Previous Page Next Page 
స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్ పేజి 33

   

    ఆమె ముందు క్యాసెట్ ఎగతాళి చేస్తున్నట్టు వుంది.    
    అరవింద్ చౌరసియా తన మీద సాధించిన ఆఖరి విజయంలా వుంది అది.    
    కొంచెం సేపు స్తబ్ధంగా వున్న తరువాత, ఆమె నెమ్మదిగా తేరుకుని మామూలు మనిషి అయింది. వీరదాసు పౌర సన్మానాన్ని రికార్డు చేయడానికి వచ్చిన దూరదర్సన్ వారిని కలుసుకుంది. "మొత్తం మీటింగ్ అంతా రికార్డు చేస్తారా? లేక కావల్సిందే చేస్తారా?"    
    "మొత్తం అంతా వీడియో తీసి కావల్సింది ఎడిట్ చేసుకుంటాం మేడమ్".    
    "థాంక్యూ" అని వాళ్ళని పంపివేసింది.    
    ఇంకో అరగంటలో మీటింగ్ ప్రారంభం కానున్నది అనగా ఆమెను సభా ప్రాంగణానికి తీసుకువెళ్ళడానికి పులిరాజు వచ్చాడు. "కూర్చోండి, ఇంకా టైమ్ వుందిగా వెళ్దాం" అంది.    
    ఇద్దరూ మాట్లాడుకుంటూ వుండగా నాయుడు ఇంటినుంచి టిఫిన్ వచ్చింది. పనివాడు ఇద్దరికీ ప్లేట్లలో తీసుకొచ్చాడు.    
    పులిరాజు అన్నాడు, "మీ వారు చీఫ్ మినిష్టర్ అయితే, క్యాబినెట్ లో కనీసం నలుగురు నేను రికమెండ్ చేసినవాళ్ళు వుండాలి."    
    "తప్పకుండా" ఆమె తన ప్లేతులోని స్వీట్ తీసి అతడికి వేస్తూ అంది. "ఇంత కష్టపడి వీరదాసుని బయటికి తీసుకొచ్చాం. అందర్నీ గెలిపిస్తాడో లేదో చూడాలి. అది అంత సులభం కాదనుకుంటాను."    
    "మా పార్టీ సెంటర్ నుంచి సపోర్ట్ చేస్తుందికదా మాక్కావల్సింది ప్రస్తుత ముఖ్యమంత్రి కూలిపోయి, మా పార్టీ మనిషి అధికారంలోకి రావడం! మీ ఆయన మా పార్టీలో కలిసిపోతున్నాడు కాబట్టి ఇక సమస్యే లేదు. కాస్త స్వీట్ తీసుకో అమ్మాయ్. నాయుడు అంత ప్రేమతో పంపాడు కదా!".    
    "వద్దండీ మేం సినిమాల్లో పనిచేసే వాళ్ళంకదా స్వీట్లు తినకూడదు" అని ఆగి, ఆమె అన్నది- "మా ఆయన బహుశ మీ పార్టీలో చేరరనుకుంటాను."    
    అతడికి స్వీట్ గొంతుకు అడ్డుపడింది. "అంటే" అన్నాడు.    
    "నాకు పూర్తిగా తెలీదు పులిరాజుగారూ ఈ విషయం నిర్దారించి వాళ్ళు చెప్పేవరకూ నేను మీతో అనకూడదు. కానీ నా వూహ అది" అని తలవంచుకుని "నాకూ, మా ఆయనకీ పడటం లేదు. త్వరలోనే మేము విడాకులు తీఉస్కోబోతున్నాం. అందుకే మీకిది ముందే చెపుతున్నాను" అంది. పులిరాజు ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు.    
    "నీకెందుకొచ్చిందీ ఆలోచన?" సందిగ్ధంగా అడిగాడు.    
    "వీరదాసు ఈ ఏరియాలో చాలా పాపులర్ అయివుండవచ్చు. కానీ రాష్ట్రంలో అతడి కంట్రోలు ఎంత? అదలా వుంచండి. మా ఆయన పార్టీ మార్చి మీ పార్టీలో చేరి ముఖ్యమంత్రి అవుతాడనుకోండి. ఎంతకాలం పదవిలో వుండగలడు? అసమ్మతి వర్గం వూరుకుంటుందా? ఎన్నో ఏళ్లనుంచీ పార్టీనే నమ్ముకున్న వాళ్ళని వదిలి, కొత్తగా చేరిన వాడిని ముఖ్యమంత్రిని చేస్తే అది కూలిపోదూ? అప్పుడు కేంద్రం మరో రాష్ట్ర నాయకుడిని ఎన్ను కొమ్మని కోరితే, నాయుడు, మా ఆయన్ల గతి ఏమిటి? వాళ్ళు మిమ్మల్ని అంత సులభంగా ఎలా నమ్ముతారు?"    
    "మరిదంతా ఎందుకు చేశారు?"    
    "వాళ్ళేం చేశారు? ఏదీ చెయ్యలేదు. అంతా మీరే చేసి సాయం చేశారు. మొదట్లో వీరదాస్ రిలీజ్ అవకుండా అడ్డుపడ్డారు. తరువాత రాయబారానికి వచ్చారు. మా వాళ్ళు దాన్ని నమ్మినట్టు నటించి వీరదాస్ ని విడిపించుకున్నారు. వాళ్ళ కార్యమే నెరవేరింది కదా."    
    పులిరాజు మొహం జేవురించింది. "బద్మాష్ లు..... వాళ్ళని ప్రాణాల్తో వుండనివ్వను." అన్నాడు రేపు ఢిల్లీలో తన అధిష్టాన వర్గానికి మొహం ఎలా చూపించాలో అతడికి తెలియడం లేదు.    
    "ఇదంతా నేను వూహించింది మాత్రమే'. రాజకీయాల్లో నాకు పెద్దగా పరిచయం లేదు. చాలాకాలం హోం మినిష్టర్ గా వుండడంకంటే కొద్దికాలంపాటు ముఖ్యమంత్రిగా వుండటమే బెటర్ అని మా ఆయన అనుకుంటే బహుశ పార్టీ మార్చవచ్చు"   
    పులిరాజు చాలాసేపు అన్యమనస్కంగా వుండి, "వెళ్దామా- టైమ్ అయింది" అన్నాడు.    
    అయిదు నిముషాల తరువాత ఇద్దరూ సభాప్రాంగణానికి చేరుకున్నారు. కారు దిగుతూ పులిరాజు అన్నాడు. "నువ్వు చెప్పినదంతా నిజమయితే నేను నాయుడ్ని బ్రతకనివ్వను. సారీ.... మీ ఆయన్ను కూడా."    
                                             *    *    *    
    సభ జనంతో కళకళలాడుతూంది. కిక్కిరిసినట్టున్నారు జనం ముందు నాయుడు మాట్లాడాడు. తరువాత పులిరాజు అతడు కుర్చీలోంచి లేవబోతూంటే కామిని దగ్గరకొచ్చి ఆమె డ్రైవర్ ఆమెతో ఏదో మాట్లాడటం కనిపించింది. ఆమె మొహం పాలిపోయింది. "నిజమా" అని గొణగటం అతడు చూశాడు.    
    ఆమె కుర్చీ దగ్గిరకు వస్తూ "ఏమైంది?" అని అడిగాడు.    
    "మా బోయ్ చనిపోయాడట స్వీట్ ఏదో తిన్నాడట ఫుడ్ పాయిజినింగ్-"    
    పులిరాజు మైకు దగ్గిరకు వెళ్ళి మాట్లాడటం ప్రారంభించిన అయిదు నిముషాలకు గుండెల్లో మంట బయల్దేరింది.    
    విషయం కొద్ది కొద్దిగా తెలుస్తున్నట్టు అనిపించింది. తల తిప్పి నాయుడు వైపు చూశాడు. నాయుడు నవ్వుతున్నట్టు కనిపించాడు. పక్కనే వీరదాసు కూడా అలాగే వున్నాడు.    
    గుండెల్లో మంట ఎక్కువైంది. వళ్ళంతా చెమట్లు పడుతున్నాయి. తనన్న ఆఖరి మాటలు గుర్తొచ్చాయి. "....నేను వాళ్ళని బ్రతకనివ్వను" అన్నాడు తను.    
    ....ఇప్పుడు వాళ్ళే బ్రతకనివ్వడం లేదు తనని.    
    కామిని చెప్పినట్టు వాళ్ళు తమ పని పూర్తి చేసుకున్నారు. వీరదాసుని విడిపించుకున్నారు. ఇప్పుడా విషయమంతా బయటకు రానివ్వకుండా తనని పైకి పంపించేస్తున్నారు.    
    నాయుడు పంపిన స్వీట్లలో విషం కలిపి వుంది. అది తిని కామిని ఇంట్లో సర్వెంటు చనిపోయాడు. కామిని మాటలు- "నాకూ మా ఆయనకీ పడటంలేదు. త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నాం"    
    అంటే-    కామినినీ తనని కలిపి చంపటానికి ప్రయత్నించారన్న మాట! తను అక్కడికి వెళ్తే- ఆమెతో కలిసి తింటాడని వూహించి వుంటారు. అందులోనూ తనకి స్వీట్స్ అంటే ఇష్టం.    
    అతడికి ప్రాణం పోతున్నట్టు అనిపించింది. అది తిని కామిని వైపు చూశాడు. ఆమె కూడా విషయం గ్రహించినట్టు పాలిపోయిన మొహంతో చూస్తోంది వీరదాసు నవ్వుతున్నాడు.    
    రాజకీయాన్ని రాజకీయంతోనే కొట్టాలి.    
    "ప్రియమైన ప్రజలారా" అన్నాడు. "ఇంకొంచెం సేపట్లో నా ప్రాణం పోతుంది. పోయే ముందు కొన్ని విషయాలు మీకు చెప్పాలి."    
    సభ ఒక్కసారిగా నిశ్శబ్దమైంది. ఎవరూ ఊహించని పరిణామం అది. అతడి పార్టీ మనుషుల్లో కదలిక.    
    "వీరదాసుని విడిపించడానికి హోం మినిష్టర్ సలహా మీద నా కూతుర్ని కిడ్నాప్ చేసింది మేమే. కేవలం రాజకీయ లాభం కోసం స్వంత కూతుర్ని కిడ్నాప్ చేశాము."    
    ఉప్పెన లాటి గోల.    
    రెండు నిముషాల పాటు ఎవరేం అరుస్తున్నదీ తెలియలేదు. పులిరాజు చెయ్యెత్తాడు. మళ్ళీ చెప్పటం ప్రారంభించాడు. రెండు పార్టీలూ కలపటం దగ్గర్నుంచీ, తన ప్రాణాలు తీసే ప్రయత్నం వరకూ-    
    అంతే! ఎవరు ఎవర్ని కొట్టుకుంటున్నారో తెలీదు. ఎవరు ఎవర్ని పొడుస్తున్నారో తెలీదు. చాలామంది పొలేఉస్లున్నారు. కానీ వాళ్ళు అంతమంది జనాన్ని ఎలా కంట్రోలు చేయగలరు?    
    పులిరాజు మనుషులు మరీ రెచ్చిపోయారు. పోలీసులు ఎమ్మెల్యే నాయుడు చుట్టూ వలయంగా నిలబడి దూరంగా తీసుకు వెళ్ళటానికి ప్రయత్నిస్తున్నారు. అప్పటికే పులిరాజు మనుష్యుల చేతుల్లో ఆయుధాలు ప్రత్యక్షమయ్యాయి.    
    రాణా, కామినిని కారు దగ్గిరకు తీసుకువెళ్ళే ప్రయత్నంలో వున్నాడు. పార్టీ కార్యకర్తలు ఆమెను పెద్దగా పట్టించుకోలేదు కానీ, సినిమా నటి అవటంవల్ల రాజకీయాలకి సంబంధంలేని జనం ఆమెను దగ్గిరనుంచి తాకటానికీ, చూడటానికీ చుట్టుముట్టసాగారు. ఒకపక్క రక్తపాతం, మరొకవైపు ఈ హడావుడి.    
    ఈ లోపులో పులిరాజుకి స్పృహ వచ్చింది. పక్కనే వున్న డాక్టర్ ఎవరో ఇంజెక్షన్ ఇచ్చి 'పెద్ద హాస్పిటల్ కి తీసుకువెళ్ళండి' అంటున్నారు. అతడి బాధ అంతా చేత్తో తీసేసినట్టు పోయింది. కార్యకర్తలందరూ ఆశ్చర్యంతో చూస్తూండగా వెళ్ళి ఎమ్మెల్యే నాయుడి మెడ పట్టుకున్నాడు. ఈ హఠాత్పరిణామానికి విస్తు బోయిన ఎమ్మెల్యే తాలూకు మనుష్యులు క్షణంలో తేరుకుని, పులిరాజుని పొడవటానికి తయారయ్యారు. వీరదాసు వాళ్ళమధ్యకి పరుగెత్తాడు. దూరంనుంచి ఎవరో "ఛార్జ్" అని అరిచారు. డియస్పీ కంఠంలా వుందది.    
    "కాల్చు" అంది కామిని.    
    రాణా ఆమెవైపు విస్మయంగా చూశాడు.    
    "ముగ్గురూ ఒకచోట కలిశారు. ఈ గొడవలో ఎవరికీ అనుమానం రాదు-కాల్చెయ్" అంది. అతడికింకా అర్ధంకాలేదు.    
    ఆమె అన్నది "పోలీస్ వర్సెస్ పోలిటిక్స్ పొలిటీషియన్స్ మీద పోలీసులు పైచేయి అయ్యే క్షణాలు అరుదుగా వస్తూ వుంటాయి. ఆ ముగ్గురూ మళ్ళీ నీకు దొరకరు. చంపెయ్యి."    
    అతడికి అప్పటికి అర్ధమయింది. "చట్టరీత్యా బంధించటం వేరు. వ్యక్తిగత కక్షలకోసం చట్టాన్ని అతిక్రమించడం వేరు" అన్నాడు.    
    "కానీ వాళ్ళు నీ తండ్రిని-"    
    "అయినాసరే" దృఢంగా అన్నాడు. అతడివైపు ఆమె కన్నార్పకుండా చూసింది.    
    .....కొంతమంది వ్యక్తులు ఎందుకు అంత గొప్పవాళ్ళవుతారో అ ఆక్షణం ఆమెకి తెలిసింది.    
    తను చూసిన ప్రపంచానికి దూరంగా వేరే ప్రపంచం ఎలా వుంటుందో అప్పుడు చూసింది.    
    ఆమెను కారువరకూ తీసుకువెళ్ళటానికి అతడికి చాల కష్టమైంది. ఆమె మాత్రం చుట్టూ వున్న జనాన్ని పట్టించుకోలేదు. "అనుకున్న దాన్ని పూర్తిచేశాను. వాళ్ళచేత మొత్తమంతా చెప్పించాలనుకున్నాను. చెప్పించాను" అంది నడుస్తూ ఆమె కళ్ళు అంతిమ విజయం తాలూకు వెలుగుతో మెరుస్తున్నాయి.    
    "నేను వేసిన ట్రాప్ లో సరీగ్గా పడ్డాడు! రీజనల్ రీసెర్చి లాబ్ లో నా స్నేహితురాలు సరియైన మందే ఇచ్చింది. పాపం..... అంతా వాళ్ళు పంపిన స్వీట్స్ ప్రభావం అనుకున్నాడు. నిజం అంతా కక్కేశాడు."    
    అతడికి ఆశ్చర్యంగా వుంది. ఆమె చిన్న పిల్లలా మాట్లాడుతూంది. ఏదో మత్తులో వున్నట్టు మాట్లాడుతూంది. అప్పటివరకూ పెద్ద మాఫియాగాంగ్ లో వుండి, ఒక్కసారిగా పోలీసులకి అప్రూవర్ గా మారి చెప్పేమనిషి ఏ విధమైన ట్రాన్స్ లో వుంటాడో ఆ విధంగా వుంది. ఒక రకమైన సంధి ప్రేలాపన....జీవితపు ఒక స్టేజిలో రెండు విభిన్న సిద్దాంతాల సంధి యుగంలో మనిషి ఒక మౌలికమైన సత్యాన్ని తెలుసుకున్నాక కలిగే వైరాగ్యపుటానందాన్ని ఆమె అనుభవిస్తున్నట్టు కనపడుతూంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS