Previous Page Next Page 
ఎలమావి తోట! పేజి 32


    అంతలో కారు యింటిముందు ఆగింది.
    అందరూ తొలిసారిగా భూమ్మీదకాలు మోపుతున్న జింక పిల్లల్లా దూకేశారు కారులోంచి.
    ఎదురుగా భీకరమైన నిశ్శబ్దంతో, బడబాగ్ని దాచుకున్న సముద్రంలా కనిపించింది ఆ భవనం. తెలియని ఆందోళనతో భయంతో అంతా ఒక్కసారిగా లోపలికి పరుగులాటి నడకతో వెళ్ళేరు.
    
                                                                     23
    
    హాల్లోకి వచ్చి అమ్మమ్మని ఆ స్థితిలో  చూడగానే స్వప్నని తల తిరిగి నట్టయింది. "అమ్మమ్మా!" అంటూ గట్టిగా అరుస్తూ వెళ్ళింది. ఆ గొంతులో దుఃఖం, బాధ ఆందోళన అన్నీ మిళితమైన వున్నాయి.
    "స్వప్నగారూ!" మృదువుగా పిలిచాడు రవి.
    అమ్మమ్మగారి బెడ్ మీద కూర్చుంటూ చప్పున తలతిప్పి చూసింది స్వప్న. ముఖంలో కోపం చోటుచేసుకుంది. "ఏమిటి సంగతి! నీ కెందుకీ అధికారం?" అన్నట్టుగా చూసింది.
    "ఇలా రండీ." గంభీరంగా అన్నాడు రవి.
    మంత్రరుద్ద భుజంగంలా వచ్చింది స్వప్న. అదిచూసి వెంకట్రామయ్య తన చేతిలోని అధికారం పూర్తిగా జారిపోయిందనుకున్నాడు కోటలో పాగా వేశాడనుకున్నాడు.
    "మీ అమ్మగారు చనిపోయారు. పూర్ణా నర్సింగ్ హోంలో హార్ట్ ఎటాక్ వచ్చిపోయారు. మీ తండ్రిగారు నరసింహంగారు వచ్చి చెప్పారు. ఫోన్ చేసి మళ్ళీ ఆ విషయం కనుక్కున్నాకే అమ్మమ్మగారు యిలా అయ్యారు. ఈ స్థితిలో మీకు బెంబేలు పడకుండా మనస్సుని గట్టి బరచుకోండి!"
    ఒక్కక్షణం పాటు తనున్న భవంతి గిర్రున తిరిగినట్టయింది "మా అమ్మగారు పోయారా? మానాన్న చెప్పారా? అది విని అమ్మమ్మగారు షాకయ్యారా? మిస్టర్ రవీ, వాడ్డూ యు మీన్? మీరు స్మృతిలో ఉండే మాట్లాడుతున్నారా?" ఆశ్చర్యంతో కోపంతో నమ్మలేనట్టుగా అడిగింది.
    "స్వప్నా! నే చెప్పింది యదార్ధం. మీ అమ్మగారి డెడ్ బాడీ అక్కడే ఉంది. పద చూపిస్తాను!"
    పక్కనవరండాలోకి దారితీస్తున్న అతనివెంటే స్వప్నా విష్ణురాలిలాగా నడిచింది స్వప్న. అక్కడ బల్లమీద వున్న శవాన్ని చూసింది. బక్క చిక్కిపోయి, ముఖంలో కళతప్ప మరేమీలేని ఆ స్త్రీమూర్తిని చూడగానే ఆమె మనస్సు స్పందించింది "ఈమె తనకు జన్మనిచ్చిన మాతృదేవతా?" అనుకుంది.
    అంతలో హాల్లోంచి వెంకట్రామయ్య వచ్చి మెల్లిగా పిలిచాడు "అమ్మాయీ! అమ్మమ్మగారికి మెలుకువ వస్తునట్టుగా ఉంది" అన్నాడు.
    గబగబా అక్కడికి వెళ్ళింది స్వప్న. ఆమె మనస్సు మొద్దుబారినట్టయి ఆలోచించే శక్తిని కోల్పోయినట్టువుంది. అక్కడికి వెళ్ళేసరికి అమ్మమ్మగారికి మెలుకువచ్చింది.
    స్వప్న గబగబా వెళ్ళి అమ్మమ్మగారి ప్రక్క కూర్చుంది. అమ్మమ్మగారు నూరు లంఖణాలు చేసిన వ్యక్తిలా ఉన్నారు. స్వప్నని చూడగానే గాజుగోళాల్లా ఉన్న ఆమెకళ్ళు మిలమిలా మెరిశాయి. అంతలో అతని మనస్సులో దుఃఖం పెల్లుబుకుతూ వచ్చింది. కూతురుపోయిన దుఃఖం, మనవరాలికి సంభవించిన కష్టం ఆమె మనస్సు అదుపు తప్పించాయి. కన్నీళ్ళు పెట్టుకుంది.
    అమ్మమ్మ కన్నీళ్ళు తుడిచి "నేను వచ్చానుగా ఇంకేం భయంలేదులే అమ్మమ్మా!" అంది గద్గదికంగా.
    అమ్మమ్మగారు ఏమీ అన్లేదు. మనవరాలి చేయి తన చేతిలోకి తీసుకుని మృదువుగా నిమురుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ వుండిపోయారు. రవి అమ్మమ్మగారి మంచం దగ్గరిగా వచ్చాడు.
    అతన్ని ఇంకా దగ్గరికి పిలిచింది. అతను దగ్గరకు రాగానే అతని చేయి అందుకుని బలహీనంగా నిమరసాగింది ఆమె. ఏటిలో కొట్టుకపోయే వ్యక్తికి గడ్డిపోచ దొరికినట్లు వుందామెకి. రవి ఏమీ అనకుండా మౌనంగా వుండిపోయాడు.
    కొద్దిసేపు అలా మూగగా గడిచిపోయింది.
    "స్వప్నా! మీ అమ్మ చనిపోయిందమ్మా. పేగులో పేగుగా పుట్టి, నా గుండెల్లో చిచ్చుపెట్టి ఇంట్లోంచి వెళ్ళిపోయిందప్పుడు. ఇప్పుడు నన్ను చిచ్చులోకి పంపిస్తూ మా లోకం నుంచే వెళ్ళిపోయింది. అది చనిపోయేవరకూ నాకు దానిపై యింత ప్రేమ వుందనుకోలేదు. నా గుండెని ఇంతగా బలహీన పరుస్తుందనుకోలేదు. నిన్ను కట్టుకొయ్యను చేసుకుని బ్రతుకుతూ వుండినా నిన్నాళ్ళు! అయినా ఆ తాడు బలంగా తెంచేసింది మీ అమ్మ. నా గుండెని వూపేసింది. ఆపేస్తుందేమోనని భయం భయంగా వుంది."
    "అమ్మమ్మా!"
    "లాభం లేదమ్మా! నా పని అయిపోతుందేనని భయంగా ఉంది!"
    "ఆమె మాట పూర్తికాకుండానే "మీకేం ఫర్వాలేదు పెద్దమ్మగారూ! మీరు కోలుకుంటారు" అన్నాడు, అక్కడికి వచ్చిన వెంకట్రామయ్య.
    చప్పున అతనివైపు చూసింది. ఆ చూపుల్లో కోపం. అతనా విధంగా చొరవ చేసుకోవటం సహించలేని దాని లాగా చూసింది. వెంటనే వెనక్కి తగ్గేడతను "ఈ ముసల్ది చావటానికి సిద్దమైనా యింకా ఠీవి ప్రదర్శిస్తూనే వుంది!" అనుకున్నాడు.
    "స్వప్నా! నిన్ను అల్లారు ముద్దుగా పెంచాను. దుష్టశక్తులు నిన్ను కబళించకుండా చూశాను. నాచూపులురక్షణగా కోటకట్టాను. ఇప్పుడు ఆకోట ఛిన్నాభిన్నమవుతోంది. నా మరణం తర్వాత నిన్ను నాలాగా ఎవరు చూసుకుంటారా అనేదే నా ఆందోళన. మన యింటిచుట్టూ పాములూ, పులులూ ఎప్పుడూ తిరుగుతూ వుంటాయి ఐశ్వర్యవంతురాలూ, అందమైన అమ్మాయీ ఎవరూ రక్షణ లేనిదీ అంటే అందరికీ ఆశే! అందుకే నా తర్వాత నిన్ను ప్రేమగా జాగ్రత్తగా చూసుకునే వ్యక్తి కోసం యిన్నేళ్ళు పరీక్షగా చూస్తూ వుండినాను. నిన్ను పెళ్ళాడి, యీయింటి హోదాని, యీ ఆస్తిని, యీ ఐశ్వర్యాన్ని కాపాడుకో గలవాడు రవి! అవును స్వప్నా! నామనస్సుకి నచ్చి, నా పరీక్షలకి నిలిచాడు___"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS