"ఆగిపోయావేం? చెప్పు ఫరవాలేదు."
"నామీద ఎంత ఆపేక్షవుందో, ఆయనమీద కూడా నీకు అంత అభిమానం వుంది. ఇద్దరిలో ఒకరిని వదులుకోలేక సందిగ్ధంలో వున్నావు."
"అవును అనవసరంగా నాకు తెలియకుండానే ఆయన మీద అభిమానం పెంచుకున్నాను. ఆయన నైజం దీనికి పూర్తి విరుద్దం. ఎవర్నీ 'దగ్గరగా' అనుకోలేరు. అభిమానం, ప్రేమా పంచివ్వలేరు. తనని తప్ప ఇతరులని ప్రేమించలేని ఆత్మారాథకుడు."
"అక్కడే పొరబడుతున్నావు! ప్రేమించడానికి వెనకాడే వ్యక్తి ఒకవేళ ప్రేమిస్తే మాత్రం చాలా గొప్పగా ప్రేమిస్తాడు."
"చూడబోతే నా లక్ష్యాన్ని నేను చేరుకోవడం చాలా కష్టమనిపిస్తోంది" ఎంతో అశక్తత ఆవరించినట్లు అంది.
"లక్ష్యం సాధించడం, సాధించలేకపోవడం మన చేతుల్లోనే వుంది. ప్రయత్నిస్తే అసాధ్యాలనుకున్నవన్నీ సాధ్యాలే. ఇటువంటి నిరుత్సాహం నీ నుండి నేను ఆశించలేదు. ధృతి అందరి అమ్మాయిల్లాంటిది కాదు. అనుకున్నది సాధిస్తుందనే నా నమ్మకానని త్రుంచి పారేస్తున్నావు. నీ ప్రయత్నం నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకు. అసలు నన్నడిగితే నువ్వు ఇంతవరకు ఆయనకి ప్రేమాభిమానాల గురించి తెలిసేట్లుగా చెయ్యడానికి అసలు ప్రయత్నించలేదు. ఇప్పటినుండీ ఒక ఛాలెంజ్ గా తీసుకుని నీ పద్దతిలో నువ్వు ప్రయత్నించు. గొప్ప లక్ష్యాన్ని సాధించాలనుకోవడమే పెద్ద నేరంకాదు. అసలు జీవితంలో ఏ లక్ష్యం లేకపోవడమే పెద్ద నేరం తెలుసా?"
"ఆయనకి నా గురించి, నా కుటుంబ వ్యక్తుల గురించీ పూర్తిగా తెలుసు. అదే నా బలహీనమైన పాయింటైకూర్చుంది. కానీ నాకు ఆయన జీవితం గురించి ఒక్క విషయం కూడా తెలియదు. తెలుసుకునే మార్గం కూడా కనిపించడంలేదు" అంటూ వుండగానే యింటిదగ్గరకొచ్చేశారు. అలవాటుగా నవీన్ ఇంటిదాకావచ్చి దింపాడు. గుమ్మందాకా రాగానే ఇంట్లోంచి నవ్వుతూ, గట్టిగా ప్రేమ్ గొంతు వినిపించింది.
"లోపలికి రా నవీన్" అంటూ ధృతి ఇంట్లోకి నడిచింది.
"హలో ధృతీ! వైజాగ్ నుండి నీ కోసం ఏం తెచ్చానో చూడు" అంటూ ఓ ప్యాకెట్ తో ఎదురొస్తూ, వెనకాలే నవీన్ ని చూసి ఆగిపోయాడు.
"నవీన్! నా ఆప్తమిత్రుడు" పరిచయం చేసింది ధృతి.
"ప్రేమ్! తెలుసుకదా?"
ఇద్దరూ చేతులు కలుపుకున్నారు.
ధృతి నవ్వుతూ, "మీరు లేకపోతే అక్కడ సందడే లేదు. వెళ్ళిన పనులు అయ్యాయా?" అని అడిగింది.
"ఆ! అన్నీ దివ్యంగా జరిగాయి. చూడు ఈ చీర నీకు చాలా నప్పుతుందని అనిపించి కొన్నాను" అంటూ కవర్ లోంచి చీర తీసి చూపిస్తూ "చీర అయితే అమ్మెయ్యలేవుగా" అన్నాడు అదోలా చూస్తూ.
దెబ్బతిన్నట్టు చూసింది ధృతి ప్రేమ్ వైపు. నవీన్ పెద్దగా పట్టించుకోలేదు.
రవితో అతని చదువు గురించి మాట్లాడుతున్నాడు.
ప్రేమ్ తన ధోరణిలో తను మాట్లాడేస్తున్నాడు. నన్నగైర్కి వార్తలు వినడానికి ఇది చాలా బాగుంటుందని ఈ పాకెట్ ట్రాన్సిస్టర్ తెచ్చాను. అమ్మగారికి చీర...."
సుభద్ర వెంటనే "నాకెందుకు బాబూ!" అందికానీ మొహంలో ఆనందం కనపడుతూనే వుంది.
సీతారామయ్య అప్పుడే ట్రాన్సిస్టర్ పరిశీలిస్తున్నాడు.
ధృతి అందర్నీ చూసి- "మీరు మరోలా భావించకండి. నాకిలా బహుమతులు తీసుకోవడం అంటే ఇష్టం వుండదు. అంటూ చీర ప్యాకెట్లో పెట్టి అతని చేతికి అందించింది.
ఆమె చేసిన ఆ పనికి నవీన్ తప్ప అందరూ బాధపడిపోతున్నట్లు ఆమెనీ, ప్రేమ్ నీ మార్చి మార్చి చూశారు.
ప్రేమ్ పెద్దగా బాధపడినట్లు లేడు. "సరే! ఇప్పుడు తెలిసిందిగా నీకు యిష్టం లేదని, ప్రస్తుతానికి తీసుకో లేకపోతే వేస్ట్ అయిపోతంది. నేనెటూ చీరలు కట్టుకోను" అన్నాడు.
అతని మాటలకి ధృతి ఫక్కున నవ్వేసింది. సుభద్రా, సీతారామయ్యలు కూడా పెద్దగా నవ్వసాగారు.
పరిస్థితి కాస్త తేలికపడటంతో నవీన్ కదిలి "ధృతి! వెళ్ళొస్తాను" అన్నాడు.
"అప్పుడేనా కాసేపుండు" అంది ధృతి.
సుభద్ర ముఖం చిట్లించి కూతురి వైపు చూసింది.
"లేదు! కాస్త పనుంది వస్తా" అంటూ అందరివైపూ చూసి చెప్పి నవీన్ వెళ్ళిపోయాడు.
"రవీ! నీ కోచింగ్ గురించి మాట్లాడాను. వెంటనే వెళ్ళి అక్కడ 'కుమార్' అని వుంటాడు. అతనికి నా పేరు చెప్పి జాయిన్ అయిపో" అనగానే రవి ఎగిరి గంతేసినంత పనిచేసి, "థాంక్సండీ!" అన్నాడు.
"ఊరికే కృతజ్ఞతలు చెప్పి నన్ను పరాయివాడ్ని చేసేస్తున్నారు" అన్నాడు తెచ్చిపెట్టుకున్న కోపంతో.
"అదేం మాట బాబూ! అసలు నిన్ను చూస్తుంటే మాకు అస్సలు పరాయిగా అనిపించడంలేదు" అన్నాడు సీతారామయ్య.
సుభద్ర కూడా వంతపాడుతూ "ఏ జన్మలో బంధమో నాయనా! ఇంత ప్రేమ కురిపిస్తూ ఇన్ని సహాయాలు చేస్తున్నావు" అంది.
ధృతికి ఆ(దృశ్యం) వాతావరణం పరమ అవాస్తవికంగా, అతిశయంగా అనిపించి లోపలికి వెళ్ళిపోయింది.
ప్రేమ్ రవికి, కృతికి ఏవో జోక్స్ చెప్పి వినిపిస్తున్నాడు. వాళ్ళు అవసరానికి మించి నవ్వుతున్నారు. లోపల్నుంచి ఆమె అంతా వింటూనే వుంది. కొంచెంసేపయ్యాక వెళ్ళడానికి ఉద్యుక్తుడైనట్లున్నాడు.
"ధృతీ! అబ్బాయి వెళ్ళిపోతాడుట" అంటూ తల్లి పిలుపు వినిపించి ఇవతలికి వచ్చింది.
"ధృతీ! నేను లేనప్పుడు అంకుల్ కి జ్వరం వస్తే కంటికి రెప్పలా చూసి, సేవలు చేశావుట కదా! థాంక్స్" అన్నాడు.
"ఎవరు చెప్పారు?" కాస్త ఆశగా అడిగింది.
"సుబ్బారాజు చెప్పాడులే!"
