Previous Page Next Page 
పగలే వెన్నెల పేజి 32


    
    ఎప్పుడైతే ఆమె వంగిందో అతను పేపర్ పైకెత్తినట్టు చేతుల్ని పైకెత్తి ఆమె ఎదమీదకి జరిపాడు.


    ఆమె హెడ్ లైన్స్ చదువుతోంది.


    ఆయన చేతుల్ని మరింత గట్టిగా వత్తాడు.


    ఆమెకు తెలిసిపోయింది. అంతే- ఆ క్షణంలో ఆయన హెడ్ మాస్టర్ గా కనపడలేదు. తనను చెరపట్టడానికొచ్చిన రాక్షసుడి మాదిరిగా కనిపించాడు.


    ఠక్కున పైకిలేచి బలాన్నంతా చేతుల్లోకి తీసుకున్నట్లు దవడ బిగించి చాచి లెంపకాయ కొట్టింది.


    ఆ దెబ్బతో అతను అదిరిపోయాడు. చెంపను పట్టుకున్నాడు. ఆయన ఎంత షాక్ కు గురయ్యాడంటే ఆమె తన స్టూడెంట్ అని గాని, స్టూడెంట్ చేతిలో దెబ్బతిన్న తొలి హెడ్మాస్టర్ తను అనిగానీ ఏమీ గుర్తుకురాలేదు. ఒక్కక్షణం మెదడంతా మొద్దుబారిపోయినట్లయింది. అసలు ఏం జరిగిందో తెలియడంలేదు.


    ఆమె బయటకు వచ్చింది. ఏదో తెలియని రోషం ఆమెను కమ్మేసింది. కోపం, దుఃఖం, రెండూ శరీరాన్ని ఎగిరెగిరి పడేస్తున్నాయి. అయితే ఆ కోపాన్ని ఎవరిమీద చూపించాలో ఆమెకి అర్థంకాలేదు.


    సీటు తనకిచ్చి తన తొడల్ని చరిచే కండక్టర్ నుంచి ఎదనునొక్కే హెడ్మాస్టర్ నుంచి ఆకలిగా చూసే హిందీపండిట్ వరకు ఎవరిపై చూపించాలి ఈ కోపం?


    ఆమె పుస్తకాల సంచిని తీసుకుని తిరిగి బయల్దేరింది అంతే ఆవేశంతో. ఇంటికి వచ్చేసిన కూతుర్ని చూసి - "ఏమైందే?" అని తల్లిదండ్రులు అడిగారు. ఆమె ఏమీ జవాబు చెప్పలేదు. "నేను చదువుకోను- అంతే" అని మాత్రం చెప్పింది. దాని వెనకనున్న కారణం తెలియకపోయినా నాగరాజు మాత్రం సంతోషించాడు.


    అలా ఆమె చదువు అటకెక్కింది.


    తమ కులంలో ఎందుకు ఆడపిల్లలు చదువుకోలేరో ఆమెకు తెలిసింది. ఇంట్లోవాళ్ళు మొదట ఇష్టపడరు. ఎందుకంటే చదివించే స్థోమత లేకపోవడంవల్ల. ఎలాగైనా పైచదువులో చేరినా చుట్టూ వున్న సంఘం చదువుకోనివ్వదు. కారణం తమ ఆర్థిక పరిస్థితి.


    తనలావుండే అగ్రకులాల ఆడపిల్లలు మాత్రం ఎలా చదువుకుంటున్నారు? వాళ్ళూ ఆడపిల్లలేగదా.


    కానీ వాళ్ళ దగ్గిర మగవాళ్ళు పిచ్చిపిచ్చి వేషాలు వెయ్యరు. పురుషోత్తం అయినా, హెడ్మాస్టర్ అయినా వాళ్ళ జోలికిపోరు. తమని ఏం చేసినా ఎవరూ అడగలేరన్న ధైర్యం, ఏమీకాదన్న నిబ్బరంవల్ల తమనే కాటువేయడానికి ప్రయత్నిస్తుంటారు వారు.


    ఇదంతా ఆమె ఎవరికీ  చెప్పలేదు. తమలాంటి తక్కువకులం ఆడపిల్లలంటే అందరికీ లోకువే.


    ఒంటరిగా ఇంట్లో వుండడం ఇష్టంలేక తండ్రితోపాటు తను కూడా కూలీకి వెళ్ళడం ప్రారంభించింది. కూలీ అంటే ఇటుకలు కేసేపని.


    నూటికి ఏదో రేటు ఉండేది. తాము ఎన్నివందలు కోస్తే అంత డబ్బు. వెధవ స్కూలుకన్నా తమవాళ్ళ మధ్యవుంటూ ఈపని చేసుకోవడం హాయిగా వుంది. స్వేచ్ఛలో వుండే ఆనందం ఎంత గొప్పదో ఆమె అనుభవిస్తోంది. సెక్యూరిటీగా వున్నప్పుడు ఎంత ధైర్యంగా వుంటామో తెలిసొచ్చింది. ఆమె ఇంకాస్తా ఏపుగా పెరిగింది.


    ఇంతకుముందైతే ఎవరైనా అబ్బాయిలు చూస్తే జుగుప్సగా, అసహ్యంగా వుండేది. ఇప్పుడలా లేదు. ఏదో సూచించినట్టుంది. కొద్దిగా సిగ్గు, మరికొంత పులకరింతలాంటి భావన- ఏదేదోగా అయిపోయేది ఒళ్ళంతా. అయితే ఎవరినయినా డైరెక్ట్ గానో, అసహ్యంగానో మాట్లాడితే మాత్రం వెంటనే రిటార్ట్ ఇచ్చేది. అందుకే ఇప్పుడు చాలామంది జాగ్రత్తగా మాట్లాడుతున్నారు. వయసు పెరిగేకొద్దీ ధైర్యం కూడా వచ్చింది ఆమెకు.


    "అయినా మీ కులంలో ఇంత అందగత్తె వుండడం అరుదు. ఎవరూ నమ్మరు. రెడ్లపిల్లంటేకూడా ఈజీగా నమ్మేస్తారు" అలాంటి వ్యాఖ్యానాలకు బాధపడాలో, లేక గర్వపడాలో ఆమెకు తెలిసేది కాదు.


    ఇలానే మూడేళ్ళు గడిచిపోయాయి.


    ఇప్పుడు ఆమె మరింత అద్భుతంగా తయారైంది.


    సాయంకాలంపూట వరిచేలమధ్య నడుస్తున్నప్పుడు, వెన్నెల్లో ఏటి ఇసుకలో మోచేతుల్ని దిండుగా చేసుకుని పడుకున్నప్పుడు, వర్షాకాలంలో తెల్లవారుఝామున చలిమంట దగ్గర్లో కూర్చున్నప్పుడు ఏ అనుభూతి కలుగుతుందో అలా అనిపించేది ఆమెను చూస్తుంటే.


    ఇంట్లోవున్న వాళ్ళంతా పనికి వెళ్ళడంతో డబ్బులు కూడా బాగానే మిగలడం ప్రారంభించాయి. అంతేకాకుండా బీసీ కాలనీలో ఇల్లు కూడా వచ్చింది.


    ఇంటిపని ప్రారంభించినప్పుడు ఇంటిల్లిపాదీ ఎంత సంతోషం పొందారో చెప్పనలవిగాదు. గవర్నమెంటు సిమెంట్, కమ్మీతోపాటు కూలీల నిమిత్తం కొంత డబ్బిచ్చింది. ఇల్లు మూడు నెలలకే పూర్తవడం, గృహప్రవేశం కూడా అయిపోయాయి. పురుషోత్తం ఇటుకల వ్యాపారంలో దెబ్బతిని, వ్యాపారం ఎత్తేశాడు. దాంతో ఉమ వ్యవసాయపనులకు వెళ్లడం ప్రారంభించింది.


    వ్యవసాయం పనులు కష్టమైనా అందులో ఉండే జాలీ అందులోనూ వుందని ఆమె కనిపెట్టింది.


    ఉదయం లేచి తొమ్మిదిగంటలకల్లా రెడీ అయిపోయి మిగతా అమ్మాయిలతో కలిసిపోవాలి. ఇక అక్కడినుంచి ఒకటే నవ్వులు- ఇకఇకలు పకపకలూను. చాలా చాలా విషయాలు వచ్చేవి. ఫలానా హీరోయిన్ ఏ డిజైన్ జాకెట్టు వేసుకున్నది, కొత్తగా వచ్చిన చౌదరి కోడలువాడే సెంట్ వరకు ప్రతీదీ వాళ్ళ దృష్టికి వచ్చేది.


    అలా అలా నడుచుకుంటూ పొలం చేరుకునేసరికి ఎలా లేదన్నా గంటో అరగంటో పట్టేది. అప్పుడిక పనిలోకి వంగడం, నాట్లో, గడ్డి తవ్వటమో అయితే భలేసరదాగా వుంటుంది. నాట్లు అయితే ఎవరో ఒకరు పాటందుకుంటారు. అట్లా పాటవింటూ నాటుతుంటే నడుంనొప్పి అసలు తెలిసేది కాదు.


    తిరిగి ఒంటిగంటకు తిరుగు ప్రయాణం. ఇంటికొచ్చి సంగటో, అన్నమో తింటే నిద్ర అంతసేపు కనురెప్పల చాటున దాక్కున్నట్టు వాలిపోయేది. సాయంకాలం నాలుగు గంటలకల్లా లేచి తయారైతే యిక పొద్దుగూకేవరకు స్నేహితురాళ్ళతో కబుర్లు.


    ఎప్పుడైనా తీరుబడి చిక్కితే అందరూ కలిసి షికార్లకు, సినిమాలకు వెళ్ళేవాళ్ళు. అందరితో కలిసి తార్రోడ్డుమీదకు చేరుకుని సినిమాకి వెళ్ళడమనేది ఆమెకెప్పుడూ ఒక మరపురాని మధురమైన సంగతి.


    అలా కాలం పరిగెడుతూ పరిగెడుతూ ఓ దగ్గర అందమైన మలుపు తిరిగింది. ఆమె ఇలాంటిది వూహించనైనాలేదు. ఆ అందమైన మలుపుకి కారణం సుధాకర్.


    ఓరోజు ఆమె సుబ్బారెడ్డి వరినాటుకు పిలిస్తే వెళ్ళింది. మొత్తం పన్నెండుమంది అమ్మాయిలు.


    "పోటీలు పడి నాటాలి. చూడాలి ఈరోజు మీ జంబం" సుబ్బారెడ్డి వాళ్ళను చూస్తూనే హుషారు పుట్టించాడు. మరి ఆ మాత్రం హుషారివ్వకపోయినట్లయితే వరినాటు వేగంగా జరగదు.


    "నారుకట్టలు నువ్వెయ్ - అట్లాగే పోటీ పడతాం చూసుకో. మొత్తం పన్నెండుమందిమి. నేను తప్ప మిగిలిన వాళ్ళకి పెళ్లి కూడా కాలేదు. మరి నువ్వేమో అరవైలో పడిపోయావ్. వెయ్ గలవేమో ఆలోచించుకో. మధ్యలో నావల్లకాదని చేతులెత్తేశావనుకో.... పాపం పడుచుపిల్లలు హైరానాపడిపోతారు" ఇంత నాటుసరసం, మోటుపాటలు అక్కడ చాలా సహజం.


    "వయసు కాదే కావాల్సింది మనసు. తలనెరిసిందిగానీ తలపులు నెరవలేదు" సుబ్బారెడ్డి వెనక్కి తగ్గలేదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS