నాకు ఆయన మానసిక స్థితిమీద అనుమానం కలిగింది. "ఆయనకి పిచ్చిగానీ లేదు కదా?" అన్నాను.
"ఎవరికి? ఆ బిజినెస్ మేగ్నెట్ కా? తెలివిలో చాణుక్యుడూ, ఉపాయంలో యుగంధరుడూ!" అంది.
"మరి ఇలా అందరి ఇళ్ళకీ ఎందుకు వెళుతున్నట్లు? పోలీస్ లకి ఇన్ ఫార్మ్ చెయ్యడం ఇష్టం లేకపోతే ఏ డిటెక్టివ్ ఏజెన్సీలో సంప్రదించవచ్చుగా" అన్నాను.
ఆమె నవ్వింది. "రకరకాల మొగుళ్ళు! పాపం కొద్దీ పురుషుడు" అంది.
"కానీ నేను విన్నది ఏవిటంటే..." అంటూ ఆనంద్ చెప్పిన విషయం ఆమెతో అందామా వద్దా అని సందేహంగా ఆగిపోయాను.
అహల్య తనంతట తనే వెళ్ళిపోయిందనా?" మామూలుగా అడిగింది అనసూయ.
నేను ఆశ్చర్యంగా "నీకూ తెలుసా?" అన్నాను.
"ఏ స్త్రీ చరిత్ర చూసినా ఏముంటుంది అంతకన్నా గర్వకారణం" అని నవ్వి "నూతిలో కప్పకి కూడా విశేషాలు తెలుస్తున్నాయే! ఎవరు చెప్పారూ?" అంది.
"మా ఆయన" అన్నాను.
"చరిత్రలో రహస్యం అనుకున్నది ఏదీ ఇంతవరకు బట్టబయలు కాకుండా లేదు. అది నిప్పులాంటిది. అడ్డు వేసినకొద్దీ పొగ బయటికి రాక తప్పదు" అంది.
"అంత పెద్ద మనిషికి ఎంత అపవాదు?" బాధగా అన్నాను.
"ఏదైనా నాలుగు రోజులే ఆ తరవాత పెద్దగా పట్టించుకునే తీరిక ఈ మనుషులకి లేదు. ఏ విషయం అయినా మరుగున పడాల్సిందే!" అంది.
"కానీ ఇది పునీత పెళ్ళికి ముందు జరగడం....సరిగ్గా లేదు" అన్నాను.
అనసూయ ముందుకి వంగి "సరయిన సమయం! అందుకే ఆ రఘురాం అంత బాధపడుతున్నాడు. మగపెళ్ళివారికి తెలియకూడదని హైరానాపడుతున్నాడు. ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టింది అహల్య" అంది.
నాకు రాత్రి ఆనంద్ నా పట్ల ప్రవర్తించిన విధానం గుర్తొచ్చింది. అతని మీద కక్ష తీర్చుకోవాలని నేను ఆలోచించిన అనేకమైన మార్గాలు కూడా గుర్తొచ్చాయి. ఈ సోకాల్డ్ హై సొసైటీలోని మనుష్యుల్ని పరువు మీద కొట్టాలి. అహల్యకి కూడా నాలా బాధలా? నాకా విషయం నమ్మాలనిపించలేదు. అక్క చెల్లెళ్ళలా, స్నేహితుల్లా కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళిన పునీతా, అహల్య నాకు గుర్తొచ్చారు.
"ఏవిటి అలా ట్రాన్స్ లోకెళ్ళావు?" అడిగింది అనసూయ.
"అహల్యకి ఏం కష్టాలున్నాయని ఇలా చేసుంటుందీ?" అన్నాను.
అనసూయ గుప్పెట బిగించి చూపిస్తూ "దీనిలో ఏవుందో నే చెప్తే కానీ నీకు తెలీదు. కానీ నేను అడిగితే నువ్వు ఇందులో పట్టేవీ, నీ వూహకి తోచినవీ.....చాలా చెప్తావు అవన్నీ సరయిన సమాధానాలు కాదు ఇది ఆడదాని మనసు. దీనిలో ఏవుంటుందో ఆమె కన్నతల్లికి కూడా చెప్పుకోలేదు. ఇది 'పేండోరా బాక్స్' మూత తీస్తే కష్టం" అంది.
నేను పైట సర్దుకుంటూ వేళ్ళు తగిలి గుండెలు భగ్గుమని "అ....మ్మా" అన్నాను.
"ఏవైందీ?" అనసూయ ఆత్రంగా దగ్గరకొస్తూ అడిగింది.
ఈ పేండోరా బాక్స్ మూత తీసి ఆమెకి చూపించాలని అనిపించలేదు.
"రేపు హాలిడే కదా....ఎక్కడికయినా వెళుతున్నావా?" అడిగాను.
"పిన్ని శ్రీశైలం చూపించమని పోరు పెడుతోంది. నువ్వూ వస్తావా....వెళదాం" అడిగింది.
"వస్తాను" ఆలోచించకుండా చెప్పాను.
నేను అనసూయతో శ్రీశైలం వెళ్ళినట్లు ఆనంద్ కి తెలుస్తుందేమో చూడాలి. తెలిస్తే ఏం చేస్తాడో....నాలో పట్టుదల పెరిగిపోతోంది.
అనసూయ చెప్పినట్లుగా బస్ డిపోలో సూట్ కేస్ తో చాలాసేపు ఎదురుచూశాను. ఫోన్ బూత్ దగ్గరకి వెళ్ళి ఆమె ఇంటికి డయల్ చేశాను.
"హలో" అనసూయ పలికింది.
"అనసూయా....రాలేదేం? బస్ డిపోనుండి మాట్లాడుతున్నాను" అన్నాను.
"ఈయన రాత్రి తాగొచ్చి గొడవచేశారు సుమతీ, పిన్నిని కొట్టారు. అది చూసి భయపడి బాబు జ్వరం తెచ్చుకున్నాడు. ఇల్లు ఆయన పేరిట రిజిస్టర్ చేయించాలట....అదీ గొడవ" ఏడుపు ఆపుకుంటూ అంది.
నాకు ఆమె పరిస్థితి అర్ధమైంది.
"ఏమైనా న్యాయంగా వుందా చెప్పు..." ఏడుస్తూనే అడిగింది.
నీతి అనే హద్దు దాటాకా ఇంకా న్యాయాన్యాయాల గురించి మాట్లాడటం నాకు నవ్వు తెప్పించింది.
"సరే....వుంటాను" అని ఫోన్ పెట్టేశాను.
పూరించలేని సమస్యల గురించి మాట్లాడుతూ టైం వేస్ట్ చేసుకోవడం నాకు ఇష్టంలేదు.
సూట్ కేస్ తీసుకుని బయటికొచ్చి ఆటోని పిలవబోతుండగా "హలో" అన్న పలకరింపు వినిపించింది.
చూస్తే....ప్రదీప్!
వెంటనే ప్రతిగా విష్ చేయాలని కూడా తట్టలేదు. అలాగే చూస్తుండిపోయాను.
స్కూల్లో వున్నప్పుడు అమరావతి ఎక్స్ కర్షన్ కెళ్ళి కృష్ణమ్మని అలాగే కళ్లిప్పి చూస్తుండిపోయాను. అందమైనవీ, ఇష్టమైనవీ మూగని చేస్తాయి.
"మాట్లాడండి....అలా వీరప్పన్ ని చూసినట్లు చూస్తుండిపోకండి. జనం అనుమానపడతారు" అన్నాడు.
నేను చిన్నగా నవ్వాను.
"ఆ సూట్ కేస్ ఇటివ్వండి....కారులో పెడదాం..." సూట్ కేసు అందుకుంటూ అన్నాడు.
అనాలోచితంగా ఇచ్చేశాను.
అతను కారు డోర్ తెరిచి పట్టుకుని "ఇంటికా?" అన్నాడు.
"ఏమో!"
అతను అప్పుడే జూలోకొచ్చిన కొత్త జంతువుని చూసినట్లు చూశాడు.
"ఎక్కండి" అని డ్రైవింగ్ సీటులో కూర్చున్నాడు.
అతని పక్కన అలా కూర్చుంటే నాకు మాధవి గుర్తొచ్చి గిల్టీగా అనిపిస్తోంది. పిచ్చిమొద్దు! ప్రతి ఉదయం ఈ మనిషి కోసం ఎంత ఎదురుచూస్తోందో!
"చాక్ లెట్ తింటారా?" క్యాడ్ బరీస్ తీసి అందిస్తూ అన్నాడు.
నేను అందుకున్నాను.
వికారాబాద్ దగ్గర మా ఫార్మ్ హౌస్ వుంది. అక్కడికెళుతున్నాను. ఒక్కడినే బోర్ కొడుతుందేమో అనుకున్నాను. సమయానికి మీరు కనిపించారు. హేపీగా వెళ్ళచ్చు" అన్నాడు.
అన్నీ టేకిట్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకుంటాడు. నేను అంగీకరించాలిగా.
"నేనా....అంత దూరమా?" అన్నాను.
అతను నవ్వాడు. "ఇంటికా అంటే ఏమో అన్నాను. దాన్ని బట్టే తెలిసింది. మీ గమ్యం నిర్దేశించుకోలేదని. కానీ నా గమ్యం నాకు తెలుసు. నా చేతిలో స్టీరింగ్ వుంది. అది చాలదా ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకుపోవడానికి. అవసరమైతే వాడడానికి కత్తి కూడా వుంది" ఆఖరి మాట గొంతు మార్చి విలన్ లా అన్నాడు.
