Previous Page Next Page 
వెన్నెల వాకిళ్ళు పేజి 32

 

    "మీరాఅండి!" అన్నాడు ఓ కుర్రాడు ఆశ్చర్యంగా.

    "అవున్రా....అప్పుడు నేను స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నాను, గాంధీజీని కలవాలని ఆయన్ని చూడటానికి మేమంతా మన ఊరునుంచి డిల్లి వెళ్ళాం. అయన దగ్గరకు వెళ్ళి నేను నమస్తే చెప్పి, మేము అహింసా పోరాటాన్ని ఎలా చేస్తుంది ఆయనకు చెప్పాం. అయన ఎంతో సంతోషించారు" అన్నాడు సర్వోత్తమరావు.

    "మీరు కూడా బాగా చదువుకుని ఆయనంత గొప్ప పేరు తెచ్చుకోవాలి తెలిసిందా?" అన్నాడు.

    "అలాగేనండి" అన్నారు వాళ్ళు.

                                            *    *    *    *

    "అమ్మా! నేను దాక్షాయణిపిన్ని, శివపార్వతి పిన్ని మ్యాట్ని ఆటకు వెళ్ళాలనుకుంటున్నామే, వెళ్ళమా?" అడిగింది జయంతి.

    మొన్ననేకదే మనందరం కలిసి వెళ్ళాం. అంతలోనే మళ్ళి ఏం సినిమా వచ్చింది?" అడిగింది కస్తూరి.

    "మల్లీశ్వరి సినిమానే....అందరం కలిసి నిదానంగా వెళదాం, ముందు మేం నాన్నగారికి, బాబాయ్ వాళ్ళకి తెలియకుండా వెళ్ళొస్తాం" అంది జయంతి.

    "ఏమోనే! మీ నాన్నగారికి తెలిస్తే కోప్పడతారు" అంది కస్తూరి.

    "అందుకేగా మ్యాట్ని ఆటకు వెళదాం అనుకుంటున్నాం. మన వెంకటేశంను తీసుకేళతాం, బండిలో వెళ్ళొస్తాం. ఎవరికి తెలియకుండా సరేనా?" అంది జయంతి బ్రతిమాలుతున్నట్లు.

    "ఎప్పుడు వెళుతున్నారు?" అడిగింది కస్తూరి.

    "ఈరోజే ఇంక గంట టైముంది. వెంకటేశంకు చెప్పాను బండి సిద్దంచేయమని" అంది ఆనందంగా.

    "ఓహో! అన్ని సిద్దం చేసుకునే అడుగుతున్నావన్నమాట" అంది సీరియస్ గా.

    "మా మంచి అమ్మ కదా, అడిగితే కాదనవనే ధైర్యంతోనే అడుగుతున్నాను" అంది జయంతి ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటూ.

    "దాక్షాయణి పిలుచుకురా" అంది కస్తూరి.

    జయంతి ఒక్క పరుగులో దాక్షాయణి గదిలోకి పరుగెత్తింది.

    "పిన్ని, అమ్మ పిలుస్తుంది నిన్ను" అంది.

    "అమ్మో చెప్పావా? సినిమా కెళుతున్నామని" అంది భయంగా.

    "చెప్పాను, అందుకే నిన్ను పిలుచుకురమ్మంటుంది, నువ్వు కూడ అడుగు అమ్మని" అంది జయంతి నవ్వుతూ.

    "ఇదేంటే నన్ను ఇలా ఇబ్బందిలో పెట్టావు....అక్కకు ఏం చెప్పాలి?" అంది భయంగా.

    "భయం ఎందుకు పిన్ని! నేను చెప్పాగా. ఊరికే నీకు చెపుతుంది జాగ్రత్తగా వెళ్ళిరండి అని అంతేగా" అంది జయంతి సీరియస్ గా.

    "ఏమో తల్లీ సినిమా వద్దు, గినిమా వద్దులే గమ్మున వుండు అంది దాక్షాయణి.

    "అయ్యో! అదేంటి పెద్దపిన్ని అలాగంటావుఏం కాదురా" అంటూ ఆమె చేయి పట్టుకుని లాక్కెళ్ళింది.

    "ఏంటి దాక్షాయణి! సినిమాకెళుతున్నారా?" అంది కస్తూరి మజ్జిగ చిలుకుతూ.

    "అవునక్కా! జయంతి ఒకటే గోలచేస్తుంది. మల్లీశ్వరి సినిమా వచ్చింది వెళదాం పిన్ని అని" అంది జయంతి మీదకు నెట్టి.

    "అందరం కలిసే వెళదాం....అలాగైతే" అంది కస్తూరి.

    "అందరం కలిసి తర్వాత వెళదాం అమ్మా! మీరంతా బయల్దేరేసరికి ఆ సినిమా వెళ్ళిపోతుంది. ఇప్పుడు మేం ముగ్గురం వెళతాం" ఏడుపు ముఖం పెట్టి కాళ్ళు రెండు నేల కేసి కొడుతూ గారంగా అంది.

    "సరిసర్లే! అమ్మా దాక్షాయణి! జాగ్రత్తగా వెళ్ళిరండి. వెంకటేశంకి చెప్పు బండి సిద్దం చేయమని" అంది కస్తూరి.

    "అలాగే అక్కా!" అంది దాక్షాయణి ఆనందంగా.

    "పార్వతి ఏది? అది కూడా వస్తుందా మీతో" అంది కస్తూరి.

    "వస్తుమ్ధక్కా!" అంది దాక్షాయణి.

    "జాగ్రత్త" సినిమా అయిపోయిన వెంటనే ఇంటికి వచ్చేయండి. మళ్ళి మీ బావగారు వస్తే కోప్పడతారు. ఒంటరిగా ఎందుకు పంపావని" అంది కస్తూరి.

    "అలాగే అక్కా! వెంటనే వచ్చేస్తాం. అయిదింటికి ఇంటికోచ్చేస్తాం" అంది దాక్షాయణి.

    "మంచిది, వెళ్ళిరండి" అంది కస్తూరి.
                                         *    *    *    *

    "గిరిజక్క మనతో పాటు సినిమాకి ఎందుకు రానంది?" స్వగతంలో అనుకున్నట్లు పైకే అనేసింది.జయంతి.

    "నువ్వడిగావా రమ్మని"అడిగింది దాక్షాయణి.

    "అడిగాను పిన్ని! తలనొప్పిగా వుంది.మీరెళ్ళీరండి అంది" చెప్పింది జయంతి.

    "మరింకేం తలనొప్పిగా వుందని చెప్పిందంటున్నావుగా" అంది శివపార్వతి.

    "ఆ మాటెందుకో నమ్మబుద్ది కావడంలేదు చిన్నపిన్ని! అసలు సినిమా అంటే ఎగిరిగంతెస్తుంది , అలాంటిది పదవే వెళ్ళొద్దామంటే కుంటి సాకు చెప్పింది " అంది జయంతి ఆలోచిస్తూ.

    "మొగుడితో వేళాదామనుకుని వుంటుందిలే,నువ్వెందుకు అంతగా ఆలోచిస్తున్నావ్?" అంది దాక్షాయణి.

    "అంతేనంటావా పెద్ద పిన్ని" సాలోచనగా అంది జయంతి.

    "అంతేలేవే,ఇంకేముంటుంది బాబూ! వెంకటేశం త్వరగా పోనియ్. చీకటి పడుతోంది. బావగారు వచ్చే సమయమయింధి" అంది దాక్షాయణి.

    "మీరు చాలా అదృష్టవంతులు పిన్నీ! ఎంచక్కా అందరూ కలిసి మెలిసి వుంటున్నారు. వీళ్ళు నా పిల్లలని ఎవరికి ఆలోచన రాదు. నిజంగా ఉమ్మడి కుటుంబం వల్ల బోల్డన్ని లాభాలున్నాయి కదూ" అంది జయంతి సీరియస్ గా.   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS