Previous Page Next Page 
మమత పేజి 33

మాటమీద మాట పెరిగింది.
"మీకు మొదట్నుంచీ ఇష్టంలేదు- అందుకే..."
జానకి ఏమంటుందో వినకుండా- "నీకు ఆ రాజీవ్ మీద ఇష్టం! అందుకే దాన్ని తెచ్చావ్....ఆ వంకని వాడు వస్తూపోతూ వుంటాడని!"
"ఛీ, మీరు మనిషి కాదసలు!" జానకి బుసలు కొట్టింది.
"పెంకుటింట్లో పడున్న మనిషిని ఇంత అందలమెక్కించటం నాదే తప్పు! నువ్వు కలలో కూడా ఊహించని భోగాలు ఇచ్చాను. నిన్ను నెత్తిన పెట్టుకున్నా- నీకా విశ్వాసం వుందా?" అరిచాడు.
"భార్యభర్తల మధ్య విశ్వాసాలు, కృతజ్ఞతలు ఏమీ వుండవు- ప్రేమే వుంటుంది!" అంది జానకి.
"అది వుంటే ఇలా మాట్లాడవు"
"అయ్యా, నా మాట వినండి- ఒక్కసారి పోలీసు స్టేషన్ లో చెప్పండి బాబూ- పిల్ల బతికుందో, లేదో కూడా తెలీదు- తల్లీ, బోడీ ఎక్కడున్నావే...!" మళ్ళీ ఏడుపు లంకించుకుంది చెన్నమ్మ.
భార్యభర్త ఆవేశాలు తగ్గాయి.
"పోనీ....రాజీవ్ కి ఫోనుచేసి చెప్పేద్దాం!" అంది జానకి
"నేనూ అదే అనుకుంటున్నా ఇప్పుడు!" అన్నాడు మాధవరావు.
రాజీవ్ కి ఫోను చేశాడు మాధవరావు- ఫోన్ రాగానే గబుక్కున తీసింది మమత.
"హలో...." అంది.
ఒక్కసారి షాక్ తిన్నట్టుగా ఫోన్ పెట్టేశాడు మాధవరావు. "జానకీ....ఆ గొంతు, అదే గొంతు!"
"ఏమిటీ...ఏమంటున్నారూ!?"
"అదే బోడి- దాందే గొంతు.... జానకీ!" అన్నాడు పరమోత్సాహంగా.
చెన్నమ్మ గబగబా లోపలికొచ్చింది.
"ఎవరి గొంతయ్యా, బోడి- సుబ్బిదా?" అంది.
"అప్పుడే ఎవరితోనూ అనకు - నిజమో, కాదో!" అంది జానకి.
"నాకేం పనీ.... అందరికీ చెప్పడానికీ!" అంది మూతి తిప్పుతూ చెన్నమ్మ.
ఫోను అందుకున్న మమత క్షణం భయంతో గజగజలాడిపోయింది. తనని తీసికెళతారేమో..!
"ఎవరు ఫోన్ చేశారూ..?" అన్నాడు మమత ముఖంలోకి చూస్తూ రాజీవ్. "ఎందుకు భయపడుతున్నావ్?" ఒళ్ళో కూర్చోపెట్టుకున్నాడు.
"డాడీ, ఆ రాక్షసుడు!"
"రాక్షసుడా- ఎవరూ..?"
"ఆ అయ్యగారు, అదే....అమ్మగారూ!" అంది భయంగా.
"మాధవరావు..?"
"ఆ..!"
"నిన్నెక్కడికీ పంపను- ఎవరొచ్చినా పంపను- తెలిసిందా!" అంటూ ఫోన్ తీశాడు.
"హలో... నేను రాజీవ్ ని- రెండురోజుల్లో వస్తున్నా- పిల్లని చూడాలనిపిస్తోంది!"
మమత నోటికి చెయ్యి అడ్డం పెట్టుకుంది- వచ్చే నవ్వు ఆపుకుంటూ.
"నిన్ననే మా వంటమనిషి చెన్నమ్మతో కాళహస్తి వెళ్ళింది- ఏదో, అమ్మవార్ని చూస్తుంది కదాని పంపాము. అది వచ్చాక నేను ఫోను చేస్తా!" మాధవరావు ఫోన్ పెట్టేశాడు.
చెన్నమ్మ వచ్చే నవ్వు ఆపుకుంటూ నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని వంటింట్లోకి వెళ్ళిపోయింది.
తండ్రి ఒళ్ళో కూర్చున్న మమతని నమిలి మింగేయాలని చూస్తున్నాడు శశికాంత్.
"నెత్తిని ఎక్కించుకోండి డాడీ....వీపుపై పెట్టుకుని ఉప్పు ఉప్పు అని అమ్మండి, ఛీ....సిగ్గులేదూ, నా అంత వున్నావు!" అన్నాడు.
రాజీవ్ నవ్వి, "నిన్ను కూడా నా ఒళ్ళో కూర్చోపెట్టుకుంటా రా!" అన్నాడు.
శశికాంత్ ఫ్రెండ్ శ్రీధర్ వచ్చాడు- వస్తూనే ఆ పిల్లని ఎగాదిగా చోసోతూ.... "దీనికి ఈ గుండేమిటిరా?" అన్నాడు.
"ఆ... పనిపిల్లకదా- పేలున్నాయని జుట్టు కత్తిరించుకునుంటుంది" అన్నాడు.
వీళ్ళ మాటలు వింటున్న మమత "డాడీతో చెప్తానుండు" అంది.
"నోర్ముయ్... ఎవడే నీ డాడీ! ఏదో... మా డాడీ జాలిపడి వీధికుక్కని, సారీ... వీధి పిల్లని ఇంత తిండి పడేస్తుంటే- డాడియా నీకు?" అన్నాడు పక్కన ఫ్రెండు వుండేసరికి ఇంకా రెచ్చిపోయి.
"ఒక్క తోపు తోస్తే కిందపడతావు!" అంటూ మమతని ఒక్క తోపు తోశాడు. అంతలో.... కింద పడబోయిన మమతని గట్టిగా పట్టుకుని లేవనెత్తుతూ, జబ్బలు గట్టిగా నొక్కాడు ఆ ఫ్రెండు.
"దీని పని పడదాం!" అన్నాడు.
"సరే..." అన్నాడు శశికాంత్.
మమతకి భయమేసింది సతీష్ గుర్తొచ్చాడు-
రోజురోజుకీ ఆ పిల్ల ఇంట్లో వుండటం అస్సలు ఇష్టం వుండటంలేదు శశికాంత్ కి. పైగా.....దాన్ని 'అక్క అను' అంటాడు తండ్రి.
రెండు కొత్త గౌన్లు, ఓ పరికిణీ కుట్టించింది సుమతి.
"అంత బిగుతా... ఛీ- సిగ్గులేదు" అంటూ శశికాంత్ ఫ్రెండు మమత గౌను జిప్పు లాగాడు. శశికాంత్ మమత గుండుపై ఒక దెబ్బవేశాడు. "ఫో....ఏడు!" అన్నాడు.
మమతకి ఏం చేయాలో తోచలేదు.
మమత నిద్రపోతుంటే, దాని గుండుపైన పౌడరు జల్లారు.
"దీన్ని ముద్దుపెట్టుకుంటా- ఏం చేస్తుందో చూద్దాం!" అంటూ శశికాంత్ ఫ్రెండ్ శ్రీధర్ దాని బుగ్గలపై గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు.
"ఉండు" అంటూ శశికాంత్ దాన్ని గట్టిగా పట్టుకున్నాడు. మమత భయపడిపోయింది. "ఛీ..." అంటూ బుగ్గలు తుడుచుకుని లోపాలకి పరిగెత్తింది.
"ఏమైందే..?" అంటూ సుమతి అడుగుతుంటే, "మమ్మీ..." అంటూ సుమతి ఒళ్ళో పడుకుని వెక్కివెక్కి ఏడ్చింది మమత. ఇద్దరూ ఎటో పారిపోయారు.
ఏమైందో విన్న సుమతి ముఖం ఒక్క నిమిషంలో వాడిపోయింది. ఈ ఆడపిల్లని తను కాపాడగలదా!
చూస్తున్న సినిమాలు, జరుగుతున్న అన్యాయాలు రోజూ ఎన్నెన్ని విధాలు?! పైగా... మగపిల్లలు ఆడపిల్లల్ని ఏడ్పించడం, వేధించటం ఒక ఫ్యాషనైపోయింది ఈ రోజుల్లో. పేపరు తిరగేస్తే చాలు మానభంగాలు- వయసుతో ప్రమేయం లేకుండా! - అయ్యో, ఈ మగ పిల్లలు ఆడపిల్లల్ని వేధించే రకాలు ఎన్నోవిధాలు! సుమతికి అవన్నీ గుర్తొచ్చాయి- ఈ శశికాంత్, వాడి ఫ్రెండు శ్రీధరు- ఎప్పుడూ టీవీ ముందు కూచుంటుంటే తను ఎంత కేకలేసినా వినిపించుకోరు- పైగా....ఆ శ్రీధరు చాలా డబ్బున్న పిల్లవాడు- ఈ స్నేహాలలో శశికాంత్ ఎలా తయారవుతాడో అనే భయం వుంది సుమతికి మనసులో.
దీనికితోడు- ఇప్పుడు వైడ్కి మమతని అక్కగా అనుకోవటం కుదరటం లేదు. ఎందుకో.... అది పనిపిల్లే- అనే భావం వాడి మనసులోనుంచి పోవడంలేదు. అమ్మా నాన్న ఎందుకో అబద్దమాడుతున్నారని వడి మనసులో పడిపోయింది- ఇవన్నీ సరిదిద్ది ఈ పిల్లని కాపాడటం తేలికా?! - సుమతి క్షణం భయంగా వుండిపోయింది.
శ్రీధర్ లోపలకొచ్చాడు. శశికాంత్ పరిగెత్తాడు వాడ్ని చూసి!
వాడు తెచ్చిన పెద్ద చాక్లెట్ చూపిస్తూ "తిను" అన్నాడు. మమత మాట్లాడలేదు.
"అబ్బో... బోడి గొప్ప!" అన్నాడు శ్రీధర్.
"దీని ముఖానికి చాక్లెట్ ఒకటి తక్కువా?" అంటూ శ్రీధర్ శశికాంత్ చెవిలో ఏదో చెప్పాడు. ఇద్దరూ గొల్లున నవ్వారు.
"ఎందుకు నవ్వుతారూ?" అంది మమత. మళ్ళీ నవ్వరు. మమత జాకెట్టు చేతుల కింద చిరిగిపోయింది. "ఇలారా!" అంటూ ఆ అమ్మాయి గుండుమీద ఒక దెబ్బేసి "ఫో..." అన్నాడు శ్రీధర్.
మమతకి ఒళ్ళు మండిపోయింది... శశికాంత్ అంటే తమ్ముడు! వీడెవడూ..?
శ్రీధర్ నెత్తిమీద ఒక దెబ్బ వేసింది-
"నువ్వెవరే... నన్ను కొట్టడానికి!" నాటో మమత చెయ్యి గట్టిగా పట్టుకుని వీపుమీద కొట్టాడు. మమత తిరిగి ఈడ్చి కొట్టింది.
దూరంగా చూస్తున్న రాజీవ్ కళ్ళలో ఎర్ర జీరలు కదిలాయి.
"డాడీకి చెప్తా వుండు- నీ పని!" అంది మమత.
పరిగెత్తుకొచ్చి చిరిగిన జాకెట్టును పట్టి లాగాడు శ్రీధర్. రాజీవ్ దెబ్బ- శ్రీధర్ చెంపమీద చెళ్ళుమంది..!
"ఫో.... లోపలికి!" అన్నాడు శశికాంత్ తో. మమత తండ్రి చాటున నిలబడింది.
ఆ రాత్రి భార్య భర్త మాట్లాడుకుంటూ- "వీడు ఇది అక్క అంటే నమ్మడంలేదు....దాన్ని ఎంత ఏడ్పిస్తున్నాడో!"
రాజీవ్ మాట్లాడకుండా ఏదో ఆలోచనలో వున్నాడు. మమత శశికాంత్ ముందు మేకపిల్లలా బెదిరిపోవటం చూస్తున్నాడు. రాజీవ్ కి ఉన్నట్టుండి జానకి, మాధవరావులపై గొంతుదాకా కోపం నిండిపోయింది.
"ఏమిటి వాళ్ళ అహం, ఏమిటి వాళ్ళ గర్వం- ఓ దిక్కులేని పిల్లని పెంచుకుంటామని తీసికెళ్ళి పనిమనిషిని చేస్తారా- ఆ పిల్ల ఎక్కడ పోయిందో పట్టించుకోరా- చెప్తా వాళ్ళ పని!!
"హలో... జానకీ- నువ్వా?"
"ఆ- రాజీవ్.." జానకి గొంతు వణికింది.
"ఎన్ని రోజులీ అబద్దాలు? - పిల్ల ఏదీ!"
రాజీవ్ గొంతు- జానకి గుండెల్లో మార్మోగింది.
మాధవరావు జానకి చేతిలో ఫోనందుకున్నాడు-
"వస్తుంది, ఓ వారం రోజుల్లో!"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS