Previous Page Next Page 
నరుడా ఏమి నీ కోరిక పేజి 33

 

    నారదుడు తల పట్టుకున్నాడు.


    "పద మహర్షి" అంటూ బయటకు నడిచాడు.


    "సార్.....ఎవరో నాటకాలోళ్ళు బిల్లు ఇవ్వకుండా వెళ్తున్నారు" సర్వర్ అరిచాడు.


    ప్రోప్రైటర్ రెండు కుక్కలకు వున్నగొలుసులు వుడదీసాడు.


    ఆ హొటల్ లో తిని బిల్లుకట్టని వాళ్ళను పప్పు రుబ్బించడమో, టేబుళ్ళు తుడిపించడమో లాంటి పనులు చేయించరు. కుక్కలను వదిలిపెడ్తారు. ఆ భయంతో డబ్బులు కడతారని ఆ ప్రోప్రైటర్ ఆలోచన.


    అంతే ఆ కుక్కలు యమధర్మరాజు, నారదుడు వెంట పడ్డాయి.

 

                                                                   * * *

    

    కొద్ది దూరం పరుగెత్తాక నారదుడికి ఓ ఆలోచన వచ్చింది.


    "సమవర్తి! ఆగి పిలిచాడు.


    "ఏమిటి నారదా!" ఆయాసంగా అడిగాడు.


    "తమరెందుకు పరుగెడుచుంటిరి?"


    "ఎందుకేమిటి అవతల ఆ శునకములు వెంటపడుచున్నవి కదా! అందులకు....."


    "పడిననేమి అగును."


    "ప్రాణములు పోవును. నా తొడ కండరములను తిని దంతములచే పికును అని మీరే కదా చెప్పారు" అన్నాడు యమధర్మరాజు.


    "నా బుద్దికి మాంద్యం సోకి అన్నాను. లేకున్న తమరే అందరి ప్రాణములు హరించువారు. అటువంటి మీకు ప్రాణభయమా? మీ చేతిలో పాశం వున్నది. మరో చేతిలో గదయున్నది. మీ కళ్ళల్లో ఎరుపు జీర వున్నది. మీరు కన్నెర్ర చేసిన ఆ శునకములు ఏ పాటి?" అన్నాడు నారదుడు.


    "అవును సుమీ! ఈ ఆలోచన నాకు తట్టనే లేదు సుమా! అయినా నేనేమిటి? చండాలంగా పరుగెత్తినాను. ఛ...ఛ....ఈ మానవ లోకమునకు వచ్చి మానవుల వల్ల భయపడి.....ఓహొ....."


    "ఇప్పుడింతగా ఆలోచించవలసిన పనిలేదు. ముందా శునకముల పని చూడుడు. అవి మీద పడి మన శరీరమును నంజుకు తినడానికి ఉవ్విళ్ళూరుతున్నాయి" నారదుడు ఆందోళనగా అన్నాడు.


    యమధర్మరాజు వెనుతిరిగి కోపంగా ఆ శునకముల వైపు చూశాడు.


    ఆ రెండు కుక్కలూ గుర్రుగా యముడి వైపు, నారదుడి వైపు చూసాయి.


    ఒక్కసారిగా యముడిమీదకు లంఘించబోయాయి. యమధర్మరాజు తన గదను వాటిమీదకు విసిరాడు.


    ఆ గద దాటికి ఆ రెండు కుక్కలు ఆకాశంలోకి ఎగిరి చాలా దూరం శున్యంలోకి ప్రయాణించి టాంక్ బండ్ దగ్గర సిమెంట్ బెంచి మీద కూర్చుని వున్న శ్రీచంద్ర, సత్తిపండుల ముందు దబ్బున పడ్డాయి.


    "యముండ" అంటూ మీసం మీద చేయేసాడు యమధర్మరాజు దర్పంగా.


    ఈసారి తన పాశాన్ని గురి చూసాడు.


    "యమా! అగుదు. మీ గద దాటికి అవి ప్రాణములు విడిచినవి. ఇపుడవి విగతజీవులు. తమ గద ధాటి మాములుదా?" అన్నాడు నారదుడు.


    "అవునవును. యముడనని ఆ శునకములు ఏమనుకున్నవి. అటులనే ఆ హొటల్ వాడిని కూడా నా గదతో....."


    "వద్దు సమవర్తి. అన్నట్లు మీ భాష మరీ ముతగ్గా మారుచున్నది" అన్నాడు నారదుడు.


    "ఏంటో ....అంతా నానా కంగాళీగా ఉంది నారదా! అన్నట్టు శునకములు నా గద ధాటికే కదా మరణించినవి" అన్నాడు యముడు.


    దివ్యదృష్టితో చూసిన నారదుడు "ఏమి సమవర్తి! వాటి ఆయువు నేటితో ముగిసినది. వాటికీ ప్రమాదవశాత్తూ మరణం రాసిపెట్టి యున్నాడు విధాత. ఇప్పుడునూ ప్రమాదవశముననే మీ చేతిలో ప్రాణములు కోల్పోయినవి" అన్నాడు.


    "ఏమియో......అన్నట్టు మరిచాను. ఇంతకీ ఆ మానవుడెక్కడ?" అన్నాడు.


    "అదిగో ప్రభూ! అల్లంత దూరంలో."


    అటువైపు చూసాడు యమధర్మరాజు.

 

                                                                 * * *


    ఉలిక్కిపడ్డాడు శ్రీచంద్ర.


    సత్తిపండు గట్టిగా అరిచి బేర్ మన్నాడు. రెండు కుక్కలు వచ్చి తమ బెంచి మీద పడ్డంతో ఇద్దరూ భయపడిపోయారు.


    "గురూ! మళ్లీ ఎవరో దొంగదెబ్బ తీసినట్టున్నారు" అన్నాడు గట్టిగా అరచి సత్తిపండు.


    "దొంగదెబ్బ కాదురా! రెండు బలసిన కుక్కలు మన మధ్య చచ్చిపడ్డాయి" అన్నాడు శ్రీచంద్ర.


    సత్తిపండు కళ్లజోడు తగించుకుని చూసాడు.


    "అవును గురూ! అదేంటి గురూ. ఆకాశంలోంచి వచ్చి చచ్చి పడ్డాయి. ఎందుకంటావ్?" అడిగాడు డౌట్ క్లారిపై చేసుకోవడానికి.


    "వెధవ డౌట్లతో నన్ను చంపకు" అంటూ చచ్చి పడివున్న ఆ కుక్కలవైపు చూసాడు.


    ఎక్కడా ఏ దెబ్బా లేదు.


    "ఒరే సత్తిపండు.....చిన్న దెబ్బ లేదురా. పైగా ఎక్కడుంచో వచ్చి పడ్డాయి."


    "గురూ! ఫ్లాష్ న్యూస్. బహుశా పాకిస్తాన్ వాళ్ళు ఇలాకుక్కలకు విషం పెట్టి చంపి దాని నోట్లో బాంబులు కుక్కి మన ట్విన్ సిటీస్ నాశనం చేయాలని విమానంలో నుంచి ఇక్కడ విసిరి పారేసారేమో" అన్నాడు తన తెలివితేటలకి తనే మురిసిపోతూ.


    "ఛ....ఉర్కో.....వాళ్ళకంత దైర్యం ఎక్కడ ఏడ్చి చచ్చింది?" అంటూ ఆ కుక్కలను పరిశీలనగా చూసి షాకయ్యాడు.


    ఏమాత్రం గాయం లేకుండా చచ్చిపడి వున్న కుక్కలను చూసి ముందు ఆశ్చర్యపోయి తర్వాత అనుమానంతో ఉలిక్కిపడ్డాడు.


    పైనుంచి దబ్బుమని కిందపడ్డమే కాక, వాటి మేడల దగ్గర కమిలిపోయిన గుర్తులు, అచ్చు మొన్న తన మెడ మీద వున్న గుర్తుల్లాంటివే.


    ఒక్క క్షణం అయోమయంలో పడ్డాడు శ్రీచంద్ర. అయినా ఆ ఫీలింగ్ ను కొనసాగించడం ఇష్టం లేకపోయింది.


    "పదరా సత్తిపండు.....ముందు ఏదో ఒకటి చేసి పుడ్ లాగించేద్దాం....."అంటూ లేచాడు.


    శ్రీచంద్రను అనుసరించాడు సత్తిపండు.


         
                                                              * * *


    నడిచి నడిచి కాళ్ళు నొప్పులు పుట్టి....టాంక్ బండ్ దగ్గరే వున్న ఓ సిమెంట్ బెంచి మీద కూచున్నారు. యమధర్మరాజు, నారదుడు.


    "నారదా......కాళ్ళు నొప్పులు పుట్టుచున్నవి......ఎవరినైనా పిలిచి కాళ్ళు పట్టమన్న పట్టుదురా....."


    పట్టరు సరిగదా.....మిమ్మల్ని ఎత్తి నీళ్ళలోకి విసిరేస్తారు. దానికి వేరే పద్దతి వుంది. దగ్గరలోనే ఓ మసాజ్ సెంటర్ వుంది. వెళ్లి పట్టించుకుందామా? అందమైన అమ్మాయిలు ఒళ్లు పడతారు."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS