ఆ రాత్రి ఉపాధ్యాయ కాలనీ వాళ్ళు కొంతమందిని తీసుకొచ్చారు. తరువాత మీటింగ్ తాలూకు బాధ్యత వాళ్ళు తీసుకున్నారు. రాత్రికి రాత్రి వేల సంఖ్యలో పాంప్లెట్లు, పోస్టర్లు ప్రింట్ అయ్యాయి. 'నిజాయితీ గల ఇన్ స్పెక్టర్ మీద చర్య ఆపుచెయ్యాలి'....'గూండా వ్యతిరేక పోరాటం వర్ధిల్లాలి" లాంటి నినాదాలతో పోస్టర్లు వెలిశాయి.
ప్రొద్దున్నకల్లా ఊరంతా వెలిసిన ఆ పోస్టర్లు చూసి నాయుడు, పులిరాజు కంగారుపడ్డారు.
"చూశావా రాణా-ఉద్యమం ఎలా సాగుతుందో" అంది అలక ఉద్వేగంగా ఆ అమ్మాయికి అదొక అద్భుతమైన అనుభవం కానీ రాణా నిర్లిప్తంగానే వున్నాడు. ఆమె అంది- "ఒక మంచి కారణం కోసం నిలబడితే జనం ఎలా సపోర్ట్ చేస్తారో చూశావా! అందరం కలిసి ముఖ్యమంత్రికి ఒక విన్నపం పంపుదామానుకుంటున్నాం. సాయంత్రం సభకి దాదాపు యాభైవేల మందిదాకా రావొచ్చు. పక్క ఊళ్ళ నుంచికూడా జనాన్ని సమీకరిస్తున్నారు."
రాణా పెద్ద ఉత్సాహం చూపకుండా, "మొన్న కాలనీ వాళ్ళతో వచ్చిన యువకులు ఎవరో తెలుసా?" అని అడిగాడు. "కేంద్రపార్టీ, రాష్ట్ర పార్తీకాక అధికారంలో ఎక్కడాలేని మూడోపార్టీ అది. ఈ సంఘటనని క్యాష్ చేసుకోవాలని చూస్తూంది ఆ పార్టీ. ఇప్పుడే ఆ రాజకీయం బయటపడటం ఇష్టంలేక వేరే పేరుమీద వర్కర్లని పంపింది. తరువాత.....అంటే ఈ ఉద్యమం బలం పుంజుకుంటే, అప్పుడది బయట కొస్తుందన్న మాట."
అలక్ నంద విస్తుబోయింది. "ఇందులోనూ రాజకీయమా?"
"అవును అలకా విద్య, కార్మికశక్తి, పోలీస్, ఆర్ధిక వ్యవస్థ.....వీటిలో ఏ అలజడి వస్తుందని తెలిసినా వెంటనే అందులో ప్రవేశించేది రాజకీయాలు మేధావులు మన ప్రజాస్వామ్యాన్ని అలా అల్లారు."
"మరి దీనికి విమోచనం లేదా?"
"ఏదో అద్భుతం ఈ దేశ చరిత్రలో జరిగితే తప్ప...." ఆగి అన్నాడు. "....లేదు."
ఈ కథకి సంబంధించినంతవరకూ అలాటి అద్భుతం మరుసటిరోజు జరిగింది.
* * *
స్కూలు ప్లే గ్రౌండ్స్ లో జరగబోయే మీటింగ్ కి వ్యతిరేకంగా అదే రోజు, అదే సమయాన 'వీరదాసు విమోచన సమితి' మరో మీటింగ్ ఏర్పాటు చేస్తుందన్న వార్త నగరంలో పాకిపోయింది. దీనిని ఎమ్మెల్యే నాయుడు, ఎం.పి. రాజు నిర్వహిస్తున్నారని వాల్ పోస్టర్ లు వెలిశాయి. అదే సభలో వీరదాసుకి పౌర సన్మానం ఏర్పాటు చేశారు. కనీ వినీ ఎరుగని రీతిలో ఈ సభని నిర్వహించాలని వాళ్ళు కంకణం కట్టుకున్నారు.
ఆ సభకి ముఖ్యఅతిధిగా కామిని వస్తోంది.
అదీ ట్రంప్ కార్డు.
వెండి తెరమీద బంగారు వెలుగు-
ఆ ఒక్క క్వాలిఫికేషన్ చాలు ఇసుకవేస్తే రాలన్మత జనాన్ని తీసుకురావటానికి! మరో అట్రాక్షన్-
ఆమె హోం మినిష్టర్ భార్య.
గూండాయిజానికి వ్యతిరేకంగా జరిగే సభ ఒకవైపు.
దానికి పోటీగా ఇంకొక సభ మరోవైపు.
ఆ సభకి హోం మినిష్టర్ భార్య ముఖ్య అతిథి!!!
ఇంతకన్నా సంచలన వార్త మరొకటి ఏముంటుంది?
రాణాని సపోర్ట్ చేసే సామాన్య ప్రజలు, అలక్ నందతో సహా మానసికంగా కృంగిపోయారు. ఈ పిచ్చుకమీద బ్రహ్మాస్త్రం అయింది వారి పరిస్థితి.
భార్య నిర్ణయానికి రెడ్డి మాత్రం చాలా సంతోషించాడు. ఆమె అంత తొందరగా వప్పుకుంటుందని అతడు వూహించలేదు. దాదాపు తను ముఖ్యమంత్రి అయిపోయినట్టు, రాష్ట్రాన్ని విడగొట్టి ఆంద్రదేశానికి ప్రధాని అయినట్టే వూహించుకుంటున్నాడు.
ఇంకో గంటలో ఆమె బయల్దేరబోతూందనగా అరవింద్ చౌరసియా ఆమెకు ఫోన్ చేశాడు. "ఏమైంది? మీ ఆయన నేను చెప్పినదానికి వప్పుకున్నాడా?"
"వప్పుకోవడమే కాదు. మిమ్మల్ని ఎప్పుడు కలుసుకుందామా అని ఉవ్విళ్ళూరుతున్నాడు-"
"మళ్ళీ నువ్వూ రెళ్ళిపోతున్నావ్ గా అయిదు నిమిషాల్లో వస్తున్నాను. ప్రైవేట్ మీటింగ్ ఏర్పాటు చెయ్యి."
"మన గెస్ట్ హౌస్ కి తీసుకురానా?"
"తీసుకురా వెంటనే"
భర్తతో కలిసి ఆమె చౌరసియాని కలుసుకుంది. చౌరసియా రెడ్డికి షేక్ హేండిస్తూ "మనిద్దరం ఇలా దగ్గిరకావటం నాకు చాలా సంతోషంగా వుంది. మిమ్మల్ని అంతకుముందు చాలా సార్లు కలుసుకున్నా ఇలా కాబోయే ముఖ్యమంత్రి హోదాలో అందరికన్నా ముందు నేనే మీకు కంగ్రాచ్యులేషన్స్ చెప్పగలిగే అవకాశం దొరకటం నా అదృష్టంగా భావిస్తున్నాను" అన్నాడు. అతడు మాట్లాడిన ఇంగ్లీషులో సగం రెడ్డికి అర్ధంకాలేదు. చౌరసియా కొనసాగించాడు.
"విషయం చాలా సున్నితమైంది. అంత భయంకరమైనది కూడా అందుకే కామినిగారితో మీకు కబురు చేశాను."
కామిని మధ్యలో కల్పించుకుని, "ఆయన ముందు నన్ను 'గారు' అనక్కరలేదు. మీకూ నాకూ మధ్యవున్న సంబంధం నా భర్తకి చెప్పాను. ఆయన చాలా సంతోషించారు కూడా" అని ఆగింది.
రెడ్డి, చౌరసియా నిశ్చేష్టులై వుండగా, ఆమె నవ్వి "ఎందుకలా వుండిపోయారు? యుద్దానికి ముందు ఒక స్త్రీ తన భర్తనీ, ప్రియుడినీ ఒకే పక్షంగా కలవటం అనేది రామాయణ, మహాభారతాల్లో కూడా జరిగి వుండదు" అన్నది.
చౌరసియా తేరుకుని, తనుకూడా నవ్వుతూ, "ఇప్పుడు యుద్ధం ఏమున్నది?" అన్నాడు విషయాన్ని తేలిక చేస్తున్నట్టు.
ఆ తరువాత వాళ్ళిద్దరూ మాట్లాడుకునే సంభాషణలో కామిని పాల్గొనలేదు. కేవలం ప్రేక్షకురాలిలా చూస్తూండిపోయింది - ఆ సంభాషణలో కామిని పాల్గొనలేదు. కేవలం ప్రేక్షకురాలిలా చూస్తూండిపోయింది - ఆ సంభాషణని రహస్యంగా రికార్డు చేస్తూ.
* * *
అర్ధరాత్రి తలుపు చప్పుడవడంతో రాణా ఆశ్చర్యపోతూ తీశాడు. ఎదురుగా వున్న కామినిని చూసి మరింత విస్మయంతో "మీరా?" అన్నాడు.
కామిని మొహంలో అలసట కొట్టొచ్చినట్టు కనపడుతోంది. దాదాపు నాలుగు వందల కిలోమీటర్లు వచ్చింది ఆమె మీటింగ్ కి హాజరవటానికి.
"చాలాకాలం తరువాత కలుసుకున్నాం కదూ. స్టూవర్ట్ పురానికి మీరు ఇన్ స్పెక్టరుగా వచ్చే మొదటి అధ్యాయంలో..." అంది.
"అవును ఇప్పుడు ఈ చివరి అధ్యాయంలో మళ్ళీ" అన్నాడు.
"ఇది చివరి అధ్యాయం అని ఎందుకనుకుంటున్నారు?"
"ఒకటి రెండు రోజుల్లోనే ఆర్డర్లు వస్తాయి కాబట్టి."
"మనం కలుసుకోవటం ఇది చివరిసారి అయి వుండవచ్చేమోగానీ, మీరు మాత్రం ఇన్ స్పెక్టర్ గానే కొనసాగుటారు. మిమ్మల్నెవరూ సస్పెండ్ చేయలేరు. ప్రజావాహిన్ని కదిల్చి, మీరు మీటింగ్ పెట్టారు కదా."
"దాన్ని విఫలం చెయ్యటానికి పని గట్టుకుని హైద్రాబాద్ నుంచి మీరొచ్చారుగా."
"కాదు మిమ్మల్ని ఒక సహాయం అడగటానికి వచ్చాను."
అతడు విస్మయన్ని అణుచుకుని "నన్నా" అన్నాడు.
"రేపు మీ మీటింగ్ జరగకూడదు. మా ఒక్క మీటింగే జరగాలి" అంది. అతడి మొహం ఎర్రబడింది. కోపాన్ని అణుచుకుంటూ, "ఇటువంటి మీటింగ్ లవల్ల ఏదో లాభం వుంటుందని నేనూ నమ్మటం లేదు. అంతమాత్రాన మావాళ్ళు పెట్టిన మీటింగ్ ని నేను ఆపుచేస్తానని ఎలా అనుకున్నావ్?" అన్నాడు.
"నన్ను అర్ధం చేసుకోవటానికి ప్రయత్నించు రాణా నేను ఒకప్పటి కామినిని కాదు. అప్పుడు నేను పూర్తి అహంతో, ఆత్మ విశ్వాసంతో అనే ముసుగులో వుండేదాన్ని. ఇప్పుడు నేను ఎదిగాను. ప్రతి మనిషీ ప్రతి స్టేజీలోనూ అలాగే అనుకుంటూ వుంటాడని నాకు తెలుసు. కానీ నా ఎదుగుదల నా ఆత్మ సంతృప్తి, అన్వేషణకి సంబంధించినది. ఇంతకుముందు ఎన్నడూ లేని తృప్తి, ఈ రోజు నాకూ దొరుకుతూ వుంది. నా మీద ఏ మాత్రం నమ్మకమున్నా నీ మీటింగ్ ఆపుచేయించు. నా మీటింగ్ కి రా. డ్యూటీలో రా అక్కడొక అద్భుతం జరుగుతుంది. నువ్వు వూహించలేని నిజాలు నేను అక్కడ బయటపెడతాను" అని ఆమె చీకట్లో కలిసిపోయింది.
రాణా అటువైపే చూస్తూ వుండిపోయాడు.
* * *
మరుసటిరోజు మీటింగ్ కాన్సిల్ అయిందన్న వార్త తెలిసింది. కామిని కళ్ళు చెమర్చాయి. తనమీద ఇంతవరకూ అంత నమ్మకముంచిన వాళ్ళెవరూ లేరు భర్తా, ప్రియుడితో సహా....
తను రాణాకి శత్రువు తన భర్త అతడి ఉద్యోగం పోవటానికి కారకుడు. అయినా సరే-అతడు తనని నమ్మాడు. ఇప్పుడిక తనమీద మహత్తరమైన బాధ్యత వుంది. చాలా కష్టమైన పని అది.....
మీటింగ్ విరమించుకొన్న మూడో పార్టీ వాళ్ళు 'సినిమా నటుల్ని ఆయుధంగా వాడుకుని అవతలి పార్టీ అదే సమయానికి మరో మీటింగ్ పెట్టటంవల్ల తాము తన మీటింగ్ పోస్ట్ పోన్ చేసుకుంటున్నట్టు' ప్రకటించారు. ఇప్పుడా ఆ జనం కూడా తన మీటింగ్ కి వస్తారని తెలుసు ఆమెకి.
ఆ మీటింగ్ లో ఈ దేశద్రోహం గురించి చెప్పాలని ఆమె ఉద్దేశ్యం ఇది మొత్తం దేశాన్నే కుదిపేస్తుందని ఆమెకి తెలుసు.
తనతోపాటు తీసుకొచ్చిన క్యాసెట్ టేప్ రికార్డర్ లో పెట్టుకుంది. అబ్దుల్ సత్తార్, అరవింద్ చౌరసియా, టి.కె. రెడ్డి, గూఢచార వ్యాపార రాజకీయ జీవితాలకి అది ఫుల్ స్టాప్ పెట్టబోయే క్యాసెట్.
మీటింగ్ కి ఇంకో అయిదు గంటలు మాత్రమే టైముంది. టీ.వీ. కవరేజికోసం దూరదర్శన్ వాళ్ళు కూడా వచ్చారని తెలిసింది.
కామిని వస్తోంది కాబట్టి దాదాపు లక్షమంది జనం హాజరవుతారని అంచనా వీరదాసుకి పౌరసన్మానం.
క్యాసెట్ లో సంభాషణ సరీగ్గా రికార్దయిందో లేదో మరో సారి సరి చూసుకోవటం కోసం ఆమె టేప్ ని 'ఆన్' చేసింది.
చాలాసేపు నిశ్శబ్దం తరువాత చిన్న నవ్వు వినిపించింది.
అది అరవింద్ చౌరసియాది. అంటే తన ప్లాన్ అంతా ముందే గ్రహించాడన్న మాట. టేప్ సంగతి కూడా! ఆమె మొహం రక్తం లేనట్టు పాలిపోయింది. ఒక్కసారిగా పాతిక అంతస్థులమేడ కూలిపోయినట్టు అనిపించింది. ఆమె చేతివెళ్ళు వణకసాగాయి. మీటింగ్ ప్రారంభం కావటానికి ఇంకెంతసేపో టైమ్ లేదు. ఈ అస్త్రం ఆధారంగానే ఆమె ఇంత ప్లాన్ చేసింది. అది ఆఖరి క్షణంలో నిర్వీర్యమైపోయింది.
