Previous Page
స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్ పేజి 34

       ఆమెను కారెక్కించి రాణా వెనుదిరిగి జనంలోకి వచ్చాడు. పులిరాజు, నాయుడు కలిసి మాట్లాడుకోవటంతో, పులిరాజు మామూలుగా వుండటంతో తాత్కాలికావేశాలు తగ్గాయి. తనేం మాట్లాడాడో, ఎలా మొత్తం అందర్నీ ఇరికించాడో పులిరాజుకి అర్ధమైపోయింది. విలేఖర్లు అప్పుడే పరుగెత్తుతున్నారు. అతడు మాట్లాడిన ప్రతిమాట దూరదర్సన్ రికార్డులో కెక్కిపోయింది.   
    అంతా నిశ్శబ్దంగా చూస్తున్నది వీరదాస్ ఒక్కడే అగ్ని పర్వతంలా వున్నాడు అతడు. పేలబోయే ముందు నిశ్శబ్దంగా-నిశ్చలంగా వుండే అగ్నిపర్వతం!!! అతడి మనసు కుత కుతా ఉడికిపోతోంది. అక్కడి కక్కడే పులిరాజుని పొడిచి చంపెయ్యాలన్న కోర్కెని బలవంతంగా అణుచుకున్నాడు. వడిగా వెళ్ళి తన కారెక్కి 'పోనియ్యి' అన్నాడు.    
    "ఎక్కడికి సాబ్?"    
    "అరె బేవకూఫ్ - ఆ కారు వెనుకే పోనియ్. దాన్ని ఎలాగయినా పట్టుకొ" అని అరిచాడు. సరీగ్గా రెండు నిమిషాల్లో కామిని కారుని అతని కారు క్రాస్ చేసింది.    
    రాత్రి తొమ్మిది దాటి వుంటుంది.    
    వీరదాసు కారు దిగి, ఆమె దగ్గిరగా వచ్చి కారులోంచి బయటకు లాగాడు. అతడి చేతిలో కత్తి మెరుస్తూంది. కామిని డ్రైవరు, కారు వదిలేసి చీకట్లో పరుగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు.    
    వీరదాసు కామిని జుట్టు పట్టుకున్నాడు.    
    చీకట్లో వీధి నిర్మానుష్యమైంది.    
    "ఇంతవరకూ నేను వేసిన ఏ ప్లానూ పాడవలేదు. మొట్టమొదటిసారి నీ వల్ల అయింది. చాలా గొప్పగా పథకం వేశావ్. నీ తెలివితేటలను తల్చుకుంటే నాకు మతిపోతూంది. ఈ క్షణం నిన్ను నడిబజార్లో ఇలాగే రేప్ చెయ్యాలని వుంది. కానీ ప్రస్తుతం ఆ మూడ్ లో లేను."    
    ఈ హఠాత్ పరిణామాన్ని వూహించని కామిని అలాగే గుడ్లప్పగించి చూస్తోంది.

    అతడు నవ్వేడు.    
    "పులిరాజు, నాయుడూ-వీళ్ళు రాజకీయ నాయకులు ఎత్తులూ పై ఎత్తులూ వాళ్ళు వేస్తారు. మీకూ మీకూ సరిపోతుంది. నాదంతా సూటి వ్యవహారమే. అందుకే ఇలా-" అంటూ కత్తి ఎత్తాడు.    
    కామిని వెళ్ళిన వెంటనే వీరదాసు కారెక్కటం రాణా చూశాడు.    
    అతడికి అనుమానం కలిగి, దానితోపాటే ఫాలో అవటం కోసం, జనంలోంచి తన వెహికల్ తీసుకుని బయటపడి వచ్చే సరికి ఈ సంఘటన జరుగుతూంది.    
    అతడు జేబులోంచి రివాల్వర్ తీసి వీరదాసుని షూట్ చెయ్యబోయాడు. ట్రిగ్గర్ నొక్కాడు.    
    'టప్' మని చప్పుడైంది. పేల్లేదు. వంద అడుగుల దూరమున్నా అంతటి నిశ్శబ్దంలో ఆ చిన్న శబ్ధమే వీరదాసుని తాకింది. అతడు వెనుదిరిగి చూశాడు.    
    రాణా చేతుల మధ్య పిస్టల్ తో కనపడ్డాడు పేలని పిస్టల్ తో.    
    వీరదాసు నవ్వేడు. అతడు ఎందుకు నవ్వుతున్నాడో రాణాకి అర్దమైంది. రాణాకి తన డిపార్ట్ మెంట్ మీద కోపంతో కూడిన నిస్సహాయత లాంటి ఫీలింగ్ కలిగింది.    
    పరుగెత్తాడు.    
    సత్తువనంతా కాళ్ళలోకి తీసుకుని అతడు వాళ్ళవైపు పరుగెత్తాడు, మధ్య మధ్యలో ట్రిగ్గర్ నొక్కే ప్రయత్నం చేస్తూ.    
    వీరదాసుకి ఇది ఆటలా కనిపించింది. రాణా నిఒజంగానే తుఫాను వేగంతో వస్తున్నాడు. రాణా తనకి ఎంత దూరంలో వుండగా తను ఈమె ప్రాణాలు తీయగలడు? కత్తిని ఎంత వేగంగా గుచ్ఛగలడు? తను ఒక్కపోటు పొడిస్తే ఈ ప్రపంచంలో ఇక ఏ డాక్టరూ ఆ ప్రాణిని రక్షించలేడు. రెండు కత్తిపోట్లతో కూడా శత్రువు బ్రతికాడంటే అంతకంటే ఒక రౌడీకి అవమానం లేదు.    
    రాణా ఇంకా పాతిక అడుగుల దూరంలో వున్నాడనగా వీరదాసు మెరుపువేగంతో కత్తి ఎత్తాడు. సరీగ్గా గెడ్డానికి రెండు అంగుళాల క్రింద మెడనరం కాస్త తెగేలా.....అంతే! ప్రపంచంలో ఇక ఏ డాక్టరూ రక్షించలేడు.    
    కత్తి గాలిని సర్రున కొస్తూ, చీకటిని చీలుస్తూ దిగుతోంది.    
    అప్పుడు పేలింది పిస్టల్.    
    అంత క్లోజ్డ్ రేంజిలో పేల్చటంతో వీరదాసు కపాలం రెండుగా చీలి మెదడు బయటకొచ్చింది. ఏ గడ్డనైతే తను చేతుల్తో అతడు రక్త పంకిలం చేశాడో, అదే భూమి చేతులుసాచి అతడి రక్తసిక్త శరీరాన్ని ఆహ్వానించింది.    
    కామిని అలాగే చూస్తూ నిలబడి వుంది.    
    రాణా ఆమె దగ్గిరగా వచ్చాడు.    
    అది కృతజ్ఞతో, లేక అతడి వేగానికి ఆశ్చర్యపోయిందో, తన ప్రాణాలు ఆఖరి క్షణంలో ఆ విధంగా రక్షింపబడటంతో సంభ్రమం చెందిందో, అవేమీకాక అతడిమీద ముందునుంచి వున్న భారం ఆ విధమైన రూపం దాల్చిందో గాని, అతడి వేగాన్ని నిరోధించకుండా అలాగే ఆహ్వానించి, అతడి మొహాన్ని తన చేతుల మధ్య ఇముడ్చుకుని- ముద్దు పెట్టుకుంది.    
    అతడి వేగంకన్నా తనది ఎక్కువ అని నిరూపించటానికా అన్నట్టు కనురెప్పపాటు కాలంలో అక్కడినుంచి కారులో అదృశ్యమైంది.    
    రాణా అటొకసారి చూసి, నెమ్మదిగా మోకాళ్ళమీద వంగాడు. ప్రాణం పోయేముందు కొద్దిపాటి సమయం మాట తెలుస్తుందంటారు. అందుకే అతడు వీరదాసుతో అన్నాడు.    
    "నేను నిన్ను చట్టరీత్యానే చంపాను."                
                                           ---****---        
                                              ఉపసంహారం        
    "నీ అంత మూర్ఖురాలు ఈ ప్రపంచంలో ఇంకెవరూ వుండరు" అన్నాడు అరవింద్ చౌరసియా. అతని చేతిలో వైన్ గ్లాస్ వుంది.    
    "ఛాయిస్ నీకే వదిలిపెడుతున్నాను. చెప్పు, నిన్నెలా చంపను?" అడిగాడతడు. ఆమె మాట్లాడలేదు. ఆమెని అతడు శాడిస్టిక్ గా చాలాసేపు హింసించాడు. అతడిలో అంత రాక్షసుడు దాగి వున్నాడని ఆమె ఎప్పుడూ అనుకోలేదు. ఆమె కంటిక్రింద నుంచి రక్తం కారుతోంది.    
    "మా రాజకీయ సెటప్ ని పునాదుల్తోసహా కదిలించి వేశావు. అంతవరకూ నువ్వు సెక్సెస్సే. కానీ వెంటనే అక్కన్నుంచి పారిపోకుండా మళ్ళీ రావటమే నువ్వు చేసిన తప్పు. నువ్వు నా ప్రియురాలివి కాబట్టి నేను నిన్ను వదిలిపెడతానని నువ్వు అనుకుంటే అది నీ రెండో తప్పు. నా దారికి అడ్డువచ్చిన ఎవర్నీ నేను క్షమించను. నువ్వు నాకు ద్రోహం చేసిన తఃరువాత పారిపోయి వుంటే, ఈ ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా నిన్ను చంపటంలో ఆనందం పొందివుండేవాడిని. ఇప్పుడు 'వేట' ఎలానూ లేదు కాబట్టి, నిన్ను సుదీర్ఘంగా చంపటంతో ఆనందం పొందుతాను. అసలు మా సంభాషణ రికార్డు చేసినప్పుడే నిన్ను ఛంపాల్సింది. నీ టేప్ చెరిపి ఆనందించాను. కానీ నువ్వు ఇంత పెద్ద ఎత్తు వేస్తావనుకోలేదు. పులిరాజు అనుమానబీజం నాటకంలో చాలా బాగా సక్సెస్ అయ్యావ్. వీరదాసు మరణం కూడా నన్నేమీ బాధపెట్టడంలేదు. నేనూ సత్తార్ కలిసి మరో ప్లాన్ వేస్తాం ఈసారి ఎవరాపగలరు? మా ప్లాన్ ఆపటానికి పాపం నువ్వుండవుగా....ఊఁ చెప్పు ఎలా చావాలనుకుంటున్నావ్ నువ్వు?" కత్తి తీస్తూ అడిగాడు. "....మణికట్టు నారం కోసేసి నీళ్ళలో పెట్టనా? ఇక్కడున్న వాటిలో అన్నిటికన్నా సింపుల్ డెత్ అది" అంటూ నవ్వేడు.    
    ఆమె అతడివైపు తలెత్తి చూసింది. ఆ కళ్ళలో ప్రేమ, ఆప్యాయత, జాలీ, అభ్యర్ధనా వున్నాయి. "అరవింద్!" అంది. ఎప్పుడో గానీ ఆమె ఇలా పిలవదు. " '... నువ్వు నన్ను రెండు ప్రశ్నలడిగావ్. ఇంత ద్రోహం చేశాక ఎందుకు మళ్ళీ వచ్చావ్? నేనూరుకుంటానా?' అని మొదటి ప్రశ్న? నువ్వు వూరుకోవని నాకు తెలుసు అరవింద్. నన్ను చంపుతావని నాకు తెలుసు. అయినా ఎందుకొచ్చానో తెలుసా? నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పటానికి నీ చేతుల్లో ప్రాణం వదలటానికి."    
    అతడామెవైపు అనుమానంగా చూశాడు. "చూడూ, నువ్వు నటివి. ఇలా ప్రేమగా మాట్లాడితే కరిగి నిన్ను వదిలి పెడతాననుకోకు."    
    "నన్ను నమ్మే అవసరం లేదు. ఒక్కసారి ముద్దుపెట్టుకో....చివరి ముద్దు.....స్త్రీ హృదయం పురుషుడు ఎప్పుడూ అర్ధం చేసుకోలేదు. మన ప్రేమలో కాసింతయినా నిజాయితీ వుండి వుంటుంది. లేకపోతే ఇంతకాలం కలసి ప్రణయం సాగించం. నా ఆఖరి కోరిక తీర్చవా?" ఆమె కళ్ళల్లో తడి కదలాడింది. అతడు ఇక ఆగలేక పోయాడు. ఆమె దగ్గిరగా వచ్చి పెదవుల మీద పెదవులు అన్నాడు. ఆమె చేతులు వెనక్కి కట్టేసి వున్నాయి. ఆమె వక్షం అతడికి బలంగా తాకుతుంది. ఆమె నాలుక అతడి పెదవుల్ని చీల్చి అతడి పంటి వరుసని సుతారంగా స్పృశించింది. అతడిలో క్రమంగా ఆవేశం ఎక్కువైంది. అతడి నాలుక ఆమె అంగుటిని తాకింది. ఆమె మొహం దూరంగా జరిపి నవ్వింది.    
    "స్త్రీలు ప్రియుళ్ళకి అధరామృతాన్ని ఇస్తారట కదూ?" అంది తలను వెనక్కి వాల్చి.    
    ఈ అసందర్భ ప్రేలాపన అర్ధంకాక "అంటే?" అన్నాడు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా-    
    "నీ రెండో ప్రశ్నకి నా సమాధానం ఏమిటో వినలేదు నువ్వు?" అంది.    
    "ఏమిటా ప్రశ్న? ఏమిటా సమాధానం?" విసుగ్గా అడిగాడు.    
    "అబ్దుల్ సత్తార్ తో నే వేసిన ప్లాన్ ని ఎవరాపగలరు?" అని.    
    "మరి సమాధానం ఏమిటి?"    
    "నేను ఆపగలను - అని ఆపగలనేమిటి? ఆపాను కూడా."    
    "ఎలా?"    
    "అధర జలాలతో కలిపి హాలాహలాన్ని ఇవ్వటం ద్వారా!" అని, "...ఇంకో అయిదు నిముషాల్లో ఇద్దరం చనిపోతున్నాం చౌరసియా" అంటూ నవ్వింది. "....నేను చాలా గొప్ప నటిని అన్న విషయం మర్చిపోకు. ఆ ధైర్యంతోనే చిగుళ్ళ వెనక్కి పొటాషియం కాంపౌండ్ కాప్సూల్ పెట్టుకొచ్చాను. నేను ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా నన్ను పట్టుకుని చంపుతావని నాకు తెలుసు. అందుకని నేనే స్వయంగా వచ్చి లొంగిపోయాను. నేను మరణించాక సత్తార్ తో కలిసి నీ ప్లాన్ సాగిస్తావనీ నాకు తెలుసు. అందుకని నేనే స్వయంగా నీ దగ్గిరకి వచ్చాను. నిన్ను చంపి, ఆ తృప్తితో మరణిస్తున్నాను."    
    అతడు ప్రతిమలా అలా చూస్తుండిపోయాడు. అప్పటికే ఇద్దరి శరీరాల్లో మార్పు వస్తోంది.    
    "ఏ చట్టమూ నిన్ను ఏమీ చేయలేదు. రాణాకూడా నిన్నేమీ చేయలేడు. అందుకని నేనే చేశాను. ఆ తృప్తితోనే మ.....ర....ణి..." ఆమె తల వెనక్కి వాలిపోతోంది. అతడింకా దిగ్భ్రమ నుంచి తేరుకోలేదు. ఫోన్ వరకూ చేతిని సాచే శక్తి కూడా లేదు. ఆఖరి క్షణంలో అతడు ఆలోచించాడు- 'ఇన్ని ఎత్తులూ పై ఎత్తులూ వేసి రాజకీయాల్లో రాణించింది, దేశాన్ని విడగొట్టటంలో తనకి ఎందుకు సహకరించలేదా?' అని.    
    'కేవలం రాణా ప్రేరణవల్లే' అన్న సమాధానం మనసుకి తోచకముందే అతడి ప్రాణం గాలిలో కలిసిపోయింది. పక్కనే కామిని శరీరం పడివుంది. నమ్మే వారెవరూ లేక, బ్రతికినంత కాలమూ నటనలో జీవించిన ఆ స్త్రీ, మరణం ముందు క్షణం వరకూ కూడా నటననే ఆశ్రయించవలసి వచ్చింది. దాన్నే విధివిలాస మంటారేమో.    
    ఈ కథ ముగించే ముందు మరో రెండు విషయాలు చెప్పవలసి వుంటుంది.    
    పులిరాజు, నాయుడు పార్టీల నుంచి బహిష్కరింపబడ్డారు. ప్రస్తుతం జైల్లో కొత్తపార్టీ స్థాపనకి మంతనాలు సాగిస్తున్నారు. పెద్ద పెద్ద రాజకీయ పార్టీలన్నీ జైళ్ళలోనే కదా పుట్టింది!    
    రాణా ప్రమోషన్ మీద గిరిజనాభివృద్ది శాఖ సెక్యూరిటీ చీఫ్ గా పంపబడ్డాడు. అలక్ నంద తో కలిసి అక్కడికి వెళ్ళాడు.        
                                           అయిపోయింది            
                                         ---****---


 Previous Page

WRITERS
PUBLICATIONS