Previous Page Next Page 
నేస్తం నీ పేరే నిశ్శబ్దం పేజి 32

   

    స్తంభించిన గాలి......

 

    అగ్ని జిహ్వాల్లా సూర్యకిరణాలు నేలని మండిస్తుంటే తండ్రి మొహంలోకి చూశాడు ధన్వి.

 

    ఇంకా చెరగని అసంతృప్తి, కుహానా మర్యాదల గురించి, చెప్పి చెప్పి అలసిపోయిన నాన్న తనకి తానే చెక్కుకున్న అసంపూర్తి శిల్పంగా అనిపిస్తున్నాడు.

 

    శవం పక్కనే కూర్చున్న అమ్మ ఇంకా మిగిలిన కన్నీళ్ళతో నాన్న చంపల్ని తడిపేస్తూ పాతికేళ్ళ అనుభందాన్ని గుర్తు చేసుకుంటోందిగుండె అవిసేలా రోదిస్తూ.

 

    తండ్రితో పాటు అతడి ఆఫీసులో పనిచేసే కొలీగ్స్, వీధిలోని పరిచితులు చాలామంది చూసి వెళుతుంటే సామ్రాజ్యం అమ్మని ఓదార్చాలని విఫలప్రయత్నం చేస్తోంది.

 

    ధన్వి ఏడవడంలేదు.

 

    "ఎందుకేడవాలి?" అన్న ఆలోచన కాదది......అతడికి తెలీదుకారణం అందరిని విస్మయపరుస్తున్న విషయాల్లో ధన్వి కంటతడి పెట్టుకోవడం కూడా ఒకటి.

 

    నిజమే!

 

    తన జీవితంలో మరో కొత్త అధ్యాయం మొదలైంది.

 

    తండ్రిలేని కొంపలో ఇక అమ్మకి అన్నీ తనే కావాలి! అయినా అది పూడ్చలేని వెలితే....అసలు ప్రతిరోజూ తండ్రి చేసే అల్లరి హడావుడి లేకపోతే అమ్మ స్మశానస్తబ్ధత లాంటి ఆ ఇంట ఎలా అడ్జస్టు కాగలుగుతుందో ధన్వికి అర్ధంకావడం లేదు.

 

    ఎవరో గైడ్ చేస్తుంటే యాంత్రికంగా తండ్రి శవానికి స్నానం చేయించాడు. కొత్త బట్టలు తొడిగాడు. ఆ తర్వాత అంత్యక్రియలు పూర్తీ చేశాడు యాంత్రికంగా.

 

    కానీ ఇంటికి తిరిగి వచ్చాక బోసిపోయినట్టున్న ఇంటిలో అడుగు పెట్టక, అమ్మని చూశాక, ధన్వి కళ్ళనుంచి రాలిపడిందో నీటిబొట్టు.

 

    అంతసేపూ వున్న నిగ్రహం సడలిపోయిందేమో!

 

    ధన్వి గదిలోకి వెళ్ళాడు.

 

    కిటికీ దగ్గర నిలబడి వసారాలోకి చూస్తుంటే నాన్న ఇంకా తనని తిడుతున్నట్టుగానే వుంది.

 

    అమ్మ బ్రతికి వున్న శవంలా ఓ మూల కూర్చుని యిందాక నాన్న శవాన్ని వుంచిన చోట వెలిగే దీపాన్ని ఏకాగ్రతగా గమనిస్తోంది వెక్కిపడుతూ.

 

    అమ్మ దగ్గరికి వెళ్లాలని వుంది.

 

    అక్కున చేర్చుకుని 'నేనున్నానమ్మా, అని ఓదార్చాలని అనిపించింది, కాని ధైర్యం చాలడంలేదు.

 

    కదిపితే బావురుమంటూ కుప్పకూలిపోతుందనిపించిందో, లేక అందరిలా ఒదార్చగల సమర్ధత తనకి లేదనిపించిందో అలాగే చూస్తూ వుండిపోయాడు చీకటిపడేదాకా.

 

    గదిలో లైటు వెలిగింది. కాదు సామ్రాజ్యం వెలిగించింది.

 

    సామ్రాజ్యం పలకరిస్తుందనుకుంటే అలాంటి ప్రయత్నం చేయకుండానే వెళ్ళిపోయింది.

 

    తన వాళ్ళంటూ ఎవరు లేని ఆ కుటుంబానికి సామ్రాజ్యం అన్నీ తనైనట్టుగా వంట కూడా చేసింది.

 

    బడలికగా కూర్చుని చూస్తున్నాడు, సామ్రాజ్యం బుజ్జగిస్తూ తినిపించబోతే అమ్మ తినకుండా మొరాయించటాన్ని.

 

    ఆ క్షణంలో కూడా నాన్న గురించే కధలు కధలుగా చెబుతుంది అమ్మ. కన్నీళ్ళని దోసిళ్ళతో తాగుతూ సశేష స్వప్నమనిపించిన దాంపత్య జీవితంలో ఇకలేని తోడు గురించి బాధతో మౌనఘోషలా ఏకరువు పెడుతుంది. ఓ మనిషిని ప్రేమగా లాలించటానికి బంధువే కానవసరంలేదు, మనిషైతే చాలన్న సత్యాన్ని నిరూపిస్తుంది సామ్రాజ్యం.

 

    "ధన్వి!"

 

    నిస్త్రాణగా తల పైకెత్తి చూశాడు.

 

    "నువ్విలా గదిలో దాక్కుంటే ప్రయోజనం లేదు."

 

    ఎగతాళిగా అనలేదు కాని ధన్విని బలంగానే కదిలించింది సామ్రాజ్యం....

 

    "మీ అమ్మగారి మాటలు వింటున్నావ్ గా?"

 

    తనను వెళ్ళి ఒదార్చమంటోంది, నిజమే.

 

    కానీ ఎలా.....


    అలిగి వెళ్ళిపోయిన  నాన్న విషయంలో అయితే ధైర్యం చెప్పగలడు. అనారోగ్యంతో హాస్పిటల్ పాలైనా నాన్న గురించైతే బ్రతికించుకోటానికి వున్న మార్గాల గురించి ఏకరువు పెట్టగలడు.

 

కానీ ఇప్పటి పరిస్థితి అదికాదు.

 

    ఇంకెప్పటికీ నాన్న కనిపించడు అన్న భాధ తననే ఇంత కలవరపెడుతుంటే ఇక అమ్మని ఏం చెప్పి ఒదార్చగలడు?

 

    "మీ అమ్మకి ఇక మిగిలింది నువ్వే ధన్వి మీ అమ్మంటే నీకు చాలా యిష్టంగా.....వెళ్ళి అన్నం తినిపించి నువ్వు కాస్త ఎంగిలిపడు."

 

    "ఏమంటుంది సామ్రాజ్యం?

    మీ అమ్మంటే నీకు చాలా యిష్టంగా అంది, అంటే నాన్నని తను ద్వేషించేవాడా?

 

    "నేను మా నాన్నని కూడా ప్రేమించేవాడ్ని సామ్రాజ్యం! కాకపోతే అందరిలా ఎక్స్ ప్రెస్ చేసి వుండకపోవచ్చు."

 

    సామ్రాజ్యం నిశ్చలంగా చూసింది.

 

    "ఒక్క మాటడుగుతాను, జవాబు చెబుతావా? శవం తేలిన ఇంటిలో ఇంకా కొన్ని గంటలు కాకముందే ఇలా మాట్లాడ్డం న్యాయం కాదు, నాకూ తెలుసు. దేన్నయినా తట్టుకోగల నిబ్బరం గలవాడివని అంగీకరిస్తూన్నాను. అసలు ఒక్క కన్నీటిబొట్టూ రాల్చకుండా, రావ్వంతైనా స్పందన లేకుండా మీ నాన్నగారి శవం ముందు ఎలా నిలబడగాలిగావ్?" ఇది నా ఒక్కదాని అభిప్రాయం మాత్రమే కాదు ధన్వి......అందరూ అనుకుంటున్నారు. అనుకోవడంతో సరిపెడితే ఫర్వాలేదు. రోజు సాధించే మీ నాన్నగారి బెడద నీకు తప్పినట్టు ప్రవర్తించానంటున్నారు అంతా. అది నా భాధ."

 

    ధన్వి భావరహితంగా చూశాడు తప్ప ఆవేశపడలేదు.

 

    "ఇలాంటి సమయాల్లో అందరు కొడుకులూ ఎలా ప్రవర్తిస్తారో నాకు తెలీదు. కానీ నేను మాత్రం కన్నీళ్ళు పెట్టుకోకుండా వుండటానికి కారణం. నాన్నంటే యిష్టం లేకపోవడం కాదు సామ్రాజ్యం! అసలు నేను బాధపడలేదని మీరంతా ఎందుకనుకుంటున్నారు?"

 

    "ఆనందాన్ని నవ్వుతో, బాధని కంటితడితో ఎక్స్ ప్రెస్ చేయడం సహజం ధన్వి! అది అంతా ఒప్పుకునే నిజం."

 

    "నేను అందరికోసమూ బాధని నటించాలా?"

 

    వెంటనే ఓ ప్రశ్నని సంధించాడు. "దుఃఖసమయంలో కంటతడి పెట్టుకోవడం ఒక్కటే కాదు సామ్రాజ్యం! గొంతు మూగపోవడము బాధపడటానికి గుర్తే. బావురుమనడమే కాదు - బ్లాంకు గా నిలబడిపోవడము వేదనలో భాగాలే అయినా...."

 

    సహజంగానే మాట్లాడే శక్తిని కోల్పోతున్నట్టు అన్నాడు ధన్వి. "ఈ ప్రపంచంలో ఏ మనిషి మరణాన్ని తప్పించుకోలేదని తెలిసీ ఎందుకు గుండెలు బాదుకోవాలి? ఈరోజు నాన్న, రేపు నేను...."

 

    "వద్దు....."వినలేనట్టుగా రియాక్ట్ అయింది సామ్రాజ్యం. "ఓ శవం పూర్తిగా చితాభస్మంగా మారకముందే నువ్వు మరో చావు గురించి మాట్లాడకు."

 

    ఆ క్షణంలో ధన్వితో వాదులాటకి దిగడం ఆమెకి యిష్టంలేదు. ధన్వి ఇలా మాట్లాడగల సమర్దుడే అని తెలుసు కానీ ఇంత త్వరగా ఇలాంటి వాక్యాల్ని ఉచ్చరిస్తాడు అనుకోలేకపోయింది.

 

    "ఓ.కే.....నేను వెళుతున్నాను. నీకు వీలైతే మీ అమ్మతో కొంత టైం స్పెండ్ చెయ్....." బాధగా బయటి చీకటిలోకి చూస్తూ అంది . " అక్కడ కూడా ఇప్పుడాయనతో మాట్లాడినట్టు నీ అభిప్రాయం చెప్పి ఆ పిచ్చి తల్లిని భాధపెట్టకు ఇలా అంటున్నది నీ మీద కోపంతో కాదు ధన్వి! భర్త పోయి పుట్టెడు దుఃఖంలో వున్న మీ అమ్మగారు కొడుకనేది ఓదార్పు తప్ప చావుపుట్టుకల గురించి నువ్వు చెప్పే ధియరీ కాదు."

 

    ఆ తర్వాత సామ్రాజ్యం అక్కడ నిలబడలేదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS