Previous Page Next Page 
నరుడా ఏమి నీ కోరిక పేజి 32

 

    "దొంగదెబ్బ తియవుగా?" అడిగాడు భయంగా.


    "ఉహూ!"


    "నిజంగా?"


    "నిజ్జంగానే"


    "అమ్మతోడు, సరస్వత్తోడు చెప్పు....."


    అంతే! శ్రీచంద్ర లేఛి  సత్తిపండు చొక్కా పట్టి సర్రున చింపాడు. వీపు వంచి దబదబ నాలుగైదు బాదుళ్ళు బాది "ఒరే! ఇలాంటి చచ్చు పుచ్చు నికృష్ట ముదనష్టపు ఐడియాలు నాకెందుకురా ఇస్తావు!" అన్నాడు ఏడుపు గొంతుకతో.


    "అదేంటి గురూ! ఇంత చిన్న విషయానికే అంత పెద్ద ఆ ఎక్స్ ప్రేషనిస్తావు? బాగా లేదా. పోనీ మరో ఐడియా చెప్పేదా?" వీపు రుద్దుకుంటూ అన్నాడు.


    "వద్దురా.....నీకూ నీ ఐడియాలకి నమస్కారం" అన్నాడు.


    "నమస్కారం గురూ!"


    "అదేంట్రా!"


    "నువ్వే నమస్కారం అన్నావుగా బావోదని నేనూ నమస్కారం అన్నాను."


    శ్రీచంద్ర సిమెంట్ బెంచి మీద కూలబడ్డాడు. కాస్త దూరంగా భయంగా నిలబడి శ్రీచంద్ర ఎక్స్ ప్రేషన్స్ గమనిస్తున్నాడు సత్తిపండు.

 

                * * *


    యమధర్మరాజు , నారదుడు పరుగెడుతున్నారు.


    వెనుక రెండు కుక్కలు మొరుగుతూ వెంటపడ్డాయి. యమధర్మరాజు ఆయాసంతో వగరుస్తున్నాడు.


    "మహర్షి! నా వల్ల కాదు, ఆగిపోనా?"


    "మీరాగిపోయినచో అవి మీ మాంసమును కొరికివేయును" అన్నాడు పరుగెడుతూనే నారదుడు.


    "అటులనా.....ఛ....ఛ.....ఏమి ఈ వైపరీత్యము" అన్నాడు యమధర్మరాజు.


    నారదుడు ఆయాసంతో నిట్టూర్చాడు.


    అసలేం జరిగిందో తెలుసుకోవాలంటే......

 

                * * *


    యమధర్మరాజు హొటల్ ఇందూ డీలక్స్ ముందు ఆగాడు. చాలా మంది భోజనాలు చేసి కిళ్ళి నముల్తూ వస్తున్నారు.


    "నారదమునీ! మనమును అచట కేగి క్షుద్భాధ తీర్చుకుందామా?"


    "అబ్బ.....మనవ భాష....మానవ భాష" అన్నాడు నారదుడు నేత్తికొట్టుకుంటూ.


    "అటులనే....అటులనే మనము అక్కడికి వెళ్లి భోజనం చేద్దామా?"


    "సరే పదండి." అంటూ హొటల్ లోపలికి నడిచారు. హొటల్ లోపలకు వెళ్లగానే ఎసి చల్లగాలి ఝుమ్ముని తాకింది శరీరాన్ని.


    యమధర్మరాజుకి ఝువ్వుమంది వొళ్లు ఆ చల్లదనానికి.


    "ఇది ఏమి మహత్తు మహర్షి! బయట చచ్చేంత ఎండగా వున్నది ఉక్కబోవుచున్నది. దీని లోపలికి అడుగిడ గానే చల్లగా ఉన్నది" అన్నాడు.


    "స్వామీ! దీనిని ఎసి అందురు. అనిన ఆంగ్లము నందు ఎయిర్ కండిషన్. ఈ మిషన్ వున్న ఎడల ఆ గది మొత్తం చల్లగా, ప్రాణమునకు హాయిగా ఉండును"


    'ఓహో అటులనా! మానవులు తెలివిమంతులే సుమీ. పనిలో పని మనం యమలోకమునకు వెళ్ళినప్పుడు గుర్తు చేయుడు ఓ నాలుగు ఏసి మిషనులు తీసుకువెళ్ళెదము. నా జీవిత భాగస్వామి మరియు ప్రాణసఖికి ఇచ్చినచో అనందించును. మరచిపోకుము" అన్నాడు తన భార్యని తలచుకుంటూ.


    "చిత్తము స్వామి! అటులనే" అన్నాడు నారదుడు.


    ప్రోప్రైటర్ ఆ ఇద్దరి వంక చూస్తున్నాడు విచిత్రంగా.


    హొటల్ ముందు రెండు కుక్కలను కట్టి పడేసాడు. అవి కస్టమర్ల వంక చూసి గుర్రుమంటున్నాయి.


    యమధర్మరాజు , నారదుడు ఓ టేబుల్ దగ్గర కూర్చున్నారు.


    "రెండు భోజనములు " చెప్పాడు దర్పంగా యమ ధర్మరాజు.


    "టూ మీల్స్" అని అరుచుకుంటూ వెళ్లిపోయాడు సర్వర్.


    మరికొద్దిసేపయిన తరువాత రెండు అరిటాకులు వేసి ఇద్దరికీ వేడివేడి అన్నం వడ్డించారు.


    నాలుగు రకాల కర్రిస్, రెండు పచ్చళ్ళు, ఊరగాయ, అప్పడంతో సుష్టుగా తిన్నారిద్ద్దరు , గడ్డపెరుగు మరింత కమ్మగా ఉంది.


    అన్నం తినడం అయిపోయాక ఫ్రూట్ సలాడ్ తెచ్చి ఇచ్చాడు సర్వర్ రెండు కప్స్.


    యముడు స్పూన్ తో తింటూ లొట్టలు వేసాడు.


    "అబ్బ! ఈ మానవులకెన్ని రకములు తెలుసు మహర్షి! ఇంత మంచి మంచి రుచికరమగు పదార్ధములను మనము మన లోకమున చూడము కదూ. ఈ చల్లని పదార్ధమునేమందురు?"


    "దీనిని ఫ్రూట్ సలాడ్ విత్ ఐస్ క్రీమ్ అందురు స్వామి."


    'అటులనా! ఇది మనం వెళ్ళునప్పుడు తిసుకేళుదుమా?" అని అడిగాడు.


    'అయ్యో! కుదరదు స్వామి. కరిగిపోవును. కుదరదు."


    "ఎందుకని?"


    "ఈ ఐటమ్ ఫ్రీజ్ అనబడే పెట్టేలాంటి దాని యందు మాత్రమే ఉండును. బయట పెట్టినచో ఐదు నిమిషములలో కరిగిపోవును."


    "ఓహో! అటులైనచో ఆ ఫ్రిజ్ పెట్టెలు ఓ డజను తీసుకెళ్ళుదము. సరేనా?"


    "తీసులేళ్ళవచ్చును కానీ, మరీ లగేజ్ ఎక్కువయిపోతుంది స్వామీ రానురాను" డౌట్ గా ఫేసు పెట్టి అన్నాడు నారదుడు.


    "అయినచో .....మరో మార్గము ఆలోచించుడు"


    "సరే స్వామీ. ఈ భూలోకమున పేకర్స్ అండ్ మూవర్స్ వారు ఉన్నారు. వారికీ చెప్పినచో ట్రాన్స్ పోర్ట్ లో వేసుకుని వారే వచ్చి మన లోకమున సర్దిపోయేదరు . అట్టి వారికి చెప్పి చూస్తాను తెస్తరేమో!"


    "అది ఏమియో మీరు చుచుకోనుడు. కానీ తప్పనిసరిగా మాత్రం తీసుకెళ్ళదము."


    "అటులనే తమురు సెలవిచ్చాక తప్పుతుందా?" అంటూ ఇద్దరూ ఫ్రూట్ సలాడ్ మొత్తం లాగించి బ్రేవ్ మని త్రేన్చి "సుఖీభవ.....సుఖీభవ" అన్నారు సర్వర్ వైపు చూస్తూ......చుట్టుపక్కల టేబుల్స్ వాళ్ళు వీళ్ళని వింతగా చూడ్డం మొదలుపెట్టారు.


    "నేను సుఖిభావనే, మీరు బిల్లుభవ....అదే బిల్లు కట్టండి. ఇంతకీ ఏ నాటకంలో ఈ వేషాలు కట్టి వస్తున్నారు?" అడిగాడు సర్వర్.


    "ఏమది....ఏమి మాట్లాడుచుంటివి?"


    సర్వర్ తల బాదుకుని "సరే సరే మీరు ఇందాక మెక్కిన అన్నానికి డబ్బు కట్టండి" అన్నాడు.


    "డబ్బా! అననేమి?" యముడు ఆశ్చర్యంగా అడిగాడు.


    "నారదుడు లోగొంతుకతో "యమా! మనం తిన్నతిండికి ప్రతిఫలమడుగుతున్నారు" విడమర్చి వివరించాడు నారదుడు.


    "ప్రతిఫలమేమిటి? ఆతిధ్యం ఇచ్చి? ప్రతిఫలమాశించుటయా.....యముండా" అన్నాడు మీసాలు మెలివేస్తూ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS