Previous Page Next Page 
హద్దులున్నాయి జాగ్రత్త పేజి 32


    నా కళ్ళు కూడా అతని కోర్కె తీర్చడానికి నిరాకరించాయి. నిర్లిప్తంగా చూశాను.
    
    "ఏడవడానికి కూడా అహం అడ్డు వస్తోందా?" అన్నాడు.
    
    "ఎందుకిలా రాక్షసుడిలా ప్రవర్తిస్తున్నావ్? నేను ఏడిస్తే నీకేమొస్తుందీ?" అడిగాను.
    
    "మరో అహల్యవి కాకుండా వుంటావు. ఫలానా ఆనంద్ గాడి పెళ్ళాం లేచిపోయింది అన్నమాట రాకుండా వుంటుంది! నువ్వు ఏడవాలి, నీ పెదవి అంచున బిగబట్టిన అభిమానం, అభిజాత్యం అన్నీ పోవాలి....నా కాలిక్రింద కుక్కలా పడుండాలి...అందుకు నీకు ఎంత లంచం ఇస్తున్నానో చూడు!"
    
    ఆనంద్ నా వార్డ్ రోబ్ తెరిచి హేంగర్లకి వేలాడుతున్న చీరలన్నీ తీసి నామీద కుప్పలా విసిరాడు. పిచ్చిపట్టిన వాడిలా లాకర్ ఓపెన్ చేసి జ్యువెలరీ బాక్స్ తెరిచి నగలన్నీ నా మీదకి గిరాటేసాడు.
    
    "చూడు.....ఇవన్నీ....తాకి చూసే అర్హత కూడా లేని నీకు ఇవన్నీ ఎందుకిస్తున్నాననుకున్నావు? నువ్వు ఇల్లు కదలకుండా, పరాయి పురుషుడ్ని కన్నెత్తి చూడకుండా వుండడం కోసం. అర్ధమైందా? నిన్ను ఫినిష్ చెయ్యడం నిమిషం పని" లైటర్ వెలిగించి ఆ మంటని దగ్గరగా తీసుకుని కొచ్చి బెనారస్ పట్టుచీరని అంటించాడు. అది అంటుకుంది. గబుక్కున నామీద నుండి తీసి కార్పెట్ మీద పారేసాను. కార్పెట్ అంటుకుని మంటలురేగాయి.
    
    నేను పరిగెత్తుకు వెళ్ళి బకెట్ తో నీళ్ళు తెచ్చి దానిమీద పోసి మంటలార్పాను. ఆనంద్ ఉన్మాదంగా నవ్వుతున్నాడు.
    
    "నీకు పిచ్చి పట్టిందా?" అసహ్యమంతా మొహంలో చూపిస్తూ అడిగాను.
    
    "ఔను! నీ అహంకారం నాకు పిచ్చిపట్టిస్తోంది. ఇంత చేసినా నువ్వు ఏడవ్వేమే?"
    
    నా చీర పట్టుకు లాగేస్తూ అన్నాడు.
    
    అతనికి సంతోషం కలిగించే పని నేనెందుకు చెయ్యాలి? శక్తిని కూడగట్టుకుని గుప్పెళ్ళు బిగించి మరీ గుండెలమీద మంటని భరిస్తూ నిలబడ్డాను. అతను చీర మొత్తం విప్పి అవతల పారేసాడు.
    
    శరీరం మొత్తం నేప్పితో, మంటలతో గిలగిలలాడుతూ వుండగా నా మీదకి వచ్చాడు.
    
    భగవాన్....ఇతను మనిషా!!!
    
    నా గుండెలు మండుతున్నాయి. బయట కాలినందుకు కాదు! లోలోన లావాలా ద్వేషం వుడికిపోతోంది. నేనేం తప్పు చేసాను? ఏ కక్షతో వీళ్ళు నన్ను ఈ ఇంటి కోడల్ని చేసుకున్నారు? అభం శుభం ఎరుగని ఏ తల్లి కన్నబిడ్దనో బలవంతంగా పంజరంలో పెట్టి బంధించడంకాకుండా అది జీవితంలో ఎగరలేకుండా రెక్కలను సైతం కత్తిరించడం నేరం అని వీళ్ళకి తెలీదా? వీళ్ళని ఏ చట్టం శిక్షిస్తుంది? భగవంతుడనే వాడుంటే ఈ పాపాలని ఎందుకు క్షమిస్తున్నాడు? ఇప్పుడు నేనేం చెయ్యాలి?
    
    ఆనంద్ కోర్కె తీరాకా తప్పతాగి పడుకున్నాడు.
    
    వంటింట్లోంఛి కిరోసిన్ తెచ్చి మీద జల్లి అగ్గిపుల్ల గీయనా? నిమిషంలో బుగ్గి అయిపోతాడు. నేను లేచి వంటింట్లోకి వెళ్తుంటే చీర కుచ్చిళ్ళు కాళ్ళకి అడ్డం పడ్డాయి. కాలి వేళ్ళకి వున్న మట్టెలు మెరుస్తూ కన్పించాయి. గుండెలమీద బరువుగా కదులుతూ రెండు తులాల మంగళసూత్రాలు.....నేను నిస్సత్తువగా గడప పట్టుకుని నిలబడిపోయాను.
    
    "చంపెయ్.....జైల్లో అయినా తృప్తిగా గాలి పీల్చుకుందువుగాని' అంటోంది అంతరాత్మ.
    
    నేను అడుగు ముందుకి వేసాను.
    
    అతను సిగరెట్ తో నన్ను కాలుస్తున్నప్పటి రూపం, అతని పెదవుల మీద అప్పుడు కనిపించిన ఆ నవ్వూ గుర్తువస్తేనే శరీరం కసితో భగభగమంటోంది! కిరోసిన్ సీసా అందుకున్నాను.
    
    కాలికింద ఏదో పడింది. చూసేసరికే బొద్దింక నా పాదంకింద పడి నలిగి చచ్చే స్థితిలో కొట్టుకుంటోంది. నాకు దాన్ని అలా చూడగానే బాధేసింది. ఆ అల్పజీవిని నేను తెలియకుండా చంపేశాను. ఛీ! ఛీ! క్రింద చూస్తూ నడవాల్సింది.
    
    రెండు అడుగులు వేసి వెనక్కి తిరిగి చూసాను. బొద్దింక చచ్చిపడివుంది. నా వల్ల చచ్చిపోయింది. నాకు కళ్ళు తిరిగినట్లయ్యాయి గోడ ఆసరాగా చేసుకుని నిలబడ్డాను.
    
    బొద్దింక చచ్చిపోతేనే తట్టుకోలేని నేను.....ఒక మనిషిని హత్య చేయగలనా? నాకు ఏడుపొచ్చింది. నన్ను అతను హింసిస్తున్నందుకు కాదు ఎదుటివారిని హింసించలేని నా మనోదౌర్భల్యం మీద.....చిన్నప్పటి నుండీ అమ్మమ్మ నూరిపోసిన నీతికథల మీద.....మంచితనం అనే నా చాతకాని తనం మీద.... తరతరాలనుండీ స్త్రీలో పేరుకుపోయిన ఈ క్షమాగుణం వల్ల....అన్నింటిమీదా కక్ష కలిగింది. చేతిలోని అగ్గిపెట్టెని విరిసికొట్టాను. కిరోసిన్ సీసాని యధాస్థానంలో వుంచి వచ్చేసాను.
    
    ఆనంద్ ఇంకా ఆదమరచి నిశ్చింతగా నిద్రపోతున్నాడు.
    
    నేనేం చేసినా ప్రతిఘటించలేడు. చంపక్కర్లేదు....సిగరెట్ అందుకుని వెలిగించాను. ఎర్రగా రాక్షసుడి కన్నులా కాల్తోంది. అతని పెదవుల దాకా తీసుకెళ్ళాను. ఎర్రని పెదవులు అరవిచ్చి నవ్వుతున్నాయి. బహుశా ప్రియంవదతో చేసిన రొమేన్స్ గుర్తుకొస్తోంది కాబోలు! సిగరెట్ తో ఆ పెదవులని చురుక్కుమనిపిస్తేనో... గుండెలమీద బనీన్ తప్ప ఏవీలేదు. గుండెలమీద గట్టిగా ఒత్తిపెట్టి అక్కడ్నుంచి వెళ్ళిపోతేనో...
    
    రెండు క్షణాల తర్వాత సిగరెట్ ని యాష్ ట్రేలో నలిపి పారేసి శుభ్రంగా చేతులు కడుక్కున్నాను. నేనేం చెయ్యలేను. నేను అశక్తురాలిని. ఇది నా పరాజయమో...నాలోని మానవత్వం గెలుపో అర్ధంకాని స్థితి.
    
    "రాత్రంతా నిద్రపోలేదు కదూ!" నా ఎర్రని కళ్ళని చూస్తూ అడిగింది అనసూయ.
    
    "నిన్న మీరు ఊరికెళ్ళారా?" మాట మారుస్తూ అన్నాను.
    
    "అవును! గురుమూర్తిగారు ద్రాక్షతోటలేవో అమ్మకానికొస్తే చూద్దామని తీసుకెళ్ళారు" అంటూ స్వీట్ బాక్స్ తీసి ఒకటి అందించింది.
    
    "ఏమిటి విశేషం?" అడిగాను.
    
    "నా కోసం ఆయన మహేంద్రాహిల్స్ లో ఒక ఫ్లాట్ తీసుకున్నారు. త్వరలోనే గృహప్రవేశం" అంది. వెలిగిపోతున్న ఆమె ముఖం చూస్తుంటే 'డబ్బున్న వెధవకి పెళ్ళాంగా వుండడం కన్నా....వెధవైన డబ్బున్న వాడికి ఉంపుడుగత్తెగా వుండడం సుఖమేమో' అనిపించింది.
    
    నేను స్వీట్ అందుకుంటూ "అహల్యగారు కనబడడం లేదుట నిన్న రఘురాంగారు మా ఇంటికి వచ్చారు" అన్నాను.
    
    "మా ఇంటికీ వచ్చారుట" అనసూయ స్వీట్ తింటూ అంది.
    
    "నేను ఒకే ఒక్కసారి ఆవిడ్ని చూశాను. మా ఇంటికి ఎందుకొచ్చారో నాకు అర్ధంకావడం లేదు" అన్నాను.
    
    అనసూయ నవ్వి "ఒకే ఒక్కసారి ఆవిడ వెళ్ళిన చీరల షాపుకీ, ఎక్కిన టాక్సీ వాడి ఇంటికి, పోస్ట్ మేన్ ఇంటికి వెళ్ళగా లేనిది మీ ఇంటికి రావడంలో విచిత్రం ఏవిటీ?" అంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS