'ఒరేయ్ గుంటనక్క మామా! నీ తెలివి తేటలు అమోఘంరా! వెళ్ళి మాట్లాడుతాను అంటే మాత్రం ఛస్తే వప్పుకోవు. ఇది నన్ను పరీక్ష చేయడం కాదా! నీకే కాదు నాకు వుంది బుర్ర....' అనుకున్న శీతల్ చాలా తేలిగ్గా నవ్వేస్తూ "ఒక్కోసారి మీకేమి తెలియదు అంకుల్! యిప్పుడు నేనీ వేషంలో వెళ్ళి షాలిన్ని పలకరించాననుకో. మళ్ళీ కొత్త చిక్కు వచ్చి పడుతుంది. వద్దంకుల్! మనం వెళ్ళిపోదాము" అంటూ ముందుకు దారి తీసింది.
"నిజమే నాకీ ఆలోచన రానే లేదు" శీతల్ మాట లతో తృప్తి చెందిన లోకేశ్వరరావు పైకి అన్నాడు.
ముగ్గురూ వచ్చి కారు ఎక్కారు.
19
వారం తర్వాత?
రాత్రికి రాత్రి-
శీతల్ ని కారు ఎక్కించుకుని మరో ఇంటికి తీసుకువచ్చాడు లోకేశ్వరరావు.
అర్దరాత్రి శీతల్ తో పాటు చిన్న కారులో ఇంకా ముగ్గురు మగవాళ్ళు వున్నారు. కారు ఎ.సి.ది కావడం వల్ల బైట ప్రపంచం కనిపించడం లేదు.
అర్ధరాత్రి నిద్రలేపి నన్ను ఎక్కడికి తీసుకెళుతున్నారని శీతల్ అడగలేదు.
"మనం ఒకచోటికి వెళ్ళాలి శీతల్! ఇంక నీకు తోచకపోవడం అంటూ వుండదు" అని అర్దరాత్రి లేఫై చెప్పాడు లోకేశ్వరరావు.
ఆ రాత్రి నిద్రపోయే ముందే అనుకుంది 'వారం పూర్తయింది ఈ లంకేశ్వరుడు గడువు పెట్టిన టైమ్ పూర్తిఅయింది. నేను ఏం చూడబోతున్నానో! ఏ కొత్త సంఘటన జరగనుందో! ఏం కానుందో'నని...
తన బ్రీఫ్ కేసుని మాత్రం పదిలంగా చేతపట్టుకుంది.
బ్రీఫ్ కేసు దేనికని లోకేశ్వరరావు అడగలేదు చూసి ఊరుకున్నాడు అంతే.
శీతల్ కారు ఎక్కింతరువాత "నిద్ర పూర్తిగా పోలేదు, కాసేపు పడుకుంటాను అంకుల్!" అంది ఆవులిస్తూ అరమూత వేసిన కళ్ళతో.
"అలాగే పడుకోమ్మా! మనం ఓ గంట కారులో వెళ్ళాలి" అన్నాడు లోకేశ్వరరావు.
శీతల్ కి నిద్ర ఎగిరిపోయింది.
దొంగ నిద్ర నటిద్దామని అలా అంది ఎ.సి. కారులోంచి బైటికి చూడడానికి లేదు. పడుకున్నట్టు నటించి వీళ్ళేమైనా పొడి పొడి మాటలు మాట్లాడుకున్నా సరే విందామనుకుంది.
"పడుకోమ్మా!" అని లోకేశ్వరరావు చెప్పంగానే సీటుకి పూర్తిగా చేరగిలబడి కళ్ళు మూసుకుంది శీతల్.
తెలివి ఏ ఒక్కరి సొత్తూ కాదు.
ఒక పథకం వేస్తే దానిని పడగొట్టే మరో పథకం ఎప్పుడూ వుంటుంది.
శీతల్ అలా కళ్ళు మూసుకుని పడుకోగానే కారు లోపలే ఏర్పాటు చేసిన ఓ బటన్ ని మామూలుగా ప్రెస్ చేశాడు లోకేశ్వరరావు.
లైట్ గా తియ్యని వాసన కారు లోపలంతా పరుచుకుంది.
శీతల్ ఆ వాసన పీలుస్తూనే మైకంలోకి వెళ్ళిపోయింది.
కొత్తగా ఫారిన్ నుంచి దిగుమతి అయిన మత్తు మందు. ఒక సీసాలో వుంటుంది. సీసాపై లేబుల్ మీద పరిమళ్ పెర్ ఫ్యూమ్ అని రాసి వుంటుంది. సీసాపై బటన్ నొక్కంగానే గాలిలో తేలుతూ లైట్ గా స్వీట్ వాసన పరుచుకుంటుంది. ఆ వాసన పీల్చంగానే మత్తుగా పడిపోవడం జరుగుతుంది.
ఈ వాసన పీల్చిన ప్రతివాళ్ళు మత్తుమందు ప్రభావానికి లోనయి సరీగా పది నిమిషాలు స్పృహ తప్పిపోతారు. ఈ మందుకి విరుగుడుగా ఓ మాత్ర వుంది. అది బుగ్గన వుంచుకుని చప్పరిస్తుంటే వాళ్ళు వాసన పీల్చినా స్పృహ తప్పదు.
విరుగుడు మందు బిళ్ళలు కారులో ప్రయాణిస్తున్న అందరి బుగ్గల్లోనూ వున్నాయి. అందువల్ల వాళ్ళెవరూ స్పృహ తప్పలేదు. వాసన పీల్చిన శీతల్ ఒక్కతి స్పృహ తప్పి మత్తులో పడిపోయింది.
శీతల్ ని కదిపి చూశాడు లోకేశ్వరరావు.
శీతల్ లేవలేదు.
శీతల్ దొంగనిద్ర నటిద్దామనుకుంది కాస్తమత్తుగా గాఢనిద్రలో జోగుతున్నది ఇప్పుడు.
"మనం యింకా అయిదు గంటలు ప్రయాణం చేయాలి. ఊ... వెంటనే ఇంజక్షన్ ఇవ్వండి" అన్నాడు లోకేశ్వరరావు.
పరిమళ్ పెర్ ఫ్యూమ్ మత్తు వాసన పీల్చినవాళ్ళు ఆ మత్తులో పదినిమిషాలు మాత్రమే వుంటారు. శీతల్ అయిదు గంటలు ప్రయాణించినట్లు తెలియకూడదు అందువల్ల వెంటనే అయిదారు గంటలసేపు లేవకుండా వుండే మత్తుమందు శీతల్ కి యింజక్షన్ ద్వారా యివ్వబడింది.
ఇప్పుడు శీతల్ కి ఏమీ తెలియదు. హాయిగా నిద్ర పోతున్నది.
గంట తర్వాత ఎ.సి. కారు సిటీ పొలిమేర దాటింది
