులే అనుకున్నది. వినయ్ కుమార్ మాటలను బట్టి జిత్తులమారి అయిన నకిలీ స్వామీజీ అనే నిశ్చయానికి వచ్చింది. ఇప్పుడు కళ్ళార చూశాక తన అభిప్రాయాలన్నీ తప్పే అని తనలో తానె తర్కించుకోసాగింది.
విష్ణులో నిజంగానే శక్తి లేకపోతే అంతమంది ప్రజలు అతనిని భగవంతుని అవతారంగా ఎందుకు కొలుస్తారు? మహిమలు లేనట్టయితే ఒకసారి వచ్చిన భక్తులు మరొకసారి దర్శనానికి ఎందుకు వస్తున్నట్టు? ఎలాంటి అతీంద్రియ శక్తులు లేవు అనుకుంటే ఇప్పుడు తమ కళ్ళార చూసింది ఏమిటి?
ఇంద్రజాలం కాదు.....కనికట్టు అంతకన్నా కాదు!
ఎంతో కాలం శ్రమించి, ఏకాగ్రతలో కుండలినీ శక్తిని జయించి హటయోగంలో ఎంతో సాధన పొందిన నిష్టాగరిష్టులలో మాత్రమే తమ శరీరాన్ని దూదిపింజకన్నా తేలికగా మార్చుకోగల మహిమ విబిడీకృతమై వుంటుందనేది తనకు తెలిసిన నగ్నసత్యం!
ఆలోచనలలో నుండి బయటపడుతూ భారతి, రీటాల కోసం తల తిప్పి చూసింది ఏ.సి.పి కిరణ్మయి.
ఎప్పుడయితే వాళ్ళు పడవ తీరాన్ని చేరుకున్నదో అప్పుడే ఆ ఇద్దరూ వెళ్ళిపోయారని ఊహించిన కిరణ్మయి పడవవాడికి డబ్బులు ఇచ్చి దూరముగా ఆపి వుంచిన జీపు వైపు నడిచింది.
ఇప్పుడు ఆమె ఆలోచనల నిండా విష్ణు రూపమే మెదులుతున్నది.
అయితే తను ఆలోచిస్తున్నది ఒక పోలీస్ ఆఫీసర్ గా కాదు......వయసులో వున్న ఒక సగటు ఆడపిల్లలా గాలిమేడలు కడుతూ , ఊహలతో తేలియాడిపోతున్నది!
