అన్నీ చాలా సింపుల్ గా మాట్లాడేస్తాడు. ఇతనికి జీవితంలో ఏదీ సీరియస్ విషయం కాదా....అనిపించింది.
"ఇంట్లో చెప్పకుండా ఇలా..." నసిగాను.
"ఇల్లు ఏవంటుందండీ? దానికేమైనా నోరుందా బదులివ్వడానికి..." అని నవ్వి "జోక్ బాలేదా? సారీ....ఇంట్లో ఎవరికి చెప్పాలీ?" అడిగాను.
"మా ఆయనకి" అన్నాను.
అతను సెల్ ఫోన్ తీసిస్తూ "నేనూ ప్రదీప్ వికారాబాద్ వెళుతున్నాం. ఒకటి రెండు రోజుల్లో వచ్చేస్తాం అని చెప్పండి" అన్నాడు.
నాకు నవ్వొచ్చింది.
"ఏం చెప్పడం కష్టమా? మరి అలాంటప్పుడు ఏం చేద్దాం? పోనీ నే చెప్పనా.....మీ ఆవిడ్ని నేను నాతో తీసుకెళుతున్నాను అని!" చాలా సీరియస్ గా అన్నాడు.
నాకు అనసూయ అన్న మాటలు గుర్తొచ్చాయి. "అహల్య సరిగ్గా కొట్టింది. సరైనా టైంలో కొట్టింది" అంది. నిజంగా ప్రదీప్ తో వెళ్ళిపోతున్నానని సెల్ లో చెప్పేసి వెళ్ళిపోతేనో...
"హలో...మరీ సిక్స్ టీన్ రీల్స్ పిక్చర్ అక్కర్లేదు. ఒక్క సీన్ చాలు! ఆయన సోఫాలో వెనక్కి విరుచుకు పడిపోతాడు. దట్సాల్!" అన్నాడు.
"నువ్వెక్కడికెళుతున్నావో...ఏం చేస్తున్నావో నేను తెలుసుకోలేనను కుంటున్నావా?" అన్నాడు ఆనంద్ - ఇదెలా తెలుసుకుంటాడూ? ఛాలెంజింగ్ గా అనిపించింది.
"సో.....ఓ.కే.నా?" అన్నాడు.
క్యాడ్ బరీస్ కొరుకుతూ "సరే" అన్నాను.
"నాకూ హాఫ్ ఇవ్వడం మర్యాదనుకుంట!" అన్నాడు.
"ఎంగిలి చేసేశాను" బాధపడుతూ అన్నాను.
"ప్రపంచంలో ఎంగిలి చెయ్యబడనిది ఏది?"
అతను చెయ్యి జాపి అందుకుంటూ అన్నాడు "కడలి తీరాన్నీ, వర్షం భూమినీ, భ్రమరం పుష్పాన్నీ, గాలి సమస్తాన్నీ ఎంగిలి చేసేస్తుంది."
అతను చాక్ లెట్ కొరికి "వా! టేస్ట్ పెరిగింది" అన్నాడు.
నాకు అంతా కలలా వుంది! ఏడుపు ముంచుకు వస్తోంది. అదేమిటో బాధ కలిగినప్పుడు ఏడుపురాదు! ఆనందం కలిగితే ఎగదన్నుకు వస్తుంది!
సిటీ లిమిట్స్ దాటే వరకూ అతను ఏవేవో జోక్స్ చెప్పి నవ్విస్తూనే వున్నాడు.
కారు మెలికలు తిరుగుతూ సాగిపోతోంది. మంద్రంగా జగ్ జీత్ సింగ్ గజల్స్ పెట్టాడు.
'కోయీ రిష్తా నహీ రహా ఫిర్ భీ...
ఏక్ తస్వీర్ లాజమీనీ హై.....షామ్ సే ఆఖ్ మే నన్హీసీహై..."
ఒక పిల్లగాలి మెల్లగా నా చెంప తట్టి పలకరించిపోయింది. అతని నుండి వీస్తున్న డెనిమ్ సువాసనలు నాకెంతో అలవాటుగా అనిపిస్తున్నాయి.
ప్రదీప్ నావైపు తిరిగి చిన్నగా నవ్వుతూ అన్నాడు. "మనం ఇంతకు ముందు కలిసినప్పుడు చివరిసారిగా అన్న మాటలు నాకింకా గుర్తే! మీకు గుర్తున్నాయా?"
ఎలా మరిచిపోతానూ! ఆ ఒక్క దృశ్యం నా మనోవీధిలో ఎన్నెన్ని సార్లు రివైండ్ చేసుకుని చూసుకున్నానో నాకు తెలీదా?....అందుకే మౌనంగా వున్నాను.
"మనసుని పెట్టడానికి ఇంకా ఎవరూ పంజరాలు తయారు చెయ్యలేదు. కానీ ఒకవేళ పంజరంలోంచి బయటపడాలని అనిపిస్తే నాకు చెప్పండి అన్నాను గుర్తుందా?"
అతను సూటిగా పాయింట్ కి వచ్చేశాడు.
నేను నా కొంగు చివర ముళ్ళు వేస్తూ కూర్చున్నాను.
"మంచి భర్తా, ముత్యాల్లాంటి పిల్లలూ హాయిగా జీవితం గడపడానికి కావలసిన ఆస్తీ అన్నీ వున్నా మనసులో ఒక వేక్యూమ్ వుండకూడదని ఏం లేదు! మీ పరిస్థితి ఎలాంటిదైనా 'ఇలాంటి' మనస్థితి రాకూడదని ఎవరూ రూల్స్ పెట్టలేరు. సంకోచాన్ని కొంగు చివర ముళ్ళుగా మార్చకండి. విప్పి వదిలి పెట్టండి" అన్నాడు.
నాకేదో తక్కువైందని అతను అనుకోవడం లేదు. ఇతని ముందు నా జీవితాన్ని పరిచి చులకనైపోవడం వల్ల నాకు ఒరిగేదేమిటీ? ఎంతో మంది స్త్రీలు ఒక పురుషుడి స్వాంతన దొరకగానే తమ జీవితంలోని అసంతృప్తులని అతని ముందు ఏకరువు పెట్టుకుంటారు. ఫలితంగా అనసూయలూ, అహల్యలూ తయారవుతారు! అలాగే పురుషుడు పరాయి స్త్రీ స్నేహం లభించగానే తన భార్యలో లోపాలనీ తన జీవితంలో వెలితినీ ఆమె ముందు పరుస్తాడు. బజారులో బేరానికి పెట్టిన పశువులా ఎదుటివాడు పరీక్షించడానికి వీలు కల్పిస్తే ఒరిగే లాభం ఏమిటి? ఇష్టమైనంత కలం అవసరం తీర్చుకుని ఆ తర్వాత ఇవతల వాళ్ళ గురించి తేలిగ్గా మాట్లాడడానికి అవకాశం కల్పించడం తప్ప! నా పక్కన కూర్చున్న వ్యక్తి సామాజిక కట్టడులనీ నైతిక సూత్రాలనీ నమ్మడు. ఎవరి పరిధిలోకి తనంతట తాను రాడు. ఒకవేళ ఎదుటివాళ్ళు వస్తే వదిలిపెట్టడు. అందమైన ఆర్గ్యుమెంట్ తో కన్విన్స్ చేసి పారేస్తాడు. అతను 'వాలి!' ఎదుటివారి శక్తిని మొత్తంగా తాను పీల్చేయగలడు. అందుకే ఊపిరి పీల్చాలన్నా భయంగావుంది. మనసులో ఆలోచనలని ఎక్కడ వాసన పట్టేస్తాడో అని!
నా భుజం మీద బరువుగా అతని చెయ్యి పడి స్పృహలోకి వచ్చాను.
"సుమతీ! మీలోని ఈ సంఘర్షణకే నాకు ఆకర్షణగా మారింది. నేనంటే ఎంత ఇష్టమో నాకు మీ బాడీ లాంగ్వేజ్ చెప్తుంది. నన్ను చూడగానే మతాబుల్లా వెలిగే మీ కళ్ళు చెప్తాయి. కానీ మీలోని భారతీయత అది ఒప్పుకోనివ్వడం లేదు.... అంతేనా?" అన్నాడు.
శీలం గురించి నేను ఆలోచించడం లేదు. కానీ మంచీ చెడూ అనేవి వుంటాయిగా! ట్రాఫిక్ పోలీస్ లేడని రూల్స్ పాటించకపోతే ఎవరికి నష్టం?"
"మీ కళ్ళంటే నాకు చాలా ఇష్టం! అవి నాలో మీకు వినిపించని చాలా రహస్యాలు నాతో చెప్తాయి" అన్నాడు కొద్దిగా నావైపు ఒంగుతూ. అతని చెంప నా చెంపకి తగిలింది. మీసం కొస పెదవి చివర చక్కిలిగిలి పెట్టింది. నా గుండె కొట్టుకునే వేగం పెరిగింది. మరు నిముషంలో ఏం జరుగుతుందో నాకు తెలుసు! అతను కారు ఆపి తన ముఖాన్ని నా ముఖం ముందుకి తెచ్చాడు. అతని బలమైన అరచేతుల్లో నా ముఖం ఫ్రేమ్ లో బిగించినట్లుగా బందీ అయింది. ఇంకో లిప్తకాలంలో అతని పెదవులు నా పెదవులని ఆక్రమిస్తాయనగా అన్నాను.
"మాధవి నా క్లోజ్ ఫ్రెండ్!"
అతను ఠక్కున దూరం జరిగినా నా మొహంలోకి ఆశ్చర్యంగా చూశాడు.
"మీరు మద్దిపాలెంలో జరిగిన నీలిమ పెళ్ళికి వెళ్ళినప్పుడు పరిచయం అయిన మాధవి" అతనికి గుర్తు చేశాను.
"ఐసీ!" అన్నాడు.
"నేనూ, మాధవీ కాలేజ్ డేస్ నుండీ ఒకే ప్రాణంగా..." నేను చెపుతుండగానే అతని పెదవులు నా పెదవులకి చేరి గట్టిగా హత్తుకున్నాయి. ఆ తర్వాత నాకు మాట పెగలలేదు! శరీరం అచేతనమై అతని చేతుల్లో శిలలా వుండిపోయింది.
అతను దూరంగా జరిగాడు.
జరిగిందేమిటో పెదవుల మీద తడి చెప్తోంది. ఈ కొత్త ఆట అలవాటు లేని నాలుక తడబడుతోంది. మాధవి తెలుసన్నాక కూడా ఇతను సంకోచించకుండా నన్ను ముద్దుపెట్టుకున్నాడంటే అసలు ఇతనికి దాని మీద అలాంటి ఫీలింగ్ లేదా? ఈ విషయం తెలిస్తే అదెలా తట్టుకుంటుంది?
